ఎవరిమధ్యనైనా ఢిల్లీకి సంబంధించిన ప్రస్తావన వచ్చిప్పుడు చాందినీ చౌక్‌ను తప్పక తలచుకుంటారు. చాందినీ చౌక్ పలు సినిమాల్లో కూడా కనిపించింది. చాందినీ చౌక్ పేరుతో ఒక చిత్రం కూడా విడుదలయ్యింది. చాందినీ చౌక్ ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ అనేక రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి. సరసమైన ధరలకు దుస్తులు, ఆభరణాలు.. ఇలా ఒకటేమిటి ఏ వస్తువైనా ఇక్కడ చిటికెలో దొరుకుతుంది. షాపింగ్‌తో పాటు రుచికరమైన తినుబండారాలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి.
చాందినీ చౌక్ ఎంతో పురాతనమైన మార్కెట్. దీనికి 370 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ మార్కెట్‌లోని ఇరుకైన వీధులను కత్రా అని పిలుస్తారు. మార్కెట్ నిత్యం కొనుగోలుదారులతో రద్దీగా ఉంటుంది. పాత ఢిల్లీలో ఉన్న ఈ చాందినీ చౌక్ మార్కెట్ ఢిల్లీకి గర్వకారణంగా నిలుస్తుంది. ఇక్కడ అన్ని వయసుల వారికి వారు కోరుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
షాజహాన్ తన కూతురి కోసం..
పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని షాజహానాబాద్ అని పిలిచేవారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమార్తెకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె అభిరుచిని నెరవేర్చేందుకు చక్రవర్తి తన ఎర్రకోట ముందు మార్కెట్‌ను ఏర్పాటు చేశాడు. దీంతో షాజహాన్ కుమార్తె ఇక్కడ షాపింగ్ చేసేది. 1650లో షాజహాన్ ఈ మార్కెట్‌ను నిర్మించాడు. క్రమంగా ఈ మార్కెట్ చాలా ప్రసిద్ధి చెందింది. ఢిల్లీలోని ప్రత్యేక మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
మత సామరస్యానికి ఉదాహరణ
చాందినీ చౌక్‌ను షాజహాన్ స్థాపించినప్పటికీ, ఇక్కడ అందరికీ షాపింగ్ చేసే అవకాశం ఉంది. చాందినీ చౌక్ ఏరియా అన్ని మతాలకు చెందిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రముఖ గౌరీ శంకర్ ఆలయం, ఫతేపురి మసీదు ఉన్నాయి. అంతే కాదు ప్రసిద్ధ సిక్కు గురుద్వారా శిష్‌గంజ్ కూడా చాందినీ చౌక్‌లో ఉంది. సెంట్రల్ బాప్టిస్ట్ చర్చి కూడా ఇక్కడ ఉంది. చాందినీ చౌక్ మార్కెట్ వెండి, బంగారు ఆభరణాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వివాహ షాపింగ్ చాలా చౌకగా చేయవచ్చని పలువురు చెబుతుంటారు.
ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని వణికించిన 8 ఉగ్రదాడులు
Comments
Please login to add a commentAdd a comment