Ayushi: చీకటిని చీల్చి సివిల్‌ ర్యాంకర్‌గా.. | Ayushi: Blind teacher from Delhi cracks UPSC Civil Services 2021 | Sakshi
Sakshi News home page

Ayushi: చీకటిని చీల్చి సివిల్‌ ర్యాంకర్‌గా..

Published Wed, Jun 1 2022 11:57 PM | Last Updated on Wed, Jun 1 2022 11:57 PM

Ayushi: Blind teacher from Delhi cracks UPSC Civil Services 2021 - Sakshi

ర్యాంకు సాధించిన ఆనందంలో ఆయుషి

నిమిషంపాటు కళ్లుమూసుకుని నడవాలంటేనే కష్టం. అటువంటిది పుట్టినప్పటినుంచే కారు చీకటి కమ్మేసిన కళ్లు అవి. జీవితంమొత్తం అంధకారమే అని తెలిసినప్పటికీ, బ్రెయిలీ లిపి సాయంతో అరకొర చదువుకాకుండా ఉన్నత చదువు చదివింది. అక్కడితో అగకుండా ప్రభుత్వ స్కూలు టీచర్‌ అయ్యింది. ఇక చాలు అనుకోకుండా .. దేశవ్యాప్తంగా పోటీపడే యూపీఎస్సీ పరీక్ష రాసి 48వ ర్యాంకు సాధించి, చరిత్ర సృష్టించింది.. చరిత్ర చెప్పే టీచర్‌ ఆయుషి.

ఢిల్లీలోని రాణిఖేడా గ్రామంలోని ఓ సాధారణ కుటుంబం లో పుట్టింది ఆయుషి. పుట్టుకలోనే విధికన్నెర్ర చేసి తన రెండు కళ్లనూ చీకటిమయం చేసింది. రెండు కళ్లకు చీకటి తప్ప మరేం కనిపించదు. అయినా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుకుంది. ఆ తరువాత శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కాలేజీలో బి.ఏ, ఇగ్నో యూనివర్శిటీలో చరిత్ర ప్రధాన సబ్జెక్టుగా ఎంఏ (హిస్టరీ), జామియా మిల్లియా ఇస్లామియా నుంచి బి.ఈడీ. చేసింది. 

ఆ తరువాత 2012లో మున్సిపల్‌ కార్పొరేషన్‌∙స్కూల్లో కాంట్రాక్ట్‌ టీచర్‌గా చేరింది. 2016లో ప్రైమరీ టీచర్‌ అయ్యింది.  2019లో ‘ఢిల్లీ సబార్డినేట్‌ సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు’ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో హిస్టరీ టీచర్‌ అయ్యింది. పదేళ్లుగా టీచర్‌గా సేవలందిస్తోన్న ఆయుషి  ప్రస్తుతం ముబారఖ్‌పూర్‌ దబాస్‌ గవర్నమెంట్‌ గర్ల్స్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్లో..  పదకొండు, పన్నెండు తరగతుల విద్యార్థులకు హిస్టరీని బోధిస్తోంది.

సివిల్స్‌కు ఎందుకంటే..
‘‘స్కూల్లో పాఠాలు చెబుతూ ఎంతోమంది భవిష్యత్‌ను చక్కగా తీర్చిదిద్దగలుగుతున్నాను. యూపీఎస్సీలో సెలక్ట్‌ అయితే మరెంతోమంది జీవితాలను తీర్చిదిద్దే అపారమైన అవకాశం లభిస్తుంది. తనలాంటి వైకల్యం కలవారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు’’ అని ఆయుషికి అనిపించింది. దీంతో 2016 నుంచి సివిల్స్‌ రాయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. టీచర్‌గా బిజీగా ఉన్నప్పటికీ తన ప్రిపరేషన్‌ను మాత్రం వదల్లేదు.

వలంటరీ రిటైర్మెంట్‌ తీసుకుని...
ఆయుషి పుట్టుకతోనే అంధురాలైనప్పటికీ సివిల్స్‌ దాక రాణించడానికి కారణం కుటుంబం వెన్నుతట్టి ప్రోత్సహించడమే. కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా ఆయుషి తల్లి... ప్రిపరేషన్‌కు చాలా బాగా సాయం చేశారు. సీనియర్‌ నర్సింగ్‌ అధికారిగా పనిచేస్తోన్న ఆయుషి తల్లి ఆశా రాణి 2020లో వలంటరీగా పదవి విరమణ చేసి ఆయుషి ప్రిపరేషన్‌కు పూర్తి సమయాన్ని కేటాయించారు. ఆయుషికి కావాల్సిన స్టడీ మెటిరీయల్‌ను ఆయుషి భర్తతో కలిసి ఆడియో రూపంలో రికార్డు చేసి ఇచ్చేవారు.

ఇవి ఆమె ప్రిపరేషన్‌కు బాగా ఉపయోగపడ్డాయి. వరుసగా నాలుగు ప్రయత్నాల్లో విఫలమైంది. వీటిలో ఒక్కసారి కూడా  కనీసం మెయిన్స్‌ కూడా క్లియర్‌ చేయని 29 ఏళ్ల ఆయుషి.. తాజాగా ఐదో ప్రయత్నంలో దేశంలోనే 48వ సివిల్‌ ర్యాంకర్‌గా నిలిచింది. రాతపరీక్షకు ఎటువంటి కోచింగ్‌ తీసుకోకుండా, మాక్‌ టెస్ట్‌కు మాత్రమే కోచింగ్‌ తీసుకుని ర్యాంక్‌ సాధించింది.  కేంద్రపాలిత ప్రాంతాలు (డ్యానిక్స్‌) లేదా హర్యాణా క్యాడర్‌లో బాలికలు, వికలాంగుల విద్యారంగంలో సేవలందించడానికి ఆయుషి ఆసక్తి చూపుతోంది.

వైకల్యం కళంకం కాకూడదు
అంధురాలిగా విద్యార్థులకు పాఠాలు బోధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే టీచింగ్‌ను నేను ఎప్పుడు ఒక ఉద్యోగంగా చూడలేదు. అభిరుచిగా భావించాను. అందుకే విద్యార్థులు నా టీచింగ్‌ను ఇష్టపడేంతగా వారిని ఆకట్టుకోగలిగాను. ఆసక్తిగా పాఠాలు చెబుతూనే సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యాను. ఈసారి కచ్చితంగా సివిల్స్‌ క్లియర్‌ చేస్తానని నమ్మకం ఉంది. కానీ యాభైలోపు ర్యాంకు రావడం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇన్నాళ్లకు నా కల నిజమైంది.

టాప్‌–50 జాబితాలో నా పేరు ఉందని తెలియడం మాటల్లో్ల వర్ణించలేని ఆనందాన్ని కలిగించింది. పుట్టినప్పటి నుంచి అనేక కష్టాలను ఎదుర్కొంటూ పెరిగాను. కుటుంబ సభ్యులు ముఖ్యంగా అమ్మ సాయంతో అన్నింటిని జయిస్తూ నేడు ఈ స్థాయికి చేరుకోగలిగాను. విద్య అనేది సాధికారతా సాధనం. బాలికలు, వికలాంగుల విద్యా రంగంలో పనిచేస్తూ వారికి రోల్‌మోడల్‌గా నిలవాలనుకుంటున్నాను. వికలాంగుల జీవితాల్లో వైకల్యం ఒక కళంకంగా ఉండకూడదు. వైకల్యంపట్ల సమాజ దృక్పథాన్ని మార్చుకోవాలి. వికలాంగులు కూడా అన్ని లక్ష్యాలను సాధించగలరు.
 – ఆయుషి

దేవుడు ఆయుషి రెండు కళ్లు తీసుకున్నప్పటికీ, ఆమె బంగారు భవిష్యత్‌కు చక్కని దారి చూపాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొంది. స్కూలుకెళ్లడానికి నలభై నిమిషాలు పడుతుంది. ఆ సమయాన్ని కూడా తన ప్రిపరేషన్‌కు కేటాయించి, ఈ స్థాయికి చేరుకున్నందుకు ఆయుషి తల్లిగా ఎంతో గర్వపడుతున్నాను.
– ఆశారాణి (ఆయుషి తల్లి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement