చెరువు బాగు.. ఎవుసం సాగు
* చెరువుల పునరుద్ధరణతోనే రైతుకు బంగారు భవిత
* ‘మిషన్ కాకతీయ’ అమలుకు రూ.2 వేల కోట్ల కేటాయింపు
* నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు
వెల్దుర్తి/నర్సాపూర్: ‘మిషన్ కాకతీయ’ను ఓ మహాయజ్ఞంలా చేపట్టి.. రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. చెరువుల పునరుద్ధరణతోనే అన్నదాతల బతుకులు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. మండలంలోని మంగళపర్తికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, .. మిషన్ కాకతీయలో గుర్తించిన చెరువుల పునరుద్ధరణ పనులు ఈ నెలాఖరు నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.
రాష్ట్రంలో కొన్ని చెరువుల పునరుద్ధరణ కోసం టెండర్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మిషన్ కాకతీయను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. చెరువుల్లో పూడిక తీసిన మట్టిని సొంత ఖర్చులతో పొలాల్లోకి తరలించుకోవాలన్నారు. దీనివల్ల రసాయన ఎరువుల వాడకం తగ్గడంతోపాటు పంటల దిగుబడి పెరుగుతుందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే చెరువుల పునరుద్ధరణ కోసం ఆయా గ్రామాల సర్పంచ్‌లు గ్రామసభలు ఏర్పాటు చేసి రైతులను, ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు.
ఆయన వెంట నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మురళీయాదవ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణాగౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి హరీష్‌రావు మంగళపర్తికి చెందిన సంఘ సేవకుడు మణికొండ రాఘవేందర్‌రావును పరామర్శించారు. ఇటీవలే రాఘవేందర్‌రావు తల్లి జానకీదేవి మృతి చెం దడంతో హరీష్‌రావు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
సివిల్స్‌లో రాణించాలి...
శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్ సోసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బీవీఆర్‌ఐటీ కాలేజీలో ఏర్పాటైన తెలంగాణ సంప్రదాయ ఉత్సవాలకు హరీష్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, .. ఇంజనీరింగ్ విద్యార్థులు సివిల్స్‌లోనూ రాణించాలని సూచించారు. సౌత్ ఇండియాలోని రాష్ట్రాల నుంచి ఆల్ ఇండియా సర్వీసెస్‌లో చాలా తక్కువ మంది ప్రాతినిథ్యం వహిస్తున్నారన్నారు. నార్త్ ఇండియా నుంచి ఎక్కువ మంది ఉంటారని, మన రాష్ర్టం నుంచి ఎక్కువ మంది సివిల్స్‌లో రాణించాలని తాను ఆశిస్తున్నానన్నారు.
బీటెక్ పూర్తయ్యాక సివిల్స్ పట్ల దృష్టి పెట్టి అందుకు అనుగుణంగా కృషి చేయాలని మంత్రి హరీష్‌రావు విద్యార్థులకు సూచించారు. బీటెక్ పూర్తవగానే అందరూ ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నారని, అలా కాకుండా సివిల్స్ పట్ల దృష్టి పెట్టాలని, ఐఏఎస్, ఏపీఎస్‌లో రాణించేందుకు కృషి చేయాలని కోరారు. అంతకుముందు విద్యార్థులు హరీష్‌రావుకు ఎడ్లబండిపై ఘన స్వాగతం పలికారు.