ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్యాచారం కేసును సుప్రీం కోర్టు విచారించింది. మంగళవారం సుప్రీం కోర్టు చేపట్టిన విచారణ సందర్భంగా.. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నిద్ర పోవట్లేదు, నిజాన్ని వెలికితీసేందుకు కొంత సమయం ఇవ్వాలని పేర్కొంది.
నేరానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ సహా ఆధారాలను సీబీఐ ధ్వంసం చేసిందని ఎవరూ చెప్పలేరని తెలిపింది. బాధితురాలి ఫొటో, పేరును వీకిపీడియా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీం కోర్టు ఆదేశించింది. బాధితురాలి గౌరవాన్ని కాపాడే దృష్ట్యా, బాధితురాలిపై గుర్తింపును బహిర్గతం చేయరాదని పేర్కొంది. సీసీటీవీ ఫుటేజీ సహా నేరానికి సంబంధిచిన ఆధారాలన్నీ సీబీఐకి అప్పగించామని తెలిపిన పశ్చిమ బెంగాల్ పోలీసులు కోర్టుకు తెలిపారు.
గత ఆదేశాల మేరకు ఈ కేసుకు సంబంధించిస్టేటస్ రిపోర్ట్‌ను సీబీఐ సుప్రీం కోర్టుకు సమర్పించింది. తాజా రిపోర్టుపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.కేసుకు సంబంధించి ఇప్పటివరకు గుర్తించిన వివరాలను బయటపెట్టడం వల్ల దర్యాప్తుపై ప్రభావం పడుతుందని తెలిపింది. ఇక.. ఇప్పటికే ప్రిన్సిపల్, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌లను అరెస్టు చేశారు. దర్యాప్తు పూర్తయ్యేవరకు వేచి చూద్దామని పేర్కొంది.
హాస్పిటల్స్‌లో టాయిలెట్స్, సీసీటీవీలు, బయోమెట్రిక్ ఏర్పాటుకు చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సీనియర్, జూనియర్ డాక్టర్ల ప్రతినిధులను సంప్రదించాలని ఆదేశించింది. మహిళా డాక్టర్లు రాత్రిపూట పని చేయకూడదనే షరతు వారి కెరీర్‌పై ప్రభావం చూపుతుందని, డ్యూటీ టైమింగ్స్ డాక్టర్లందరికీ సహేతుకంగా ఉండాలని తెలిపింది. అయితే.. ఆ షరతును పభుత్వం తొలగిస్తుందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీం కోర్టుకు తెలియజేశారు.
మహిళల నైట్ డ్యూటీలకు నిషేధిస్తూ వారు 12 గంటల షిఫ్టుకు మించి పని చేయరాదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ నోటిఫికేషన్‌ను పరిశీలించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి చూచించింది. ఈ నొటిఫికేషన్ తాత్కాలికమేనని మరో నోటిఫికేషన్‌ను తీసుకువస్తుందని బెంగాల్ ప్రభుత్వం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీం కోర్టుకు తెలిపారు.
చదవండి: అబద్ధాల పుట్ట సందీప్ ఘోష్.. అభయ కేసు దర్యాప్తుపై సీబీఐ అధికారులు
మరోవైపు.. సోమవారం సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు, ప్రభుత్వం మధ్య రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశం జరిగింది. అనంతరం.. జూనియర్ డాక్టర్ల ఐదు డిమాండ్లలో సీఎం మమతా బెనర్జీ మూడింటిని ఆమోదించారు. వైద్య విద్య డైరెక్టర్, ఆరోగ్య సేవల డైరెక్టర్‌లను తొలగించడానికి అంగీకరించారు. వైద్యురాలి తల్లిదండ్రులకు డబ్బు ఇవ్వజూపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ పైనా వేటు వేశారు. ఇక.. ఇవాళ కొత్త కమిషనర్‌ను నియమిస్తామని సీఎం మమత ప్రకటించారు.
జూనియర్ల డాక్టర్ల ఇతర డిమాండ్లను పరిశీలించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఐదింటిలో మూడు డిమాండ్లను అంగీకరించినందుకు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని జూనియర్ డాక్టర్లను కోరినట్లు మమత వెల్లడించారు. జూడాలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవని ప్రకటించారు. ఇక.. సమ్మె విషయంపై చర్చించుకొని తమ నిర్ణయం చెబుతామని జూనియర్ డాక్టర్లు తెలిపారని సీఎం మమత వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment