న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా అభయ ఘటన కేసుపై ఇవాళ (సెప్టెంబర్9) సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతుంది. విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్డీవాలా, మనోజ్ మిశ్రాల ధర్మాసనం అభయ కేసులో సీబీఐ దర్యాప్తుపై కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐ దర్యాప్తు విషయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అయితే మరోవారం రోజుల్లో అభయ కేసు స్టేటస్ రిపోర్ట్‌ను అందించాలని స్పష్టం చేసింది.
అదే సమయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కోల్‌కతా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఆర్జీ కర్ అభయ డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన సమయం, పోలీసుల రికార్డుల్లోని సమయంపై ప్రశ్నలు సంధించింది. డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన సమయం విషయంలో పొంతన లేకపోవడాన్ని తప్పుబట్టింది. దీంతో పాటు భద్రత కోసం వచ్చిన సీఐఎస్‌ఎఫ్ జవాన్లకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది.
డాక్టర్ల భద్రతపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
విచారణ కొనసాగే సమయంలో డాక్టర్ల భద్రతపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. డాక్టర్ల భద్రపై కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అనంతరం.. రేపు సాయంత్రం 5గంటల్లోపు డాక్టర్లు విధుల్లో చేరాలని తెలిపింది. విధుల్లో చేరే డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సంబంధిత శాఖ అధికారులు సూచించింది. డాక్టర్లకు మేం అన్ని రకాల సహకారం అందిస్తామని, డాక్టర్ల భద్రతపై కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలి’అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
ఆమె గౌరవాన్ని కాపాడుకుందాం
కేసు విచారణ కొనసాగే సమయంలో దేశ ప్రజలకు సుప్రీం కోర్టు విజ్ఞప్తి చేసింది. అభయ గౌరవాన్ని కాపాడేలా ఆమె ఒరిజినల్ ఫొటోల్ని సోషల్ మీడియాలో డిలీ చేయాలని ఆదేశించింది.
పోస్ట్‌మార్టం రిపోర్ట్ చలాన్ మిస్సింగ్
అభయ పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత జారీ చేసిన చలాన్ మిస్సయ్యింది. పోస్ట్‌మార్టం నివేదిక చలాన్‌ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అందించలేదని సీబీఐ ప్రస్తావించింది.
కాగా, ఇవాళ ఉదయం సుప్రీం కోర్టులో కేసు విచారణ ప్రారంభమైన కొద్ది సేపటికి ఆర్జీ కర్ అభయ కేసు స్టేటస్ రిపోర్ట్‌ను సీబీఐ.. సుప్రీం కోర్టుకు అందించింది. మరోవైపు, డాక్టర్ల సమ్మె వల్ల 23 మంది రోగులు మృతి చెందారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ హెల్త్ డిపార్ట్‌మెంట్ సుప్రీం కోర్టుకు మరో రిపోర్ట్‌ను అందించింది. విచారణ కొనసాగించిన సుప్రీం కోర్టు కేసు దర్యాప్తులో పై విధంగా స్పందించింది.
అభయ కేసులో తొలిసారి సుప్రీం కోర్టు
కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో అభయపై దారుణ ఘటన కేసును సుమోటోగా స్వీకరించాలని కోరుతూ ఇద్దరు న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఆ లేఖపై స్పందించిన సుప్రీం కోర్టు అభయ కేసును సుమోటోగా స్వీకరించింది. ఆగస్టు 20న విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా అభయపై జరిగిన దారుణాన్ని అత్యంత పాశవిక ఘటనగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. ఈ ఉదంతంలో పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిందంటూ మండిపడింది. ఎఫ్‌ఐఆర్ నమోదులో ఆలస్యం మొదలుకుని ఈ దారుణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు మరో పోస్టింగ్, ఆస్పత్రిపై మూక దాడిని నిలువరించడంలో వైఫల్యం దాకా ఒక్క అంశాన్నీ ఎత్తి చూపించింది. దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది ఏమాత్రం రక్షణ లేని పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి : పప్పు కాదు.. ఆయనొక విజనరీ!
ఈ సందర్భంగా వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతకు దేశవ్యాప్త ప్రొటోకాల్ కావాల్సిందే అని స్పష్టం చేసింది. దాని విధివిధానాల రూపకల్పనకు వైస్ అడ్మిరల్ ఆర్తీ సరిన్ సారథ్యంలో వైద్య ప్రముఖులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు వారాల్లోగా ప్రాథమిక నివేదిక, రెండు నెలల్లో పూర్తి నివేదిక అందించాల్సిందిగా టాస్క్‌ఫోర్స్‌కు సూచించింది.
టాస్క్‌ఫోర్స్ బృందం ఇదే..
వైద్యుల భద్రత తదితరాలపై సిఫార్సుల కోసం సుప్రీంకోర్టు నియమించిన నేషనల్ టాస్క్‌ఫోర్స్ సభ్యులు...చైర్‌పర్సన్: వైస్ అడ్మిరల్ ఆర్తీ సరిన్ (మెడికల్ సర్వీసెస్ డీజీ) సభ్యులు: డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి (ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ ఎండీ), డాక్టర్ ఎం.శ్రీనివాస్ (ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్), డాక్టర్ ప్రతిమా మూర్తి (ఎన్‌ఐఎంహెచ్‌ఈ డైరెక్టర్), డాక్టర్ గోవర్ధన్ దత్ పురీ (జోధ్‌పూర్ ఎయిమ్స్ ఈడీ), డాక్టర్ సౌమిత్రా రావత్ (ఐఎస్‌జీ చైర్‌పర్సన్), అనితా సక్సేనా (బీడీ శర్మ మెడికల్ వర్సిటీ వీసీ), పల్లవీ సప్లే (జేజే గ్రూప్ ఆస్పత్రుల డీన్), డాక్టర్ పద్మా శ్రీవాత్సవ (ఢిల్లీ ఎయిమ్స్ మాజీ ప్రొఫెసర్) వీరితో పాటు టాస్క్‌ఫోర్స్‌లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా కేంద్ర కేబినెట్ కార్యదర్శితో పాటు హోం, ఆరోగ్య శాఖల కార్యదర్శులు తదితరులు వ్యవహరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment