ఒకప్పుడు మన దేశ రాజధాని కలకత్తా..తనదంతర కాలంలో అది ఢిల్లీకి మారింది. చరిత్రలో నిలిచిపోయే ఈ ఘటన ఈరోజు (డిసెంబరు 12)న జరిగింది. నాటి బ్రిటీష్ పాలకులు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? దేశరాజధాని కలకత్తా కాదు.. ఢిల్లీ అంటూ ఎందుకు ప్రకటించారు?
అది.. 1911 డిసెంబర్ 11.. బ్రిటీష్ పాలకులు ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఢిల్లీ దర్బార్‌లో భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాలని జార్జ్ వీ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు నాటి బ్రిటీష్ అధికారులంతా సమ్మతి తెలిపారు. ఈ నేపధ్యంలో 1911, డిసెంబరు 12న ఉదయం 80 వేల మందికి పైగా ప్రజల సమక్షంలో బ్రిటన్ రాజు జార్జ్ వీ ఇకపై ఢిల్లీ భారతదేశానికి రాజధానిగా ఉంటుందని ప్రకటించారు.
రాజధాని మార్పు వెనుక రెండు కారణాలు
అయితే దీనిని అధికారికంగా అమలు చేయడం ఆంగ్లేయులకు అంత సులభం కాలేదు. ఎట్టకేలకు 1931 మార్చి నాటికి, బ్రిటీష్ హైకమాండ్ పూర్తిస్థాయిలో ఢిల్లీని రాజధానిగా అంగీకరించింది. ఈ విషయాన్ని బ్రిటీషర్లు యావత్ ప్రపంచానికి తెలియజేశారు. ఆంగ్లేయులు కలకత్తాను పక్కనపెట్టి, ఢిల్లీని రాజధానిగా చేయడం వెనుక రెండు ప్రత్యేక కారణాలున్నాయి. మొదటిది బ్రిటిష్ ప్రభుత్వ పాలనకు ముందు పలు సామ్రాజ్యాలు ఢిల్లీ నుంచి పాలన సాగించాయి. రెండవది భారతదేశంలోని ఢిల్లీ భౌగోళిక స్వరూపం. ఈ రెండు కారణాలను పరిగణలోకి తీసుకున్న ఆంగ్లేయులు ఢిల్లీ నుంచి దేశాన్ని పాలించడం సులభమని భావించారు.
ఈస్ట్ ఇండియా కంపెనీ బలహీనపడటంతో..
కాగా బెంగాల్ విభజన తర్వాత కలకత్తాలో పెరిగిన హింస, అల్లర్లతో పాటు బెంగాల్‌లో స్వరాజ్యం కోసం పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా బ్రిటీషర్లు ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు నిపుణులు చెబుతుంటారు. బ్రిటీష్ వారు మొదట ఆశ్రయం పొందిన భూమి బెంగాల్ అని, ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించింది అక్కడేనని, అయితే కంపెనీ బలహీనపడటంతో వారు దేశరాజధానిని ఢిల్లీ మార్చారనే వాదన కూడా వినిపిస్తుంటుంది. రాజధానిని మార్చేందుకు వ్యూహాత్మకంగా భారీ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి, రాజధాని మార్పు నిర్ణయం భారత్‌లోని అందరికీ అనుకూలమేనని బ్రిటీషర్లు ప్రకటించారు.
1911 ఆగస్టులో అప్పటి వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ లండన్‌కు పంపిన లేఖలో భారత్ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాలంటూ పేర్కొన్నారు. 1931లో నాటి వైస్రాయ్, గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ ఢిల్లీని అధికారికంగా రాజధానిగా ప్రకటించారు. తరువాత వారు బ్రిటీష్ వాస్తుశిల్పులు సర్ ఎడ్విన్ లుటియన్స్, సర్ హెర్బర్ట్ బేకర్‌లకు ఢిల్లీ రూపకల్పన బాధ్యతను అప్పగించారు.
తరగని వైభవం
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఢిల్లీని 1956లో కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. అయితే 1991లో 69వ సవరణ ద్వారా ఢిల్లీకి జాతీయ రాజధాని ప్రాంతం హోదాను కల్పించారు. ఢిల్లీ చరిత్ర కథ మహాభారత కాలంలో ఇంద్రప్రస్థ ప్రస్తావనతో ముడిపడివుంది. 12వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల పాలనలో ఉంది. తదనంతరకాలంలో సామ్రాజ్యాలు మారాయి. పాలకులు మారారు. చివరికి ప్రభుత్వాలు కూడా మారాయి. అయితే దేశ చరిత్రలో ఢిల్లీకి ఘనమైన స్థానం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది.
ఇది కూడా చదవండి: Year Ender 2024: దేశగతిని మార్చిన 10 సుప్రీం తీర్పులు
Comments
Please login to add a commentAdd a comment