civils
-
13 బంగారు పతకాలు, తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : ఎవరీ శ్రద్ధా
సాధించాలన్న పట్టుదల, కృషి,అచంచలమైన సంకల్ప శక్తి ఇవి ఉంటే చాలు. ఎలాంటి వారైనా తమ కలలను సాకారం చేసుకోవచ్చు. ఈవిషయాన్నే తన విజయం ద్వారా నిరూపించింది ఓ యువతి. ఒకటి కాదు రెండు ఏకంగా 13 బంగారు పతకాలను సాధించింది. CLATలలో అగ్రస్థానంలో నిలిచి, బంగారు పతకాలు సాధించడమే కాకుండా, యూపీఎస్సీలో మంచి (60) సాధించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన శ్రద్ధా గోమె సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం రండి!శ్రద్ధా గోమ్ తండ్రి రిటైర్డ్ SBI అధికారి. ఆమె తల్లి వందన గృహిణి. శ్రద్ధా చిన్నప్పటినుంచీ తెలివైన విద్యార్థిని. ఇండోర్‌లోని సెయింట్ రాఫెల్స్ హెచ్ఎస్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ అగ్రస్థానంలో నిలిచింది.తరువాత శ్రద్ధా గోమ్ న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించాలని బావించింది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT)లో టాపర్‌గా నిలిచింది. ఈ ఘనత ఆమె ప్రతిష్టాత్మకమైన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU), బెంగుళూరు, భారతదేశంలోని అత్యుత్తమ న్యాయ కళాశాలలో ప్రవేశం పొందింది. అత్యుత్తమ ప్రతిభకు గాను అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రచేతులమీదుగా 13 బంగారు పతకాలను అందుకుంది. ఇలాంటి అవార్డులు, రివార్డుల పరంపరకొనసాగుతూనే ఉంది. (మసాబా మెచ్చిన చ్యవన ప్రాశ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా!)హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కంపెనీలో లీగల్ మేనేజర్‌గా పనిచేసింది. ముంబై, లండన్‌లో విలువైన అనుభవాన్ని పొందింది. తరువాత తన స్వస్థలమైన ఇండోర్‌కు తిరిగొచ్చి, 2021లొ సివిల్ సర్వీసెస్‌కు (సీఎస్ఈ) ప్రిపేర్ అయింది. ఇంటర్నెట్ ద్వారా స్టడీ మెటీరియల్ సమకూర్చుకుని స్వయంగా పరీక్షకు సిద్ధమైంది. మొక్కవోని దీక్షతో చదివి తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రద్ధా మంచి ఆర్టిస్ట్ కూడా. -
Humera Begum: టీచర్ కొలువిచ్చిన సివిల్ పవర్
ఆమధ్య వచ్చిన కమల్‌హాసన్ సినిమాలో ఒక డైలాగ్....‘ఈ లోకంలో అత్యంత ధైర్యవంతులు ఎవరో తెలుసా? కోల్పోవడానికి ఏమీ మిగలని వాళ్లు!’ఒకప్పుడు హుమేరా బేగం పరిస్థితి అలాగే ఉండేది. సివిల్స్‌కు ఎంపిక కావాలనేది తన లక్ష్యం. ఆ లక్ష్యం వైపు అడుగులు పడకుండానే...‘మేమున్నాం’ అంటూ సమస్యలు, వాటితోపాటు వచ్చిన బాధలు వరుస కట్టాయి. ఇలాంటప్పుడు లక్ష్యం మసక మసకగా కనిపించడం మాట అటుంచి అసలే కనిపించకపోయే ప్రమాదం ఉండవచ్చు.‘కోల్పోవడానికి ఏమీ లేదు’ అనుకునే స్థితిలో ఉన్న తనకు భయం ఎందుకు! ఆ ధైర్యంతోనే సమస్యలను తట్టుకునే నిలబడింది. ఎస్జీటి ఉర్దూ టీచర్‌గా సెలెక్ట్ అయింది. మరి సివిల్స్ కల..? అంటారా... ‘వెయ్యి మైళ్ల ప్రయాణం అయినా, ఒక అడుగుతోనే ఆరంభం అవుతుంది’ అనే మాట మనకు తెలియనిది కాదు...హుమేరా బేగం స్వస్థలం తెలంగాణాలోని వనపర్తి. నాన్న రోజువారీ కూలీగా సైదాబాద్ (హైదరాబాద్)లో ఒక మదర్సాలో పని చేసేవాడు. అమ్మ ఉర్దూ టీచర్‌గా కొంతకాలం పని చేసింది. అన్న ఓబిద్ మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేది హుమేరా చిన్నప్పటి కల. హుమేరా ఏడో తరగతిలో ఉన్నప్పుడు కష్టాలు మొదలయ్యాయి.తండ్రి పక్షవాతం బారిన పడ్డాడు. తండ్రి అనారోగ్య ప్రభావం హుమేరా చదువుపై పడింది. ప్రైవేట్ స్కూల్ నుంచి చాదర్‌ఘట్‌లోని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు. అక్కడే పదో తరగతి పూర్తి చేసింది. మరోవైపు తండ్రి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి తమకు దూరం కావడానికి ఎంతో కాలం పట్టలేదు.‘నా తండ్రి వెయ్యి ఏనుగుల బలం’ అనుకునే అమ్మాయి ‘తండ్రి లేని బిడ్డ’ అయింది.తండ్రి చనిపోవడంతో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. దీంతో హైదరాబాద్ నుంచి తిరిగి వనపర్తి వెళ్లిపోయారు. హైదరాబాద్ విడిచి వెళుతున్నప్పుడు కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘హైదరాబాద్ అంటే పెద్ద సిటీ... పెద్ద చదువులు చదువుకోవచ్చు’ అనుకునేది. ధైర్యం ఇచ్చే నాన్న లేడు. ధైర్యం ఇచ్చే మహా నగరం దూరం అయింది.అయితే తన కల మాత్రం దూరం కాకుండా జాగ్రత్త పడింది. హుమేరాలో చదువుకోవాలనే తపన చూసి అక్క (చిన్నమ్మ కూతురు) సమీన, కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బావ అహ్మద్ అలీ హుమేరా కుటుంబాన్ని మళ్లీ హైదరాబాద్ తీసుకువచ్చారు. పట్టుదల గట్టిదైతే ఒక్కో ద్వారం దానికదే తెరుచుకుంటూ దారి చూపుతుంది. హుమేరాకు చదువుపై ఉండే ఆసక్తి, పట్టుదల, కల జైలు సూపరింటెండెంట్ వరకు వెళ్లింది. చంచల్‌గూడ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్‌గౌడ్ ‘సేవ్ ద గర్ల్ ఛైల్డ్’ సంస్థ తరఫున హుమేరాకు అండగా నిలబడ్డాడు. ‘మేము సైతం’ అన్నారు జైలు సిబ్బంది. తమ పిల్లలకు ట్యూషన్లు చెప్పేందుకు హుమేరాకు అవకాశం ఇచ్చారు.జైలు అధికారులు, సిబ్బంది సహకారం హుమేరా కుటుంబానికి ఆర్థికంగా భరోసాను ఇచ్చాయి. ఆమెలో ఆత్మవిశ్వాస శక్తిని రెండింతలు చేశాయి. ఎన్ని సమస్యలు ఎదురైనా ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసింది. నేరేడ్మెట్లో డీఎడ్ కూడా పూర్తి చేసింది. కష్టపడే వారిని విజయం వెదుక్కుంటూ వస్తుంది... అన్నట్లు హుమేర కష్టం వృథా పోలేదు. ఎస్జీటీ ఉర్దూ టీచర్‌గా ఎంపిక అయింది.ఒకప్పుడు... ‘ఐఏఎస్ కావాలనేది నా కల’ అని హుమేరా అని ఉంటే నవ్వేవాళ్లేమో. ఎందుకంటే తాను ఉన్న దయనీయమైన పరిస్థితుల్లో ఇంటర్మీడియేట్ పూర్తి చేయడమే చాలా కష్టం. ఇప్పుడు ఎవరూ ఎగతాళిగా నవ్వే పరిస్థితి లేదు. ‘యస్... ఆ అమ్మాయి కచ్చితంగా సాధిస్తుంది’ అంటారు ఇప్పుడు. ఈ నమ్మకం కలిగించడానికి ఆమె ఎంతో కష్టపడింది. గుండె ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. హుమేరాది ఎంతోమంది పేద అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపించే పట్టుదల. ఆమె భవిష్యత్ కల నెరవేరాలని బలంగా కోరుకుందాం.జీవితం ముగిసిపోయింది అనుకున్న సమయంలో....సివిల్స్ సాధించాలనే నా కలను దృష్టిలో పెట్టుకొని ‘సేవ్ ద గర్ల్ ఛైల్డ్’ సంస్థ సహకారంతో శివకుమార్ గౌడ్ సార్ నాకు దిల్లీకి చెందిన ఓ కోచింగ్ సెంటర్ ద్వారా ఆన్ లైన్ సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఓపెన్ డిగ్రీతో పాటు, నా ట్యూషన్లు కొనసాగిస్తూనే మిగిలిన సమయంలో సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. నా జీవితం ముగిసింది అనుకున్న సమయంలో ఒక దారి దొరికింది. నాలా అవకాశాల కోసం కష్టపడే ఎంతోమంది పేద విద్యార్థులకు అండగా నిలబడేందుకే నేను సివిల్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాను.– హుమేరా బేగం – నాగోజు సత్యనారాయణ, సాక్షి, హైదరాబాద్ స్టేట్ బ్యూరో -
TG: ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం' చెక్కుల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం చెక్కులను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం పంపిణీ చేశారు. సివిల్స్‌లో ప్రిలిమ్స్ పాసై మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్న 135 మందికి ఆర్థికసాయం అందించారు. ఒక్కొక్కరికి రూ. లక్ష చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. 90 రోజుల్లోనే 30 వేల మందికి నియామక పత్రాలు అందించామని, మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని పేర్కొన్నారు. ఉన్నత స్థాయిలో తెలంగాణ యువత రాణించాలని, అందుకే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పేదలకు మంచి విద్యను అందిస్తామని, ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.ఉద్యోగ నియామకాల కోసం చిత్తశుద్దిలో పనిచేస్తున్నాం. సివిల్స్ విద్యార్ధులకు ఆత్మస్తైర్యం ఇవ్వడం కోసం మా ప్రయత్నం. రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నాం. సివిల్స్ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలి. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తాంగతంలో సచివాలయంలోరి రానివ్వని పరిస్థితి ఉండేది. సచివాలయంలోకి వెళ్తే అరెస్ట్ చేయించారు. చదువుకు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. పరిశ్రమలు పెట్టే వాళ్లంతా వృత్తి నైపుణ్యం కలిగిన వాళ్ల కోసం వెతుతుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా వర్సిటీ ద్వారా 2వేల మందికి శిక్షణ ఇస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి శిక్షణ ఇస్తాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడాకారులకు శిక్షణ ఇస్తాం. 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లకు అత్యధికంగా పతకాలు వచ్చేలా కృషి చేస్తున్నాం. పేద పిల్లలకు న్యాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది. వచ్చే 10, 15 రోజుల్లో అన్ని యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తాం. వర్సిటీల్లోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం. ’ అని తెలిపారు. ‘డిప్యూటీ సీఎం భట్టి కమెంట్స్..‘సివిల్స్‌లో మంచి ర్యాంకులు సాధించి తెలంగాణకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలి. సివిల్స్‌లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారికి కొంతైనా ఉపశమనం లభిస్తుంది. మన రాష్ట్రం నుంచి ఐఎఎస్ అయిన వారు ఏ రాష్ట్రంలో పనిచేసినా.. మనకు గర్వకారణమే.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను 5 వేల కోట్ల తో ఏర్పాటు చేస్తున్నాం. మా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. గ్లోబలైజేషన్‌కు అనుగుణంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం.లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందుకుంటున్న వారిలో ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో 21 మంది. ఓబీసీ కేటగిరిలో 62 మంది. ఎస్సీ కేటగిరిలో 19 మంది.. ఎస్టీ కేటగిరీలు 33 మంది. ఎస్టీ కేటగిరిలో 33 మందిలో 22 మంది మహిళా అభ్యర్థులు ఉండడం స్ఫూర్తిదాయకం. దేశంలో ఈ తరహా పథకం అమలు ఇదే తొలిసారి.’ అని తెలిపారు. -
లక్ష్యం.. క్రమశిక్షణే విజయ రహస్యం
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ మానేసి సివిల్సే లక్ష్యంగా.. సివిల్స్‌కు ఎంపిక కావడమే లక్ష్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకొని మెయిన్స్‌కు ప్రిపేర్ అయిన మెరుగు కౌశిక్.. తొలి ప్రయత్నంలోనే 82వ ర్యాంకుతో సత్తా చాటారు. సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేసిన ఆయన.. ఢిల్లీలో ఎంబీఏ చేశారు. అందరూ చదివినట్లే చదివానని.. రోజుకు 8–9 గంటలపాటు ప్రిపేర్ అయినట్లు చెప్పారు. చదువుకుంటున్న సమయంలోనే సివిల్స్‌కు ప్రిపరేషన్ మొదలు పెట్టానని, ఆ తర్వాత ఏడాది పాటు జాబ్ చేశానని తెలిపారు. ప్రిలిమ్స్ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి మెయిన్స్ రాసినట్లు పేర్కొన్నారు. ఐఏఎస్ కావాలనేది తన లక్ష్యం అని చెప్పారు. తనకు 100లోపు ర్యాంకు వస్తుందని మాత్రం అసలు ఊహించలేదన్నారు. తన తండ్రి నిర్మాణ రంగంలో ఉన్నారని, తల్లి గృహిణి అని చెప్పారు. విధి వంచించినా... విధి వంచించినా.. విశ్వాసం ఆమెను నిలబెట్టింది. కాళ్లు కదలకపోయినా.. పట్టువిడవని సంకల్పం తనను ముందుకు నడిపింది. ఊహించని అనారోగ్యం ఇంటికే పరిమితం చేసినా.. చదువును మాత్రం ఏనాడు దూరం చేసుకోలేదు. దూరవిద్య ద్వారా చదువులు పూర్తి చేసి కుటుంబ సభ్యులు, గురువుల సహకారంతో విశాఖపట్టణానికి చెందిన హనిత వేములపాటి సివిల్స్‌లో 887వ ర్యాంక్ సాధించి సత్తాచాటారు. తాను ఆత్మవిశ్వాసంతో చదువును కొనసాగించి సివిల్స్ ప్రిపేరయ్యానని ఆమె చెప్పారు. దేశంలోనే అత్యున్నత సివిల్స్ సర్విసెస్‌కు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాత జస్టిస్... మనవరాలు సివిల్స్ ర్యాంకర్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామస్వామి మనవరాలు ఐశ్వర్య నీలిశ్యామల సివిల్స్‌లో 649వ ర్యాంకు సాధించారు. బీటెక్ పూర్తి చేసిన ఐశ్వర్య ప్రణాళికాబద్ధంగా ప్రిపేరై ర్యాంకు సాధించినట్లు తెలిపారు. తాత జస్టిస్ రామస్వామి తనను ఎంతగానో ప్రేరేపించారని, అందుకే ప్రజాసేవ చేయాలనే లక్షంతో సివిల్స్ రాశానని అన్నారు. తండ్రి సివిల్ సర్వెంట్, తల్లి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యురాలు అని, తన మామ ఐఏఎస్ అధికారి అని పేర్కొన్నారు. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి : అలేఖ్య ఖమ్మం జిల్లాలో సాధారణ కానిస్టేబుల్ కూతురు అలేఖ్య. పోలీసు వృత్తిలోనూ నిజాయితీని చాటుకున్న తండ్రిని ఆమె ఆదర్శంగా తీసుకుంది. పాఠశాల విద్య నుంచే సివిల్స్ లక్ష్యంగా ఎంచుకుంది. అనుక్షణం తండ్రి ప్రోత్సాహం ఆమెకు కలిసి వచ్చింది. తన కష్టాలే ఆమెను మానసికంగా బలపడేలా చేశాయి. ఐపీఎస్ కావాలన్న లక్ష్య సాధనలో ఆమె 938వ ర్యాంకు సాధించింది. నాలుగుసార్లు సివిల్స్ విజయానికి దగ్గరగా వెళ్లిన ఆమె ఎన్నడూ నిరుత్సాహ పడలేదు. ఐదోసారి అనుకున్నది సాధించారు. ప్రతీ తల్లీదండ్రీ పిల్లలను ప్రోత్సహించాలని ఆమె చెప్పార. ప్రజా జీవితానికి చేరువగా విధి నిర్వహణ చేయాలని ఆమె కోరుకుంటున్నారు. వ్యవసాయ కూలీ కుమారుడు ఐఏఎస్‌కు.. పూడూరు: వ్యవసాయ కూలీ కుమారుడు ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్‌పల్లికి చెందిన దయ్యాల బాబయ్య, శశికళ దంపతుల కుమారుడు తరుణ్ (24) సివిల్స్‌లో 231వ ర్యాంక్ సాధించారు. 2017లో తరుణ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి పూర్తి చేశారు. రాజేంద్రనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. 2023లో బీటెక్ పూర్తి చేశారు. ఐఏఎస్‌కు ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నానని, పేదలకు సేవ చేసే అవకాశం వచ్చిందని తరుణ్ తెలిపారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తరుణ్ ఇంటికి వెళ్లి అభినందించారు. మారుమూల గ్రామానికి చెందిన తరుణ్ ఐఏఎస్‌కు ఎంపిక కావడం సంతోషంగా ఉందని తెలిపారు. 60 మంది తోటి కానిస్టేబుళ్ల ముందు సీఐ అవమానించారని.. చిక్కడపల్లి: ‘60 మంది పోలీసుల ముందు ఇన్స్పెక్టర్ అవమానించారు. నాపై వ్యక్తిగత కోపంతో తిట్టారు. 2013 నుంచి 2018 వరకు చేసిన కానిస్టేబుల్ జాబ్‌కు ఆరోజే రిజైన్ చేశాను. ఐఏఎస్ సాధించాలని ఆ రోజే కసితో దీక్ష తీసుకున్నాను. నాలుగో ప్రయత్నంలో విజయం సాధించాను’ అని 780వ ర్యాంక్ సాధించిన ఉదయ్ కృష్టారెడ్డి చెప్పారు. తనకు ఐఆర్ఎస్ వస్తుందని భావిస్తున్నట్లు పేర్కొ న్నారు. ఈ జాబ్‌లో చేరి ఐఏఎస్ సాధించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిల్లా గుడ్లూరు పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తనకు సీఐ చేసిన అవమానమే ఈ రోజు సివిల్స్ సాధించేందుకు దోహదపడిందన్నారు. తనకు జంతువులంటే ఎంతో ప్రేమ అని, మనుషుల కోసం 108 వాహనం ఉన్నట్లే జంతువుల కోసం దేశవ్యాప్తంగా 109 అంబులెన్స్ వాహనం కోసం తన వంతుగా ప్రయత్నం చేస్తానన్నారు. తన చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారని నానమ్మ పెంపకంలో పెరిగానని వివరించారు. ఢిల్లీ ఐఐటీ వదిలి.. దూర విద్య చదివి... ముషీరాబాద్: నల్లగొండ జిల్లా అల్వాలకు చెందిన సత్యనారాయణరెడ్డి స్కూల్ ప్రిన్సిపల్, తల్లి హేమలత టీచర్. తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నత విద్యావంతులు కావడంతో కుమారుడు పెంకేసు ధీరజ్‌రెడ్డిని ఐఐటీ చదివించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారి ఆశలకు తగ్గట్టుగానే ఐఐటీ ఢిల్లీలో సీటు సాధించారు. మొదటి సంవత్సరంలో 9.3 సీజీపీఏ సాధించి ఐఐటీ ఢిల్లీలోనే టాప్ 7లో నిలిచాడు. ఇలా సాగిపోతున్న తరుణంలో ధీరజ్రెడ్డికి చదువు పరుగు పందెంలా అనిపించింది. ఎప్పుడూ కంప్యూటర్‌తో కుస్తీ, మెకానికల్ లైఫ్ అనిపించి ఈ చదువు తనకు ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. అయినప్పటికీ కుమారుడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని తల్లిదండ్రులు నీకు నచ్చకపోతే ఐఐటీ వదిలేయమని చెప్పారు. దీంతో ఐఐటీని మధ్యలోనే ఆపేసి ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే డిగ్రీ అడ్మిషన్లు అయిపోవడంతో ఉస్మానియా యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్(దూర విద్య)లో బీఏ డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఆ అడ్మిషన్ కేవలం డిగ్రీకి మాత్రమే.. వెంటనే సివిల్స్‌పై దృష్టి సారించాడు. తల్లిదండ్రుల్లో మాత్రం కుమారుడి భవిష్యత్తు మీద ఆందోళన మొదలైంది. 2019లో మొదటిసారి సివిల్స్ ఫలితాల్లో 0.6 మార్కులతో రాలేదు. రెండవ ప్రయత్నంలో 17 మార్కులతో, మూడవ ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లో ఫెయిలయ్యాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిoచి నాలుగోసారి 173వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు దారులు వేసుకున్నాడు. మేస్త్రీ కుమారుడికి 574వ ర్యాంక్ కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్ కాలనీకి చెందిన రామారెడ్డిపేట రజనీకాంత్ ఆరో ప్రయత్నంలో 574వ ర్యాంకు సాధించారు. రజనీకాంత్ కుటుంబానిది రాజంపేట మండలం ఆర్గోండ గ్రామం. రామారెడ్డిపేట సిద్ధిరాములు, పద్మ దంపతుల రెండవ కుమారుడు. పేద కుటుంబమే. తల్లి గృహిణి కాగా, తండ్రి భవన నిర్మాణ పనులతోపాటు డ్రైవర్‌గా చేస్తారు. చిన్నప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడ్డామని, కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని రజనీకాంత్ చెప్పారు. సామాన్య కుటుంబంలో పుట్టిన తమ అబ్బాయి సివిల్స్ సాధించి తమ జన్మను సార్థకం చేశాడని తల్లిదండ్రులు ‘సాక్షి’తో ఆనందం వ్యక్తం చేశారు. బీడీ కార్మికురాలి కొడుకు సివిల్స్ ర్యాంకర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్ 27వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన సాయికిరణ్ తండ్రి నందాల కాంతారావు మహారాష్ట్రలోని భివండిలో చేనేత కార్మికుడిగా పనిచేశారు. తల్లి లక్ష్మీ బీడీలు చుట్టేవారు. కాంతారావు కేన్సర్‌తో 2016లో మరణించారు. ఆ సమయంలో సాయికిరణ్ వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 2018లో క్యాంపస్ ఇంటరŠూయ్వలో క్వాల్కమ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చింది. బాల్యం నుంచి ఐఏఎస్ కలగా ఉన్న సాయికిరణ్ అప్పటి నుంచి ఓవైపు ఉద్యోగం చేస్తూనే ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా సివిల్స్‌కు ప్రిపేరయ్యాడు. క్రితంసారి విఫలమైనా.. ఈసారి మాత్రం విజయం సాధించి తన స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. పాలమూరు బిడ్డ... ప్రతిభకు అడ్డా సివిల్స్ లక్ష్యంగా నిద్రాహారాలు మానేసి చదివిన పాలమూరు బిడ్డ అనుకున్నది సాధించింది. ఆలిండియా మూడో ర్యాంకు సాధించింది. మహబూబ్‌నగర్‌కు జిల్లాకు చెందిన దోనూరు అనన్య రెడ్డి తొలి ప్రయత్నంలోనే విజయ శిఖరాలు అధిరోహించడం విశేషం. అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన సురేష్ రెడ్డి, మంజులతకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అనన్యరెడ్డి కాగా.. రెండో సంతానం చరణ్య. పదో తరగతి వరకు మహబూబ్‌నగర్ గీతం హైసూ్కల్లో చదివిన అనన్య.. ఇంటర్ విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. ఢిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె ఎంతో కష్టపడి చదివి సివిల్స్‌లో ర్యాంకు సాధించినట్లు తెలిపారు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సివిల్స్ మీద దృష్టి సారించానని చెప్పారు. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు చదివానని పేర్కొన్నారు. ఆంథ్రోపాలజీ ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకున్నానని, ఇందుకు హైదరాబాద్‌లోనే కోచింగ్ తీసుకుని పకడ్బందీగా ప్రిపేరయ్యానని చెప్పారు. అయితే ఈ ఫలితాల్లో మూడో ర్యాంకు వస్తుందని ఊహించలేదన్నారు. చిన్నప్పటి నుంచే సమాజానికి సేవ చేయాలన్న కోరికతోనే సివిల్స్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు. తమ కుటుంబంలో సివిల్స్ సాధించిన తొలి అమ్మాయిని తానేనని చెప్పారు. అనన్య తల్లి గృహిణి కాగా, తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి. -
Hyderabad: సివిల్స్ విజేతల సరికొత్త ఫ్యాక్టరీ!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సివిల్ సర్వీసెస్..దేశంలో కోట్లాది మంది యువత మదిలో మెదిలే అత్యున్నత ఉద్యోగం. అన్ని పరీక్షల కంటే అత్యంత క్లిష్టంగా, అనేక వడపోతలతో సాగే ఈ ప్రక్రియ గురించి వింటేనే..వామ్మో మనకెలా సాధ్యం..? అని అన్పిస్తుంది. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఐఎస్, ఐడీఈఎస్.. ఇలా 24 అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యేందుకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షల కోసం ఒకప్పుడు ఢిల్లీకి వెళ్లి మరీ సన్నద్ధులైన తెలుగు రాష్ట్రాల వారిని పరిశీలిస్తే ఫెయిల్యూర్ స్టోరీలే ఎక్కువ. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ ప్రాంతం క్రమంగా పట్టు బిగిస్తోంది..ర్యాంకుల సాధనలో సక్సెస్ అవుతోంది. 2021–2022 సివిల్స్ ఫలితాలే అందుకు నిదర్శనం అని నిపుణులు అంటున్నారు. తాజాగా ర్యాంకులు సాధించినవారిలో 46 మంది ఇక్కడివారే కావటం కొత్త చరిత్రగా పేర్కొంటున్నారు. హైదరాబాద్ సివిల్స్ విజేతల ఫ్యాక్టరీగా రూపుదిద్దుకున్న ఫలితమే గడిచిన నాలుగేళ్లుగా తెలుగింటి బిడ్డల జైత్రయాత్ర అని చెబుతున్నారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో ఎప్పుడూ టాప్‌లో ఉండే ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్ రాష్ట్రాల సరసన ఇప్పుడు తెలంగాణ కూడా చేరుతోంది. అమెరికా, ఐటీలొద్దంటూ.. ఇంజనీరింగ్, మెడికల్ ఇతర ప్రొఫెషనల్ చదువుల అనంతరం ఉన్నత ఉద్యోగం, అమెరికా లేదా ఇండియాలో ఐటీ ఉద్యోగాల్లో చేరేందుకు ఉత్సాహం చూపే ప్రతిభావంతుల్లో ఎక్కువమంది దృష్టి ఇప్పుడు సివిల్స్ వైపు మళ్లుతోంది. సమాజం నుంచి తీసుకున్న దాంట్లో కొంతైనా సేవా రూపంలో తిరిగి సమాజానికి ఇవ్వాలనే లక్ష్యంతో కొందరు సివిల్స్ వైపు అడుగులేస్తున్నారు. ఢిల్లీ ఐఐటీలో గోల్డ్‌మెడల్ సాధించిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అజ్మీరా సంకేత్ జపాన్‌లో మంచి ప్యాకేజీతో ఉన్నత ఉద్యోగం సంపాదించాడు. అయితే తన స్నేహితుడు కట్టా రవితేజ సివిల్స్‌కు ఎంపికై సమాజానికి చేస్తున్న సేవ, అందులోని సంతృప్తిని గమనించి తానూ సివిల్స్ రాసి 35వ ర్యాంకు సాధించాడు. తనకు మిత్రుడు రవితేజ రోల్‌మోడల్ అని సంకేత్ సాక్షికి చెప్పారు. అవగాహన పెరిగింది గతంలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేస్తారు? వారి విధులు ఎలా ఉంటాయి? సమాజంలో వారు తీసుకొచ్చే మార్పు ఎలా ఉంటుందనే అంశాలపై పెద్దగా అవగాహన ఉండేది కాదు. చాలామందికి డాక్టర్లు, ఇంజనీర్లే ఎక్కువ అనే భావన ఉండేది. మరోవైపు సివిల్స్ పరీక్షలకు కోచింగ్ సెంటర్లు చాలావరకు ఢిల్లీ కేంద్రంగానే ఉండేవి. దీంతో ఢిల్లీతో ఎక్కువ అనుసంధానమై ఉండే ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ ఎంపిక అయ్యేవారు. అయితే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. సివిల్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈజీగా తెలిసిపోతోంది. హైదరాబాద్ కేంద్రంగానూ మంచి కోచింగ్ సెంటర్లు వచ్చాయి. అలాగే అఖిల భారత సర్వీసులకు సంబంధించిన అవగాహన పెరిగింది. ఫలితంగా మనవారు ఇప్పుడు సివిల్స్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. విజయం సాధిస్తున్నారు. – దురిశెట్టి అనుదీప్ (సివిల్స్–2017 ఆలిండియా టాపర్, మెట్పల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా), (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్) ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే సాధించొచ్చు నాన్న వెంకటేశ్వర్లు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. నేను బీటెక్‌లో ఉన్నప్పుడే మా కలెక్టర్ అలా అన్నారు. ఎస్పీ ఇలా అన్నారు అంటూ వారి గురించి గొప్పగా చెబుతుండేవారు. అప్పుడే నేనూ నిర్ణయించుకున్నా కలెక్టర్ కావాలని. అందుకోసం ఐదేళ్లు కష్టపడ్డా. కుటుంబసభ్యులు అందించిన సహకారంతో చివరకు జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించా. నాలా అందరికీ ఫ్యామిలీ సపోర్ట్ దొరికితే రాష్ట్రం నుంచి అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్‌లు వస్తారు. – ఉమా హారతి, సివిల్స్ 3వ ర్యాంకర్ నాలాంటి వాళ్లకు సాయం చేయాలని.. నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తూ నన్ను, అన్న, చెల్లెల్ని చదివించింది. మా కోసం ఆమెపడే కష్టం ఎప్పుడూ కళ్ల ముందే ఉండేది. అందుకే సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ ఇంటర్ వరకు చదివా. ఐఐటీ చెన్నైలో సీటు వచ్చినప్పుడు కనీస ఫీజు సరే అక్కడికి వెళ్లేందుకు, ఇతర ఖర్చులకు కూడా డబ్బుల్లేవు. అయితే కొందరు దాతలు ముందుకొచ్చి సహాయం చేయడంతో ఐఐటీ çపూర్తి చేశా. ఆపై ఓఎన్జీసీలో ఉన్నత ఉద్యోగం సంపాదించా. కానీ ఏదో వెలితిగా అనిపించేంది. నేను కూడా కొంత మందికి సహాయం చేయాలంటే మరింత ఉన్నత స్థితిలో ఉండాలనుకుని ఉద్యోగానికి రాజీనామా చేసి రెండవ ప్రయత్నంలోనే సివిల్స్‌లో 410 ర్యాంకు సాధించా. – డొంగ్రి రేవయ్య, ఆసిఫాబాద్ జిల్లా ఇప్పుడు అన్నీ హైదరాబాద్‌లోనే.. ఒకప్పుడు సివిల్స్ రాయాలంటే ఢిల్లీ వెళ్లాలి. అక్కడ ఉండి కోచింగ్ తీసుకోవాలి. అక్కడి వాతావరణం, ఆహారం, భాష అన్నీ మనకు కొత్తగా అనిపించేవి. దాంతో ఎక్కువగా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల వారే సివిల్స్‌లో రాణించేవారు. కానీ ఇప్పుడు అన్నింటికీ హైదరాబాద్ అడ్డా అయ్యింది. నిపుణుల కొరత లేదు. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, అమెరికా లాంటి దేశాలపై మోజు తగ్గించుకుని మరీ సివిల్స్ వైపు వస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా ఎంపికవుతుండటంతో, ఇతరులు వారిని ఆదర్శంగా తీసుకుని విజేతలవుతున్నారు. – ఎం.బాలలత, సివిల్స్ ట్రైనర్ మాధోపట్టి..సివిల్స్ విజేతల పుట్టినిల్లు! యూపీ రాజధాని లక్నోకు 300 కి.మీ. దూరంలో ఉన్న మాధోపట్టి గ్రామంలో మొత్తం 75 ఇళ్లు. అందులో సివిల్స్ సాధించిన వారు ఏకంగా నలభై మంది ఉండటం అబ్బురపరిచే విషయం. ఇక్కడ ఉపాధికి సరిపోయే భూమి లేక అందరూ ఉన్నత చదువులనే ఆ«ధారం చేసుకున్నారు. ఇలా 1952లో డాక్టర్ ఇందుప్రకాష్ తొలిసారి యూపీఎస్సీ పరీక్షల్లో రెండో ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకున్న ఆయన నలుగురు సోదరులు ఐఏఎస్ ను సాధించారు. అందులో వినయ్‌సింగ్, ఛత్రçసల్సింగ్లు బిహార్, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. ఇలా మాధోపట్టి మేధావులకు నిలయంగా మారింది. పురుషులతో పాటు మహిళలు కూడా ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఎంపికయ్యారు. అలా మాధోపట్టి ఐఏఎస్‌ల ఫ్యాక్టరీగా మారింది. -
UPSC Result 2023: కోచింగ్ నచ్చలేదు.. ఇంటిలోనే.. ఇంటర్నెట్లో శోధిస్తూ..
నారాయణపేట/హుజూర్నగర్: ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగు సార్లు యూపీఎస్సీ రాసినా ర్యాంకు రాలేదు. అయినా ఆమె నిరాశ చెందలేదు. ఐదోసారి సైతం పట్టుదలతో ప్రయత్నించి ఏకంగా ఆలిండియా 3వ ర్యాంకు సాధించింది. ఆమెనే నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, శ్రీదేవిల కుమార్తె నూకల ఉమాహారతి. హైదరాబాద్‌లో 2010లో 9.8 జీపీఏతో టెన్త్‌లో ఉత్తీర్ణత సాధించిన ఉమాహారతి... 2012లో ఇంటర్ ఎంపీసీలో 955 మార్కులు సాధించారు. ఆపై 2017లో ఐఐటీ హైదరాబాద్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లుది సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందినవారు. యూపీఎస్సీ 2020లో నిర్వహించిన ఐఈఎస్‌లో ఆమె తమ్ముడు సాయి వికాస్ 12వ ర్యాంకు సాధించారు. రెండేళ్ల శిక్షణ అనంతరం సోమవారమే ముంబైలోని సీపీడబ్ల్యూడీలో ఐఈఎస్‌గా విధుల్లో చేరగా ఆ మర్నాడే అక్క ఉమాహారతి సివిల్స్‌లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కానుండటం విశేషం. సివిల్స్‌లో ర్యాంకు సందర్భంగా ఉమాహారతితో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ ఆమె మాటల్లోనే.. గత సివిల్స్ పేపర్లూ చదివా... సివిల్ ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగం బదులు సివిల్స్‌వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఢిల్లీలోని వాజీరావు కోచింగ్ సెంటర్లో 2018–19లో శిక్షణ పొందినప్పటికీ అక్కడి కోచింగ్ నచ్చలేదు. ఇంటికొచ్చి ఆప్షనల్ సబ్జెక్టు అంథ్రోపాలజీతోపాటు కామన్ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలపై ఇంటర్నెట్లో స్టడీ మెటీరియల్ సెర్చ్ చేశా. గత సివిల్ పేపర్లనూ చదివా. దేశ, అంతర్జాతీయ ఆంశాలు, సంఘటనలపై నిత్యం ఆంగ్ల దినపత్రికలు చదివేదాన్ని ఈ ఏడాదంతా నాన్న, అమ్మతో నారాయణపేటలో ఉండి చదివా. సివిల్స్ సాధించా. ఈసారి 2,500 ర్యాంకుల్లో ఏదో ఒకటి వస్తుందనుకున్నా. మూడో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. విఫలమైనా తమ్ముడు వెన్నుతట్టాడు... ఐపీఎస్ అధికారి అయిన మా నాన్న వెంకటేశ్వర్లు నుంచే స్ఫూర్తి పొందా. తమ్ముడు సాయి వికాస్‌ను ఆదర్శంగా తీసుకున్నా. గత ప్రయత్నాల్లో నాలుగుసార్లు విఫలమైనా బాధపడొద్దని తమ్ముడు అండగా నిలిచాడు. స్నేహితులు నిఖిల్, అంకితల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయి. -
సివిల్స్ గురుగా మహేశ్ భగవత్ మార్కు.. ఆలిండియా టాపర్లుగా 125 నుంచి 150 మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ ‘సివిల్స్ గురూ’గా మరోసారి తన మార్కు చాటారు. సివిల్స్–2022 తుది ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థుల్లో చాలా మంది ఆయన వద్దే ఇంటర్వ్యూ శిక్షణ పొందారు. తన వద్ద ఇంటర్వ్యూ శిక్షణ పొందిన వారిలో ఆల్ ఇండియా టాపర్లుగా దాదాపు 125 నుంచి 150 మంది నిలిచారని, ఇది తనకు ఎంతో సంతోషంగా ఉందని మహేశ్ భగవత్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఆలిండియా టాపర్, యూపీ యువతి ఇషితా కిశోర్‌కు తాను మెంటార్‌గా ఉండటం సంతృప్తినిచ్చిందన్నారు. తనతోపాటు మరికొందరు గత పదేళ్లుగా సివిల్స్ అభ్యర్థులకు మెంటార్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది టాప్–100 ర్యాంకుల్లో 14వ ర్యాంకర్ కృతికా గోయల్, 22వ ర్యాంకర్, తిరుపతివాసి పవన్ దత్తా, 25వ ర్యాంకర్ కశ్మిరా సంకే, 27వ ర్యాంకు సాధించిన యాదవ్ సూర్యభాన్, 35వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన అజ్మీర సంకేత్ కుమార్, 38వ ర్యాంకర్ అనూప్‌దాస్, 54వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన రిచా కులకర్ణి, 74వ ర్యాంకర్ ఐషి జైన్, 76వ ర్యాంకు సాధించిన దబోల్కర్ వసంత్, 78వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన ఉత్కర్ష కుమార్‌లు తన వద్ద ఇంటర్వ్యూ పొందినవారేనని మహేశ్ భగవత్ తెలిపారు. గత ఐదు నెలలుగా తాను ఇంటర్వూలకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. విజేతలు గర్వం పెరగకుండా చూసుకోవాలని, ర్యాంకులు రాని వారు నిరుత్సాహపడకుండా మరోసారి ప్రయత్నించాలని ఆయన సూచించారు. -
కానిస్టేబుల్‌కు సివిల్స్‌లో 667 ర్యాంకు..
ఢిల్లీ: ఢిల్లీ పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రామ్‌భజన్ కుమార్ సివిల్స్‌లో 667వ ర్యాంకు సాధించి, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఆయన వయసు 34 ఏళ్లు. ఎనిమిదో ప్రయత్నంలో ర్యాంకు సాధించడం గమనార్హం. ప్రస్తుతం సైబర్ సెల్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సివిల్స్ ఫలితాలు వెలువడిన తర్వాత రామ్‌భజన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహచరులు, సీనియర్ అధికారులు ఆయనను అభినందించారు. ఓబీసీ కేటగిరీకి చెందిన రామ్‌భజన్‌కు తొమ్మిది సార్లు సివిల్స్ రాసేందుకు అనుమతి ఉంది. ఎట్టకేలకు ర్యాంకు సాధించడం ద్వారా తన కల నెరవేర్చుకున్నానని ఆయన చెప్పారు. ఒకవేళ ఈసారి విఫలమైనా తొమ్మిదోసారి పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇప్పటిదాకా ఏడు ప్రయత్నాలు సఫలం కాకపోయినా నిరాశ పడలేదని అన్నారు. తన భార్య అందించిన అండదండలతో ముందుకు సాగానని వివరించారు. తాను రాజస్తాన్ నుంచి వచ్చానని, అక్కడ తన తండ్రి కూలీగా పనిచేస్తున్నాడని వెల్లడించారు. కష్టాల్లోనే పుట్టి పెరిగానని పేర్కొన్నారు. అంకితభావం, కఠోర శ్రమ, సహనంతో అనుకున్న లక్ష్యం సాధించడం సులువేనని సూచించారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ 2019లో యూపీఎస్సీ పరీక్షలో ర్యాంకు సాధించిన ఫిరోజ్ ఆలం తనకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. రామ్‌భజన్ 2009లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. ఇది కూడా చదవండి: సివిల్స్‌లో నారీ భేరి -
భార్య సివిల్స్ పోరాటం..భర్తలో అనుమానం
సాక్షి, బెంగళూరు: భార్యను సినిమాశైలిలో హత్య చేసిన భర్త బండారం బయటపడడంతో కటకటాల పాలయ్యాడు. మడివాళ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ అని ఫిర్యాదు చేసిన భర్త పృధ్వీరాజ్ (48) పై అనుమానంతో పోలీసులు అదుపులోకి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డీసీపీ సీకే.బాబా కేసు వివరాలను వెల్లడించారు. మడివాళలో గత 13 ఏళ్లుగా ఎలక్ట్రానిక్ప్ అప్లయన్స్ దుకాణం నిర్వహిస్తున్న బిహార్‌కు చెందిన పృధ్వీరాజ్, 8 నెలల కిందట జ్యోతికుమారి (38) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెది కూడా బిహారే. గత కొద్దిరోజులనుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య విద్యావంతురాలు కాగా ఆమె సివిల్స్‌కు ప్రిపేరవుతోంది. ఒక యువకునితో తరచూ ఫోన్లో మాట్లాడేది. దీంతో భర్త ప్రశ్నించడంతో గొడవలు జరిగేవి. చివరకు ఆమెను హత్యచేయాలని పృధ్వీరాజ్ పథకం రూపొందించాడు. భర్త పృధ్విరాజ్ భార్య జ్యోతి (ఫైల్) ఉడుపిలో తొలి యత్నం విఫలం ఇద్దరి సెల్ఫోన్లు ఇంట్లో పెట్టి ఈ నెల 2న భార్యను ఉడుపి మల్పె బీచ్‌కు తీసుకెళ్లడానికి జూమ్ కారును బాడుగకు తీసుకున్నాడు. స్నేహితుడు సమీర్‌కుమార్‌ను కూడా తీసుకెళ్లాడు. బీచ్‌లో భార్యను ముంచేసి సహజ మరణంగా నమ్మించాలన్నది భర్త కుట్ర. కానీ సముద్రం లోతులోకి దిగలేక ప్లాన్ ఫలించలేదు. తరువాత సకలేశపురకు తీసుకెళ్లి కారులోనే ఆమెను చున్నీతో గొంతుబిగించి ప్రాణాలు తీసి అక్కడే పొదల్లో పడేసి ఇంటికి చేరుకున్నాడు పృధ్వీరాజ్, అతని మిత్రుడు. చదవండి: (మహిళపై అత్యాచారం.. బీజేపీ నేతపై కేసు నమోదు చేయాలని కోర్టు సీరియస్) మిస్సింగ్ అని ఫిర్యాదు 5వ తేదీన మడివాళ పోలీస్‌స్టేషన్‌లో భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె సెల్‌ఫోన్ ఇంట్లోనే ఉండటాన్ని తెలుసుకుని అనుమానంతో సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. పోలీసులు చివరకు అనుమానం వచ్చి భర్తను తమదైన శైలిలో విచారించగా ఒప్పుకున్నాడు. భార్య తనను తీవ్ర వేధింపులకు గురిచేసిందని చెప్పాడు. రెండుసార్లు సివిల్స్ పరీక్షలు రాయడానికి, శిక్షణ సమయంలో ఢిల్లీకి వెళ్లిన సమయంలో అక్కడ ఒక యువకునితో సంబంధం పెట్టుకుందని, దీంతో విరక్తి చెంది హత్యచేశానని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అతని మిత్రుని కోసం గాలింపు జరుగుతోంది. -
సోషల్ మీడియాకు దూరంగా ఉంటే సక్సెస్ సాధ్యం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సోషల్ మీడియాకు వీలైనంత దూరం ఉంటే సక్సెస్ త్వరగా సాధ్యమవుతుందని సివిల్స్ ఆలిండియా 136 ర్యాంక్ సాధించిన అరుగుల స్నేహ అన్నారు. సక్సెస్ అయ్యాక మాత్రం సోషల్ మీడియాలో మనమే ఉంటామని చెప్పారు. శనివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన స్నేహ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అడిగిన సందేహాలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విషయాన్ని ఎంత తొందరగా ఆకళింపు చేసుకుంటామనే దాన్నిబట్టి ఎన్ని గంటలు చదవాలనే దానిపై ప్రణాళిక నిర్దేశించుకోవాలని సూచించారు. నెగెటివ్ ఆలోచనలను రాకుండా చూసుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు. ఓటములను గెలుపునకు నాందిగా భావించాలని చెప్పారు. తాను మూడు విడతల్లో విఫలమై, మూడో విడతలో ఒకే ఒక్క మార్కుతో సివిల్స్ ర్యాంక్ కోల్పోయినప్పటికీ పట్టు వదలకుండా నాలుగో విడతలో విజేతగా నిలిచానన్నారు. స్నేహితులతో ఎప్పటికప్పుడు గ్రూప్ డిస్కషన్స్ ద్వారా అనేక సందేహాలు నివృతి చేసుకున్నట్లు స్నేహ పేర్కొన్నారు. అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ కోసం దినపత్రికలను రోజూ కచ్చితంగా చదవి నోట్స్ తయారు చేసుకోవాలని వివరించారు. ‘సాక్షి’ తరపున జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి స్నేహను సన్మానించి మెమొంటో అందజేశారు. -
27 ఏళ్ల క్రితం వదిలేసిన చదువు.. కొడుకు కోసం కలం పట్టిన నాగరాణి
బచ్చు స్మరణ్‌రాజ్. సివిల్స్ 676వ ర్యాంకు విజేత. లక్షల మంది పోటీపడిన పరీక్షల్లో అతని ఆలోచనాధారకు తల్లి నాగరాణి అక్షర రూపమిచ్చారు. సివిల్స్‌కోసం స్మరణ్‌తో పాటు ఆమె సైతం అహర్నిశలు శ్రమించారు. 27ఏళ్ల క్రితం డిగ్రీతో చదువు ఆపేసిన ఆమె కలానికి పదును పెట్టి.. సెకన్లు, నిమిషాలను లెక్కిస్తూ కాగితాలు నింపేశారు. ప్రతి ప్రశ్నకు అతడు మాటల్లో సమాధానం చెబుతుంటే ఆమె తన కలంతో అక్షరాలను పరుగులు పెట్టించారు. కొడుకు విజయంలో ప్రత్యక్ష భాగస్వామిగా నిలిచిన నాగరాణి ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు.. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ తార్నాకకు చెందిన స్మరణ్ చెన్నై ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ (బీటెక్) పూర్తి చేశారు. 2016 డిసెంబర్లో ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం కూడా వచ్చింది. చేరిన కొద్ది రోజులకే 2017 ఫిబ్రవరిలో ఆకస్మాత్తుగా అతని ఆరోగ్యం దెబ్బతిన్నది. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న స్మరణ్‌ను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ హేమరేజ్‌గా నిర్ధారించారు. శస్త్రచికిత్స తప్పనిసరైంది. కలం పట్టుకోవడమే కష్టం... చెన్నైలోనే ఓ ప్రముఖ ఆసుపత్రిలో జరిగిన అరుదైన సర్జరీతో అతడు మృత్యుముఖం నుంచి బయటపడ్డాడు. మెదడుకు రక్షణగా ఉండే కపాల భాగాన్ని 37 రోజులు అతని పొట్టలోనే భద్రపరిచి అనంతరం తలకు అమర్చి కుట్లువేశారు. కానీ బ్రెయిన్ హేమరేజ్‌తో కుడివైపు శరీరానికి పక్షవాతం వచ్చింది. మరో మూడున్నరేళ్ల పాటు ఫిజియోథెరపీ చికిత్స పొందాడు. కుడివైపు భాగం అతని స్వాధీనంలోకి వచ్చింది. కానీ చేతివేళ్ల కదలిక కష్టమైంది. చదవగలడు. కానీ రాయలేడు. ఐఏఎస్ కావాలని కలలుగన్న స్మరణ్‌కు అది అవరోధంగా మారింది. అంతేకాదు.. కొన్ని సంస్థలైతే అతనికి శిక్షణనిచ్చేందుకూ నిరాకరించాయి. మరోసారి నిరాశకు గురైన స్మరణ్ కలను సాకారం చేయాలని తల్లిదండ్రులు నాగరాణి, రమేష్‌లు సంకల్పించారు. సివిల్స్ కోచింగ్ ఇస్తోన్న బాలలతను సంప్రదించారు. అక్కడ అతని ఆశయానికి అండ లభించింది. కలం పట్టుకొని గెలిపించారు... ఆ శిక్షణ స్మరణ్‌కు మాత్రమే కాదు. అతని తల్లికి కూడా. ఇద్దరికీ కలిపి పరీక్షలు నిర్వహిం చిన బాలలత... కొడుకు చెప్పే వేగాన్ని ఆమె అందుకోగలుగుతుందా? లేదా? అని పరీక్షిం చారు. అలా 37 పరీక్షలు నిర్వహించారు. కొడుకు కోసం పరీక్షలు రాసేందుకు ఏడాది పాటు ప్రాక్టీస్ చేశారామె. స్మరణ్ రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడితే.. ఆ అంశాలను వేగంగా రాసేందుకు నాగరాణి పోటీపడ్డారు. తప్పుల్లేకుండా స్పష్టంగా రాసేందుకు యూట్యూబ్ శిక్షణ తీసుకున్నారు. నిమిషానికి రాయగలిగే అక్షరాలను లెక్కిస్తూ వేగం పెంచారు. ‘మొదట్లో గంటకో పేజీ రాయడం కష్టంగా ఉండేది. క్రమంగా 4 గంటల్లో 40 పేజీలు రాసే నైపుణ్యం వచ్చింది. స్మరణ్ చదివే పుస్తకాల్లోని అంశాలే రాయడం వల్ల సివిల్స్ పరీక్షల్లో ఇబ్బంది కాలేదు’ అని నాగరాణి చెప్పారు. అమ్మనే స్క్రైబ్.. ఎందుకంటే? సాధారణంగా ఏ పరీక్షల్లో అయినా రాయలేనంత వైకల్యం ఉన్న వాళ్లు స్క్రైబ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అభ్యర్ధి చెప్పే సమాధానాలను స్క్రైబ్ తప్పుల్లేకుండా, ఉన్నదున్నట్లుగా రాయాలి. ‘స్క్రైబ్‌గా వ్యవహరించేందుకు బయటివాళ్లు అందు బాటులో ఉండొచ్చు. కానీ వాళ్లకు మా అబ్బాయి గెలుపు పట్ల తపన, అంకి తభావం ఉండవు కదా. అందుకే స్మరణ్ తల్లి ఆ బాధ్యతను తీసుకుంది’ అని స్మరణ్ తండ్రి రమేష్‌కుమార్ చెప్పారు. పైగా స్క్రైబ్‌గా వ్యవహరించేవాళ్లు యూపీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలు రాసే అర్హతను కోల్పోతారు. ‘నాకు, మా అబ్బాయిని గెలిపించడం కంటే గొప్ప పోటీ పరీక్ష మరొకటి లేదు కదా’ అని నవ్వేశారు నాగరాణి. -
క్రేన్ ఆపరేటర్ కూతురికి 323వ ర్యాంక్.. స్మార్ట్‌ఫోన్‌తో ప్రిపరేషన్!
రాంఘర్(రాంచి): పేద కుటుంబం..కోచింగ్ తీసుకునే స్తోమత లేదు..అయినప్పటికీ వెనుకాడలేదు. రోజుకు 18 గంటలపాటు చదువుకుని, స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించుకుని యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేరైంది. రెండు రోజుల క్రితం వెలువడిన యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో ఆల్ ఇండియా 323వ ర్యాంక్ సాధించింది. జార్ఖండ్‌కు చెందిన దివ్యా పాండే(24) ఘనత ఇది. రాంచీ యూనివర్సిటీ నుంచి దివ్య 2017లో డిగ్రీ పొందారు. ఈమె తండ్రి జగదీష్ ప్రసాద్ పాండే సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(సీసీఎల్)లో క్రేన్ ఆపరేటర్‌గా పనిచేసి 2016లో రిటైరయ్యారు. ‘ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్‌ఫోన్ సివిల్స్ సాధించేందుకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇంటర్నెట్లోని అపార సమాచారాన్ని వాడుకున్నా. రోజుకు 18 గంటలపాటు సొంతంగా చదువుకున్నా. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. యూపీఎస్సీ కోసం ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఏడాది కష్టానికి తొలి ప్రయత్నంలోనే ఫలితం దక్కింది’ అని దివ్యా పాండే తెలిపారు. పేదలు, అట్టడుగు వర్గాల వారి కోసం పనిచేస్తానన్నారు. కుమార్తె సాధించిన ఘనతతో జగదీష్ ప్రసాద్ ఆనందానికి అవధుల్లేవు. ‘నాకు చాలా గర్వంగా ఉంది. దివ్య ఎంతో కష్టపడింది. అందుకు తగిన ఫలితం దక్కింది’ అని అన్నారు. దివ్య చెల్లెలు ప్రియదర్శిని పాండే కూడా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీలో ఉత్తీర్ణురాలైంది. -
తెలుగు తేజాల సత్తా.. వారి నేపథ్యం, మనోగతాలివీ
సాక్షి, అమరావతి/నెట్వర్క్: దేశంలో అత్యున్నత స్థాయి క్యాడర్ పోస్టులైన ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఆలిండియా సర్వీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన సివిల్స్–2021 తుది ఫలితాలను (ఇంటర్వ్యూ) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సోమవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 685 మందిని ఆయా క్యాడర్ పోస్టులకు ఎంపిక చేసింది. సివిల్స్ తుది ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 40 మంది ఉన్నత ర్యాంకుల్లో నిలిచారు. ఏపీలోని నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లెకు చెందిన చల్లపల్లి యశ్వంత్‌కుమార్‌రెడ్డి 15వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. విజేతలుగా నిలిచిన అభ్యర్థుల నేపథ్యం, వారి మనోగతాలివీ.. యశ్వంత్‌కుమార్‌రెడ్డి నేపథ్యమిదీ నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లెకు చెందిన చల్లపల్లె యశ్వంత్‌కుమార్‌రెడ్డి తల్లిదండ్రులు.. పుల్లారెడ్డి, లక్ష్మీదేవి. యశ్వంత్ వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం కూలురు కొట్టాల ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 వరకు, రాజంపేట నవోదయలో 6 నుంచి 10వ తరగతి వరకు చదివారు. విజయవాడలో ఇంటర్, కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు. తరువాత బెంగళూరులోని ఐవోసీఎల్ కంపెనీలో చేరారు. అనంతరం గ్రూప్–1లో మూడో ర్యాంక్ సాధించి సీటీవోగా కర్నూలులో పనిచేస్తూ సివిల్స్‌లో శిక్షణ పొందారు. 2020లో సివిల్స్‌లో 93వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌కు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ సివిల్స్ రాసి పట్టుదలతో 15వ ర్యాంక్ సాధించారు. పూసపాటి వంశీకురాలికి 24వ ర్యాంక్ విశాఖ జిల్లా ఎండాడకు చెందిన పూసపాటి సాహిత్య సివిల్స్‌లో 24వ ర్యాంకు సాధించారు. విజయనగరం జిల్లా ద్వారపూడికు చెందిన ప్రముఖ రచయిత స్వర్గీయ పూసపాటి కృష్ణంరాజు మనవరాలు ఈమె. సాహిత్య తల్లిదండ్రులు.. జగదీష్‌వర్మ, పద్మజ. బీఫార్మసీలో నేషనల్ టాపర్‌గా నిలిచి ఎమ్మెస్సీ చేసిన సాహిత్య ఏడాదిపాటు ఉద్యోగం చేశారు. ‘ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్‌కు సిద్ధమయ్యాను’ అని సాహిత్య తెలిపారు. సత్తా చాటిన నర్సీపట్నం యువకుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం యువకుడు మంతిన మౌర్య భరద్వాజ్ 28వ ర్యాంకు సాధించారు. 2017 నుంచి వరుసగా ఐదుసార్లు ప్రయత్నం చేసి చివరకు లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. భరద్వాజ్ తండ్రి సత్యప్రసాద్ హైస్కూల్లో హెచ్ఎంగా, తల్లి రాధాకుమారి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. వరంగల్ నిట్‌లో బీటెక్ పూర్తి చేసిన భరద్వాజ్ కొద్దికాలం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2020లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలాన్ని శిక్షణకు వెచ్చించి విజయం సాధించారు. ‘పేదల జీవన ప్రమాణాలు పెంచే దిశగా నా వంతు కృషి చేస్తాను.. విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు మరింత సేవ చేయాలన్నదే నా అభిమతం’ అని భరద్వాజ చెప్పారు. కందుకూరు కోడలికి 37వ ర్యాంక్ నెల్లూరు జిల్లా కందుకూరు కోడలు వి.సంజన సింహ 37వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. హైదరాబాద్‌కు చెందిన ఆమె హైదరాబాద్‌లోనే బీటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. భర్త హర్ష ప్రోత్సాహంతో సివిల్స్‌కు ప్రయత్నించిన సంజన మూడో ప్రయత్నంలో ఐఆర్ఎస్కు ఎంపికై., ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇన్‌కంట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ‘నాలుగో ప్రయత్నంలో విజయం సాధించాను’ అని సంజన చెప్పారు. 56వ ర్యాంకర్ డాక్టర్ కిరణ్మయి కాకినాడ రూరల్ వలసపాకల గ్రామానికి చెందిన డాక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి సివిల్స్‌లో ఆలిండియా స్థాయిలో 56వ ర్యాంకు సాధించారు. ఆమె తండ్రి కొప్పిశెట్టి లక్ష్మణరావు హైదరాబాద్‌లో రక్షణశాఖ (డీఆర్డీఎల్)లో సీనియర్ టెక్నికల్ అధికారిగా, తల్లి వెంకటలక్ష్మి టీచర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. కిరణ్మయి ఉస్మానియాలో ఎంబీబీఎస్, ఎంఎస్ చేసి అక్కడే వైద్యురాలిగా పనిచేశారు. 2019లో సివిల్స్ డానిక్స్‌లో 633 ర్యాంకు సాధించి ఆర్డీవో స్థాయి ఉద్యోగానికి ఢిల్లీలో శిక్షణ పొందుతున్నారు. ఉన్నతోద్యోగాలు వదులుకొని.. 62వ ర్యాంకు సాధించిన తిరుమాని శ్రీపూజ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపిండికి చెందినవారు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ఈవోపీఆర్డీగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీపూజ ఎన్ఐటీ సూరత్కల్లో బీటెక్ చేశారు. అనంతరం సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. ‘లక్షలాది రూపాయల వేతనం కూడిన ఉన్నతోద్యోగాలు వచ్చినా చేరలేదు. మొదటిసారి సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. రెండోసారి ర్యాంకును సాధించాను’ అని శ్రీపూజ చెప్పారు. సత్తా చాటిన రైతు బిడ్డ 2021 సివిల్స్‌లో నంద్యాల జిల్లా కోవెలకుంట్లకు చెందిన రైతు బిడ్డ గడ్డం సుధీర్‌కుమార్ సత్తా చాటారు. పెద్ద రామసుబ్బారెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడైన సుధీర్‌కుమార్‌రెడ్డి 69వ ర్యాంకు సాధించారు. ఇంటర్ గుడివాడలో చదివి, ఖరగ్‌పూర్ ఐఐటీ చేశారు. 4వ ప్రయత్నంలో ఐఏఎస్ సాధించారు. రాజమహేంద్రి కుర్రాడికి 99వ ర్యాంకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంకి చెందిన తరుణ్ పట్నాయక్ తొలి ప్రయత్నంలోనే 99వ ర్యాంకు సాధించారు. తరుణ్ తండ్రి రవికుమార్ పట్నాయక్ ఎల్ఐసీ రూరల్ బ్రాంచిలో క్లర్క్‌గా పనిచేస్తుండగా, తల్లి శారదా రాజ్యలక్ష్మి వైజాగ్ ఫుడ్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తరుణ్ పట్నాయక్ గౌహతి ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ‘సివిల్స్‌కు స్వంతంగా చదువుకుంటూనే తొలి ప్రయత్నంగా పరీక్ష రాశాను. 99వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ఐఏఎస్‌గా ఎంపికై ప్రజలకు సేవ చేయాలనే తన లక్ష్యం నెరవేరింది’ అని తరుణ్ పట్నాయక్ తెలిపారు. ఎమ్మిగనూరు అమ్మాయికి 128వ ర్యాంక్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన అంబికాజైన్ తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 128వ ర్యాంకు సాధించారు. పట్టణానికి చెందిన జైన్ ఎలక్ట్రికల్ షాపు యజమాని లలిత్‌కుమార్, అనిత దంపతుల కుమార్తె అయిన అంబికాజైన్ 10వ తరగతి వరకు ఇక్కడే చదివారు. ఇంటర్మీడియెట్, డిగ్రీలను హైదరాబాద్‌లో పూర్తి చేసి ఢిల్లీలోని సౌత్ ఏషియన్ వర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో ఎంఏ చేశారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించటం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఆన్లైన్ కోచింగ్..154వ ర్యాంక్ నంద్యాల జిల్లా నందిపల్లెకు చెందిన వంగల సర్వేశ్వరరెడ్డి, మల్లేశ్వరమ్మల కుమార్తె మనీషారెడ్డి సివిల్స్‌లో 154వ ర్యాంకు సాధించింది. మనీషా ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. సివిల్స్‌లో హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకుంది. మనీషారెడ్డి మాట్లాడుతూ.. ‘రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఆడపిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్ చదువులే కాదు కష్టపడితే అతి తక్కువ కాలంలో ఐఏఎస్, ఐపీఎస్‌లు కూడా సాధించగలరు’ అని చెప్పారు. న్యాయవాది కుమారుడికి 157వ ర్యాంక్ పల్నాడు జిల్లా పెదకూరపాడుకి చెందిన కన్నెధార మనోజ్‌కుమార్ 157వ ర్యాంక్ సాధించారు. న్యాయవాది కన్నెధార హనమయ్య, రాజరాజేశ్వరి దంపతుల పెద్ద కుమారుడైన మనోజ్ ఐఐటీ ఇంజనీరింగ్ విద్యను తిరుపతిలో అభ్యసించారు. ఆ తరువాత రూ.30 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం రాగా.. ఆ ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో 157 ర్యాంకు సాధించారు. ‘దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతోనే సివిల్స్‌కు సిద్ధమయ్యా. తల్లిదండ్రుల స్ఫూర్తితో రోజుకు 8 గంటలు చదివేవాడిని’ అని మనోజ్‌కుమార్ తెలిపారు. మూడో ప్రయత్నంలో 235వ ర్యాంక్ గుంటూరు శ్యామలానగర్‌కు చెందిన కాకుమాను అశ్విన్ మణిదీప్ మూడో ప్రయత్నంలో 235వ ర్యాంకు సాధించారు. మణిదీప్ తండ్రి కిషోర్, తల్లి ఉమాదేవి ఉపాధ్యాయులు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ టెక్నాలజీలో బీటెక్ ఏరో స్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మణిదీప్ మాట్లాడుతూ.. ‘తొలిసారి దారుణంగా ఓటమి చెందినా నిరాశ చెందకుండా చెన్నైలో శిక్షణ పొందాను. ఆన్లైన్ టెస్ట్‌లు రాసేవాడిని, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, పత్రికలు చదవడం చేసేవాడిని’ అని చెప్పారు. తల్లిదండ్రుల స్ఫూరితో సివిల్స్‌కు.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన షేక్ అబ్దుల్ రవూఫ్ సివిల్స్‌లో 309 ర్యాంక్ సాధించారు. రవూఫ్ తండ్రి మహ్మద్ ఇక్బాల్ వ్యవసాయ శాఖలో సూపరింటెండెంట్‌గా పని చేస్తుండగా.. తల్లి గౌసియా బేగం కృష్ణా జిల్లా మైనార్జీ సంక్షేమ అధికారిగా, వ్యవసాయ శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పని చేశారు. ‘ముంబై ఐఐటీలో బీటెక్ పూర్తి చేశాక అమెరికాలో ఎంఎస్ చేశాను. చెన్నైలో నాబార్డు మేనేజర్‌గా రెండున్నరేళ్లు పని చేశాను. ఏడాదిగా ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో సివిల్స్ శిక్షణ పొందాను’ అని రవూఫ్ పేర్కొన్నారు. గంగపుత్రుడికి 350వ ర్యాంక్ కాకినాడ పర్లోవపేటకు చెందిన దిబ్బాడ సత్యవెంకట అశోక్ 350వ ర్యాంక్ సాధించారు. అశోక్ తండ్రి సత్తిరాజు సముద్రంలో చేపల వేట చేస్తుంటారు. అశోక్ ఇంటర్మీడియెట్ గుంటూరులో, గౌహతిలో ఐఐటీ బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశారు. నాలుగో ప్రయత్నంలో 350వ ర్యాంకు సాధించారు. రైతు బిడ్డకు 420వ ర్యాంక్ తెనాలి రూరల్ మండలం చావావారి పాలెంకు చెందిన రైతుబిడ్డ నల్లమోతు బాలకృష్ణ 420వ ర్యాంకు సాధించారు. విజయవాడలో ఇంటర్, జేఎన్టీయూ, పులివెందులలో బీటెక్, చెన్నైలో రెన్యూవబుల్ ఎనర్జీలో ఎంటెక్ చేశాడు. జూనియర్ సైంటిస్ట్‌గా పనిచేశారు. ‘ప్రస్తుత ర్యాంక్‌తో ఐఆర్ఎస్ వస్తుందని భావిస్తున్నా. మరోసారి సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించాలనేది నా ఆశయం’ అని బాలకృష్ణ చెప్పారు. ఓఎన్జీసీ ఉద్యోగికి 602వ ర్యాంకు కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం వాడపర్రుకు చెందిన పండు విల్సన్ 602వ ర్యాంకు సాధించారు. ముంబైలోని ఓఎన్జీసీ ఎలక్ట్రికల్ విభాగంలో ఉద్యోగం చేస్తూ తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు. తండ్రి ప్రసాద్ వ్యవసాయం చేస్తుంటారు. తల్లి లక్ష్మి గృహిణి. విల్సన్ కాకినాడ జేఎన్టీయూలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడై ఓఎన్జీసీలో ఉద్యోగం సాధించారు. సీఎం, గవర్నర్ శుభాకాంక్షలు సివిల్స్–2021లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 15వ ర్యాంకు సాధించిన సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డితో పాటు ఇతర అభ్యర్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు పొందడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని గవర్నర్ పేర్కొన్నారు. 15 ర్యాంకు సాధించిన యశ్వంత్‌కుమార్‌రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వీరితో పాటు సివిల్స్‌కు ఎంపికైన 685 మందికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. చదవండి👉సివిల్స్ టాపర్ శ్రుతీ శర్మ -
కావలి మేఘనకు కేటీఆర్ అభినందనలు, శాలువాతో సత్కారం
సాక్షి, హైదరాబాద్: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2020 తుది పరీక్ష ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 83వ ర్యాంక్ సాధించిన కావలి మేఘనను ఐటీ శాఖమంత్రి కేటీ రామారావు అభినందించారు. వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గానికి చెందిన మేఘన తన తండ్రి టీఎస్ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (కమర్షియల్) కె.రాములుతో శుక్రవారం ప్రగతిభవన్‌కు వెళ్లి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మేఘనను మంత్రి శాలువాతో సత్కరించారు.నేటి యువతరం మేఘనను ఆ దర్శంగా తీసుకోవాలని సూచించారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో కార్మిక శాఖమంత్రి సీహెచ్ మల్లారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ భాస్కర్ తదితరులున్నారు. -
Civils Prilimanary Exam: నేడు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష
సాక్షి, తిరుపతి: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం ఉదయం ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి తిరుపతిలో 16 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 7,201 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. జనవరి 7న మెయిన్స్ పరీక్ష జరగనుంది. అభ్యర్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అరగంట ముందుగా పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు. బస్టాండ్ నుంచి పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నారు. ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. తెలంగాణ... తెలంగాణ వ్యాప్తంగా 53,015 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. హైదరాబాద్ లో 101 పరీక్ష కేంద్రాల్లో 46,953 మంది, వరంగల్‌లో 14 కేంద్రాల్లో 6,062 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణ బస్ భవన్ ప్రెస్ నోట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2021 కి హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత రవాణా అందించడానికి టీఎస్ఆర్టీసీ నిర్వహణ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ చూపించడం ద్వారా హైదరాబాద్, వరంగల్‌లోని మూడు నగరాల్లోని మెట్రో, ఏసీ బస్సులతో సహా అన్ని రకాల సిటీ బస్సులలో ఈ ఉచిత రవాణా సేవను పొందవచ్చు అని తెలిపారు. ఈ క్రమంలో వీసీ సజ్జనార్ సివిల్ సర్వీస్ పరీక్ష -2021 కి హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్ఆర్టీసీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది అన్నారు. -
1993లో ఇంటర్వ్యూలో ఫెయిల్.. నాలాగా ఇబ్బంది పడొద్దనే..
సాక్షి, హైదరాబాద్: వృత్తిరీత్యా ఆయన పోలీస్ కమిషనర్. నిత్యం పనులతో బిజీనే. అయినా సమయం చిక్కించుకుని.. సివిల్స్ రాసే అభ్యర్థులకు శిక్షణ.. గైడెన్స్‌తో అండగా నిలుస్తున్నారు. ఇలా ఇప్పటివరకు వెయ్యికి పైగా అభ్యర్థులు సివిల్స్ సాధించేలా తీర్చిదిద్దారు. తాజాగా 2020 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో మొదటి 20 ర్యాంకుల్లో ఆరు మంది (3, 8, 14, 18, 19, 20), వంద ర్యాంక్స్లో 19 మందికి ఈయనే మెంటార్షిప్ వహించారు. ఆయనే రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం.భగవత్. మంగళవారం తెలంగాణ టాపర్ పీ శ్రీజ (20వ ర్యాంక్), కనక్నాల రాహుల్ (218వ ర్యాంక్), పీ గౌతమి (317వ ర్యాంక్)లు రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... చదవండి: సివిల్స్ టాప్ 20 ర్యాంక్: ఆడుతూపాడుతూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యా ► 1993లో యూపీఎస్సీ మెయిన్స్‌లో పాసయ్యా. కానీ సరైన గైడెన్స్ లేకపోవటంతో ఇంటర్వ్యూలో ఫెయిలయ్యా. లోలోపల ఏదో తెలియని భయం. మానసికంగా కృంగదీసింది. స్థానికంగా ఉన్న సీనియర్ ఆఫీసర్ల మార్గనిర్దేశంతో రెండో ప్రయత్నంలో 1994లో విజయం సాధించా. సివిల్స్ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యేందుకు నాకు ఎదురైన ఇబ్బందులు నేటి యువతకు ఎదురుకావొద్దనే ఉద్దేశంతో 2014 నుంచి శిక్షణ ఇవ్వటం ప్రారంభించా. చదవండి: సివిల్స్‌లో తెలుగువారి సత్తా ► హోదా వచ్చాక ఎవరైనా గౌరవిస్తారు. సాయం చేస్తారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు సరైన మార్గనిర్ధేశం చేసేవాళ్లే చాలా అవసరం. సివిల్స్‌లో ప్రతి ఒక్క మార్కు కూడా కీలకమే. దేశంలో ఏటా 10 లక్షల మంది పోటీపడితే ఉత్తీర్ణలయ్యేది 800 మంది లోపే ఉంటుంది. టాప్ 10 ర్యాంకర్ల మధ్య ఒక్క మార్కు తేడానే ఉంటుంది. మౌఖిక పరీక్షే ముఖ్యం ► సివిల్స్‌లో 275 మార్కులతో ఉండే మౌఖిక పరీక్ష చాలా కీలకం. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. లేకపోతే విజయం సాధించలేం. అందుకే ఇంటర్వ్యూకు ప్రిపేర్ చేసే అంశంపై ప్రత్యేక దృష్టి సారించా. అభ్యర్థుల్లో ఆత్మ విశ్వాసం, మనోధైర్యాన్ని నింపేందుకు మెయిన్స్ పూర్తవగానే 3 నుంచి 4 నెలల పాటు ఉచితంగా ఇంటర్వ్యూపై కోచింగ్ ఇస్తున్నాం. మరికొందరి సాయం.. భద్రాద్రి–కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఐఆర్ఎస్లు (ఏపీ) సాధు నరసింహా రెడ్డి, నితేష్ పాథోడ్, ముకుల్ కులకర్ణి, ఐఆర్ఎస్ రిటైర్డ్ రాజీవ్ రణాదే, ఐఏఎస్‌లు నీల్కాంత్ అవద్, ఆనంద్ పాటిల్, డాక్టర్ శ్రీకర్ పరదేశి, అభిషేక్ సరాఫ్, ఎంయూఏడీ జాయింట్ కమిషనర్ సమీర్ ఉన్హాలే, ఐసీఏఎస్ సుప్రియ దేవస్థలి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ శైలేంద్ర డియోలాంకర్, జేపీసీ డైరెక్టర్ డాక్టర్ వివేక్ కులకరి్ణలు కూడా నాతోపాటు సివిల్స్ అభ్యర్థులకు సహకరిస్తున్నారు. రెండు వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా, జూమ్, వీడియో కాల్స్ ద్వారా అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాం. హైదరాబాద్‌కు చెందిన అభ్యర్థులకు భౌతికంగా శిక్షణ ఇస్తున్నాం. ఫారెస్ట్ సర్వీసెస్, కేంద్ర సాయుధ పోలీసు బలగాల పరీక్షలకు కూడా ట్రెయినింగ్ ఉంటుంది. ► తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, కేరళ, రాజస్తాన్, ఉత్తరాఖండ్, బీహార్, అసోం, ఒడిశా, జమ్మూ అండ్ కశ్మీర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన సివిల్స్ అభ్యర్థులు మా వద్ద శిక్షణ పొందుతున్నారు. నా వద్ద శిక్షణ పొందిన సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ (హైదరాబాద్ మాజీ సీపీ ఏకే ఖాన్ కుమారుడు), భైంసా ఏఎస్పీ కిరణ్ ఖరేలు ప్రస్తుతం మన రాష్ట్రంలో విధుల్లో ఉన్నారు. https://t.co/zb1mcIV0OA — Rachakonda Police (@RachakondaCop) September 28, 2021 -
Civils Ranker: ఎవరి కోసమూ ఎదురు చూడొద్దు..
సాక్షి, హైదరాబాద్: జీవితంలో సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని, అలా అని అంత ఈజీగా ఏదీ దక్కదని సివిల్స్‌లో 20వ ర్యాంకు సాధించిన డాక్టర్ పొడిశెట్టి శ్రీజ అన్నారు. ఎంబీబీఎస్ పూర్తవ్వగానే తండ్రి శ్రీనివాస్ ప్రోత్సాహంతోనే ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నట్లు తెలిపారు. సివిల్స్‌లో తాను 100 లోపు ర్యాంక్‌ను ఊహించానని ఇంత మంచి ర్యాంకు వస్తుందనుకోలేదని ఆనందం వ్యక్తం చేశారు. శనివారం ర్యాంకర్ శ్రీజ తన కెరియర్ విశేషాలను ‘సాక్షి’కి వివరించారు. అమ్మ ప్రేరణే డాక్టర్‌గా మలిచింది తన చిన్న తనంలోనే అమ్మ నర్సుగా సేవలందిస్తున్న అంశాలు తనను ప్రేరేపించడంతో ఎంబీబీఎస్ చేసి డాక్టరయ్యానని శ్రీజ తెలిపారు. విద్యాభ్యాసం రెండవ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చైతన్యపురిలోని రఘునాథ హైస్కూల్లో, ఇంటర్ శ్రీ చైతన్య కళాశాలలో, ఎంబీబీఎస్ ఉస్మానియా యూనివర్సిటీ(2019)లో పూర్తి చేసినట్లు తెలిపారు. అక్కడి నుంచి సివిల్స్ కోచింగ్ ప్రిపరేషన్ ప్రారంభించానన్నారు. కూతురుకు మిఠాయి తినిపిస్తున్న శ్రీజ తల్లిదండ్రులు, శ్రీనివాస్, శ్రీలత, చిత్రంలో సోదరుడు సాయిరాజ్ మహిళా సాధికారతకు కృషి... డాక్టర్‌గా సేవలందించాలనుకున్న తనకు అమ్మతో పాటు నాన్న ప్రోత్సాహం తోడైందని..అక్కడ నుంచి తన సేవలను కొద్ది మందికి కాకుండా మరింత మందికి అందించాలన్న ఆశయంతో సివిల్స్ వైపు అడు గులు వేసినట్లు తెలిపారు. మహిళ ఉన్నత చదువు చదివితే ఆ ప్రభావం కుటుంబపై ఎలా చూపుతుందో తెలుసుకున్నట్లు తెలిపారు. మహిళా సాధికారతతోపాటు విద్యాభివృద్ధికి కృషిచేస్తానన్నారు. యువతకు సూచన ఎవ్వరూ తమను తాము తక్కువ అంచనా వేసుకోకూడదని, అందరూ సమర్థులేనని గుర్తించి ముందుకు సాగాలని శ్రీజ పేర్కొన్నారు. ఎవ్వరి ప్రోత్సా హం కోసం ఎదురు చూడొద్దని.. ఎవరికి వారు తమకు తాముగా ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగితే ఎలాంటి వాటినైనా సాధించుకోవచ్చన్నారు. సివిల్స్ ర్యాంకర్ డాక్టర్ పొడిశెట్టి శ్రీజ తండ్రి కల నెరవేర్చిన కూతురు చదువులో చురుగ్గా ఉండే శ్రీజ తన తండ్రి కోరిక మేరకు మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సాధించడంతో తండ్రి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అంతటితో ఆగకుండా కూతురును ఐఏఎస్ చదివించాలనే కోరిక తండ్రిలో బలపడింది. అదే విషయాన్ని శ్రీజకు చెప్పి ఒప్పించాడు. అతి సాధారణ కుటుంబం నుంచి ఐఏఎస్ వరకు... అతి సాధారణ కుటుంబ నుంచి వచి్చను శ్రీజ సివిల్స్ బెస్ట్ ర్యాంక్ సాధించడంతో శ్రీనివాస్ స్నేహితులు చిలుకానగర్ డివిజన్ సాయినగర్‌కాలనీలో సంబరాలు చేసుకుంటున్నా రు. 20 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చిన శ్రీనివాస్ పలు ఆటోమొబైల్ షోరూమ్స్‌లో పని చేశారు. ప్రస్తుతం ఉప్పల్ చిలుకానగర్ డివిజన్ పరిధిలో సాయినగర్‌లో డబుల్ బెడ్ రూం ఇంటిలో అద్దెకుంటున్నారు. శ్రీజకు ఓ సోదరుడు సాయిరాజ్ కూడా ఉన్నాడు. అతను బీబీఏ పూర్తి చేశాడు. -
నా విజయం వెనుక చాలామంది కృషి ఉంది : సివిల్స్ 20 వ ర్యాంకర్
-
సివిల్స్– 2021 ప్రిలిమ్స్ పరీక్ష.. ఈ నాలుగు సక్సెస్‌కు కీలకం
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష... ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా 19 ఉన్నత స్థాయి సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే మూడంచెల ఎంపిక ప్రక్రియలో తొలిదశ! ప్రిలిమ్స్‌లో ప్రతిభ చూపితే.. సివిల్స్‌లో విజయం దిశగా మొదటి అడుగు పడినట్లే! ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది పోటీ పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మంది వరకూ దరఖాస్తు చేసుకున్నారని అంచనా! ఇంతటి తీవ్ర పోటీ నెలకొన్న సివిల్స్ ప్రిలిమ్స్‌లో గట్టెక్కి.. మలిదశ మెయిన్‌కు ఎంపికయ్యేందుకు అభ్యర్థులు ఎంతో శ్రమిస్తుంటారు. సివిల్స్ ప్రిలిమ్స్–2021 పరీక్ష.. అక్టోబర్ 10న జరుగనుంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రిపరేషన్ వ్యూహాలు, ఫోకస్ చేయాల్సిన అంశాలపై ప్రత్యేక కథనం... సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష.. అక్టోబర్ 10వ తేదీన జరగనుంది. అంటే.. అభ్యర్థులకు అందుబాటులో ఉన్న సమయం 33 రోజులు మా త్రమే. ప్రిలిమ్స్ అనే మైలురాయిని దాటేందుకు ఈ సమయం ఎంతో కీలకం. సివిల్స్ అభ్యర్థులు ఈ అమూల్యమైన సమయంలో ముఖ్యంగా నాలుగు విజయ సూత్రాలు పాటించాలి అంటున్నారు నిపు ణులు. అవి..విశ్లేషణాత్మక అధ్యయనం, పునశ్చరణ, సమయ పాలన, ప్రాక్టీస్. ఈ నాలుగు సూత్రాలు పక్కాగా అమలు చేస్తే..ప్రిలిమ్స్‌లో విజయావకా శాలు మెరుగుపరచుకోవచ్చని సూచిస్తున్నారు. సమయ పాలన ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అభ్యర్థులకు టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. జనరల్ స్టడీస్ పేపర్లో పేర్కొన్న ఏడు విభాగాలకు సంబంధించిన సిలబస్‌ను పరిశీలించి.. దానికి అనుగుణంగా ప్రతి సబ్జెక్ట్‌ను నిత్యం చదివేలా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. ప్రతి రోజు కనీసం ఎనిమిది నుంచి పది గంటల సమయం ప్రిపరేషన్‌కు కేటాయించాలి. దీంతోపాటు ప్రతి వారం అధ్యయనం పూర్తిచేసిన టాపిక్స్‌పై సెల్ఫ్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు రాయాలి. తద్వారా ఆయా అంశాలపై తమకు లభించిన అవగాహనను విశ్లేషించుకోవాలి. గత ప్రశ్న పత్రాల సాధన కూడా లాభిస్తుంది. కరెంట్ అఫైర్స్‌తో కలిపి సిలబస్‌లో పేర్కొన్న కోర్ టాపిక్స్‌ను కరెంట్ అఫైర్స్‌తో సమ్మిళితం చేసుకుంటూ చదవాలి. ఎందు కంటే.. ఇటీవల కాలంలో ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు.. కరెంట్ అఫైర్స్ సమ్మిళితంగా అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు 2020 జూలై నుంచి 2021 జూలై వరకూ జరిగిన.. ముఖ్యమైన కరెంట్ ఈవెంట్స్‌పై దృష్టిపెట్టాలి. వాటిని సంబంధిత సబ్జెక్ట్ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. సంఘటనల నేపథ్యం, ప్రభావం, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు అంచనా.. వంటి అంశాలను విశ్లేషించుకుంటూ చదవడం చాలా అవసరం. అనుసంధానం చేసుకుంటూ ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో భాగంగా అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లను ఇతర సబ్జెక్ట్లతో అనుసంధానం చేసు కుంటూ చదవాలి. ముఖ్యంగా ఎకానమీ–పాలిటీ, ఎకానమీ–జాగ్రఫీ, జాగ్రఫీ–ఎకాలజీ; జాగ్రఫీ–సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ–పాలిటీ విభాగాలను అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. దీనివల్ల ప్రిపరేషన్ పరంగా ఎంతో విలువైన సమయం కలిసొస్తుంది. ఇలా మిగిలిన సమయంలో తాము క్లిష్టంగా భావించే.. ఇతర ముఖ్య టాపిక్స్‌పై దృష్టిపెట్టొచ్చు. ముఖ్యాంశాల గుర్తింపు ప్రస్తుతం సమయంలో..అభ్యర్థులు సబ్జెక్ట్ వారీగా ముఖ్యాంశాలను గుర్తించాలి. అందుకోసం గత నాలుగైదేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. వాటిల్లో సబ్జెక్టుల వారీగా ఏఏ అంశాలకు ఎక్కువ ప్రాధా న్యం లభించిందో గుర్తించాలి. ఉదాహరణకు చరిత్రలో.. సాంస్కృతిక చరిత్ర, రాజ్య వంశాలు వంటి వి. అలాగే ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో గత ఏడాది కాలంలో సంభవించిన ముఖ్యమైన పరిణామాలపై దృష్టి సారించాలి. ప్రధానంగా కరోనా పరిస్థితులు, ప్రపంచ వాణిజ్యంపై చూపిన ప్రభావం, వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలు ముఖ్యమైనవిగా గుర్తించాలి. అదే విధంగా..ఆయా దేశాల మధ్య ఒప్పందాలు–వాటి ఉద్దేశం–అంతర్జాతీయంగా, జాతీయంగా వాటి ప్రభావం తదితర అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. కొత్త అంశాలు చదవాలా విస్తృతమైన సివిల్స్ సిలబస్ ప్రిపరేషన్ క్రమంలో అభ్యర్థులు కొన్ని టాపిక్స్‌ను వదిలేస్తుంటారు. అలా విస్మరించిన అంశాలను ఇప్పుడు చదవడం సరైందేనా.. అనే సందేహాన్ని చాలామంది అభ్య ర్థులు వ్యక్తం చేస్తుంటారు. గతంలో చదవకుండా వదిలేసిన టాపిక్స్‌లో కొరుకుడు పడని అంశాలుం టే.. అనవసర ఆందోళనకు దారితీస్తుంది. కాబట్టి విస్మరించిన అంశాలను ఇప్పుడు కొత్తగా చదవడం సరికాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పట్టు బిగించిన వాటినే మరింత లోతుగా అధ్యయనం చేయాలని సూచిస్తున్నారు. ఒకవేళ కొత్త అంశాలను చదవాల్సిన పరిస్థితి ఏర్పడితే.. కాన్సెప్ట్లపై అవగాహన పొందితే సరిపోతుంది. పేపర్–2కు కూడా సమయం అభ్యర్థులు పేపర్–2(సీశాట్)కు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. దీన్ని అర్హత పేపర్‌గానే పేర్కొ న్నప్పటికీ.. ఇందులో 33 శాతం మార్కులు సాధి స్తేనే.. పేపర్–1 మూల్యాంకన చేస్తారు. దాని ఆధా రంగానే మెయిన్‌కు ఎంపిక చేస్తారు. పేపర్–2లో అర్హత మార్కులు సాధించేందుకు ప్రధానంగా మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్ స్కిల్స్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి. రెండుసార్లు రివిజన్ సిలబస్ అంశాల ప్రిపరేషన్ సెప్టెంబర్ చివరికల్లా పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి రోజూ కొంత సమయం రివిజన్‌కు కేటాయిస్తూ.. ప్రతి సబ్జెక్ట్‌ను కనీసం రెండుసార్లు పునశ్చరణ చేయాలి. రివిజన్‌కు ఉపకరించేలా ప్రిపరేషన్ సమయంలోనే ఎప్పటికప్పుడు షార్ట్‌నోట్స్ రాసుకోవాలి. మెమొరీ టిప్స్ ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు మెమొరీ టిప్స్ సాధన చేయాలి. పాయింటర్స్, ఫ్లో చార్ట్స్, విజువలైజేషన్ టెక్నిక్స్, అన్వయించుకోవడం వంటి వాటి ద్వారా మెమొరీ పెంచుకోవాలి. ఇలా ప్రతి విష యంలో నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేస్తే.. ప్రిలి మ్స్‌లో విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. సబ్జెక్ట్ వారీగా ఇలా కరెంట్ అఫైర్స్: కరోనా పరిణామాలు, అభివృద్ధి కారకాలపై చూపుతున్న ప్రభావం; గత ఏడాది కాలంలో ఆర్థిక ప్రగతికి సంబంధించిన గణాం కాలు; ముఖ్యమైన నియామకాలు; అంతర్జా తీయంగా పలు సంస్థల నివేదికల్లో భారత్‌కు సంబంధించిన గణాంకాలు. చరిత్ర: ఆధునిక భారత చరిత్ర; జాతీయోద్యమం; ప్రాచీన, మధ్యయుగ భారత చరిత్రకు సంబంధించి సాహిత్యం, కళలు, మత ఉద్యమాలు, రాజకీయ–సామాజిక–ఆర్థిక చారిత్రక అంశాలు. ఆధునిక చరిత్రలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన–పరిపాలన విధానాలు; బ్రిటిష్‌కు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు–ఉద్యమాలు,సంస్కరణోద్యమాలు. ముఖ్యంగా స్వాతంత్య్ర పోరాటం. పాలిటీ: రాజ్యాంగం: రాజ్యాంగ పరిషత్, రాజ్యాం గ సవరణ ప్రక్రియ, పీఠిక, ఇప్పటివరకు జరిగిన ముఖ్య రాజ్యాంగ సవరణలు–వాటికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు. రాజకీయ వ్యవస్థ: పార్లమెంటరీ వ్యవస్థ, అర్థ సమాఖ్య, రాష్ట్రపతి,గవర్నర్, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్నికల కమిషన్, ఆర్థిక కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు,అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ వంటి వాటికి సంబంధించి రాజ్యాంగ ప్రకరణలు. పంచాయతీరాజ్ వ్యవస్థ: బల్వంత్రాయ్, అశోక్‌మెహతా, హన్మంతరావ్, జి.వి.కె.రావ్, సింఘ్వీ కమిటీల సిఫార్సులు, 73వ రాజ్యాంగ సవరణ చట్టం. ప్రభుత్వ విధానాలు: విధానాల రూపకల్పన జరిగే తీరు; విధానాల అమలు, వాటి సమీక్ష; ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ముఖ్య విధానపర నిర్ణయాలు; కేంద్ర–రాష్ట్ర సంబంధాలు; గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన న్యాయ వ్యవస్థ క్రియాశీలత. ఎకానమీ: ఆర్థికాభివృద్ధిలో సహజ వనరులు– మూలధన వనరుల పాత్ర. ► ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల ప్రగతి(ముఖ్యంగా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం వంటివి). ► ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో దేశంలో ఆర్థిక–సాంఘికాభివృద్ధి. ► పారిశ్రామిక తీర్మానాలు–వ్యవసాయ విధానం ► పంచవర్ష ప్రణాళికలు–ప్రణాళిక రచన–వనరుల కేటాయింపు–10, 11 పంచవర్ష ప్రణాళికలు ► బ్యాంకింగ్ రంగం ప్రగతి–సంస్కరణలు– ఇటీ వల కాలంలో బ్యాంకింగ్ రంగంలో స్కామ్‌లు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం; ► తాజా మానవాభివృద్ధి, ప్రపంచ అభివృద్ధి నివేదికలు. సైన్స్ అండ్ టెక్నాలజీ: గత ఏడాది కాలంలో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు; ఇటీవల కాలంలో సంక్రమిస్తున్న వ్యాధులు–కారకాలు; సైబర్ సెక్యూరిటీ యాక్ట్; రక్షణ రంగంలో కొత్త మిస్సైల్స్ ప్రయోగాలు; ముఖ్యమైన వన్యమృగ సంరక్షణ కేంద్రాలు–పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలు, చర్యలు; వివిధ ఐటీ పాలసీలు. జాగ్రఫీ: జనగణనకు సంబంధించిన ముఖ్యాంశాలు; అత్యధిక, అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాలు; అత్యధిక, అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రాలు; స్త్రీ, పురుష నిష్పత్తి; స్త్రీ, పురుష అక్షరాస్యత శాతం; గత పదేళ్లలో జనన, మరణ రేట్లు. పర్యావరణ సమస్యలు– ఎక్కువగా కేంద్రీకృతమైన ప్రాంతాలు, దేశాలు. ► సౌర వ్యవస్థ, భూమి అంతర్ నిర్మాణం, శిలలు, జియలాజికల్ టైం స్కేల్, రుతుపవనాలు, ప్రపంచ పవనాలు, చక్రవాతాలు, ఉష్ణోగ్రత విలోమం, భూకంపాలు, సునామీలు. ► మన దేశంలో నగరీకరణ; రుతుపవనాలు, నదులు; జలాల పంపిణీ; వివాదాలు. సివిల్స్ ప్రిలిమ్స్–2021 ముఖ్యాంశాలు ► మొత్తం పోస్ట్‌ల సంఖ్య: 712 ► ప్రిలిమినరీ పరీక్ష తేది: అక్టోబర్ 10, 2021 ► రెండు పేపర్లు.. 400 మార్కులకు పరీక్ష (ఒక్కో పేపర్‌కు 200 మార్కులు). ► ప్రిలిమ్స్‌లో ప్రతిభ ఆధారంగా 1:12 లేదా 1:12.5 నిష్పత్తిలో మలి దశ మెయిన్‌కు ఎంపిక ► తెలుగు రాష్ట్రాల్లో.. అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు. -
సివిల్స్ అభ్యర్థులకు కేంద్రం తీపి కబురు
న్యూఢిల్లీ: 2020లో కరోనా మహమ్మారి వ్యాప్తి, వరదల కారణంగా దేశవ్యాప్తంగా చాలామంది అభ్యర్థులు సివిల్ సర్వీస్ పరీక్షకు(సీఎస్ఈ) హాజరు కాలేకపోయారు. వీరిలో చివరి ప్రయత్నం(లాస్ట్ అటెంప్ట్) అభ్యర్థులు కూడా ఉన్నారు. వీరికి కేంద్రం తీపి కబురు చెప్పింది. వీరికి 2021లో మరో అవకాశం ఇవ్వడానికి అంగీకరించింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ అవకాశం నిర్దేశిత వయసులోపు ఉన్నవారికే వర్తిస్తుంది. వయసు మీరిన ‘చివరి ప్రయత్నం’ అభ్యర్థులకు మరో అవకాశం లేనట్లే. 2020లో పరీక్ష రాయలేకపోయిన వారు మరో అవకాశం కింద 2022లో రాసేందుకు మాత్రం వీల్లేదు. కరోనా వల్ల 2020లో సివిల్స్‌కు హాజరుకాలేకపోయిన అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను కోర్టు ఈనెల 8కి వాయిదా వేసింది. చదవండి: శభాష్ పోలీస్: క్షణం ఆలస్యమైతే ఘోరం జరిగేది! సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్! -
ఆన్లైన్లో సివిల్స్ శిక్షణ
కరీంనగర్: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు తెలంగాణలో ఎనలేని క్రేజ్. ఏటా వేల మంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ప్రతిష్టాత్మక సర్వీసులే లక్ష్యంగా.. సివిల్స్ పరీక్షలకు సన్నద్ధం అవుతుంటారు. యూపీఎస్సీ వందల సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే.. దేశవ్యాప్తంగా ఆరు లక్షల మందికిపై దరఖాస్తు చేసుకుంటారు. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ.. ఇలా మూడంచెల సివిల్స్ ఎంపిక ప్రక్రియలో.. విజయం సాధించాలంటే.. కనీసం ఏడాదిన్నరపాటు నిపుణుల సలహాలతో అంకితభావంతో ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా విద్యార్థులు వ్యక్తిగతంగా క్లాసులకు రాలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు వీలున్న సమయంలో నిపుణులు రూపొందించిన వీడియో క్లాసులు వింటూ.. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేలా.. క్రిష్ణప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో యాప్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ అందిస్తోంది. ఇందుకు సాక్షి మీడియా గ్రూప్.. మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఠీఠీఠీ. జుpజ్చీట. ఛిౌఝలో లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవచ్చు. కోర్సు కాల వ్యవధి ఏడాదిన్నర.‡ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.25,000. ప్లే స్టోర్ నుంచి క్రిష్ణప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వీడియో క్లాసులు వినొచ్చు. ఈ వీడియోలను ఎప్పుడైనా, ఎక్కడైనా మొబైల్లో చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యాప్‌లో స్టడీ మెటీరియల్, అసైన్మెంట్స్, మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ టెస్టులు ఉంటాయి. టెస్ట్ సబ్మిట్ చేయగానే ఫలితం వస్తుంది. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 9133637733, 9505514424, 9666013544 పని దినాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సంప్రదించొచ్చు. -
సివిల్స్‌లో రష్మితకు 534వ ర్యాంకు
తూర్పుగోదావరి,అంబాజీపేట: యుపీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాలలో నీతిపూడి రష్మితారావు 534వ ర్యాంకు సాధించడం పట్ల పుల్లేటికుర్రు శివారు కొల్లివారిపేట కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. రష్మిత ఇంటర్ వరకు విశాఖపట్నంలో విద్యనభ్యసించి, బీటెక్, ఎంటెక్‌లను కాన్పూర్ ఐఐటీలో పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విధులు నిర్వహిస్తున్నారు. సివిల్స్‌లో రెండు సార్లు హాజరై నిరాశపడకుండా మూడో సారి విజయం సాధించడంపై పుల్లేటికుర్రులో సొసైటీ అధ్యక్షుడు నీతిపూడి వెంకటరమణ, విలసిత మంగతాయారు, కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. రష్మితారావు తల్లిదండ్రులు నీతిపూడి భాస్కరరావు, డాక్టర్ విశ్వమిత్రలు కొల్లివారిపేటలో నివాసముండేవారు. వృత్తిరీత్యా భాస్కరరావు గుంటూరు ప్రభుత్వాస్పత్రి మత్తు విభాగంలో ప్రొఫెసర్‌గా సేవలందించి విశాఖపట్నంలో స్థిరపడ్డారు. తల్లి డాక్టర్ విశ్వమిత్ర కాకినాడ ప్రభుత్వాస్పత్రి కంటి విభాగంలో సేవలందిస్తున్నారు. -
ఈ కండక్టర్.. కాబోయే కలెక్టర్?
తీరిక లేకుండా కండక్టర్ ఉద్యోగం. పెద్ద పెద్ద అకాడమీల్లో శిక్షణ పొందలేదు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు ఉన్న వనరులతోనే సివిల్స్ వైపు సాగిపోతున్నాడో యువ కండక్టర్. దూరవిద్యలో డిగ్రీ, పీజీలు చేసి సివిల్స్ పరీక్షల్లో మెయిన్స్‌ను అధిగమించాడు. కర్ణాటక, యశవంతపుర: పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చని నిరూపించే పనిలో ఉన్నారు బస్సు కండక్టర్ ఒకరు. మండ్య జిల్లా మళవళ్లికి చెందిన ఎన్సీ మధు బెంగళూరులోని కొత్తనూరు 34వ బీఎంటీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నాడు. తన 19 ఏటనే కండక్టర్ కొలువు సాధించాడు. చదువు అంటే ఎంతో ఇష్టం కావడంతో మధు ఐఏఎస్ కావాలని కలగన్నాడు. అందుకోసం దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీని పూర్తి చేశాడు. 2014లో కేఎఎస్, 2018, 2019లో యుపీఎస్సీ పరీక్షలను రాశాడు. 2019లో కన్నడ మాధ్యమంలో సివిల్స్ రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. రాజనీతి శాస్త్రం, జనరల్ స్టడీస్‌ను ఎంపిక చేసుకొని రాసిన మెయిన్స్ పరీక్షల్లో పాసై ఇంటర్వ్యూకు ఎంపిక కావడం విశేషం. మార్చి 25న ఢిల్లీలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇంటర్వ్యూలో పాసైతే కలెక్టర్ లేదా ఎస్పీ ఏదైనా సాధించినట్లే. రెండుసార్లు పరాజయం 2014లో కేఎఎస్ పరీక్ష , 2018లో సివిల్స్ రాసినా ఫలితం లేదు. నిరుత్సాహం పడకుండా ఈసారి సాధించాలనే పట్టుదలతో యూ ట్యూబ్‌లో సివిల్స్ పరీక్షల మెళకువలు నేర్చుకున్నాడు. తన మొబైల్ ఫోన్లో యూ ట్యూబ్ ద్వారా కోచింగ్ తీసుకుంటూ సన్నద్ధమయ్యాడు. 2019లో యుపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ రాసి సత్తా చాటాడు. రోజూ 5 గంటలు వీడియోలతో కోచింగ్ తాను ఎక్కడా కోచింగ్‌కు వెళ్లలేదని, రోజు ఐదు గంటల పాటు యూ ట్యూబ్‌లోలో కోచింగ్ తరగతులను చూస్తూ పరీక్షకు సిద్ధమైనట్లు మధు చెబుతున్నాడు. తనకు యూ ట్యూబే మార్గదర్శనమని చెప్పాడు. ఇప్పుడు ఇంటర్వ్యూపై దృష్టి పెట్టినట్లు తెలిపాడు. -
చిరకాల స్వప్నం.. సివిల్స్‌లో విజేతను చేసింది
చెన్నై, తిరువళ్లూరు: సన్మాన గ్రహీత రమేష్‌రెడ్డి ప్రసంగం ప్రారంభం కాగానే నిశ్శబ్ద వాతావరణం...సుమారు 20 నిమిషాల ప్రసంగం.. మద్యలో ఒక యువకుడిని వేదిక మీదకు పిలిచి, నా తర్వాత సివిల్స్ విజేత ఇతనే అంటూ పరిచయం చేశాడు. రమేష్‌రెడ్డి చెప్పిన మాటలకు అక్కడున్న వారిలో పూర్తి నమ్మకం.. కారణం అతడు క్లాస్‌టాపర్ మాత్రమే కాదు అనుకున్నది సాధించే మొండి వాడు కూడా. అనాడు రమేష్‌రెడ్డి చెప్పిన మాటలను నిజం చేస్తూ సివిల్స్‌లో 179వ ర్యాంక్ సాధించారు ప్రకాశం జిల్లాకు చెందిన అల్లాటిపల్లి పవన్‌కుమార్‌రెడ్డి. నేపథ్యం అల్లాటిపల్లి పవన్‌కుమార్‌రెడ్డిది ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు. తండ్రి నారాయణరెడ్డి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. తల్లి వెంటకరత్నమ్మ గహిణి. ఐదవ తరగతి వరకు నేరేడుపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఆ తర్వాత 10 వరకు ఒంగోలులోని నవోదయ పాఠశాలలో, ఇంటర్ రత్నం కళాశాలలో పూర్తి చేశారు. బాపట్ల వ్యవసాయ కళాళాలలో అగ్రికల్చర్ బీఎస్సీ జాయిన్ అయ్యారు. బీఎస్సీ పూర్తి కాగానే ఉత్తరాఖాండ్‌లోని జీపీ పంత్ కళాశాలలో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ పూర్తి చేశారు. తర్వాత దొనకొండ ఏఈఓగా 2011 లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. సివిల్స్‌పై సమరం: ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే సివిల్స్ సన్నాహాలు ప్రారంభించారు పవన్. 2012లో సివిల్స్ రాయడం మొదలుపెట్టి 2015 వరకు సివిల్స్‌పై సమరం సాగించారు. 2012లో ప్రిలిమినరీ, 2014, 2015లో మెయిన్స్ వరకు వచ్చి ఓడిపోయినా నిరాశ చెందలేదు. జీవితంలో ఓడిపోయానని అనిపించిన ప్రతిసారి స్టేజీపై రమేష్ రెడ్డి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చేవి. 2016లో ఢిల్లీ నుండి హైదరాబాదుకు తిరిగి వచ్చి స్నేహితులతో కలసి మళ్లీ ప్రిపరేషన్ మొదలుపెట్టారు. గతంలో ఏర్పడిన వైపల్యాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నారు. నాలుగవ ప్రయత్నంలో మెయిన్స్‌ను పూర్తి చేసి ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. ఇంటర్వ్యూను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. చిరకాల స్వప్నం నిజమైన వేళ ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి బెంగళూరుకు వెళ్లారు పవన్. 2016 మే10న పలితాలు విడుదలయ్యాయి. 179వ ర్యాంక్‌తో ఐపిఎస్‌కు సెలక్ట్ అయ్యారు. ఆరోజు సంఘటన ఆయన మాటల్లోనే ‘‘ ఫలితాల్లో నా పేరు చూడగానే అమ్మానాన్న అంటూ గట్టిగా అరిచేసా. పక్కరూమ్లో వున్న అమ్మానాన్నలు పరుగెత్తుకొచ్చి గట్టిగా కౌగలించుకున్నారు. ఓ అరగంట పాటు ఆనందభాష్పాలు. కష్టానికి తగిన ప్రతిçఫలం దక్కిందన్న సంతృప్తి. ఆరోజు రమేష్‌రెడ్డి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. సర్వీస్ రాకముందు, వచ్చిన తర్వాత ఆ ఒక్కక్షణం జీవితంలో ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవనేవారు ఆయన. అది నిజమే’’ అంటూ ఆ మధుర జ్ఞాపకాలను సాక్షికి వివరించారు పవన్. తెలుగు సాహిత్యాభిలాషి పవన్‌కుమార్‌రెడ్డికి తన విధులు ఎంతో ముఖ్యమో అంతకంటే తెలుగు సాహిత్యంపైన మక్కువ. సమయం దొరికితే చాలు పుస్తకాలతో సావాసం చేస్తారు. తెలుగు సాహిత్యంపై ఉన్న మక్కువతోనే సివిల్స్ మెయిన్స్‌కు తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్‌గా ఎంచుకున్నారు. కుక్కపిల్ల..సబ్బుబిల్ల,.. కాదేదీ కవితకు అనర్హం అంటూ శ్రీశ్రీ చెప్పిన మాటల స్ఫూర్తితో ఇప్పటి వరకు 30 పైగా కవిత్వాలు కూడా రాశారు. తెలుగు మీడియం విద్యార్థులకు సివిల్స్‌పై ఉన్న భయాన్ని పోగట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు పవన్. స్నేహితులతో కలిసి తెలుగులో సివిల్స్ మెటీరియల్ తయారు చేస్తున్నారు. మత్స్యకార గ్రామాలపై ప్రత్యేక దృష్టి పొన్నేరీ ఏఎస్పీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మత్య్సకార గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తిరుపాళయవనం పొన్నేరి తదితర ప్రాంతాల్లో 35 మత్సకార గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ తరచూ ఘర్షణలు, హత్యలు, దాడులతో నిత్యం రణరంగంగా ఉండేవి. ఈ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించిన పవన్ కుమార్ అక్కడి ప్రజలతో మమేకమయ్యారు. గ్రామాల్లో శాంతి కమిటీలను ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించి అందరి వద్ద ప్రశంసలు కూడా అందుకున్నారు. ప‘వన్’ మ్యాన్ షో: సివిల్స్‌లో విజయం సాధించాక ఎన్పీఏలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని పొన్నేరీ అసిస్టెంట్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. రౌడీలకు షెల్టర్‌గా వున్న పొన్నేరీలో శాంతిభద్రతల అదుపు కోసం అల్లరిమూకలను జల్లెడపట్టారు. సుమారు 25 మంది రౌడీలను అరెస్టు చేశారు.. 10 మందిపై గూండాచట్టం ప్రయోగించారు. ఎర్రచందనం, రేషన్‌బియ్యం, గంజా విక్రయంపై ఉక్కుపాదం మోపారు. 300 పైగా సీసీ కెమరాలను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాపిక్‌ను నియంత్రించి శభాష్ అనిపించుకున్నారు. జిల్లాలో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక మాఫియాను నెలరోజుల్లోనే అణచివేసి అక్రమార్కులకు సింహస్వప్నంలా మారారు. ఎంతలా అంటే ఆయన సెలవు పెట్టి రెండు రోజులు ఊరికి వెళితే.. బదిలీపై వెళ్లిపోయాడని ఇసుక మాఫియా తమకు అడ్డు తొలగిందని టపాసులు కాల్చేంతగా. మొత్తానికి అక్రమార్కులకు తెలుగోడి సత్తాను చూపించారు పవన్. వేదిక : బాపట్లలోని వ్యవసాయ కళాశాల కార్యక్రమం : సివిల్స్‌లో విజయం సాధించిన కళాశాల పూర్వ విద్యార్థి ఆవుల రమేష్‌రెడ్డికి సన్మానం.. -
ఫిల్మ్‌మేకింగ్ అంటే కామన్సెన్స్
∙చిన్నప్పుడే స్కూల్ ఎగ్గొట్టి మరీ మా అమ్మతో కలిసి సినిమాలు చూశాను. కానీ చదువును అశ్రద్ధ చేయలేదు. పదో తరగతిలో తొంభైశాతానికిపైగా మార్కులు సాధించాను. ఆ తర్వాత ఇంటర్ జాయిన్ అయ్యాక చదువు ఆపేద్దాం అనుకున్నా. నాన్నగారి మాటలతో బీటెక్ చేశాను. యూకేలో మాస్టర్స్ చేశా. అక్కడే ఫిల్మ్ కోర్స్ కంప్లీట్ చేసి సినిమాల వైపు వచ్చాను. ∙మన సొసైటీలో నచ్చింది చేయడం కష్టం. అదే నేను యూకేలో పుట్టి ఉంటే ఈ సినిమాను ఎప్పుడో తీసేవాడినేమో. యూకే నుంచి తిరిగొచ్చిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావ్ అని నా ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు? వాళ్ల బలవంతంపై సివిల్స్‌లో జాయిన్ అయ్యాను. అక్కడే ‘హుషారు’ స్క్రిప్ట్ రాశా. మధ్యలో హ్యాండ్ కెమెరాతో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశాను. ముందు ‘హుషారు’ చిత్రాన్ని సొంతంగా నిర్మిద్దాం అనుకున్నాం. సినిమాను రిలీజ్ చేయడం తీసినంత ఈజీ కాదని ఓ శ్రేయోభిలాషి చెప్పడంతో బెక్కెం వేణుగోపాల్‌గారిని కలిసి కథ చెప్పాను. ‘పెళ్ళిచూపులు’ సినిమాకు ముందు ఈ స్క్రిప్ట్‌ను విజయ్ దేవరకొండకు వినిపించాను. ఆయన ఓకే అన్నారు కూడా. ఆ తర్వాత కుదర్లేదు. నచ్చినట్టు బతకాలనుకునే నలుగురు స్నేహితులు లైఫ్‌లో ఎలాంటి సమస్యలను ఫేస్ చేశారు? జీవితంలో ఎలా గెలిచారు? అనేది సినిమా కథ. నా దగ్గర మరో రెండు కథలు ఉన్నాయి.