ఢిల్లీ: కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు , వైద్య సిబ్బంది, మెడికల్ కాలేజీ విద్యార్థులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయితే పశ్చిమబెంగాల్‌లో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది తిరిగి విధుల్లో చేరాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసింది.
‘ఆర్జీ కర్ జూనియర్ డాక్టర్ ఘటన దేశంలో ఉన్న ప్రతిఒక్కరి మనస్సును కదిలించింది. ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను దేశం తన కుమార్తెగా భావించింది. అయితే మొత్తం మెడికల్ కమ్యూనిటీ సుప్రీంకోర్టుకు ఆదేశాలకు కట్టుబడి ఉండాలి. వెంటనే విధుల్లోకి చేరి.. వైద్యసేవలు ప్రారంభించండి. న్యాయం జరగటం గురించి అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు వదిలేయండి. రోగుల సంరక్షణ, భద్రత వైద్య వృత్తి ప్రధాన విధి. ఈ ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుంది. డాక్టర్ల రక్షణ కోసం జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. డాక్టర్లు తమను నమ్మాలని.. వైద్యం నిలిపివేయవద్దని ఇప్పటికే సుప్రీం కోర్టు తెలియజేసింది’ అని లేఖలో పేర్కొంది.
ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. సీబీఐ అధికారులు.. నిందితులకు పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించి సాక్ష్యాలు సేకరిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, డాక్టర్లు, వైద్య సిబ్బందికి మెరుగైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతూ వివిధ రాష్ట్రాల్లో డాక్టర్లు భారీగా నిరసనలు చేపట్టారు. మరోవైపు.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment