
నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కొత్త భవనంలోనే జరగనున్నాయి. దీంతో ఇప్పుడు దేశంలోని చాలా మంది ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే.. పాత భవనాన్ని కూల్చివేస్తారా? లేదా మరేదైనా అవసరాలకు ఉపయోగిస్తారా?. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి 2020, డిసెంబరు 10న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ భవనం అద్భుతంగా ఉండటమే కాకుండా భద్రత కోసం అత్యాధునిక పరికరాలను ఉపయోగించారు.
నూతన పార్లమెంట్ భవనం పాత భవనం కంటే చాలా పెద్దది. పాత పార్లమెంట్ భవనంలో ఎంపీలు కూర్చునే ఏర్పాట్లతో పాటు లైబ్రరీ, లాంజ్, ఛాంబర్ ఉన్నాయి. ఇదేకాకుండా ఎంపీలు, జర్నలిస్టులకు రాయితీ ధరలకు ఆహారం అందించే క్యాంటీన్ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ చారిత్రక భవనాన్ని ఏం చేయనున్నారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. పాత పార్లమెంటు భవనానికి సంబంధించిన ప్రభుత్వ ప్రణాళిక ఏమిటో 10 పాయింట్లలో ఇప్పుడు తెలుసుకుందాం.
1) పాత భవనాన్ని 1927లో బ్రిటిష్ వాస్తుశిల్పులు సర్ ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్ట్ బేకర్ నిర్మించారు. ఈ భవనానికి ఇప్పుడు 97 ఏళ్లు నిండాయి.
2) ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం పాత భవనాన్ని కూల్చివేయరు. ఈ భవనానికి మరమ్మతులు చేసి, కొత్త అవసరాలకు అనుగుణంగా మార్చనున్నారు.
3) లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఈ భవనాన్ని పునరుద్ధరించనున్నారు. ఇతర ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకునే యోచనలో ప్రభుత్వం ఉంది.
4) భారత పార్లమెంటరీ చరిత్రను సామాన్య ప్రజలు తెలుసుకునేలా భవనంలోని కొంత భాగాన్ని మ్యూజియంగా మార్చనున్నట్లు సమాచారం.
5) ఈ భవనాన్ని భారతదేశపు ముఖ్యమైన చారిత్రక వారసత్వ సంపదగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని సంబంధిత అధికారవర్గాలు చెబుతున్నాయి.
6) భవన పునరుద్ధరణ కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారు బ్లూప్రింట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
7) ఈ భవనంలోని నేషనల్ ఆర్కైవ్స్ కొత్త భవనానికి తరలిపోనుంది. దీంతో పాత భవనంలోని ఈ స్థలాన్ని సమావేశ గదిగా లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించనున్నారు.
8) పార్లమెంట్ కొత్త భవనంలో ఎంపీల కోసం ఛాంబర్, విశ్రాంతి స్థలం, లైబ్రరీ, క్యాంటీన్ వంటి అనేక ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి.
9) కొత్త పార్లమెంట్ భవనం 64,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యింది. ఇందులో లోక్‌సభకు 880 సీట్లు, రాజ్యసభకు 300 సీట్లు ఉన్నాయి. ఉమ్మడి సమావేశానికి 1280 సీట్లను ఏర్పాటు చేశారు.
10) సౌండ్ సెన్సార్‌లతో సహా అత్యాధునిక సాంకేతికత కలిగిన కొత్త భవనంలో భద్రత కోసం అనేక లేయర్‌లు ఉపయోగించారు.
ఇది కూడా చదవండి: పాక్ బాంబు దాడికి బలైన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు? ఆ రోజు ఏం జరిగింది?