civils topper
-
సివిల్స్ గురుగా మహేశ్ భగవత్ మార్కు.. ఆలిండియా టాపర్లుగా 125 నుంచి 150 మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ ‘సివిల్స్ గురూ’గా మరోసారి తన మార్కు చాటారు. సివిల్స్–2022 తుది ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థుల్లో చాలా మంది ఆయన వద్దే ఇంటర్వ్యూ శిక్షణ పొందారు. తన వద్ద ఇంటర్వ్యూ శిక్షణ పొందిన వారిలో ఆల్ ఇండియా టాపర్లుగా దాదాపు 125 నుంచి 150 మంది నిలిచారని, ఇది తనకు ఎంతో సంతోషంగా ఉందని మహేశ్ భగవత్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఆలిండియా టాపర్, యూపీ యువతి ఇషితా కిశోర్‌కు తాను మెంటార్‌గా ఉండటం సంతృప్తినిచ్చిందన్నారు. తనతోపాటు మరికొందరు గత పదేళ్లుగా సివిల్స్ అభ్యర్థులకు మెంటార్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది టాప్–100 ర్యాంకుల్లో 14వ ర్యాంకర్ కృతికా గోయల్, 22వ ర్యాంకర్, తిరుపతివాసి పవన్ దత్తా, 25వ ర్యాంకర్ కశ్మిరా సంకే, 27వ ర్యాంకు సాధించిన యాదవ్ సూర్యభాన్, 35వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన అజ్మీర సంకేత్ కుమార్, 38వ ర్యాంకర్ అనూప్‌దాస్, 54వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన రిచా కులకర్ణి, 74వ ర్యాంకర్ ఐషి జైన్, 76వ ర్యాంకు సాధించిన దబోల్కర్ వసంత్, 78వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన ఉత్కర్ష కుమార్‌లు తన వద్ద ఇంటర్వ్యూ పొందినవారేనని మహేశ్ భగవత్ తెలిపారు. గత ఐదు నెలలుగా తాను ఇంటర్వూలకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. విజేతలు గర్వం పెరగకుండా చూసుకోవాలని, ర్యాంకులు రాని వారు నిరుత్సాహపడకుండా మరోసారి ప్రయత్నించాలని ఆయన సూచించారు. -
మరోసారి వార్తల్లో నిలిచిన సివిల్స్ టాపర్ టీనా దాబీ.. మార్క్‌షీట్ వైరల్
యూపీఎస్సీ టాపర్, ఐఏఎస్ అధికారి టీనా దాబీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె సీబీఎస్ఈ 12వ తరగతి మార్క్‌షీట్ సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం టీనాకు హిస్టరీ, పాలిటికల్ సైన్స్‌లో 100కు 100 మార్కులు వచ్చినట్లు కొన్ని మీడియా సంస్థలు చెప్పాయి. అయితే ఈ మార్క్‌షీట్ నిజంగా టీనాదేనా అనే విషయంపై క్లారిటీ లేదు. ఆమెకు రెండు సబ్జెక్టుల్లో 100 మార్కులు రావడాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. అసలు టీనా మార్క్‌షీట్ నెట్టింట్లో లేదని తెలుస్తోంది. అయితే టీనా 2011 సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో 93శాతం మార్కులు సాధించినట్లు సమాచారం. ఢిల్లీలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ స్కూల్లో చదివిన ఆమె.. టాపర్‌గా నిలిచింది. ఢిల్లీ యూనివర్సిటీ లేడీ శ్రీరాం కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో బీఏ పూర్తి చేసింది. తన ప్రతిభకు గానూ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు కూడా అందుకుంది. 2015 యూపీఎస్సీ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో జైసల్మేర్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తోంది. తరచూ వార్తల్లో టీనా సివిల్స్‌లో టాపర్ అయినప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తోంది. 22 ఏళ్లకే ఐఏఎస్ అయిన దళిత యువతిగా అరుదైన ఘనత సాధించింది. అయితే సివిల్స్ రెండో ర్యాంకర్ అయిన అథర్ అమీర్ ఖాన్‌తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించడం పెద్ద చర్చకు దారితీసింది. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా వెనక్కి తగ్గకుండా 2018లో వీళ్లిద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ 2020లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత డాక్టర్ ప్రదీప్ గవాండేను(2013 ఐఏఎస్ బ్యాచ్)ను రెండో వివాహం చేసుకుంది టీనా. దాదాపు ఏడాదిపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట పెళ్లి 2022లో జరిగింది. ఇది కూడా ప్రేమ వివాహమే కావడం గమనార్హం. చదవండి: జర భద్రం..! ఆ దేశానికి వెళ్లే వారికి కేంద్రం హెచ్చరిక -
అమ్మానాన్నల ప్రోత్సాహం.. బావ సహకారంతో సివిల్స్ రాశా..
సాక్షి, వరంగల్ (మహబూబాబాద్) : నాన్న వైద్యుడిగా పనిచేయడంతో చిన్నతనం నుంచి నాన్న దగ్గరకు వచ్చే గిరిజనులు, పేదవాళ్లను చూసి.. వారి కష్టాలు తీర్చాలని అనిపించేది.. పెద్దయ్యాక పేదలకోసం ఏదైనా చేయాలని ఆలోచన ఉండేది.. ఐఐటీ చదువుతున్నప్పుడు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆ ఆలోచన మరింత బలపడింది.. ఆ తర్వాత అమ్మ, నాన్నల ప్రోత్సాహం.. బావ సహకారంతో సివిల్స్‌లో 658 ర్యాంకు సాధించానంటున్న మానుకోట మణిహారం సభావట్ అమిత సివిల్స్ ర్యాంకు సాధించిన సందర్భంగా “సాక్షి’తో మాట్లాడారు. పరీక్షలంటే భయంలేదు.. చిన్నప్పటి నుంచి ప్రత్యేకతలు ఏమీ లేకుండా అమ్మా నాన్నలు చెప్పింది వింటూ ఏడో తరగతి వరకు మహబూబాబాద్‌లో, తర్వాత ఇంటర్ వరకు హైదరాబాద్‌లో, ఐఐటీ కాన్పూర్‌లో ఇంజనీరింగ్ చదివాను.. అయితే పరీక్షలు వచ్చినప్పుడు కాకుండా ఎప్పటి విషయాలు అప్పుడు చదవడం చిన్ననాటి నుంచి అలవాటు దాంతో ఏ పరీక్షనైనా భయం లేకుండా రాసేదాన్ని.. సేవ చేయాలనే ఆలోచన.. గిరిజనులు ఎక్కువగా ఉండే మానుకోటలో పుట్టి పెరిగాను. నేనూ గిరిజన బిడ్డనే కావడంతో వారు పడుతున్న ఇబ్బందులు, కష్టాలను చూసి వారికి ఏదైనా చేయాలని ఆలోచిందే దాన్ని. కాన్పూర్‌లో ఐఐటీ చదువుతున్నప్పుడు మా కోర్సులో భాగంగా ఎన్జీఓలో పనిచేయాల్సి వచ్చింది. అప్పుడు మహిళలు, దివ్యాంగులు, పిల్లల సమస్యలు వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయడం అలవాటైంది. మహిళలపై వేధింపులు చూసినప్పుడల్లా.. వీటిని నివారించే అవకాశం వస్తే బాగుండు అనుకున్నాను. అందుకోసమే సివిల్స్ రాశాను. అమ్మతో అనుబంధం ఎక్కువ.. నా ఆలోచనను అమ్మానాన్నలు చిన్నప్పటి నుంచి గమనిస్తున్నారు. అమ్మతో నాకు ఎక్కువ అనుబంధం.. సివిల్స్ రాస్తానంటే ధైర్యం చెప్పింది.. 2018లో 975వ ర్యాంకు వచ్చింది.. డిఫెన్స్‌లో సెక్షన్ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరాను. ఉద్యోగం చేస్తూనే మళ్లీ చదవడం ప్రారంభించాను.. ఇంతలోనే కోవిడ్ మహమ్మారితో ఇల్లు విడిచి వెళ్లలేని పరిస్థితి.. ఈ పరిస్థితిలో నాకు ఏ ఇబ్బంది రాకుండా చూసింది అమ్మ. ఆన్లైన్లో చదడం ప్రారంభించాను. మెటీరియల్, ఇంటర్వ్యూ ఎలా చేయాలి.. ఏ అంశాలు చదవాలి అనే సందేహాను నివృత్తి చేసింది. బావ దేవేందర్ సింగ్(ఐఏఎస్ మహారాష్ట్ర కేడర్). ఇలా అమ్మానాన్న, బావ సహకారం నన్ను మరిన్ని గంటలు చదివేలా చేసింది.. ఇలా రోజుకు 12 గంటలకు పైగా చదివి.. ఈ సారి 658వ ర్యాంకు సాధించాను కలిసొచ్చిన ఇంటర్వ్యూ.. నాకు రిటన్ టెస్ట్కన్నా.. ఇంటర్వ్యూలో అత్యధిక మార్కులు స్కోర్ చేసే అవకాశం వచ్చింది. నేను సెంట్రల్ డిఫెన్స్‌లో ఉద్యోగం చేయడంతో ఇంటర్వ్యూ చేసే పెద్దలు నన్ను సహ ఉద్యోగిగా చూశారు. గిరిజనులు, జీవన విధానం, సామాజిక సేవా మొదలైన అంశాలపై ప్రశ్నలు అడిగారు. దీంతో నాకు సమాధానాలు చెప్పడం సులువైంది. మనమేమీ తక్కువ కాదు.. మానుకోట.. మారు మూల జిల్లా.. ఇక్కడ చదివిన వాళ్లు ఏం సాధిస్తారు. అనే ఆలోచన ఇక్కడి విద్యార్థులు, యువతలో ఉంటుంది.. కానీ, లక్ష్యం ఎంచుకొని శ్రమిస్తే సాధించలేనిది ఏమీ లేదు. మనమేమీ తక్కువ కాదు.. ఇతరులు మనకన్నా గొప్పేం కా దు.. కష్టపడితే విజయం వరిస్తుంది. యువత భయ పడకుండా కష్టపడి ఉన్నతస్థానాల్లో ఉండాలనేది నా ఆకాంక్ష.నా చిన్ననాటి స్వప్నం సాకారమయ్యే రోజు వచ్చింది. నాకు వచ్చిన ర్యాంక్‌తో ఐపీఎస్ లేదా.. ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్లు వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని సామాజిక సేవకు ప్రాధాన్యత ఇస్తా.. ముఖ్యంగా మహిళలు, గిరిజనులకు సహాయ పడేందుకు ప్రయత్నం చేస్తా. చాలా గర్వంగా ఉంది పెద్ద పాప డాక్టర్, అమిత చిన్ననాటి నుంచి వినూత్నంగా ఆలోచించేది.. అందుకోసమే సివిల్స్ రాస్తా ను అనగానే ధైర్యం చెప్పాం.. బిడ్డ రోజు నిద్రపోకుండా చదువుతుంటే బాధ అనిపించేంది.. కానీ ఆమెతోపాటు మేం మేల్కొని ఉండి సాయం చేసేవాళ్లం.. మంచి ర్యాంకు సాధించినందుకు గర్వ పడుతున్నాం.. – డాక్టర్ భీంసాగర్, భూ లక్ష్మి, అమిత తల్లిదండ్రులు -
Ayushi: చీకటిని చీల్చి సివిల్ ర్యాంకర్‌గా..
నిమిషంపాటు కళ్లుమూసుకుని నడవాలంటేనే కష్టం. అటువంటిది పుట్టినప్పటినుంచే కారు చీకటి కమ్మేసిన కళ్లు అవి. జీవితంమొత్తం అంధకారమే అని తెలిసినప్పటికీ, బ్రెయిలీ లిపి సాయంతో అరకొర చదువుకాకుండా ఉన్నత చదువు చదివింది. అక్కడితో అగకుండా ప్రభుత్వ స్కూలు టీచర్ అయ్యింది. ఇక చాలు అనుకోకుండా .. దేశవ్యాప్తంగా పోటీపడే యూపీఎస్సీ పరీక్ష రాసి 48వ ర్యాంకు సాధించి, చరిత్ర సృష్టించింది.. చరిత్ర చెప్పే టీచర్ ఆయుషి. ఢిల్లీలోని రాణిఖేడా గ్రామంలోని ఓ సాధారణ కుటుంబం లో పుట్టింది ఆయుషి. పుట్టుకలోనే విధికన్నెర్ర చేసి తన రెండు కళ్లనూ చీకటిమయం చేసింది. రెండు కళ్లకు చీకటి తప్ప మరేం కనిపించదు. అయినా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుకుంది. ఆ తరువాత శ్యాంప్రసాద్ ముఖర్జీ కాలేజీలో బి.ఏ, ఇగ్నో యూనివర్శిటీలో చరిత్ర ప్రధాన సబ్జెక్టుగా ఎంఏ (హిస్టరీ), జామియా మిల్లియా ఇస్లామియా నుంచి బి.ఈడీ. చేసింది. ఆ తరువాత 2012లో మున్సిపల్ కార్పొరేషన్∙స్కూల్లో కాంట్రాక్ట్ టీచర్‌గా చేరింది. 2016లో ప్రైమరీ టీచర్ అయ్యింది. 2019లో ‘ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు’ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో హిస్టరీ టీచర్ అయ్యింది. పదేళ్లుగా టీచర్‌గా సేవలందిస్తోన్న ఆయుషి ప్రస్తుతం ముబారఖ్‌పూర్ దబాస్ గవర్నమెంట్ గర్ల్స్ సీనియర్ సెకండరీ స్కూల్లో.. పదకొండు, పన్నెండు తరగతుల విద్యార్థులకు హిస్టరీని బోధిస్తోంది. సివిల్స్‌కు ఎందుకంటే.. ‘‘స్కూల్లో పాఠాలు చెబుతూ ఎంతోమంది భవిష్యత్‌ను చక్కగా తీర్చిదిద్దగలుగుతున్నాను. యూపీఎస్సీలో సెలక్ట్ అయితే మరెంతోమంది జీవితాలను తీర్చిదిద్దే అపారమైన అవకాశం లభిస్తుంది. తనలాంటి వైకల్యం కలవారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు’’ అని ఆయుషికి అనిపించింది. దీంతో 2016 నుంచి సివిల్స్ రాయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. టీచర్‌గా బిజీగా ఉన్నప్పటికీ తన ప్రిపరేషన్‌ను మాత్రం వదల్లేదు. వలంటరీ రిటైర్మెంట్ తీసుకుని... ఆయుషి పుట్టుకతోనే అంధురాలైనప్పటికీ సివిల్స్ దాక రాణించడానికి కారణం కుటుంబం వెన్నుతట్టి ప్రోత్సహించడమే. కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా ఆయుషి తల్లి... ప్రిపరేషన్‌కు చాలా బాగా సాయం చేశారు. సీనియర్ నర్సింగ్ అధికారిగా పనిచేస్తోన్న ఆయుషి తల్లి ఆశా రాణి 2020లో వలంటరీగా పదవి విరమణ చేసి ఆయుషి ప్రిపరేషన్‌కు పూర్తి సమయాన్ని కేటాయించారు. ఆయుషికి కావాల్సిన స్టడీ మెటిరీయల్‌ను ఆయుషి భర్తతో కలిసి ఆడియో రూపంలో రికార్డు చేసి ఇచ్చేవారు. ఇవి ఆమె ప్రిపరేషన్‌కు బాగా ఉపయోగపడ్డాయి. వరుసగా నాలుగు ప్రయత్నాల్లో విఫలమైంది. వీటిలో ఒక్కసారి కూడా కనీసం మెయిన్స్ కూడా క్లియర్ చేయని 29 ఏళ్ల ఆయుషి.. తాజాగా ఐదో ప్రయత్నంలో దేశంలోనే 48వ సివిల్ ర్యాంకర్‌గా నిలిచింది. రాతపరీక్షకు ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా, మాక్ టెస్ట్‌కు మాత్రమే కోచింగ్ తీసుకుని ర్యాంక్ సాధించింది. కేంద్రపాలిత ప్రాంతాలు (డ్యానిక్స్) లేదా హర్యాణా క్యాడర్లో బాలికలు, వికలాంగుల విద్యారంగంలో సేవలందించడానికి ఆయుషి ఆసక్తి చూపుతోంది. వైకల్యం కళంకం కాకూడదు అంధురాలిగా విద్యార్థులకు పాఠాలు బోధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే టీచింగ్‌ను నేను ఎప్పుడు ఒక ఉద్యోగంగా చూడలేదు. అభిరుచిగా భావించాను. అందుకే విద్యార్థులు నా టీచింగ్‌ను ఇష్టపడేంతగా వారిని ఆకట్టుకోగలిగాను. ఆసక్తిగా పాఠాలు చెబుతూనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను. ఈసారి కచ్చితంగా సివిల్స్ క్లియర్ చేస్తానని నమ్మకం ఉంది. కానీ యాభైలోపు ర్యాంకు రావడం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇన్నాళ్లకు నా కల నిజమైంది. టాప్–50 జాబితాలో నా పేరు ఉందని తెలియడం మాటల్లో్ల వర్ణించలేని ఆనందాన్ని కలిగించింది. పుట్టినప్పటి నుంచి అనేక కష్టాలను ఎదుర్కొంటూ పెరిగాను. కుటుంబ సభ్యులు ముఖ్యంగా అమ్మ సాయంతో అన్నింటిని జయిస్తూ నేడు ఈ స్థాయికి చేరుకోగలిగాను. విద్య అనేది సాధికారతా సాధనం. బాలికలు, వికలాంగుల విద్యా రంగంలో పనిచేస్తూ వారికి రోల్‌మోడల్‌గా నిలవాలనుకుంటున్నాను. వికలాంగుల జీవితాల్లో వైకల్యం ఒక కళంకంగా ఉండకూడదు. వైకల్యంపట్ల సమాజ దృక్పథాన్ని మార్చుకోవాలి. వికలాంగులు కూడా అన్ని లక్ష్యాలను సాధించగలరు. – ఆయుషి దేవుడు ఆయుషి రెండు కళ్లు తీసుకున్నప్పటికీ, ఆమె బంగారు భవిష్యత్‌కు చక్కని దారి చూపాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొంది. స్కూలుకెళ్లడానికి నలభై నిమిషాలు పడుతుంది. ఆ సమయాన్ని కూడా తన ప్రిపరేషన్‌కు కేటాయించి, ఈ స్థాయికి చేరుకున్నందుకు ఆయుషి తల్లిగా ఎంతో గర్వపడుతున్నాను. – ఆశారాణి (ఆయుషి తల్లి) -
అప్పుడు జగన్ అభినందించారు.. ఆ స్ఫూర్తితోనే..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సివిల్స్ పరీక్షలలో జాతీయ స్థాయిలో రిషికేశ్ రెడ్డి 95వ ర్యాంక్ సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉందని ఆయన తండ్రి సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన సాక్షిటీవీతో మాట్లాడుతూ.. 'చిన్నప్పటి నుంచి రిషి చదువులో ముందుండే వాడు. మొదటి ప్రయత్నంలోనే ఇంటర్వూ వరకు వెళ్లాడు. నాలుగో ప్రయత్నంలో అనుకున్న ర్యాంకు సాధించాడు. పులివెందుల నియోజకవర్గం నుంచి సివిల్స్ సాధించిన రెండో వ్యక్తి మా అబ్బాయి కావడం సంతోషంగా ఉంది. గతంలో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెష్ సాధించినప్పుడు వైఎస్ జగన్ అభినందించారు. ఆ స్ఫూర్తితోనే ఈసారి సివిల్స్‌లో 95వ ర్యాంకు సాధించాడని' సుబ్బారెడ్డి తెలిపారు. రిషి సడలని కృషి వేంపల్లె : కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలి.. పది మందికి సేవ చేసే భాగ్యం దక్కించుకోవాలనే లక్ష్యంతోనే చదివాడు. ఆ ఆశయం సాధించేవరకు విశ్రమించకుండా తల్లిదండ్రుల మాటను తప్పకుండా పాటించి విజయం సాధించారు. ప్రణాళికాబద్ధంగా చదివి సివిల్స్ పరీక్షలలో జాతీయస్థాయిలో 95వ ర్యాంక్ సాధించారు. చిన్న నాటి నుంచి కలెక్టర్ కావాలనే కలను నెరవేర్చుకున్నారు. నాలుగుసార్లు పట్టు వదలకుండా సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యి తన కలను నెరవేర్చుకున్నారు వేంపల్లెకు చెందిన సింగారెడ్డి రిషికేశ్‌రెడ్డి. వేంపల్లెకు చెందిన సింగారెడ్డి సుబ్బారెడ్డి, సుజాత దంపతుల కుమారుడు రిషికేశ్‌రెడ్డి. మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాలలో జాతీయస్థాయిలో 95వ ర్యాంక్ సాధించాడు. (సివిల్స్ టాపర్ ప్రదీప్ సింగ్) కుటుంబ సభ్యులతో రిషికేశ్‌రెడ్డి ప్రస్తుతం వీరు కడప నగరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. ఇతడు ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు వేంపల్లెలోని శ్రీచైతన్య ఉన్నత పాఠశాలలో చదివాడు. 6, 7 తరగతులు తిరుపతి విద్యానికేతన్ స్కూల్లోనూ, 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్‌లో చదివాడు. 10వ తరగతిలో 537మార్కులు సాధించాడు. ఇంటర్ ఎంపీసీ విభాగంలో 961మార్కులు సాధించారు. ఎంసెట్, జేఈఈ పరీక్ష రాసి ఎంసెట్‌లో 116వ ర్యాంక్, జేఈఈలో జాతీయస్థాయిలో 153వ ర్యాంక్ సంపాదించాడు. జేఈఈ ర్యాంక్‌లో రిషికేశ్ ఢిల్లీ ఐఐటీలో సీటును దక్కించుకున్నాడు. సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించాలని రిషికేశ్‌రెడ్డి తపన పడేవాడు. ఢిల్లీ ఐఐటీలో ఇంజనీరింగ్ కోర్సు చేరాక.. ఎలాగైన ఐఏఎస్ కావాలనే తపన అతనిలో మొదలైంది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెబుతున్న మాటలు నిరంతరం గుర్తు పెట్టుకునేవాడు. ఉన్నత స్థానం చేరాలని కలలుకనేవాడు. ఇంజినీరింగ్ చదువుతూనే సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో రోజుకు 8గంటలపాటు ప్రణాళికాబద్ధంగా చదివాడు. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు టీవీల్లో వచ్చే వివిధ ఆటల పోటీలను చూస్తుండేవాడు. 2015లో మొదటిసారి సివిల్స్ పరీక్ష రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. (సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు) 2016లో రెండవసారి పరీక్ష రాయగా ఎంపిక కాలేదు. తర్వాత ఎక్కడ మార్కులు తగ్గాయని.. వాటి లోపాలను విశ్లేషించుకుని అధిగమించే ప్రయత్నం చేశాడు. 2017లో సివిల్స్ పరీక్ష రాసి జాతీయస్థాయిలో 374వ ర్యాంక్ సాధించారు. ఇండియన్ రైల్వే సర్వీస్‌లో ఉద్యోగం పొందారు. ఏడాదిపాటు ట్రైనింగ్‌లో ఉంటూ పట్టువదలని విక్రమార్కుడిలా చదివి నాల్గవసారి సివిల్స్ పరీక్షను రాసి జాతీయస్థాయిలో 95వ ర్యాంక్ సాధించాడు. జిల్లా ఖ్యాతిని నిలిపి విజేతగా నిలిచాడు. మూడుసార్లు ప్రయత్నించి ర్యాంక్ రాలేదని నిరుత్సాహపడి ప్రయత్నాలను ఆపేయకూడదని.. మళ్లీ పట్టుదలతో ప్రయత్నం చేసి విజయం సాధించారు. -
సివిల్స్ టాపర్ ప్రదీప్ సింగ్
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్–2019 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. మొత్తం 829 మంది అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ వంటి అత్యున్నత సర్వీసులకు ఎంపికయ్యారు. వీరిలో ప్రదీప్ సింగ్(హరియాణా) మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానం జతిన్ కిశోర్(ఢిల్లీ), మూడో స్థానం ప్రతిభ వర్మ(ఉత్తర ప్రదేశ్) దక్కించుకున్నారు. వీరిద్దరూ ఇప్పటికే కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్నారు. మరో 11 మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపి వేసినట్లు(విత్ హెల్డ్) యూపీఎస్సీ వెల్లడించింది. ఫలితాలు, నియామకాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా అభ్యర్థులు 011–23385271/ 23381125/23098543 నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చని సూచించింది. పూర్తి సమాచారం ఠీఠీఠీ.upటఛి.జౌఠి.జీn వెబ్సైట్ ద్వారా పొందవచ్చని తెలియజేసింది. కల నెరవేరింది 29 ఏళ్ల ప్రదీప్ సింగ్ ఇప్పటికే ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) అధికారిగా సేవలందిస్తున్నారు. ఫరీదాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, నార్కోటిక్స్(ఎన్ఏసీఐఎన్)లో ప్రొబేషన్‌లో ఉన్నారు. ఇప్పుడు నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించారు. సివిల్స్‌లో అగ్రస్థానంలో నిలవడంతో తన కల నెరవేరిందని, ఐఏఎస్ అధికారిగా సమాజంలో అణగారిన వర్గాలకు సేవలందించాలన్నదే తన లక్ష్యమని ప్రదీప్ చెప్పారు. విద్యా, వ్యవసాయ రంగాలను మరింత మెరుగుపర్చాలన్నదే తన కోరిక అన్నారు. ఆయన సొంతూరు హరియాణాలోని సోనీపట్. చాలారోజులు సెలవు పెట్టి, సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యారు. ప్రదీప్ సింగ్ తన సొంత రాష్ట్రం హరియాణా క్యాడర్‌నే ఎంచుకున్నారు. సొంత రాష్ట్రంలో పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. రెండో ప్రయత్నంలో రెండో ర్యాంకు సివిల్స్ రెండో ర్యాంకర్, 26 సంవత్సరాల జతిన్ కిశోర్ 2018 బ్యాచ్ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్(ఐఈఎస్) అధికారి. సివిల్స్‌లో ఇది తన రెండో ప్రయత్నమని, ఈసారి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు రావడం సంతోషంగా ఉందని జతిన్ కిశోర్ తెలిపారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తా.. సివిల్ సర్వీసెస్ మూడో ర్యాంకర్ ప్రతిభ వర్మ ఇప్పటికే ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఇన్‌కం ట్యాక్స్) అధికారిగా పని చేస్తున్నారు. ఆమె సివిల్స్–2018లో 489వ ర్యాంకు సాధించారు. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లో పని చేస్తానని, మహిళా సాధికారత, శిశు సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. -
గర్ల్ ఫ్రెండ్‌కు యూపీఎస్సీ టాపర్ థాంక్స్
జైపూర్ : ప్రేమలో పడితే లక్ష్యానికి దూరమవుతారు.. అనుకున్నది సాధించలేరు అనుకునే వారి అభిప్రాయలను తప్పని నిరూపించాడు యూపీఎస్సీ టాపర్ కనిషక్ కటారియా. నిజమైన ప్రేమ జీవితంలో ముందుకు వెళ్లేందుకు చేయూతగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. యూపీఎస్సీ పరీక్షలో ఆలిండియా టాపర్‌గా నిలిచిన వేళ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘ఈ విజయ సాధనలో నాకు తోడుగా నిలిచిన కుటుంబ సభ్యులకు, నా గర్ల్‌ఫ్రెండ్‌కి, స్నేహితులకు ధన్యవాదాలు. మీరిచ్చిన మద్దతుని ఎన్నటికి మరచిపోలేను. యూపీఎస్పీ పరీక్షలో నేను మొదటి ర్యాంక్ సాధించాననే విషయాన్ని ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. ప్రజలు నన్ను మంచి అధికారిగా చూడాలని కోరుకుంటున్నారు. నా ఉద్దేశం కూడా అదే’ అంటూ చెప్పుకొచ్చారు. Kanishak Kataria, AIR 1 in #UPSC final exam: It's a very surprising moment. I never expected to get the 1st rank. I thank my parents, sister & my girlfriend for the help & moral support. People will expect me to be a good administrator & that's exactly my intention. #Rajasthan pic.twitter.com/IBwhW8TJUs — ANI (@ANI) April 5, 2019 అయితే యూపీఎస్సీ లాంటి ప్రతిష్టాత్మక పరీక్షలో విజయం సాధించిన తర్వాత గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్‌కు పబ్లిక్‌గా ధన్యవాదాలు చెప్పిన మొదటి వ్యక్తి బహుశా కనిషక్ కటారియానే అవుతాడని చెప్పవచ్చు. ఎస్సీ వర్గానికి చెందిన టాపర్ కటారియా తన ఆప్షనల్‌గా మేథమేటిక్స్ ఎంచుకున్నారు. ఆయన ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చదివారు. ఐదో ర్యాంకర్ దేశ్‌ముఖ్ భోపాల్‌లోని రాజీవ్ గాంధీ ప్రౌద్యోగికి విశ్వవిద్యాలయలో కెమికల్ ఇంజనీరింగ్‌లో బీఈ చేశారు. తనపై ఉన్న నమ్మకంతోనే తొలి ప్రయత్నంలోనే సివిల్స్ పరీక్షలో విజయం సాధించానని దేశ్‌ముఖ్ చెప్పారు. ఆమె తండ్రి ఇంజనీర్ కాగా, తల్లి ప్రిస్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. (చదవండి: మనోడికే 7వ ర్యాంక్) -
సివిల్స్ టాపర్‌కు నేను స్ఫూర్తి : వర్మ
సాక్షి, హైదరాబాద్ : ట్విటర్లో తనదైన వ్యాఖ్యాలతో.. విరుచుకుపడే రామ్ గోపాల్‌వర్మ తనను విమర్శించే వారికి ఓ సూచన చేశాడు. ‘నేను ఎప్పుడూ క్రిమినల్స్ నుంచి, బూతు నుంచి స్ఫూర్తి పొందుతానని భావించేవారు.. ఈ సివిల్స్ టాపర్ ఏం చెప్పాడో ఒకసారి చూడండి. నేను చదువంటే భయపడే విద్యార్ధినే.. సివిల్ ఇంజనీరింగ్ రెండు సార్లు ఫెయిల్ అయినప్పటికి నేను గర్వపడతాను’ అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో ‘ఒక సివిల్ ఇంజనీరింగ్ ఫెయిల్ అయిన వ్యక్తి ఓ సివిల్స్ టాపర్‌కి స్పూర్తి కల్గించాడు. యెడవల్లి అక్షయ్ నేను నిన్ను తప్పక కలుస్తాను.. మనం ఎడ్యుకేషన్ గురించి చర్చిద్దాం’ అని పోస్ట్ చేశారు. For all those who thought i inspire only criminals and perverts take a listen to what this Civil Topper is saying ..The irony is that I was a terrible student and failed in Civil engineering twice but proud about it😎 https://t.co/HVSy898CUh — Ram Gopal Varma (@RGVzoomin) May 9, 2018 Yedavalli Akshay kumar a Civils Topper takes inspiration from a failed Civil engineer ..Watch from 23:45 to 28:30 Hey Akshay I would like to meet you and talk to u about education https://t.co/BCECyhUpYI — Ram Gopal Varma (@RGVzoomin) May 9, 2018 -
సివిల్స్ ఫస్ట్ ర్యాంక్‌తో సర్ప్రైజే ఇచ్చాడు
అమ్మకు తేడా తెలీదు. అమ్మ చూపులో చిన్నచూపుపెద్దచూపు ఉండదు. కలిమిలేమి, రాజుపేద, తన పర భేదాలు చూడకుండా అవసరాన్ని మాత్రమే చూడమని చెప్తుంది! అమ్మ ప్రోత్సాహం అనుదీప్ జీవితంలో చాలా విలువైంది. అమ్మ ఇచ్చే సందేశం కూడా అంతే విలువైంది. అనుదీప్‌తో ఒక స్నేహితురాలిలామెలిగాను అంటున్నారు తల్లి జ్యోతి దురిశెట్టి. ‘‘బాగా గుర్తుంది ఆ రోజు. సివిల్స్ ఇంటర్వ్యూ అయిపోగానే నాకు ఫోన్ చేశాడు. ‘అమ్మా.. ఈసారి వస్తుంది.. గ్యారెంటీ’ అన్నాడు. అన్నట్టుగానే తెచ్చుకున్నాడు. వాడికెలా ఉందోగానీ నాకైతే సంతోషమే సంతోషం. సివిల్స్ ఆల్ ఇండియా ఫస్ట్ అనుదీప్ అని రిజల్ట్స్ రాగానే ఫోన్లే ఫోన్లు. అనుదీప్ మదర్‌గా చాలా ప్రౌడ్‌గా ఫీలవుతున్నా. అమ్మగా నేనేం చేయాలో అది చేశాను తప్ప స్పెషల్‌గా ఏం పెంచలేదు. వాడే గోల్ సెట్ చేసుకున్నాడు. దానికి తగ్గట్టు కష్టపడ్డాడు. ఈ రోజు మీ అందరి గ్రీటింగ్స్.. బ్లెస్సింగ్స్ అందుకుంటున్నాడు. చాలా హ్యాపీగా ఉంది. మా ఊరు.. కుటుంబం మా సొంతూరు చిట్టాపూర్. ఇది జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండల్ కిందికొస్తది. కానీ మావారి (దిరిశెట్టి మనోహర్) ఉద్యోగం మెట్పల్లిలో కాబట్టి అక్కడే ఉంటాం. ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్. మాకు అనుదీప్ కాకుండా ఇంకో అబ్బాయి ఉన్నాడు. వాడి పేరు అభినయ్. మొన్ననే బీటెక్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలో ఆలోచించుకుంటున్నాడు. ‘అన్నయ్యలాగే నేను కూడా సివిల్స్ రాస్తా’ అన్నాడు. వాడిష్టం. పిల్లల మీద మేమెప్పుడూ ప్రెషర్ పెట్టలేదు. ఫలానా వాళ్ల పిల్లలు డాక్టర్స్ అయ్యారు.. ఫలానా వాళ్ల పిల్లలు ఇంజనీర్స్ అయ్యారు.. మీరూ అలాగే చదవాలి.. అని వాళ్లనెప్పుడూ ఫోర్స్ చేయలేదు. ఏం చదవాలన్నా.. ఏం కావాలన్నా వాళ్లిష్టమే. ఫ్యూచర్లో వాళ్లు ఏం కావాలో మేం డిసైడ్ చేయలేదు. చదువులో ఇంకే విషయాల్లో వాళ్లకు ఇబ్బంది కాకుండా చూసుకున్నాం అంతే. ఎప్పుడు చదువుకుంటావ్‌రా...? పిల్లలిద్దర్నీ మెట్పల్లిలోనే చదివించాం. అనుదీప్ మొదట్నించీ క్లాస్ ఫస్టే. అట్లాగని 24 గంటలూ పుస్తకాలు పట్టుకుని కూర్చునే టైప్ కాదు. క్లాస్‌లో విన్నదే. గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. హోమ్‌వర్క్స్ కూడా స్కూల్లోనే చేసేసుకునేవాడు. ఇంటికొచ్చి స్నాక్స్ తిని, పాలు తాగి అలసిపోయేంతగా ఆడుకునేవాడు. ఇంటికొచ్చాక నేను కూడా పిల్లల వెంట పడేదాన్ని కాను చదువుకోమని. ఆడుకోమనే చెప్పేదాన్ని. పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మా పిల్లలు ఆటలతోనే షార్ప్ అయ్యారని అనుకుంటా. ఫిజికల్ యాక్టివిటీ కాన్సన్ట్రేషన్ను పెంచుతుంది కదా. బహుశా అనుదీప్‌ను అంత షార్ప్ చేసింది వాడు ఆడిన ఆటలేనేమో. వాడికి ఫుట్‌బాల్ అంటే ఇష్టం. పోటీల్లో పాల్గొన్నాడు కూడా. మా ఇంటి పక్కన ఓ టీచర్ ఉండేది. ఆవిడ అనుదీప్‌ను చూసి ‘ఒరేయ్ ఎప్పుడు చూసినా ఆడుతూనే కనిపిస్తావ్... చదువులో మాత్రం ఫస్ట్ ర్యాంక్ తప్పవ్. ఎప్పుడు చదువుకుంటావ్‌రా నువ్వసలు?’ అని అంటుండేది. నిజమే.. ఆవిడ అన్నట్టుగా ఆటలతో అలసిపోయేవాడు చదువులో మాత్రం ఫస్ట్ ఎప్పుడూ తప్పలేదు. టెన్త్‌లోనూ స్కూల్ టాప్. కార్పోరేట్ కాలేజ్‌వాళ్లు ఫ్రీగానే ఇంటర్లో సీట్ ఇచ్చారు. ఫస్టియర్‌లో చాలా బెరుగ్గానే ఉన్నాడు. ‘అమ్మా.. ఇక్కడ అందరూ చాలా ఫ్లుయెంట్ ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు. నాకేమో అంత ఫ్లుయెన్సీ లేదు. వాళ్ల లెవెల్‌కి రీచ్ అవుతానా?’ అని అనేవాడు. ‘ఏంకాదు నాన్నా... నలుగురితో మాట్లాడుతూ కలిసిపోతే భయం పోతుంది. భయంపోతే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈజీగా మాట్లాడేస్తావ్’ అని చెప్పేవాళ్లం. అన్నట్లుగానే త్వరగా ఆ ఫీలింగ్‌నీ ఓవర్‌కమ్ చేశాడు. ఎమ్సెట్లో స్టేట్ ఫార్టీఫిఫ్త్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఐఐటీకీ ప్రిపేర్ అయ్యాడు. చికెన్‌పాక్స్ రావడంతో ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయాడు. ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రూమెంటల్) బిట్స్ పిలానీలో చేశాడు. ఒరాకిల్‌లో జాబ్ వచ్చినప్పడు మాత్రం... అనుదీప్‌కి పుస్తకాలు చదవడం అలవాటు. నా క్వాలిఫికేషన్ ఇంటర్. కాని కథల పుస్తకాలు బాగా చదివేదాన్ని. అలా నా చిన్నప్పుడు చదివిన చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, చిన్నయసూరి నీతికథలు.. అన్నిటినీ రాత్రి పిల్లలకు చెప్పేదాన్ని. అట్లా బుక్‌రీడింగ్ మీద అనుదీప్‌కి ఇంట్రెస్ట్ పెరిగింది. ఇవ్వాళ సివిల్స్ సక్సెస్‌కు అదీ ఒక రీజన్ అనుకుంటాన్నేను. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే క్యాంపస్ సెలక్షన్లో ఒరాకిల్‌లో జాబ్ వచ్చింది. అప్పుడు మాత్రం అనుకున్నాం.. వీడు ఉద్యోగంలో చేరకుండా సివిల్స్‌కి ప్రిపేర్ అయితే బాగుండు అని. అట్లా అనుకున్నామో లేదో తెల్లవారే ఫోన్ చేశాడు. ‘అమ్మా.. జాబ్‌లో చేరను. సివిల్స్‌కి ప్రిపేర్ అవుతా’ అని. ‘నీ ఇష్టం నాన్నా...’ అన్నాం. ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడే ఢిల్లీలో సివిల్స్‌కి కోచింగ్ తీసుకున్నాడు. ఫస్ట్ ఎటెంప్ట్‌లో రాలేదు. సెకండ్ ఎటెంప్ట్‌కి ఐఆర్ఎస్లో వచ్చింది. మేం హ్యాపీగానే ఉన్నాం. కాని వాడికే శాటిస్ఫాక్షన్ లేకుండింది. మళ్లీ ప్రిపేర్ అయ్యాడు. థర్డ్ ఎటెంప్ట్‌లో రాలేదు. పోనీలే నాన్నా.. వదిలెయ్ అన్నా వినలేదు. ‘లేదమ్మా.. నా గోల్ అది’ అంటూ మళ్లీ ఫోర్త్ టైమ్ రాశాడు. అప్పుడూ రాలేదు. అయినా ఊరుకోలేదు. అయిదోసారి.. ఇట్లా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని మాకూ సర్ప్రైజే ఇచ్చాడు. సమస్యలు తెలుసు... వాళ్ల నాన్న ఇంజనీర్ కదా. మా ఇంటికెప్పుడూ రైతులు వçస్తుండేవారు పొలంలో కరెంట్ సమస్యలతోని. వాళ్లు వాళ్ల ప్రాబ్లమ్స్ మావారితో చెప్పుకుంటుంటే మావారు వాళ్లకు సలహాలిస్తుంటే అనుదీప్ వెళ్లి వాళ్ల నాన్న పక్కన కూర్చుని అన్నీ వినేవాడు. రైతులు వెళ్లిపోయాక తనకొచ్చిన డౌట్స్ అన్నీ వాళ్ల నాన్నను అడిగి తెలుసుకునేవాడు. అట్లా చిన్నప్పటినుంచే వాడికి రైతుల ప్రాబ్లమ్స్, ఊళ్లో పరిస్థితుల గురించి తెలుసు. అవన్నీ వాడికిప్పుడు హెల్ప్ అవుతాయనే అనుకుంటున్నా. అనుదీప్ చాలా సెన్సిటివ్. పెద్దవాళ్ల పట్ల చాలా గౌరవంగా ఉంటాడు. ఆడవాళ్లంటే కూడా చాలా రెస్పెక్ట్. ఎవరినీ నొప్పించడు. అయినా వాడి నుంచి నేను కోరుకునేది ఒకటే. వాడి లైఫ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫ్యూచర్లో ఇంకా మంచి పొజిషన్‌కు వెళ్లొచ్చు. ఎప్పుడు ఎక్కడ.. ఏ పొజిషన్లో ఉన్నా అందరినీ రెస్పెక్ట్ చేయాలి. ప్రాబ్లమ్స్‌తో తన దగ్గరకు వచ్చిన వాళ్ల పట్ల భేదభావం చూపొద్దు. డబ్బున్నవాళ్లపట్ల, లేని వాళ్ల పట్ల ఎలాంటి తారతమ్యాలు చూపొద్దు అని. ఇదే మాట చెప్తాను వాడికెప్పుడూ. నా పిల్లల మీద నాకు చాలా నమ్మకం. తోటివాళ్లకు సహాయపడేలా ఉంటారని. తొలి జీతంతో కానుక అనుదీప్ ఫోర్త్‌టైమ్ సివిల్స్ రాశాక మమ్మల్ని సర్ప్రైజ్ చేశాడు. నాకు, వాళ్ల నాన్నకు ఢిల్లీకి టికెట్స్ బుక్ చేశాడు. ఫోన్లో ఆ విషయం చెప్పేవరకు మాకు తెలీదు. ‘అమ్మా.. నీ కోసమే ప్లాన్‌చేశా ఇది. నువ్వెప్పుడూ ఇల్లూ పని అంటూ కదలనే కదలవు. అందుకే ఈ సర్ప్రైజ్’ అని చెప్పాడు. ఆగ్రా తీసుకెళ్లాడు. తాజ్‌మహల్ చూపించాడు. నిజానికి దానికన్నా కూడా సర్ప్రైజ్ గిఫ్ట్ వాడు ఐఏఎస్ కావడం. వాడి కలను నెరవేర్చుకోవడం. ఇందులో నేను వాడికి చేసిన హెల్ప్ ఏమీ లేదు. అమ్మలా కాకుండా ఓ ఫ్రెండ్‌లా ఉన్నా. అన్నీ షేర్ చేసుకుంటాడు. అనుదీప్‌లో నాకు బాగా నచ్చేది ఈగో లేకపోవడం. వాడు మంచి పెయింటర్ కూడా. ఐఆర్ఎస్గా జాయిన్ అయ్యాక వచ్చిన ఫస్ట్ శాలరీతో నాకు పట్టుచీర కొన్నాడు. సెల్ ఫోన్ కొనిచ్చాడు. ఇప్పుడు మేమెక్కడ కనపడినా అనుదీప్ వాళ్ల మదర్ కదా.. అని నాతో సెల్ఫీలు తీసుకుంటున్నారు చాలామంది. మదర్‌గా ఇంతకన్నా ప్రైడ్ ఏముంటుంది నాకు? – సరస్వతి రమ -
కోలారు కీర్తి కిరీటం కేఆర్ నందిని
► సివిల్స్ ప్రథమ ర్యాంకర్ నందినికి ఘన సన్మానం కోలారు: యూపీఎస్సీలో ప్రతిభ చాటి దేశ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన కోలారువాసి కేఆర్ నందిని ప్రతిభాపాటవాలు జిల్లాకే గర్వకారణమని వక్తలు కొనియాడారు. నగరంలోని టి.చన్నయ్య రంగమందిరంలో జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం నందినిని ఘనంగా సన్మానించారు. సంఘం అధ్యక్షుడు మంజునాథ్ మాట్లాడుతూ కృషి, పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకున్న నందిని యువతకు ఆదర్శమని ప్రశంసించారు. తన ప్రతిభాపాటవాలతో నందిని రాష్ట్రానికే కీర్తి తెచ్చారని అభినందించారు. అనంతరం మైసూరు పేటతో సత్కరించి ఘనంగా సన్మానించారు. నందిని మాట్లాడుతూ.. కష్టపడి సాధన చేసి లక్ష్యాన్ని చేరుకున్నానన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంఘం కార్యదర్శి కేబీ అశోక్, కోశాధికారి ఎస్.చౌడప్ప, దైహిక శిక్షకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసగౌడ, కన్నడ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షుడు నాగానంద కెంపరాజ్, నందిని తల్లిదండ్రులు రమేష్, విమల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
25న సివిల్స్ టాపర్ టీనాదాబికి సన్మానం
విజయవాడ (గాంధీనగర్) : ఆల్ ఇండియా సివిల్స్ టాపర్ టీనాదాబి సన్మాన సభ ఏ–కన్వెన్షన్ సెంటర్లో ఈనెల 25న నిర్వహిస్తున్నట్లు జాయింట్ యాక్షన్ ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఇంజినీర్ కొర్లపాటి విజయకుమార్ తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సన్మానానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు హాజరవుతారని తెలిపారు. టీనాదాబీతో సహా ఇతర సివిల్స్ టాపర్స్ విద్యార్థులకు సూచనలు, సలహాలు అందజేస్తారన్నారు. టీనాదాబి మధ్యప్రదేశ్‌లో దళిత కుటుంబంలో జన్మించారని, సివిల్స్ చరిత్రలో దళిత యువతి టాపర్‌గా నిలవడం ఇదే ప్రథమమన్నారు. సన్మాన సభకు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్‌బాబు, కొల్లు రవీంద్ర హాజరవుతారన్నారు. సమావేశంలో రిటైర్డ్ ఐఆర్ఎస్ పల్లెపోగు సీమోను, ఎస్.రాజన్‌బాబు, గొర్రె గాంధీ, పోలుమట్ల విజయ్‌కుమార్, పరిశపోగు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
సివిల్స్ టాపర్‌కు వచ్చింది.. 53 శాతమే!
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో పేపర్లు ఎంత కఠినంగా దిద్దుతారో తెలుసా.. అందులో టాప్ ర్యాంకు సాధించిన ఇరా సింఘాల్‌కు వచ్చిన మార్కులు 53.43 శాతం మాత్రమే! ఈ మార్కులే సివిల్స్ పేపర్లను ఎంత కచ్చితంగా, కఠినంగా దిద్దుతారనేందుకు నిదర్శనం. ఇరా సింఘాల్ సహా, మెయిన్స్ పాసయిన మొత్తం అందరు అభ్యర్థుల మార్కుల షీట్లను ఆన్లైన్లో పెట్టారు. సివిల్స్‌లో ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశలుంటాయన్న విషయం తెలిసిందే. ఈ మూడింటినీ దాటినవాళ్లు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి సర్వీసులకు వెళ్తారు. 2014 సివిల్స్‌లో టాప్ ర్యాంకు సాధించిన ఇరా సింఘాల్ మొత్తం 2025కు గాను 1082 మార్కులు మాత్రమే సాధించారు. మెయిన్స్ 1750, ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటాయి. రెండో ర్యాంకు సాధించిన రేణు రాజ్ 52.14 శాతం, మూడో ర్యాంకు పొందిన నిధి గుప్తా 50.61 శాతం మాత్రమే మార్కులు పొందారు. -
సచిన్ స్ఫూర్తితో సివిల్స్ ర్యాంక్
ముంబై: ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఇప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్నూ ప్రభావితం చేస్తున్నాడు. పట్టుమని పదోతరగతి కూడా పాస్ కాలేని (పాక్‌తో సిరీస్ కారణంగా పరీక్షలకు హాజరుకాలేదు) సచిన్.. దేశంలోనే అత్యున్నతమైనదిగా భావించే సివిల్స్‌కు.. ఆ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించేవారికి స్ఫూర్తిగా నిలిచాడు. మూడు రోజుల క్రితం విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో మహారాష్ట్ర టాపర్‌గా నిలిచిన ఇబోలి నర్వాణే తన ఉన్నతికి కారణం క్రికెట్ దేవుడేనని గర్వంగా చెబుతోంది. పుణెలో స్కూలింగ్ పూర్తిచేసిన ఇబోలి.. ముంబైలోని ప్రముఖ కాలేజీ నుంచి ఎంఏ (ఎకనామిక్స్) పూర్తిచేసింది. మూడో ప్రయత్నంలో సివిల్స్ ఆలిండియా 78వ ర్యాంక్ సాధించింది. చిన్నప్పటినుంచి సచిన్‌కు హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన ఇబోలి ఏమాత్రం సమయం చిక్కినా క్రికెట్ దేవుడి జీవిత చరిత్ర పుస్తకాన్ని తిరగేస్తూ, ఆయన ఆడిన అద్భుత ఇన్నింగ్సులు చూస్తుంటుంది. సచిన్ మిమ్మల్ని ఎలా ప్రభావితం చేశాడని ప్రశ్నిస్తే.. 'ప్రధానంగా మూడు విషయాల్లో టెండూల్కర్ నన్ను గొప్పగా ప్రభావితం చేశాడు. ఒకటి ఆట పట్ల అతను చూపే కమిట్మెంట్. రెండు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సుగుణం. మూడు దేశం కోసం ఇవ్వగలిగిందంతా ఇచ్చేయడం. ఈ మూడు అంశాలన్ని ఎప్పుడూ బేరీజు వేసుకుంటాను. సచిన్‌లా నేనూ కమిట్మెంట్తో ఉన్నానా? ఆయనకు మల్లే దేశంకోసం నేనేదైనా చేయగలనా? అని ప్రతిక్షణం ఆలోచిస్తూఉంటాను. ఆ ఆలోచనలే నన్ను సివిల్స్ వైపు నడిపించాయి. ఐఏఎస్ ఆఫీసర్‌గా భవిష్యత్‌లో సాధించబోయే విజయాల్లో కూడా సచిన్ స్ఫూర్తి తప్పక వుంటుంది' అని సమాధానమిస్తోంది. సివిల్స్‌లో సత్తాచాటిన ఇబోబి ప్రొఫెషనల్ కథక్ డ్యాన్సర్ కూడా. కాలేజీలో, ఆతర్వాతా ఎన్నో ప్రదర్శనలిచ్చింది. తల్లి మీనల్ నర్వాణే ప్రఖ్యాత యశ్వాడా అకాడమీ డైరెక్టర్. తండ్రి సునీల్ నర్వాణే మర్చంట్ నేవీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆమె మేనమామ రాజీవ్ రణడే ఐఆర్ఎస్ ఆఫీసర్. తన విజయంలో సహోదరి నేహా కులకర్ణీ పాత్రకూడా ఉందటోంది ఇబోబి.