నిత్యం జనాల కోలాహలంతో సందడిగా ఉండే చారిత్రక మార్గం అది. అలాంటిది దాదాపు 20 నెలల పాటు మూగబోయింది అది. ఇప్పుడు కొత్త పేరుతో.. సరికొత్త హంగులతో సందర్శకులకు స్వాగతం పలకనుంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా.. రాజ్‌పథ్, సెంట్రల్ విస్టా లాన్స్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ స్ట్రెచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో.. కర్తవ్య పథ్‌గా మారిన రాజ్‌పథ్ నేపథ్యం ఓసారి గుర్తు చేసుకుందాం.
రాజ్‌పథ్.. చారిత్రక మార్గం. ఈ పేరు వినగానే గణతంత్ర దినోత్సవం నాడు జరిగే సైనిక పరేడ్‌లు, విన్యాసాలు గుర్తుకు రావడం ఖాయం. ఢిల్లీ వాసులకైతే ఇదొక సేదతీరే అడ్డా. చలికాలం సీజన్‌లో సూర్యకిరణాలను ఆస్వాదిస్తుంటారు అక్కడి ప్రజలు. అక్కడే ఉన్న రైల్ భవన్, శాస్త్రి భవన్, నిర్మాణ్ భవన్, విజ్ఞాన్ భవన్ ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయాల్లో ఇక్కడే సేద తీరుతుంటారు. రాజధాని చూడడానికి వచ్చే యువత, జంటలు, కుటుంబాలు చాలావరకు ఇక్కడే టైం పాస్ చేస్తుంటాయి. నేరెడు చెట్లు, ఇంకా ఎన్నో నీడను పంచేవి. అలాంటి..
దారి రూపం.. పేరు మారిపోయాయి. అధికారికంగా ఇప్పుడది కర్తవ్య పథ్ అయ్యింది. బుధవారం అంటే ఇవాళ(సెప్టెంబర్ 7, 2022).. జరిగిన న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ భేటీ రాజ్‌పథ్ పేరును కర్తవ్య పథ్‌గా మార్చేస్తూ నిర్ణయం తీసుకుంది.
► ప్రధాని నరేంద్ర మోదీ కొత్తరూపం సంతరించుకున్న ఈ మార్గాన్ని ప్రారంభిస్తారు. కానీ, సాధారణ ప్రజానీకం మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా ఒక్కరోజు తర్వాతే(శుక్రవారం) నుంచి ఈ కొత్తదారిని వీక్షించొచ్చు. ఈమధ్యలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు అవుతాయని ఢిల్లీ వాసులకు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
► ప్రజాశక్తీకి నిదర్శనంగా ఉండేందుకే కర్తవ్యపథ్‌గా అనే పేరుపెట్టినట్లు కేంద్రం చెబుతోంది. వసలవాద మైండ్‌సెట్‌ను తొలగించే క్రమంలో భాగంగానే.. అప్పటి పేర్లు, కట్టడాలను మార్చేయాలనే గట్టి ఉద్దేశంతో ఉంది ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.
► 1911లో కోల్‌కతా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ సమయంలో నిర్వహించిన దర్బార్ కోసం వచ్చిన అప్పటి బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ 5 ఢిల్లీకి వచ్చారు. ఆ టైంలోనే వైశ్రాయ్ భవన్(నేటి రాష్ట్రపతి భవన్) దాకా ఒక రాచబాటను వాడుకలోకి తీసుకొచ్చారు. అదే తర్వాత రాజ్‌పథ్(కర్తవ్యపథ్) అయ్యింది.
► లండన్‌లో జార్జ్ 5 తండ్రి ఎడ్వర్డ్ 7 స్మారకార్థం 1905లో ‘కింగ్స్‌వే’ను ప్రారంభించారు. రాజ్‌పథ్ నమునా కూడా కింగ్స్‌వేను దాదాపుగా పోలి ఉంటుంది. దీంతో ఆనాడు ఢిల్లీ సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఫ్రొఫెసర్‌గా పని చేస్తున్న పెర్సివల్ స్పియర్.. ఢిల్లీ రాజమార్గానికి ‘కింగ్స్‌వే’ పేరును ప్రతిపాదించారు. దీంతో మనదగ్గరా కింగ్స్‌వేగానే అది ఉండిపోయింది.
► అయితే స్వాతంత్రం అనంతరం ఢిల్లీ కింగ్స్‌వే పేరును.. రాజ్‌పథ్ అని మార్చేశారు. 1961లో ఈ పేరు మారింది.
► రాజ్‌పథ్ నిర్మించింది.. సర్దార్ నారాయణ్ సింగ్ అనే కాంట్రాక్టర్. బ్రిటిషర్ల పాలనలో ఈ మార్గం ఒక్కటే కాదు.. ఢిల్లీలో చాలారోడ్లను నిర్మించిన కాంట్రాక్టర్ కూడా ఈయనే.
► రైజినా హిల్స్ మీద ఉన్న రాష్ట్రపతి భవన్ నుంచి విజయ్ చౌక్ మీదుగా ఇండియా గేట్ వరకు దాదాపు మూడు కిలోమీటర్ల పొడవు మార్గంగా రాజ్‌పథ్ ఉండేది.
► గత కొన్ని సంవత్సరాలుగా రాజ్‌పథ్.. దానికి అనుసంధానంగా ఉండే సెంట్రల్ విస్టా ఎవెన్యూలు.. ట్రాఫిక్, ఇతర కష్టాలను ఎదుర్కొంటున్నాయి.
► పబ్లిక్ టాయిలెట్స్, తాగు నీటి సవతి, కుర్చీలు-బల్లలు, పార్కింగ్ స్పేస్ తగినంత లేకపోవడం.. తదితర కారణాలతో రూపురేఖలు మార్చేయాలని నిర్ణయించింది కేంద్రం. వీటికి తోడు రిపబ్లిక్ డే పరేడ్, ఇతర కార్యక్రమాల నిర్వాహణ.. వీక్షకులకు సరిపడా జాగా లేకపోవడంతో ఇక్కడ అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
► బ్రిటిష్ వలసపాలనలో కట్టించిన కట్టడాల తొలగింపులో భాగంగా.. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టు తెర మీదకు వచ్చింది. త్రికోణాకారంలో నూతన పార్లమెంట్ భవనం, సెక్రటేరియట్, ప్రధాని నివాసం, ప్రధాని కార్యాలయం, ఉప రాష్ట్రపతి ఎన్‌క్లేవ్ రానున్నాయి. ఈ క్రమంలోనే రాజ్‌పథ్, సెంట్రల్ విస్టా లాన్ రూపు రేఖలు మారిపోయాయి.
► 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. బ్రిటిషర్లు, వలసపాలనలో పేర్లకు, గుర్తులకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
► కర్తవ్యపథ్.. ఇక సువిశాలంగా ఉండనుంది. ఎటు చూసినా పచ్చదనంతో లాన్స్, వాక్‌వేస్, కాలువలు, స్నాక్స్ దొరికేలా దుకాణాలు, లైటింగ్ సిస్టమ్స్, టాయిలెట్స్ సౌకర్యాలు, సైన్ బోర్డులు.. ఏర్పాటు చేశారు.
► కొత్త రూపం సంతరించుకోనున్న ఈ తోవ గుండా రాష్ట్రాల వారీగా ఫుడ్‌స్టాల్స్, గ్రానైట్ వాక్‌వేలు ఏర్పాటు చేశారు. వెండింగ్ జోన్లు, పార్కింగ్ స్థలాలు, రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ ఉండనుంది. వర్షపు నీటిని, రీయూజ్ వాటర్ ప్రాజెక్టులను సైతం అమలు చేయనున్నారు.
► సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా.. ఈ రోడ్డును మీడియా, ప్రభుత్వ డాక్యుమెంట్లు ‘సెంట్రల్ విస్టా ఎవెన్యూ’గా పేర్కొన్నాయి. కానీ, అధికారికంగా మాత్రం ఇప్పుడదిక కర్తవ్య పథ్.
► శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన 28 అడుగుల గ్రానైట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించి మరీ.. కర్తవ్యపథ్, సెంట్రల్ విస్టా లాన్స్ స్ట్రెచ్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
#WATCH | Delhi: Visuals from the redeveloped Kartavya Path that will soon be opened for public use pic.twitter.com/YUoNXFToRL
— ANI (@ANI) September 7, 2022
Comments
Please login to add a commentAdd a comment