సివిల్స్ టాపర్కు వచ్చింది.. 53 శాతమే!
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో పేపర్లు ఎంత కఠినంగా దిద్దుతారో తెలుసా.. అందులో టాప్ ర్యాంకు సాధించిన ఇరా సింఘాల్కు వచ్చిన మార్కులు 53.43 శాతం మాత్రమే! ఈ మార్కులే సివిల్స్ పేపర్లను ఎంత కచ్చితంగా, కఠినంగా దిద్దుతారనేందుకు నిదర్శనం. ఇరా సింఘాల్ సహా, మెయిన్స్ పాసయిన మొత్తం అందరు అభ్యర్థుల మార్కుల షీట్లను ఆన్లైన్లో పెట్టారు. సివిల్స్లో ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశలుంటాయన్న విషయం తెలిసిందే. ఈ మూడింటినీ దాటినవాళ్లు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి సర్వీసులకు వెళ్తారు.
2014 సివిల్స్లో టాప్ ర్యాంకు సాధించిన ఇరా సింఘాల్ మొత్తం 2025కు గాను 1082 మార్కులు మాత్రమే సాధించారు. మెయిన్స్ 1750, ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటాయి. రెండో ర్యాంకు సాధించిన రేణు రాజ్ 52.14 శాతం, మూడో ర్యాంకు పొందిన నిధి గుప్తా 50.61 శాతం మాత్రమే మార్కులు పొందారు.