శిక్షణ ఇస్తున్న మహేశ్ భగవత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ ‘సివిల్స్ గురూ’గా మరోసారి తన మార్కు చాటారు. సివిల్స్–2022 తుది ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థుల్లో చాలా మంది ఆయన వద్దే ఇంటర్వ్యూ శిక్షణ పొందారు. తన వద్ద ఇంటర్వ్యూ శిక్షణ పొందిన వారిలో ఆల్ ఇండియా టాపర్లుగా దాదాపు 125 నుంచి 150 మంది నిలిచారని, ఇది తనకు ఎంతో సంతోషంగా ఉందని మహేశ్ భగవత్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఆలిండియా టాపర్, యూపీ యువతి ఇషితా కిశోర్‌కు తాను మెంటార్‌గా ఉండటం సంతృప్తినిచ్చిందన్నారు. తనతోపాటు మరికొందరు గత పదేళ్లుగా సివిల్స్ అభ్యర్థులకు మెంటార్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది టాప్–100 ర్యాంకుల్లో 14వ ర్యాంకర్ కృతికా గోయల్, 22వ ర్యాంకర్, తిరుపతివాసి పవన్ దత్తా, 25వ ర్యాంకర్ కశ్మిరా సంకే, 27వ ర్యాంకు సాధించిన యాదవ్ సూర్యభాన్, 35వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన అజ్మీర సంకేత్ కుమార్, 38వ ర్యాంకర్ అనూప్‌దాస్, 54వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన రిచా కులకర్ణి, 74వ ర్యాంకర్ ఐషి జైన్, 76వ ర్యాంకు సాధించిన దబోల్కర్ వసంత్, 78వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన ఉత్కర్ష కుమార్‌లు తన వద్ద ఇంటర్వ్యూ పొందినవారేనని మహేశ్ భగవత్ తెలిపారు. గత ఐదు నెలలుగా తాను ఇంటర్వూలకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. విజేతలు గర్వం పెరగకుండా చూసుకోవాలని, ర్యాంకులు రాని వారు నిరుత్సాహపడకుండా మరోసారి ప్రయత్నించాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment