Rajpath
-
‘కర్తవ్య పథ్’లోనే గణతంత్ర వేడుకలు ఎందుకంటే..
భారతదేశం రేపు (జనవరి 26) 75వ గణతంత్ర దినోత్సవాలను చేసుకునేందుకు సిద్ధం అవుతోంది. 1950లో భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర బిందువు న్యూ ఢిల్లీలోని కర్తవ్య పథ్ (గతంలో రాజ్‌పథ్). ఇక్కడ జరిగే రిపబ్లిక్ డే పరేడ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పరేడ్‌లో సాయుధ బలగాలకు చెందిన మూడు శాఖల బృందాలు చేసే కవాతు, ఆయుధాలు, సైనిక పరికరాల ప్రదర్శనలు, మోటార్ సైకిల్ విన్యాసాలు భారతదేశ సైనిక సత్తాను చాటుతాయి. ఈ సంవత్సరం భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను ఆహ్వానించారు. ‘కర్తవ్య పథ్’ రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించి ఉంది. ఈ ప్రదేశానికి భారతదేశ స్వాతంత్ర్య పోరాటంతో విడదీయరాని అనుబంధం ఉంది. 1911లో బ్రిటిష్ సర్కారు తన రాజధానిని కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా) నుండి ఢిల్లీకి మార్చిన తర్వాత ఈ రహదారిని నిర్మించి, ‘కింగ్స్‌వే’ అనే పేరు పెట్టింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఈ రహదారిని ‘రాజ్‌పథ్’గా మార్చారు. ఆ తరువాత దీనికి ‘కర్తవ్య పథ్’ అనే పేరుపెట్టారు. ఇది కూడా చదవండి: గణతంత్ర దినోత్సవ థీమ్ ఏమిటి? ముఖ్య అతిథి ఎవరు? గత ఏడు దశాబ్దాలుగా అంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి వార్షిక గణతంత్ర దినోత్సవ వేడుకలను ‘కర్తవ్య పథ్’లోనే నిర్వహిస్తున్నారు. ఈ రహదారి వలస పాలన నుంచి సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రం వరకు సాగిన భారతదేశ ప్రయాణానికి చిహ్నంగా నిలిచింది. 2022లో ‘రాజ్‌పథ్’ను ‘కర్తవ్య పథ్’గా మార్చారు. అనంతరం దీనికి సెంట్రల్ విస్టా అవెన్యూలో చేర్చారు. ఒకప్పడు ‘రాజ్‌పథ్’ అధికార చిహ్నంగా ఉండేది. దానిని ‘కర్తవ్య పథ్’గా మార్చాక ఈ రహదారి సాధికారతకు చిహ్నంగా మారింది. ‘కర్తవ్య పథ్’ ప్రారంభోత్సవాన ప్రధాని మోదీ మాట్లాడుతూ నాటి ‘కింగ్స్‌వే’ లేదా ‘రాజ్‌పథ్’ బానిసత్వానికి చిహ్నంగా నిలిచిందని, ఇటువంటి గుర్తింపును శాశ్వతంగా తుడిచివేయడానికే దీనికి ‘కర్తవ్య పథ్’ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. -
పాలకుల కర్తవ్యం ఇదేనా?
కాలానికీ, అవసరాలకూ తగ్గట్టుగా అన్నీ మారతాయి... మారాల్సిందే. అయితే, ఆ మార్పుల వెనుక ఉద్దేశాల పట్ల అనుమానాలు తలెత్తినప్పుడే అభ్యంతరాలు వస్తాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశ రాజధానిలో చేపట్టిన ‘సెంట్రల్ విస్టా’ ఆధునికీకరణ ప్రాజెక్ట్ తొలి దశ గురువారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైన తీరు, ‘రాజ్‌పథ్’కు ‘కర్తవ్యపథ్’గా పేరు మార్చడం చర్చకు తావిచ్చింది అందుకే! కేవలం 19 నెలల్లో ఇండియా గేట్ పరిసరాలు కళ్ళు చెదిరేలా మారిపోయాయి. కనువిందు చేస్తూ, గర్వకారణమనిపించే ఈ ఆధునిక మార్పులను ఆహ్వానించాల్సిందే. ఇండియాగేట్ సమీపాన బ్రిటీష్ కాలంలో కింగ్ అయిదో జార్జ్ విగ్రహమున్నచోట నేతాజీ ప్రతిమ పెట్టడమూ స్ఫూర్తిదాయ కమే. కానీ, భారీ విగ్రహాలు పెట్టి, రోడ్లకు పేర్లు మార్చి, దేశం సుభిక్షమని నమ్మింపజూస్తేనే చిక్కు. బానిసత్వాన్ని వదిలించుకోవాలని నోటితో చెబుతూ, తాము ప్రభువులమన్నట్టు ప్రవర్తిస్తేనే కష్టం. కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్, కొత్త పార్లమెంట్‌పై 4 సింహాల చిహ్నం, ఐఎన్ఎస్ విక్రాంత్, సెంట్రల్ విస్టా... ఇలా ప్రతి కొత్త ప్రారంభోత్సవం ఇవాళ ఒక జాతీయవాద ప్రచార ఆర్భాటం. ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు ఓ సరికొత్త రాజకీయ నేరేటివ్. గత నెలరోజుల్లోనే దేశవ్యాప్తంగా 30 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనో, ప్రారంభమో చేశారు. అలా దీన్ని 2024 ఎన్నికలకు ముందస్తు సన్నాహంగా మార్చడం పాలకుల గడుసుతనం. ఈ క్రమంలో వలసవాద అవశేషాలను తొలగిస్తున్నామంటూ... సామాన్యులు సైతం స్వేచ్ఛగా తిరిగిన ఇండియాగేట్ ప్రాంతాన్ని ‘కర్తవ్య పథ్’గా వారికి దూరం చేయడమే విరోధాభాస. ఈ ఏడాది స్వాతంత్య్ర దిన ప్రసంగంలోనే ప్రధాని ఈ ‘కర్తవ్యపథ’ నిర్దేశం చేసేశారు. ప్రభుత్వం చేసిన వాగ్దానాల్ని నిలబెట్టుకోవాలన్న డిమాండ్లను పక్కన బెట్టి, పౌరుల కర్తవ్యాన్ని నొక్కిచెప్పారు. ప్రజలే ప్రభువులని గుర్తు చేస్తున్న రాజ్‌పథ్‌ను, ప్రజలకు వారి కర్తవ్యాన్ని గుర్తుచేసే కర్తవ్యపథ్గా మార్చారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం లాంటి సమస్యల పరిష్కారం పాలకుల కర్తవ్యం. అది వదిలేసి ‘నామ్‌కే వాస్తే’ మార్పులపై దృష్టిపెడితే ఎలా? కాన్వాయ్‌ల మొదలు అనేక అంశాల్లో నేటికీ వలస పాలన అవశేషాలనే అనుసరిస్తున్న మన పాలకులు ముందుగా వారు వదులుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నిజానికి, రాష్ట్రపతి భవన్ నుంచి విజయ్ చౌక్, ఇండియా గేట్ మీదుగా పురానా ఖిల్లా దాకా సాగే మార్గం రాజ్‌పథ్. రైజీనా హిల్‌పై నుంచి పురానా ఖిల్లా దాకా ఆ మార్గాన్ని పరికిస్తున్నట్టుగా కట్టిన అప్పటి వైస్రాయ్ భవనమే నేటి రాష్ట్రపతి భవన్. ఆ మాటకొస్తే న్యూఢిల్లీ, అక్కడి భవనాలు, ఇండియా గేట్ లాంటి చారిత్రక కట్టడాలు బ్రిటీష్ హయాంలో నిర్మాణమైనవే. వాటన్నిటినీ బానిస చిహ్నాలుగా తృణీకరిస్తామా? చక్రవర్తి అయిదో జార్జ్ 1911లో భారత సందర్శనకు వచ్చినప్పుడు ‘ఢిల్లీ దర్బార్’ జరిగింది. కలకత్తా నుంచి ఢిల్లీకి దేశ రాజధానిని మార్చారు. ఆ జ్ఞాపకంగా బ్రిటీషర్లు ఈ మార్గానికి ‘కింగ్స్ వే’ అని పేరు పెట్టారు. దాని మీదుగా వెళ్ళే మరో రోడ్‌ను ‘క్వీన్స్ వే’ అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ‘కింగ్స్ వే’ను ‘రాజ్‌పథ్’ అనీ, ‘క్వీన్స్ వే’ను ‘జన్‌పథ్’ అనీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. నిజానికి, ఆ కొత్త పేర్లేమీ పాతవాటికి అనువాదాలు కావు. ‘రాజ్ పథ్’ అంటే రాజుల మార్గమని కాదు... ‘రాజ్య (ప్రభుత్వ) పథ’మనే అర్థం. ఆ రకంగా అప్పుడే ఆ వలస పాలకుల నామకరణా లను ప్రజాస్వామ్య చిహ్నాలుగా మార్చారు. ఆ పేర్లలో జన్‌సంఘ్ సహా ఎవరికీ కనిపించని వలస వాదం, బానిసత్వం తీరా ఇప్పుడు దర్శనమివ్వడమే విడ్డూరం. పేరులో ఏముంది పెన్నిధి అంటారు కానీ, ప్రతి పేరూ భావోద్వేగాలు రేకెత్తించగలదని ఎనిమిదిన్నరేళ్ళుగా దేశాన్ని ఏలుతున్న బీజేపీకి తెలుసు. అధికారంలోకి వచ్చిన ఏడాదికే 2015లోనే వీధులు, నగరాలు, అవార్డుల పేర్లు మార్చే పనిలో పడింది. ఢిల్లీలోని ఔరంగజేబ్ రోడ్‌ను అబ్దుల్ కలామ్ రోడ్‌గా మార్చడంతో మొదలుపెట్టి, ప్రధాని నివాసం ఉండే రేస్‌కోర్స్ రోడ్‌ను లోక్‌కల్యాణ్ మార్గ్‌గా, నెహ్రూ స్మారక మ్యూజియమ్ – లైబ్రరీ ఉన్న ఒకప్పటి నెహ్రూ నివాసం తీన్‌మూర్తి భవన్‌ను ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’గా మార్చేసింది. అక్బర్ రోడ్, హుమాయూన్ రోడ్ పేర్లు తదుపరి అజెండాలో ఉన్నాయట. ఈ దేశపు సమ్మిశ్రిత సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన పేర్లను తొలగించి, హిందూ పునరుద్ధరణవాద నామకరణాల వల్ల సమాజంలో సామరస్యం కొరవడితే అది పూడ్చలేని నష్టం. ఒక వర్గం కన్నా అధికులమనే భావన మరో వర్గంలో కలిగితే, అది సమాజాన్ని నిలువునా చీలు స్తుంది. 2019 ఎన్నికలకు ముందు ఒక్క యూపీలోనే అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌గా, ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా, మొఘల్ సరాయ్ రైల్వే జంక్షన్‌ను జన్‌సంఘ్ సిద్ధాంతవేత్త పేరిట దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌గా ఏ వలసవాద పాలన అవశేషాలున్నాయని మార్చారు? ఇది దేశ బహుళత్వ గుర్తింపును నిరాకరించడమే. చరిత్రలో మొఘల్ చక్రవర్తుల భాగాన్ని కనుమరుగు చేసే ప్రయత్నమే. రాజీవ్ ఖేల్‌రత్న అవార్డ్ పేరు ధ్యాన్‌చంద్ అవార్డుగా మారడం వెనుకా హాకీ దిగ్గజంపై గౌరవం కన్నా రాజకీయంగా తేల్చుకోదలచిన లెక్కలే ఎక్కువ. హైదరాబాద్ పేరును ‘భాగ్య నగర్’గా మారుస్తామని ఇటీవల బీజేపీ నేతలు ప్రకటించారు. ఏ చారిత్రక ఆధారాలతో ఆ మాట అన్నారో చెప్పలేం. ఇక, ఢిల్లీని ‘ఇంద్రప్రస్థం’గా మారుస్తారనీ ఓ ప్రచారం. వెరసి, ఈ పేర్ల మార్పు ధోరణితో ఎక్కడికెళతాం? వలస పాలకులు పోయారు కానీ, గద్దెపై పెద్దలు ప్రాధాన్యాలు మర్చిపో తేనే ఇబ్బంది. పాలకులు కర్తవ్యం విడిచి, దోవ తప్పితే ప్రజాస్వామ్యంలో ప్రజలకు కిం కర్తవ్యం? -
కొత్త లుక్ తో అదరహో అనిపిస్తున్న కర్తవ్య పథ్
-
ప్రారంభానికి రెడీ అయిన సెంట్రల్ విస్టా అవెన్యూ
-
రాజ్‌పథ్ ఇక గతం.. కర్తవ్యపథ్ ఎంతో ఘనం
నిత్యం జనాల కోలాహలంతో సందడిగా ఉండే చారిత్రక మార్గం అది. అలాంటిది దాదాపు 20 నెలల పాటు మూగబోయింది అది. ఇప్పుడు కొత్త పేరుతో.. సరికొత్త హంగులతో సందర్శకులకు స్వాగతం పలకనుంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా.. రాజ్‌పథ్, సెంట్రల్ విస్టా లాన్స్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ స్ట్రెచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో.. కర్తవ్య పథ్‌గా మారిన రాజ్‌పథ్ నేపథ్యం ఓసారి గుర్తు చేసుకుందాం. రాజ్‌పథ్.. చారిత్రక మార్గం. ఈ పేరు వినగానే గణతంత్ర దినోత్సవం నాడు జరిగే సైనిక పరేడ్లు, విన్యాసాలు గుర్తుకు రావడం ఖాయం. ఢిల్లీ వాసులకైతే ఇదొక సేదతీరే అడ్డా. చలికాలం సీజన్లో సూర్యకిరణాలను ఆస్వాదిస్తుంటారు అక్కడి ప్రజలు. అక్కడే ఉన్న రైల్ భవన్, శాస్త్రి భవన్, నిర్మాణ్ భవన్, విజ్ఞాన్ భవన్ ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయాల్లో ఇక్కడే సేద తీరుతుంటారు. రాజధాని చూడడానికి వచ్చే యువత, జంటలు, కుటుంబాలు చాలావరకు ఇక్కడే టైం పాస్ చేస్తుంటాయి. నేరెడు చెట్లు, ఇంకా ఎన్నో నీడను పంచేవి. అలాంటి.. దారి రూపం.. పేరు మారిపోయాయి. అధికారికంగా ఇప్పుడది కర్తవ్య పథ్ అయ్యింది. బుధవారం అంటే ఇవాళ(సెప్టెంబర్ 7, 2022).. జరిగిన న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ భేటీ రాజ్‌పథ్ పేరును కర్తవ్య పథ్‌గా మార్చేస్తూ నిర్ణయం తీసుకుంది. ► ప్రధాని నరేంద్ర మోదీ కొత్తరూపం సంతరించుకున్న ఈ మార్గాన్ని ప్రారంభిస్తారు. కానీ, సాధారణ ప్రజానీకం మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా ఒక్కరోజు తర్వాతే(శుక్రవారం) నుంచి ఈ కొత్తదారిని వీక్షించొచ్చు. ఈమధ్యలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు అవుతాయని ఢిల్లీ వాసులకు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ► ప్రజాశక్తీకి నిదర్శనంగా ఉండేందుకే కర్తవ్యపథ్గా అనే పేరుపెట్టినట్లు కేంద్రం చెబుతోంది. వసలవాద మైండ్‌సెట్‌ను తొలగించే క్రమంలో భాగంగానే.. అప్పటి పేర్లు, కట్టడాలను మార్చేయాలనే గట్టి ఉద్దేశంతో ఉంది ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ► 1911లో కోల్‌కతా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ సమయంలో నిర్వహించిన దర్బార్ కోసం వచ్చిన అప్పటి బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ 5 ఢిల్లీకి వచ్చారు. ఆ టైంలోనే వైశ్రాయ్ భవన్(నేటి రాష్ట్రపతి భవన్) దాకా ఒక రాచబాటను వాడుకలోకి తీసుకొచ్చారు. అదే తర్వాత రాజ్‌పథ్(కర్తవ్యపథ్) అయ్యింది. ► లండన్‌లో జార్జ్ 5 తండ్రి ఎడ్వర్డ్ 7 స్మారకార్థం 1905లో ‘కింగ్స్‌వే’ను ప్రారంభించారు. రాజ్‌పథ్ నమునా కూడా కింగ్స్‌వేను దాదాపుగా పోలి ఉంటుంది. దీంతో ఆనాడు ఢిల్లీ సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఫ్రొఫెసర్‌గా పని చేస్తున్న పెర్సివల్ స్పియర్.. ఢిల్లీ రాజమార్గానికి ‘కింగ్స్‌వే’ పేరును ప్రతిపాదించారు. దీంతో మనదగ్గరా కింగ్స్వేగానే అది ఉండిపోయింది. ► అయితే స్వాతంత్రం అనంతరం ఢిల్లీ కింగ్స్‌వే పేరును.. రాజ్‌పథ్ అని మార్చేశారు. 1961లో ఈ పేరు మారింది. ► రాజ్‌పథ్ నిర్మించింది.. సర్దార్ నారాయణ్ సింగ్ అనే కాంట్రాక్టర్. బ్రిటిషర్ల పాలనలో ఈ మార్గం ఒక్కటే కాదు.. ఢిల్లీలో చాలారోడ్లను నిర్మించిన కాంట్రాక్టర్ కూడా ఈయనే. ► రైజినా హిల్స్ మీద ఉన్న రాష్ట్రపతి భవన్ నుంచి విజయ్ చౌక్ మీదుగా ఇండియా గేట్ వరకు దాదాపు మూడు కిలోమీటర్ల పొడవు మార్గంగా రాజ్‌పథ్ ఉండేది. ► గత కొన్ని సంవత్సరాలుగా రాజ్‌పథ్.. దానికి అనుసంధానంగా ఉండే సెంట్రల్ విస్టా ఎవెన్యూలు.. ట్రాఫిక్, ఇతర కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ► పబ్లిక్ టాయిలెట్స్, తాగు నీటి సవతి, కుర్చీలు-బల్లలు, పార్కింగ్ స్పేస్ తగినంత లేకపోవడం.. తదితర కారణాలతో రూపురేఖలు మార్చేయాలని నిర్ణయించింది కేంద్రం. వీటికి తోడు రిపబ్లిక్ డే పరేడ్, ఇతర కార్యక్రమాల నిర్వాహణ.. వీక్షకులకు సరిపడా జాగా లేకపోవడంతో ఇక్కడ అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ► బ్రిటిష్ వలసపాలనలో కట్టించిన కట్టడాల తొలగింపులో భాగంగా.. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టు తెర మీదకు వచ్చింది. త్రికోణాకారంలో నూతన పార్లమెంట్ భవనం, సెక్రటేరియట్, ప్రధాని నివాసం, ప్రధాని కార్యాలయం, ఉప రాష్ట్రపతి ఎన్క్లేవ్ రానున్నాయి. ఈ క్రమంలోనే రాజ్‌పథ్, సెంట్రల్ విస్టా లాన్ రూపు రేఖలు మారిపోయాయి. ► 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. బ్రిటిషర్లు, వలసపాలనలో పేర్లకు, గుర్తులకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ► కర్తవ్యపథ్.. ఇక సువిశాలంగా ఉండనుంది. ఎటు చూసినా పచ్చదనంతో లాన్స్, వాక్‌వేస్, కాలువలు, స్నాక్స్ దొరికేలా దుకాణాలు, లైటింగ్ సిస్టమ్స్, టాయిలెట్స్ సౌకర్యాలు, సైన్ బోర్డులు.. ఏర్పాటు చేశారు. ► కొత్త రూపం సంతరించుకోనున్న ఈ తోవ గుండా రాష్ట్రాల వారీగా ఫుడ్‌స్టాల్స్, గ్రానైట్ వాక్‌వేలు ఏర్పాటు చేశారు. వెండింగ్ జోన్లు, పార్కింగ్ స్థలాలు, రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ ఉండనుంది. వర్షపు నీటిని, రీయూజ్ వాటర్ ప్రాజెక్టులను సైతం అమలు చేయనున్నారు. ► సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా.. ఈ రోడ్డును మీడియా, ప్రభుత్వ డాక్యుమెంట్లు ‘సెంట్రల్ విస్టా ఎవెన్యూ’గా పేర్కొన్నాయి. కానీ, అధికారికంగా మాత్రం ఇప్పుడదిక కర్తవ్య పథ్. ► శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన 28 అడుగుల గ్రానైట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించి మరీ.. కర్తవ్యపథ్, సెంట్రల్ విస్టా లాన్స్ స్ట్రెచ్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. #WATCH | Delhi: Visuals from the redeveloped Kartavya Path that will soon be opened for public use pic.twitter.com/YUoNXFToRL — ANI (@ANI) September 7, 2022 -
రాజ్ పథ్ కాదు ...కర్తవ్య పథ్
-
రాజ్‌పథ్ పేరు మార్చేసిన కేంద్రం!
ఢిల్లీ: దేశరాజధానిలోని చారిత్రక మార్గం రాజ్‌పథ్ పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్‌పథ్, సెంట్రల్ విస్టా లాన్ పేరును ‘కర్తవ్యపథ్’గా అధికారికంగా మార్చబోతోంది. ఈ మేరకు న్యూఢిల్లీ మున్సిపల్ (NDMC) సెప్టెంబర్ 7వ తేదీన నిర్వహించబోయే ప్రత్యేక సమావేశంలో.. కౌన్సిల్ ముందుకు రాజ్‌పథ్ పేరుమార్చే ప్రతిపాదన బిల్లు రానుంది. ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం నుంచి.. రాష్ట్రపతి భవన్ వద్ద దాకా ఉన్న రోడ్డును రాజ్‌పథ్‌గా వ్యవహరిస్తారననది తెలిసిందే. బ్రిటిషర్ల కాలంలోనే రాజమార్గంగా రాజ్‌పథ్‌ను ఉపయోగించడం జరిగింది. ఢిల్లీ నడిబొడ్డున పునరుద్ధరించిన రాజ్‌పథ్, సెంట్రల్ విస్టా లాన్లు కొత్త రూపాలతో త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో.. కొత్త పేరును సైతం వాడుకలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. 1911లో కోల్‌కతా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చింది బ్రిటీష్ వైశ్రాయ్ పాలన. ఆ సమయంలో నిర్వహించిన దర్బార్ కోసం వచ్చిన అప్పటి బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ 5 వచ్చారు. ఆ టైంలోనే రాజ్‌పథ్ వాడుకలోకి వచ్చింది. అయితే 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. బ్రిటిషర్లు, వలసపాలనలో పేర్లకు, గుర్తులకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఈ నెల 8న సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టు కింద విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు స్ట్రెచ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. లండన్‌లో జార్జ్ 5 తండ్రి ఎడ్వర్డ్ 7 స్మారకార్థం 1905లో కింగ్స్‌వేను ప్రారంభించారు. రాజ్‌పథ్ దీనినే పోలి ఉంటుంది. అయితే స్వాతంత్రం అనంతరం ఢిల్లీ కింగ్స్‌వేను హిందీ భాషకు అనుగుణంగా రాజ్‌పథ్ అని మార్చేశారు. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా.. ఈ రోడ్డును మీడియా, ప్రభుత్వ డాక్యుమెంట్లు ‘సెంట్రల్ విస్టా ఎవెన్యూ’గా పేర్కొన్నాయి. కానీ, ఫార్మల్గా రాజ్‌పథ్ అనే పేరే కొనసాగుతోంది. త్వరలో అది కర్తవ్య పథ్‌గా మారనుంది. ల్యాండ్‌మార్క్స్ రాష్ట్రపతి భవన్, సెక్రటేరియెట్ భవనం, విజయ్ చౌక్, ఇండియా గేట్, నేషనల్ వార్ మెమోరియల్.. రాజ్‌పథ్‌కు గుర్తులుగా ఉన్నాయి. కొత్త రూపం సంతరించుకోనున్న రాజ్‌పథ్ వెంట రాష్ట్రాల వారీగా ఫుడ్‌స్టాల్స్, గ్రానైట్ వాక్‌వేలు ఏర్పాటు చేశారు. వెండింగ్ జోన్లు, పార్కింగ్ స్థలాలు, రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ ఉండనుంది. ఇదీ చదవండి: అర్షదీప్ సింగ్‌కు ఖలిస్తాన్ లింక్ అంటగట్టడంపై కేంద్రం సీరియస్ -
జాతీయ జెండాను ఆవిష్కరించిన రామ్‌నాథ్ కోవింద్
సాక్షి, న్యూఢిల్లీ: భారత 73వ గణతంత్ర వేడుకలు ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో బుధవారం అట్టహాసంగా జరిగాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాలు 21 తుపాకులతో సైనిక వందనం సమర్పించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులు, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో వీక్షకుల సంఖ్యను కుదించారు. 2500 మందిని రాజ్‌పథ్‌లో పరేడ్ చూసేందుకు అనుమతించారు. 15ఏళ్లలోపువారికి అనుమతి లేదు. కరోనా నేపథ్యంలో ఈసారి గణతంత్ర వేడుకలకు విదేశీ అతిథులను ఆహ్వానించలేదు. ఆకట్టుకున్న సైనిక పరేడ్ రాజ్‌పథ్‌లో సైనిక పరేడ్ అదరహో అనిపించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్న వేళ.. భారత సైనిక సామర్థ్యాన్ని, దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా రిపబ్లిక్ డే పరేడ్ సాగింది. 16 కవాతు విభాగాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. సైన్యం, నౌకాదళం, వాయుసేన, కేంద్ర పారామిలటరీ దళాలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సిబ్బంది మార్చ్ ఫాస్ట్‌లో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్బంగా.. భారతీయ వాయుసేన 75 యుద్ధవిమానాలతో గ్రాండ్ ప్లైపాస్ట్ నిర్వహించింది. రఫేల్, సుఖోయ్, జాగ్వర్, అపాచీ వంటి ఫైటర్ జెట్స్ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. -
మైండ్‌బ్లోయింగ్ మోటర్ స్టంట్స్.. ‘సీమా భవాని’ గురించి తెలుసా?
సెల్యూట్ టు ప్రెసిడెంట్.. ఫిష్ రైడింగ్.. పీకాక్.. శక్తిమాన్ విండ్ మిల్....మొదలైన విన్యాసాలు ఆహా అనిపిస్తాయి! మనల్ని మరో లోకంలోకి తీసుకువెళతాయి. మన చేత ఆగకుండా చప్పట్లు కొట్టిస్తాయి. చలిపులి తోకముడిచి ఎక్కడికో పారిపోతుంది. రిపబ్లిక్ డే పరేడ్ (రాజ్‌పథ్, దిల్లీ) విన్యాసాల్లో ‘సీమ భవాని’ బృందం 350 సీసీ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటర్‌సైకిళ్లపై చేసే విన్యాసాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పదహారు రకాలైన డేర్ డెవిల్ స్టంట్స్‌తో ఆబాలగోపాలం చేత వహ్వా అనిపిస్తుంది బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) లో భాగమైన ఈ ఆల్–వుమెన్ యూనిట్. 2016లో మధ్యప్రదేశ్‌లోని టెకన్పూర్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ మోటర్ ట్రాన్స్పోర్ట్ (సీఎస్ఎంటీ)లో ‘సీమ భవానీ’కి అంకురార్పణ జరిగింది. అంతకుముందు రిపబ్లిక్ డే వేడుకల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ నుంచి మహిళలు పాల్గొని తన నైపుణ్యాలను ప్రదర్శించేవారు. 2018తో ఒక అధ్యాయం మొదలైంది... ఆ సంవత్సరం తొలిసారిగా ‘సీమ భవాని’ బృందం చేసిన మైండ్‌బ్లోయింగ్ మోటర్ స్టంట్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ‘అపురూపం, అసాధారణం’ అని వేనోళ్ల పొగిడేలా చేశాయి. మొదట్లో ‘సీమ భవాని’లో 27 మంది ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 110కి చేరింది. ‘సీమ భవాని’ టీమ్ కోసం 25–30 ఏళ్ల వయసు ఉన్నవారిని ప్రత్యేకంగా ఎంపిక చేస్తారు. ఈ టీమ్‌కు ఎంపిక కావడం పెద్ద గౌరవంగా భావిస్తారు. ‘గతంలో ఎక్కడైనా మోటర్ సైకిల్ స్టంట్స్ చూసినప్పుడు కలా? నిజమా? అనుకునేదాన్ని. సీమ భవాని టీమ్ లో నేను భాగం కావడం సంతోషాన్ని ఇస్తుంది’ అంటుంది హిమాన్షు శిర్హోయి. ‘అసాధారణమై బృందానికి ఎంపిక కావడం నా జీవితంలో మరచిపోలేని రోజు. రోజూ ఎన్నో గంటల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నప్పుటికీ కష్టం అనిపించలేదు’ అంటుంది సోనియా భన్వీ. ఈ ఇద్దరూ బీఎస్ఎఫ్లో ఇన్‌స్పెక్టర్స్‌గా పనిచేస్తున్నారు. 110 మందితో కూడిన ‘సీమ భవానీ’కి కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన జయంతి ఎంపికైంది. బీఎస్ఎఫ్లో గత ఏడేళ్లుగా కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది జయంతి. పిరమిడ్ ఫార్మేషన్తో సహా కఠినతరమైన ఎన్నో విన్యాసాలలో గత ఏడు నెలలుగా శిక్షణ తీసుకుంది జయంతి. ‘రిపబ్లిక్ డే పరేడ్‌లో నాకు బాగా ఇష్టమైనవి మోటర్‌సైకిల్ విన్యాసాలు. ఎలా చేస్తున్నారో కదా! అని బోలెడు ఆశ్చర్యపోయేవాడిని. ఆ బృందంలో మా అమ్మాయి కూడా భాగం అయినందుకు గర్వంగా ఉంది’ అంటున్నాడు జయంతి తండ్రి జయదేవ్ పిళ్లై. నిజానికి ‘సీమ భవాని’ తల్లిదండ్రుల సంతోషమేకాదు యావత్ దేశ సంతోషం. చదవండి: ఆత్మగౌరవ వజ్రాయుధం... దాక్షాయణి వేలాయుధం #WATCH | Border Security Force's women contingent 'Seema Bhawani' is set to showcase its stunts at Rajpath on Republic Day parade This is the 2nd time when the Seema Bhawani team will showcase its stunts at Rajpath during the R-Day parade pic.twitter.com/3KzU7Em2EI — ANI (@ANI) January 3, 2022 -
ఢిల్లీ గడ్డపై కలంకారీ మెరుపు
శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న ఢిల్లీలోని రాజపథ్‌లో ప్రదర్శించే కళారూపాల్లో శ్రీకాళహస్తి కలంకారీకి చోటుదక్కింది. శ్రీకాళహస్తి యువ కళాకారుడు సుధీర్ ఏపీ, తెలంగాణ తరఫున ఈ ప్రదర్శనకు ఎంపికయ్యాడు. గత నెలలో చండీగఢ్‌లో జరిగిన అమృతోత్సవాల్లో 9 మంది బృందంతో పాల్గొన్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరఫున మరుగునపడ్డ స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను కలంకారీని మిళితం చేసి 30 మీటర్ల వస్త్రంపై చిత్రీకరించారు. శ్రీకాళహస్తి ఖ్యాతిని రెపరెపలాడించిన కళాకారుడిని ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అభినందించారు. చదవండి: నెట్ సెంటర్లో వెబ్ వాట్సాప్ లాగౌట్ చేయని మహిళ.. చివరికి.. కలంకారీ చిత్రాలు గీస్తున్న కళాకారులు చాలా ఆనందంగా ఉంది చండీగఢ్‌లో జరిగిన అమృతోత్సవాల్లో ఏపీ, తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించాను. మరుగునపడ్డ జాతీయ నాయకుల చిత్రాలకు జీవం పోశాం. మా కలంకారీ కళను గుర్తించడం చాలా ఆనందంగా ఉంది. 2006 మహాత్మాగాంధీ మెమోరియల్ అవార్డు, 2007లో హ్యాండీక్రాఫ్ట్ విభాగంలో రాష్ట్ర అవార్డు వచ్చింది. హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయంలో పెయింటింగ్‌లో బ్యాచిలర్ ఇన్ విజువల్ ఆర్ట్స్ పూర్తి చేశాను. జాతీయ అవార్డు తీసుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నాను. – సుదీర్, కలంకారీ కళాకారుడు -
రిపబ్లిక్ వేడుకల్లో తెలుగు కళారూపం
సాక్షి, హైదరాబాద్: తెలుగు కలంకారీ కళాకారుడు సుధీర్‌కు అరుదైన గుర్తింపు లభించింది. దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ వేడుకల్లో సుధీర్ కలంకారీ కళారూపానికి చోటు దక్కింది. పంజాబ్‌లోని రాజ్‌పురా చిట్కారా విశ్వవిద్యాలయంలోని కళాకుంభ్‌లో స్క్రోల్ తయారీ ప్రక్రియలో భాగంగా ఉన్న కొన్ని సంప్రదాయ రీతులను ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ కవాతు సందర్భంగా న్యూఢిల్లీ రాజ్ పథ్‌లో ప్రదర్శించనున్నారు. ఇందులో భాగంగా రాజ్‌పథ్‌లోని ఓపెన్ గ్యాలరీలో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్జీఎంఎ) భారీ స్క్రోల్స్‌ను ప్రదర్శించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 500 మందికి పైగా కళాకారులు (వీటి పొడవు ఒక్కొక్కటి 750 మీటర్లు) దీనిని చిత్రించారు. కళారూపాల జాబితాలో కలంకారీ కళారూపం గణతంత్ర దినోత్సవ ప్రదర్శనకు ఎంపిక చేసిన ప్రతిష్టాత్మక కళారూపాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తికి చెందిన కళాకారుడు సుధీర్ రూపొందించిన కళారూపం కూడా ఉండటం విశేషం. సుధీర్ అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్న సంప్రదాయ కలంకారీ కళాకారుడు. కలంకారీ అనేది సహజమైన రంగులను ఉపయోగించి, చింతపండు, పెన్నుతో కాటన్ లేదా సిల్క్ ఫ్యాబ్రిక్‌పై చేసే చేతి పెయింటింగ్ పురాతన శైలి. ఈ కళలో డైయింగ్, బ్లీచింగ్, హ్యాండ్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, స్టార్చింగ్, క్లీనింగ్ ఇంకా మరెన్నో 23 శ్రమతో కూడిన దశలుంటాయి. కలంకారీలో గీసిన మోటిఫ్‌లు, పువ్వులు, నెమలి, పైస్లీలు మొదలు మహాభారతం, రామాయణం వంటి హిందూ ఇతిహాసాల దైవిక పాత్రల వరకు విస్తరించి ఉంటాయి. -
నేడే కిసాన్ గణతంత్ర పరేడ్
న్యూఢిల్లీ: ఒకవైపు గణతంత్ర దినోత్సవాలు, మరోవైపు మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కిసాన్ గణతంత్ర పరేడ్.. దేశ రాజధాని ఢిల్లీలో ఒకేరోజు రెండు ముఖ్యమైన కార్యక్రమాలు. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు జరిగే రాజ్‌పథ్‌లో, రైతులు ట్రాక్టర్ పరేడ్ తలపెట్టిన మార్గాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్‌పథ్‌లో అధికారిక గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాతే ట్రాక్టర్ పరేడ్ ప్రారంభిస్తామని, సెంట్రల్ ఢిల్లీలోకి ప్రవేశించబోమని రైతు సంఘాల నాయకులు సోమవారం ప్రకటించారు. ఈ పరేడ్‌లో దాదాపు 2 లక్షల ట్రాక్టర్లు, రైతుల శకటాలు పాల్గొంటాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ సరిహద్దులోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ పాయింట్ల నుంచి పరేడ్ మొదలవుతుందన్నారు. ► రిపబ్లిక్ డే వేడుకలు జరిగే రాజ్‌పథ్‌లో 6,000 మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ► పరేడ్‌లో పాల్గొనే రైతులు 24 గంటలకు సరిపడా ఆహార పదార్థాలను వెంట తెచ్చుకోవాలని రైతు నాయకులు సూచించారు. ► ఆయుధాలు, మద్యం, అనుచిత బ్యానర్లు ప్రదర్శించవద్దని చెప్పారు. ► సింఘు బోర్డర్ నుంచి ప్రారంభమయ్యే ట్రాక్టర్ పరేడ్ 63 కిలోమీటర్లు, టిక్రీ బోర్డర్ నుంచి మొదలయ్యే పరేడ్ 62 కిలోమీటర్లు, ఘాజీపూర్ బోర్డర్ నుంచి నిర్వహించే పరేడ్ 68 కిలోమీటర్లు కొనసాగుతుంది. రైతులకు బెస్ట్ ఆఫర్ ఇచ్చాం మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలును ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరాలపాటు నిలిపివేస్తామంటూ ప్రభుత్వం తరపున రైతులకు ‘బెస్ట్ ఆఫర్’ ఇచ్చామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సోమవారం చెప్పారు. ఈ ఆఫర్‌ను రైత సంఘాల నేతలు త్వరలోనే పునఃపరిశీలించి, వారి నిర్ణయాన్ని తమకు తెలియజేస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. రైతు సంఘాలు సానుకూలంగా స్పందిస్తే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. కొత్త సాగు చట్టాలను రైతులే రద్దు చేస్తారు ముంబై: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తన మెజార్టీని అడ్డం పెట్టుకొని రాజ్యాంగాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొస్తోందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత,శరద్ పవార్ మండిపడ్డారు. ఆయా చట్టాలను ప్రభుత్వం రద్దు చేయకపోతే ప్రజలే ఆ పని పూర్తిచేస్తారని, అధికార పార్టీని కూల్చేస్తారని హెచ్చరించారు. అక్కడ కేవలం పంజాబ్ రైతులే ఉన్నారని కొందరు అంటున్నారని, పంజాబ్ ఏమైనా పాకిస్తానా? అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అవమానించారు పార్లమెంట్లో సమగ్రమైన చర్చ జరగకుండానే వ్యవసాయ బిల్లులను ఆమోదించారని శరద్ పవార్ తప్పుపట్టారు. పూర్తిస్థాయిలో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇలా చేయడం రాజ్యాంగాన్ని అవమా నించడమే అవుతుందన్నారు. బడ్జెట్ రోజు పాదయాత్ర న్యూఢిల్లీ: మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటంలో ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ వరకూ పాదయాత్ర చేపట్టనున్నట్లు రైతు సంఘాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాల రద్దు దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి పార్లమెంట్ దాకా పాదయాత్ర చేపట్టనున్నట్లు క్రాంతికారి కిసాన్ యూనియన్ నేత దర్శన్ పాల్ సోమవారం చెప్పారు. కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేయాలన్న తమ డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదన్నారు. -
నారీ శక్తి సైనిక శక్తి
న్యూఢిల్లీ: భారతదేశ 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజధాని న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఘనంగా జరిగాయి. శీతాకాలం వేళ ఆదివారంనాడు సూర్యకిరణాల వెచ్చదనం మధ్య త్రివిధ బలగాలు నిర్వహించిన 90 నిమిషాల పెరేడ్ అణువణువునా దేశభక్తిని నింపుతూ రోమాలు నిక్కబొడిచేలా సాగింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, మన సైనిక సత్తాని ప్రపంచానికి చాటి చెప్పే ఆయుధ ప్రదర్శనలు, సామాజిక, ఆర్థిక పురోగతిని తెలిపే శకటాలు, మహిళా సాధికారతను చాటి చెప్పే విన్యాసాలతో పెరేడ్ దేశానికే గర్వకారణంగా నిలిచింది. రాజ్‌పథ్‌లో గోవా, మేఘాలయ తదితర రాష్ట్రాల శకటాల ప్రదర్శన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారక కేంద్రం దగ్గర నివాళులర్పించడం దగ్గర్నుంచి గగనతలంలో త్రివిధ బలగాలకి సంకేతంగా హెలికాప్టర్లు చేసే విన్యాసాల వరకు ఎన్నో తొలి ఘటనలకు ఈ వేడుకలు సాక్షీభూతమయ్యాయి. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనోరా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసి పెరేడ్ని తిలకించారు. రాజ్‌పథ్‌లో పెరేడ్ మొదలు కావడానికి ముందు జాతీయ గీతం బ్యాండ్‌ని వాయించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించే సమయంలో 21 సార్లు గాల్లోకి తుపాకులు పేల్చి సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఇతర ప్రముఖులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. యుద్ధస్మారక కేంద్రం వద్ద ప్రధాని నివాళులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఉదయం పెరేడ్ ప్రారంభం కావడానికి ముందు కొత్తగా నిర్మించిన జాతీయ యుద్ధ స్మారక కేంద్రం వద్ద నివాళులర్పించారు. ఏటా ఇండియా గేట్ దగ్గరున్న అమర్ జ్యోతి జవాన్ వద్ద నివాళుల ర్పించడం సంప్రదాయంగా వస్తోంది. కాషాయ బాందినీ ప్రింట్ తలపాగాతో.. జాతీయ వేడుకల సమయంలో ప్రధానమంత్రి మోదీ రంగుల తలపాగా ధరించే సంప్రదాయాన్ని కొనసాగించారు. తెల్ల రంగు పైజామా, కుర్తా, దానిపైన నీలం రంగు జాకెట్, కాషాయ రంగులో వీపు మీదుగా జారేలా ఉండే బాందినీ ప్రింట్ తలపాగా ధరించారు. రాజస్తాన్, గుజరాత్‌లలో ఇలాంటి తలపాగాలను ధరిస్తారు. ఆకట్టుకున్న శకటాలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో, సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా, మన సైనిక పాటవాన్ని చాటేలా మొత్తం 22 శకటాల ప్రదర్శన ఆద్యంతం మనోహరంగా సాగింది. కప్పల్ని కాపాడాలని గోవా శకటాన్ని రూపొందిస్తే, హిమాచల్ ప్రదేశ్ కులు దసరా ఉత్సవాన్ని, ఒడిశా రథయాత్రను ప్రతిబింబించేలా శకటాల్ని రూపొందించాయి. వాయుసేనకు చెందిన శకటం తేజస్ యుద్ధ విమానాలు, ఆకాశ్, అస్త్ర క్షిపణుల్ని ప్రదర్శించింది. ఇక జల్ శక్తి మంత్రిత్వ శాఖ 2024కల్లా ప్రతీ గ్రామానికి కుళాయి కనెక్షన్ ఇస్తామని చాటిచెప్పే శకటాన్ని ప్రదర్శించింది. ఎన్నో ఫస్ట్లు రాజ్‌పథ్‌లో జరిగిన పెరేడ్ని మహిళా కమాండర్ కెప్టెన్ తాన్యా షెర్గిల్ ముందుండి నడిపించారు. అందరూ పురుషులే పాల్గొన్న ఈ మార్చ్‌కి ఒక మహిళా అధికారి నేతృత్వం వహించడం ఇదే తొలిసారి. ► సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు చెందిన మహిళా బైకర్లు తొలిసారిగా ఇచ్చిన ప్రదర్శన ఉత్కంఠభరితంగా సాగింది. ఇన్స్పెక్టర్ సీమ నాగ్ నేతృత్వంలో డేర్ డెవిల్ స్టంట్ ప్రదర్శన సాగింది. నడుస్తున్న బైక్ పైభాగాన నిల్చొని సీమ సెల్యూట్ సమర్పించడం ఈ షోకే హైలైట్. ► జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొని ‘‘తిరిగి గ్రామానికి’’అన్న థీమ్‌తో శకటాన్ని ప్రదర్శించింది. ఈ శకటం ముందుభాగంలో కశ్మీర్ చేతి వృత్తులను ప్రతిబింబించేలా శాలువా అల్లుతున్న కార్మికుడ్ని ఉంచారు. ► రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ) గత ఏడాది రూపొందించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏశాట్)ని ఈ సారి పెరేడ్లో తొలిసారిగా ప్రదర్శించారు. మిషన్ శక్తిలో భాగంగా మన క్షిపణి వ్యవస్థ సత్తా దీంతో తెలుస్తుంది. ► ధనుష్ శతఘ్నులను తొలిసారిగా రిపబ్లిక్ డే పెరేడ్లో ప్రదర్శించారు. 155ఎంఎం/45 కాలిబర్ సామర్థ్యం కలిగిన ఈ శతఘ్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. 36.5కి.మీ. దూరం వరకు ధనుష్ కచ్చితంగా లక్ష్యాలను ఛేదిస్తుంది. ► కొత్తగా మన అమ్ముల పొదిలో వచ్చి చేరిన చినూక్, అపాచీ భారీ యుద్ధ హెలికాప్టర్లు తొలిసారిగా పెరేడ్లో ప్రదర్శించాయి. మారుమూల ప్రాంతాల్లో భారీ లోడ్లను కూడా చినూక్ మోసుకుపోగలదు. ఇక అపాచి హెలికాప్టర్ గగనతలం నుంచి గగనతలానికి, నింగి నుంచి నేలకి కూడా క్షిపణుల్ని ప్రయోగించే సత్తా ఉంది. ► నీలాకాశంలో జరిగే వైమానిక విన్యాసాలు రోమాలు నిక్కబొడుచుకునేలా సాగాయి. 40 విమానాలు త్రిశూల్ ఆకారంలో విన్యాసాలు చేయడంతో మొదలై త్రివిధ దళాలకి గుర్తుగా మూడు ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లు ’VIP’ ఆకారంలో వచ్చాయి. ఈ ప్రదర్శనని ఇలా నిర్వహించడం ఇదే తొలిసారి. 17 వేల అడుగుల ఎత్తులో.. న్యూఢిల్లీ: 17 వేల అడుగుల ఎత్తు.. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత.. మోకాళ్ల లోతు మంచు.. జాతీయ జెండాను ఎగురవేసేందుకు ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లకు ఇవేవీ అడ్డంకి కాలేదు. 71వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా లదాఖ్‌లో ‘వందేమాతరం.. భారత్ మాతా కీ జై’ నినాదాల నడుమ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ట్విట్టర్లో వైరల్‌గా మారింది. సైనికులను కీర్తిస్తూ పలువురు యూజర్లు కామెంట్లు చేశారు. దేశానికి నిజమైన హీరోలు మీరే అంటూ ఒకరు.. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది.. గణతంత్ర వేడుకలు జరుపుతున్న హీరోలు అంటూ ఇంకొకరు అని కొనియాడారు. గణతంత్ర వేడుకల్లో మోదీ ధరించిన తలపాగాలు పరేడ్‌లో ఆకాశ్ క్షిపణి బైక్‌పై సీఆర్పీఎఫ్ మహిళా జవాన్ల విన్యాసం -
ఆర్మీపై శివసేన నేత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: భారత ఆర్మీపై, ఆయుధ సంపత్తిపై శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ సైన్యం మరోసారి దురాగతానికి తెగబడి కాల్పులు జరపగా ఆర్మీ లెఫ్టినెంట్ అధికారి, ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. మరో ముగ్గురు జవాన్లు పాక్ కాల్పుల్లో గాయపడ్డారు. దీనిపై శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో స్పందించారు. పాకిస్తాన్ వద్ద ఆయుధాలున్నాయి. భారత్ వద్ద కూడా ఆయుధాలున్నాయి. అదే పాక్ అయితే ఆ తుపాకులు, ఆయుధాలతో దాడులకు పాల్పడి భారత్ జవాన్లను హత్యచేస్తుంది. భారత్ మాత్రం తమ ఆయుధ సంపత్తిని, ఇతరత్రా సామాగ్రిని కేవలం ప్రదర్శన కోసం ఉంచుతోందని, రాజ్‌పథ్‌లో ప్రశంసలు పొందేందుకు వాటిని ప్రదర్శిస్తారని సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే అధినేతలు, ప్రతినిధులకు భారత ఆర్మీ ఆయుధాలను ప్రదర్శించి ప్రశంసలు పొందడానికే కదా మన తుపాకులు, ఆయుధాలు అని ప్రశ్నించారు. పాక్ దురాగతాలకు పాల్పడిన సందర్భంలో భారత ఆర్మీ సైతం అదే స్థాయిలో దాయాదికి బుద్ధి చెప్పాలని అభిప్రాయపడ్డారు. కాగా, ఆదివారం పూంచ్‌లోని షాపూర్ సెక్టార్లో, రాజౌరీ జిల్లాలోని భీంభేర్ గలీ సెక్టార్లో పాక్ సైనికులు తుపాకులు, మోర్టార్లతో విరుచుకుపడ్డ ఘటనలో నలుగురు అమరులైన విషయం తెలిసిందే. -
జయహో జెండా పండుగ
-
జయహో జెండా పండుగ
న్యూఢిల్లీ: భారత దేశభక్తిని, అస్త్ర శక్తిని ప్రతిబింబించేలా 69వ గణతంత్ర వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా హాజరైన ఆసియాన్ దేశాధినేతల సమక్షంలో భారత సంప్రదాయాలు, సైనిక పాటవ ప్రదర్శనల నడుమ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. రాజ్‌పథ్ రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమానికి వేలమంది ప్రజలు, ప్రముఖులు హాజరయ్యారు. త్రివర్ణపతాక ఆవిష్కరణ అనంతరం భారత త్రివిధ దళాల అధిపతి, రాష్ట్రపతి రామ్‌నాథ్ పరేడ్‌లో సైనిక వందనం స్వీకరించారు. రాష్ట్రపతిగా కోవింద్‌కు ఇదే తొలి గణతంత్ర దినోత్సవ వేడుక. చీఫ్ గెస్ట్లుగా.. ఆసియాన్ దేశాల వ్యూహాత్మక సంబంధాలతో బలమైన కూటమిగా ఎదిగే క్రమంలో భారత్‌లో జరుగుతున్న జాతీయ వేడుకలకు ఈ 10 దేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరవటం ఇదే తొలిసారి. మయన్మార్ కౌన్సెలర్ ఆంగ్‌సాన్ సూచీ, వియత్నాం ప్రధాని ఎన్‌గెయెన్ జువాన్, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటర్టె, థాయలాండ్ ప్రధాని ప్రయుత్ చానోచా, సింగపూర్ చీఫ్ సీన్ లూంగ్, బ్రూనై సుల్తాన్ హాజీ బోల్‌కయా, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో, మలేసియా ప్రధాని నజీబ్ రజాక్, లావోస్ పీఎం థాంగ్లౌన్ సిసౌలిత్, కంబోడియన్ అధ్యక్షుడు హున్సేన్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల ప్రారంభానికి ముందు ప్రధాని.. రక్షణ మంత్రి, త్రివిధ దళాల చీఫ్‌లతో కలిసి ఇండియా గేట్ వద్ద అమర జవాన్ జ్యోతి వద్ద నివాళులర్పించారు. గణతంత్ర వేడుకల్లో.. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, జైట్లీ, జేపీ నడ్డా, రవిశంకర్ ప్రసాద్ సహా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, మాజీ ప్రధాని మన్మోహన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 61 మంది గిరిజన ప్రముఖులు ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. కళ్లన్నీ ఆకాశంలోనే.. పరేడ్ చివర్లో ఎమ్ఐ–17 యుద్ధ విమానాలు, రుద్ర హెలికాప్టర్లు, ఐఏఎఫ్ విమానాలతో వైమానికదళం చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. ఎల్‌హెచ్, ఎంకే–4, డబ్ల్యూఎస్ఐ హెలికాప్టర్లు, సీ–130జే సూపర్ హెర్క్యులస్ యుద్ధ విమానం చేసిన విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. 21 గన్ సెల్యూట్ సంప్రదాయం ప్రకారం త్రివర్ణ పతాకావిష్కరణ తర్వాత జాతీయగీతం ఆలాపనతోపాటు 52 సెకన్లపాటు 21 గన్ సెల్యూట్ నిర్వహించారు. 2281 రెజిమెంట్‌కు చెందిన ఏడు ఫిరంగుల ద్వారా ఈ గన్ సెల్యూట్ నిర్వహించారు. గణతంత్ర దినోత్సవంతోపాటు, ఆగస్టు 15, ఆర్మీడే (జనవరి 15), అమరవీరుల దినం (జనవరి 30)న ఈ రకమైన గన్‌సెల్యూట్ చేస్తారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా 13 రాష్ట్రాలు, పలు మంత్రిత్వ శాఖలు తమ శకటాలను ప్రదర్శించాయి. డీఆర్డీవో సంస్థ.. నిర్భయ్ క్షిపణిని, అశ్విని రాడార్ వ్యవస్థతో కూడిన శకటంతో పరేడ్‌లో పాల్గొంది. ‘జగమంత’ వేడుకలు ఢిల్లీతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. ప్రజలు ప్రాథమిక హక్కులను పొందటంతోపాటు తమ బాధ్యతలు గుర్తెరిగి మసలుకోవాలని ప్రజలకు సూచించారు. రాజస్తాన్‌లోని పోఖ్రాన్లో ఓ భారతీయుడు, ఇద్దరు సౌదీ జాతీయులు శాటిలైట్ ఫోన్లతో సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైనా, రష్యా, యూకే, ఈజిప్ట్, ఇండోనేసియా, సింగపూర్, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల్లోని దౌత్యకార్యాలయాల్లోనూ పతాకావిష్కరణ ఘనంగా జరిగింది. భద్రతను పక్కనపెట్టి.. గణతంత్ర దినోత్సవ సంబరాల అనంతరం ప్రధాని మోదీ భద్రతను పక్కనపెట్టి వేడుకలను చూసేందుకు రాజ్‌పథ్‌కు వచ్చిన ప్రేక్షకులకు బారికేడ్ల వద్దకెళ్లి అభివాదం చేశారు. తలపై కాషాయం, ఎరుపు, ఆకుపచ్చని సంప్రదాయ తలపాగాతో ప్రత్యేకంగా కనిపించిన మోదీ.. తమ వద్దకు వస్తుండటంతో ప్రేక్షకుల్లో హర్షం వ్యక్తమైంది. మోదీ, మోదీ నినాదాలతో వాతావరణాన్ని వారంతా మరింత హుషారుగా మార్చారు. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం అనంతరం కూడా ప్రజల వద్దకెళ్లి వారితో కరచాలనం చేశారు. ఆసియాన్ దేశాల అధినేతలు పాల్గొన్న ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 60వేల మంది ఢిల్లీ పోలీసు, ఆర్మీ బలగాలు, షార్ప్ షూటర్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆకట్టుకున్న పరేడ్ మార్చ్‌పాస్ట్‌లో ఆసియాన్ జెండాతోపాటుగా 10 దేశాల జాతీయజెండాలనూ ప్రదర్శించారు.బీఎస్ఎఫ్ మహిళా సైనికుల ‘సీమా భవానీ’ బృందం చేసిన మోటార్ సైకిల్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత ఆర్మీ యుద్ధ ట్యాంకు టీ–90 (భీష్మ), బ్రహ్మోస్ మిసైల్ వ్యవస్థ, శత్రువుల ఆయుధాలను పసిగట్టే రాడార్, బ్రిడ్జ్ లేయింగ్ ట్యాంక్ టీ–72, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ సహా తదితర భారత మిలటరీ సామర్థ్యాలను పరేడ్‌లో ప్రదర్శించారు. ఆర్మీ అశ్వికదళం, పంజాబ్ రెజిమెంట్, మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ, డోగ్రా రెజిమెంట్, నౌక, వైమానిక దళాలూ మార్చ్ఫాస్ట్ నిర్వహించాయి. ఢిల్లీ, నాగ్‌పూర్‌లోని పాఠశాలల విద్యార్థుల నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. రాష్ట్రపతి ఉద్వేగం ఈ వేడుకల్లో భారత అత్యుత్తమ మిలటరీ సేవా పురస్కారం (శాంతి సమయాల్లో ఇచ్చే) అశోకచక్రను ఐఏఎఫ్ గరుడ్ కమాండో కార్పొరల్ జ్యోతి ప్రకాశ్ నిరాలా (మరణానంతరం)కు అందజేశారు. ఈ అవార్డు ఇస్తున్న సమయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్వేగానికి గురయ్యారు. గతేడాది నవంబర్‌లో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడైన ఎయిర్‌ఫోర్స్ గరుడ్ కమాండో, కార్పొరల్ జ్యోతి ప్రకాశ్ నిరాలా ఈ ఏడాది అశోకచక్ర అవార్డుకు ఎంపికయ్యారు. నిరాలా భార్య సుష్మానంద్, ఆయన తల్లి మాలతీ దేవీ ఈ అవార్డును అందుకున్నారు. అశోక చక్ర అందిస్తున్న సందర్భంగా రాష్ట్రపతి ఉద్వేగానికి గురయ్యారు. తన సీట్లో తిరిగి కూర్చోగానే చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూ కనిపించారు. పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆసియాన్ దేశాల శకటం రాజ్‌పథ్ పరేడ్‌లో పాల్గొన్న సైనిక వాహనాలు నిరాలా కుటుంబానికి అశోకచక్రను ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి కోవింద్ -
రాజ్‌పథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు
-
సత్తా చాటిన త్రివిధ దళాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో 69వ గణతంత్య్ర వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. రాజ్ పథ్ వేదికగా.. ఏషియన్ 10 దేశాల ముఖ్యఅతిథులు వీక్షిస్తుండగా తమ విన్యాసాలను ప్రదర్శించిన త్రివిధ దళాలు ‘భారత్ సత్తా ఇది’ అని చాటి చెప్పాయి. వివిధ రకాల క్షిపణులు, సైనికుల విన్యాసాలను అహుతులు ఆసక్తిగా తిలకరించారు. ముందుగా ఉదయం ట్వీటర్లో దేశ ప్రజలకు గణతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. అమర్ జవాన్ జ్యోతి వద్ద అమర వీరులకు పుష్ఫ గుచ్ఛాలతో నివాళులర్పించారు. ఆయన వెంట రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, త్రివిధ దళాల అధిపతులు ఉన్నారు. అక్కడి నుంచి వారంతా రాజ్‌పథ్‌కు చేరుకున్నారు. ఆసియాన్ కూటమిలో సభ్యదేశాలైన బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, సింగపూర్, వియత్నాం అధినేతలు ఈ వేడుకలకు హాజరుకాగా.. వారిని ప్రధాని మోదీ స్టేజీపైకి సాదరంగా ఆహ్వానించారు. ఆపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ్‌పథ్‌కు చేరుకోగా.. మోదీ ఆయనకు కరచలనంతో స్వాగతం పలికారు. రాష్ట్రపతిగా కోవింద్‌కు ఆయనకు ఇదే తొలి వేడుకలన్న విషయం తెలిసిందే. ఉదయం 10 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. కాగా, దాదాపు 100 అడుగుల పొడవైన వేదికను అతిథుల కోసం ఏర్పాటు చేయగా, చుట్టూ బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్, భద్రత కోసం 60 వేల మంది సిబ్బందిని కేంద్రం ఏర్పాటు చేసింది. ఢిల్లీ పోలీసులతో పాటు బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ సహా వివిధ విభాగాలు భాగస్వామ్యమయ్యాయి. చుట్టుపక్కల భవనాలపై స్నిప్పర్స్ ను ఏర్పాటు చేశారు. ఇండియా సార్వభౌమత్వాన్ని ప్రదర్శిస్తూ త్రివిధ దళాల విన్యాసాలు కొనసాగాయి. వివిధ శాఖల, రాష్ట్రాల శకలాలు ఆకట్టుకున్నాయి. ఎయిర్ ఫోర్స్ సీ-130 జే సూపర్ హెర్క్యులెస్, సీ-17 గ్లోబ్ మాస్టర్, సుఖోయ్ - 30 ఎంకేఐ ఎస్, లైట్ కాంబాట్ తేజాస్ విమానాలు గాల్లో చేసిన విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. సైన్యానికి చెందిన టీ-90 ట్యాంకులు, బ్రహ్మోస్ మిసైల్స్, ఆకాష్ వెపన్ సిస్టమ్‌లతో పాటు 113 మంది మహిళలతో కూడిన 'సీమా భవానీ' పరేడ్ లో కదులుతున్న వేళ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. బైకులపై జవాన్లు చేసిన విన్యాసాలు కూడా ఆకర్షించాయి. ఈసారి లడ్డూ ఇవ్వలేదు... గణతంత్ర్య దినోత్సవంగా సందర్భంగా పాక్ సైనికులకు భారత సైన్యం స్వీట్లు పంచటం తెలిసిందే. అయితే ఉరి దాడి తర్వాత... మిఠాయిలను పంచకూడదని బీఎస్ఎఫ్ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు లడ్డూ పంచకుండానే వేడుకలు నిర్వహించింది. అయితే బంగ్లా సైనికులతో మాత్రం యథావిధిగా స్వీట్లు పంచుకుని వేడుకలు జరుపుకుంది. -
ఆకర్షించిన శకటాల ప్రదర్శన...
-
రాజ్‌పథ్‌లో మువన్నెల రెపరెపలు!
-
రాజ్‌పథ్‌లో మువన్నెల రెపరెపలు!
ఢిల్లీలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ ఆకట్టుకుంటున్న సైనిక కవాత్తులు న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో మంగళవారం 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.. ఆహూతులతో కలిసి జాతీయగీతాన్ని ఆలపించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హోలాండ్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హోలాండ్ను ఈ వేడుకకు సాదరంగా తోడుకొని వచ్చారు. కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, పెద్దసంఖ్యలో ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నారు. రాజ్‌పథ్ ఆవరణలో కళ్లుచెదిరే రీతిలో గణతంత్ర దినోత్సవం వేడుకలు కొనసాగాయి. మొదట త్రివిధ దళాలు కవాత్తు నిర్వహించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వందనం సమర్పించాయి. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల కుటుంబసభ్యులకు, విశేష సేవలందించిన వీర సైనికులకు రాష్ట్రపతి శౌర్య పతకాలు ప్రదానం చేశారు. మువన్నెల పతాపు రెపరెపల కింద శకటాల కవాత్తు, సైనికుల కళ్లు చెదిరే విన్యాసాలతో కోలాహలంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. సైనిక బలగాలు తమ పాటవాన్ని, శక్తిసామర్థ్యాలను విశేష రీతిలో ప్రదర్శించాయి. మొట్టమొదటిసారిగా ఈసారి విదేశీ సైన్యం కూడా రాజ్‌పథ్ వద్ద కవాతు నిర్వహించింది. ఫ్రాన్స్ సైన్యం తన విన్యాసాలతో ఆకట్టుకుంది. -
యోగావేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
-
యోగా వేడుకలకు సర్వం సిద్ధం
ఢిల్లీలో రాజ్‌పథ్ వద్ద వేలాది చాపలను సిద్ధంచేస్తున్న సిబ్బంది. సియాచిన్ గ్లేసియర్ వద్ద యోగాను అభ్యసిస్తున్న సైనికులు నేడు భారత్ సహా 192 దేశాల్లో యోగా దినోత్సవం * రాజ్‌పథ్‌లో ‘రికార్డు’ ఉత్సవాలు.. పాల్గొననున్న మోదీ, కేజ్రీవాల్ * 37 వేల చాపలు, 2,000 సినిమా స్క్రీన్లతో యోగాసనాలకు ఏర్పాట్లు సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆదివారం జరగనున్న తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాల కోసం భారత్ సిద్ధమైంది. రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ప్రధాని నరేంద్రమోదీ సహా 37 వేల మంది ఆదివారం ఉదయం యోగా చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 192 దేశాల్లోని 251కి పైగా నగరాల్లో యోగా డే నిర్వహించనున్నారు. ఐరాస ప్రధాన కార్యాలయం సహా పలు దేశాల్లో యోగా ఉత్సవాలకు కేంద్ర మంత్రులు సారథ్యం వహించనున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియాగేట్ వరకు రెండున్నర కిలోమీటర్ల మేర గల రాజ్‌పథ్‌లో.. ఉదయం 7 గంటల నుంచి 7:35 గంటల వరకూ యోగా నిర్వహించనున్నారు. రఫీమార్గ్ క్రాసింగ్‌లోని రాజ్‌పథ్ మధ్యలో భారీ వేదిక ఏర్పాటు చేశారు. వేదిక నుంచి ఇండియా గేట్ వరకు కిలోమీటరు పొడవున యోగాసనాల కోసం 37 వేల చాపలు పరిచారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయటం లక్ష్యంగా రాజ్‌పథ్‌లో చేపడుతున్న యోగా ఉత్సవాలకు 152 విదేశీ ఎంబసీలను ఆహ్వానించారు. ఆయుష్ మంత్రిత్వశాఖ సమన్వయం చేస్తున్న ఈ యోగా ఉత్సవాలను ప్రజలు తిలకించేందుకు వీలుగా 2,000 భారీ సినిమా స్క్రీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని పోస్టల్ శాఖ ముద్రించిన పోస్టల్ స్టాంపులను, ఆర్థికశాఖ ముద్రించిన రూ.10, రూ. 100 బిళ్లలను ఆదివారం రాజ్‌పథ్‌లో జరిగే కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ప్రధాని పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, యోగా గురు బాబారాందేవ్ సహా యోగా నిపుణులు ఆసనాలు వేయనున్నారు. సినీ నటులు అమితాబ్ బచ్చన్, అమీర్‌ఖాన్ వంటి ప్రముఖులకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, త్రివిధ దళాల సిబ్బంది, అధికారులు, ఉద్యోగులు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు.. అన్ని వర్గాలకు చెందిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ యోగా ఉత్సవాలను దూరదర్శన్, పీఐబీ వెబ్సైట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఏక కాలంలో..: లక్నో, కోల్‌కతా, పట్నా తదితర నగరాల్లోనూ భారీ స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏక కాలంలో నిర్వహించాలని, జిల్లా, పంచాయతీ రాజధానుల్లోనూ కార్యక్రమాలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకూ సూచించారు. ప్రభుత్వమే కాకుండా పలు సంస్థలు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రామ్‌దేవ్ 1,100 కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే.. యోగా దినోత్సవంలో యోగాసనాలు వేయడానికి చైనా నుంచి దిగుమతి చేసుకున్న యోగా చాపలను వినియోగించడాన్ని కాంగ్రెస్, ఆప్ పార్టీలు విమర్శించాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాలిచ్చే ప్రధాని మోదీ ప్రభుత్వం.. తొలి ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో ‘మేక్ ఇన్ చైనా’కు ప్రాధాన్యమిచ్చిందని ఎద్దేవా చేశాయి. దేశంలో యోగా ఉత్సవాల కోసం సుమారు రూ. 40 కోట్ల వరకు వ్యయం అయినట్టు తెలుస్తోంది. విదేశాల్లో మంత్రుల నేతృత్వం.. ప్రధాని మోదీగత ఏడాది ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రతిపాదనకు 177 దేశాలు ఆమోదం తెలపటంతో.. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐరాస గత ఏడాది డిసెంబర్లో ప్రకటించడం తెలిసిందే. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవాలకు సారథ్యం వహించేందుకు విదే శాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అమెరికా చేరుకున్నారు. ఈ కార్యక్రమం తర్వాత న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో 30,000 మంది యోగా చేస్తారు. ప్రతి ఒక్కరూ భాగం కావాలి ఆదివారం జరగనున్న తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇతరులు కూడా పాల్గొనేలా ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఒక ప్రకటనలో దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యోగాపై సర్కారుది నిస్సిగ్గు దురాక్రమణ: కాంగ్రెస్ ప్రాచీన భారత సంస్కృతిలో భాగమైన యోగా ను దురాక్రమించుకుని.. దానిని ప్రచార కార్యక్రమంగా, ప్రజాసంబంధాల కార్యక్రమంగా వాడుకునేందుకు మోదీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. యోగాతో ఆరోగ్య ప్రయోజనాలు అంటూ ప్రచారం చేస్తున్న కేంద్రం.. ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులను తగ్గించటమే కాక.. 2013-14లో రూ. 1,069 కోట్లుగా ఉన్న యోగా బడ్జెట్ కేటాయింపులను ఈ ఏడాది కేవలం రూ. 318 కోట్లకు తగ్గించటం ఏమిటని ఓ ప్రకటనలో ప్రశ్నించింది. మాజీ ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ యోగా చేస్తున్న ఫొటోతో పాటు.. ఎవరైనా దేనినైనా తాము ఆచరించాకే ఇతరుల నుంచి ఆ ఆచరణను ఆశించాలని చెప్పే గాంధీ సూక్తితో కూడిన గాంధీ ఫొటోను విడుదల చేసింది. -
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి యోగా నాటకం: దిగ్విజయ్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి యోగా కార్యక్రమాల పేరుతో కొత్త నాటకానికి తెర తీశారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కేంద్రం నిర్ణయించడాన్ని బుధవారం ఆయన ట్విటర్లో తప్పుబట్టారు. మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలని చెప్పడం తప్పుకాదని, అయితే దాన్ని ఓ మతపరమైన, రాజకీయపరమైన కార్యక్రమంగా నిర్వహించాలని అనుకోవడం దురదృష్టకరమన్నారు. తానూ 40 ఏళ్లుగా ప్రాణాయామం చేస్తున్నానని పేర్కొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌పథ్‌లో భారీ కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. దేశంలోని అన్ని పాఠశాలల్లో 21న యోగా కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఎంపీఎల్బీ) సహా పలు ముస్లిం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని దిగ్విజయ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
రేపు రాజపథ్ రోడ్డులో ట్రాఫిక్ నిషేధం
న్యూఢిల్లీ: నగరంలోని రాజ్‌పథ్‌కు వెళ్లే ప్రధాన రోడ్లన్నీ శుక్రవారం ఉదయం మూసివేస్తారు. సాధారణ ట్రాఫిక్‌పై నిషేధాజ్ఞలు విధిస్తున్నారు. ఎందుకంటే.. సర్దార్ వల్లభబాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ నుంచి ‘రన్‌ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి రాజ్‌పథ్, రఫీ మార్గాల్లో ఉదయం 5.30 గంటల నుంచి 9.30 వరకు, జనపథ్-మాన్సింగ్ మార్గాల్లో 7.00 గంటల నుంచి 9.30 వరకు జనరల్ ట్రాఫిక్ నిషేధం ఉంటుందని స్పెషల్ కమిషనర్(ట్రాఫిక్) ముక్తేశ్ చందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మంది కార్లు, బస్సుల్లో పాల్గొంటారని పోలీసులు తెలిపారు. వీరితోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు పాల్గొంటారని చెప్పారు. ఆయా రోడ్లపై వాహనాల నిషేధాజ్ఞలను పాటించాలని వాహనదారులను కోరారు. ఈ అసౌకర్యాన్ని మన్నించాలని కోరారు. -
రేపు ప్రపంచ కేన్సర్ దినం అవగాహనే అసలు మందు!
న్యూఢిల్లీ: కేన్సర్... ఈ పేరు వింటేనే గుండెల్ల్లో రైళ్లు పరుగెడుతాయి. అదే మన సొంతవారికెవరికైనా కేన్సర్ ఉందని తెలిస్తే.. మన గుండె ఆగినంత పనవుతుంది. రోగితోపాటు అతని కుంటుంబం మొత్తం ఇక తమ జీవితం ముగిసిపోయిందన్న భావనలోకి వెళ్లిపోతుంది. ఇలాంటివారికి సంఘీభావం పలికేందుకు, వారిలో ధైర్యాన్ని నూరిపోసేందుకు వేలాదిమంది యువతీయువకులు, నగర ప్రముఖులు సామాజిక కార్యకర్తలు, క్రీడాకారులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రాజ్‌పథ్‌కు వచ్చారు. కేన్సర్ రోగులకు సంఘీభావంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తామూ మద్దతు పలుకుతున్నామని చెప్పారు. ఏడో వార్షిక వాకథాన్‌లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని భారత మహిళా క్రికెట్ జట్లు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా జెండా ఊపి ప్రారంభించారు. కేన్సపోర్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం గురించి ఆ సంస్థ వ్యవస్థాపకులు హర్మలా గుప్తా మాట్లాడుతూ... ‘పశ్చిమ దేశాలతో పోలిస్తే కేన్సర్‌పై భారతీయులకు అవగాహన చాలా తక్కువ. కేన్సర్ ఒకసారి సోకిందంటే అది ఇక వ్యాప్తి చెందుతూనే ఉంటుందని, చివరికి మరణమే శరణ్యమని భావిస్తున్నారు. దాని నుంచి విముక్తి పొందే చికిత్స గురించి అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేస్తున్న చికిత్స చాలామంది రోగులకు అందుబాటులో ఉండడం లేదు. అందుబాటులో ఉన్న చికిత్స గురించి రోగులకు సమాచారం లేదు. అందుకే కేన్సపోర్ట్ సంస్థ కేన్సర్ బాధితులకు అండగా నిలుస్తుంది. ఈ విషయాన్ని చాటిచెప్పేందుకే ఏడో వార్షిక వాకథాన్‌లో కేన్సర్ రోగులకు సంఘీభావం ప్రకటిస్తున్నామ’న్నారు. రోగి ఇంటికే కేన్సర్ చికిత్స కేన్సర్ సోకిన వ్యక్తి మానసికంగా కుంగిపోతాడు. అతని కుటుంబం కూడా అచేతనంగా మారుతుంది. ఇటువంటి సమయంలో రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లడం, చికిత్స చేయించడం వంటివి చాలా కష్టంగా మారతాయి. ముప్పై సంవత్సరాల చిత్రా షా కూడా తన భర్తకు ఊపిరితిత్తుల కేన్సర్ సోకిందని తెలియగానే మానసికంగా బలహీనురాలైపోయింది. అప్పటికే ఇద్దరు పిల్లలు. వారిని పెంచే బాధ్యత, భర్తకు చికిత్స చేయించే బాధ్యతలన్నీ ఆమె భుజాలపైనే పడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో ఆమెకు కొండంత బలాన్నిచ్చే ఓ వార్త తెలిసింది. అదే రోగి వద్దకే కేన్సర్ చికిత్స. అదీ.. అందుబాటు ధరలో. హెడ్ మెడికల్ సర్వీస్, హెల్త్ కేర్ ఎట్ హోం సంస్థ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆ సంస్థ ప్రతినిధి గౌరవ్ ఠుక్రాల్ ఈ విషయమై మాట్లాడుతూ... ‘అసలే కేన్సర్ సోకిందనే బాధలో ఉన్న కుటుంబం ఆస్పత్రుల వెంట తిరిగి అనవసర ఖర్చులను భరించాల్సి వస్తుంది. దీంతో వారికి వైద్యం కోసం అయ్యే ఖర్చుతోపాటు ఇతర ఖర్చులు కలిసి తడిసి మోపెడవుతాయి. సమయం లేనివారికైతే చికి త్స చేయించడం ఓ నరకమే. ఇటువంటి వారికోసమే మా సంస్థ ‘రోగుల వద్దకే చికిత్స’ కార్యక్రమంతో ముందుకొచ్చింది. ఇందులోభాగంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండే అన్ని సదుపాయాలను కల్పిస్తాం. కేన్సర్ రోగులకు ఇంజెక్షన్ ద్వారా అందించే కీమోథెరపీని శిక్షణ పొందిన నర్సుల సాయంతో ఇంటివద్దనే అందించడం ద్వారా రోగికి అనవసరమైన వ్యయప్రయాసలను తగ్గించవచ్చు. అంతేకాక ప్రయాణ ఖర్చులు కూడా చాలావరకు తగ్గుతాయి. బయట ఆస్పత్రుల్లో అందిస్తున్నదానికంటే తక్కువ ధరకే ఈ సేవలను అందిస్తామ’ని చెప్పారు. -
త్రివర్ణ శోభ
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని రాజ్‌పథ్‌ను మూడు రంగుల జెండాలతో అలంకరిం చారు. ఎటు చూసినా మువ్వన్నెల రెపరెపలతో రైసినాహిల్స్ ప్రాంతం శోభాయమానంగా మారిపోయింది. రాష్ట్రపతిభవన్, నార్త్‌బ్లాక్, సౌత్‌బ్లాక్,పార్లమెంట్ భవనాలను విద్యుత్‌దీపాలతో అలంకరిం చారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎలాంటి అపశ్రుతి చోటు చేసుకోకుండా సాయుధ బలగాలు డేగకళ్లతో పహారా కాస్తున్నాయి. ఇండియాగేట్తోసహా రాజ్‌పథ్ మార్గానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన గ్యాలరీలను అనువణుకు తనికీ చేశారు. రాత్రి వేళ ల్లో తిరిగే వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేసిన తర్వా తే వదులుతున్నారు. ఇప్పటికే సెంట్రల్ ఢిల్లీతోపాటు పలు ప్రాంతాలను పోలీసు బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు.. గణతంత్య్ర దినోత్సవంగా సందర్భంగా నిర్వహించనున్న వేడుకలతో పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు ట్రాఫిక్ జాయింట్ సీపీ అనిల్‌శుక్లా తెలిపారు. ఆదివారం ఉదయం 9.50 గంటలకు పరేడ్ విజయ్‌చౌక్ నుంచి రాజ్‌పథ్, ఇండియాగేట్, తిలక్‌మార్గ్, బహదూర్ షాజాఫర్ మార్గ్, నేతాజీ సుభాష్ మార్గ్ మీదుగా ఎర్రకోట చేరుకుంటుందన్నారు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిషేధం... కౌటిల్యమార్గ్, ఔరంగజేబ్ రోడ్ క్యూ పాయింట్, హుమాయున్రోడ్, సుబ్రహ్మణ్య భారతిమార్గ్, మధురరోడ్, భగవాన్దాస్రోడ్, ఫిరోజ్‌షారోడ్, విన్డ్సర్ప్లేస్, అశోకరోడ్, బాబా కడక్‌సింగ్ మార్గ్, మధర్ థెరిస్సా క్రిసెంట్, సర్దార్‌పటేల్ మార్గ్‌ల్లో ట్రాఫిక్ నిషేధం అమలులో ఉంటుంది. కేవ లం అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే ఉదయం ఆరుగంటల నుంచి 12.30 వరకు అనుమతిస్తారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కి వెళ్లేందుకు.. సౌత్ ఢిల్లీ నుంచి: మధర్‌థెరిస్సా క్రిసెంట్-ఆర్ఎమ్ఎల్ హాస్పిటల్-బాబా కడక్‌సింగ్ మార్గ్-ఔటర్ సర్కిల్ కన్నాట్‌ప్లేస్-చెమ్స్‌ఫోర్డ్ రోడ్ మీదుగా పహార్గంజ్వైపు, అజ్మీర్గేట్వైపునకు మింట్‌రోడ్, భావ్బుతిమార్గ్ మీదుగా వెళ్లొచ్చు. నార్త్ ఢిల్లీ నుంచి: జండేవాలన్ వయా రాణిఝాన్సీ రోడ్డు,డీబీరోడ్,షీలాసినిమారోడ్, పహార్గంజ్ మీదుగా వెళ్లొచ్చు. ఈస్ట్ ఢిల్లీ నుంచి: బోలీవర్డ్రోడ్ వయా ఐఎస్బీటీ బ్రిడ్జి మీదుగా రాణిఝాన్సీ రోడ్-జండేవాలన్,డీబీ.గుప్తా రోడ్-షీలాసినిమా రోడ్-పహార్గంజ్ మీదుగా వెళ్లొచ్చు. పాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌కి వెళ్లేందుకు... సౌత్ ఢిల్లీ నుంచి: రింగ్‌రోడ్-ఆశ్రమ్‌చౌక్-సరాయికలేఖాన్-రింగ్‌రోడ్-రాజ్‌ఘాట్-రింగ్‌రోడ్-చౌక్యమునా బజార్-ఎస్పీ.ముఖర్జీ మార్గ్-చత్తర్రైల్-కరాయిబ్రిడ్జిమీదుగా వెళ్లొచ్చు. నార్త్ ఢిల్లీ నుంచి: బోలీవర్డ్ రోడ్-మోరీగేట్,పుల్డుఫ్రిన్-ఎస్పీ.ముఖర్జీమార్గ్ మీదుగా వెళ్లొచ్చు. -
రిపబ్లిక్ డే డ్రెస్ రిహార్సల్స్ ఆద్యంతం అహ్లాదభరితం
రాజ్‌పథ్‌లో గురువారం నిర్వహించిన ఫుల్‌డ్రెస్ రిహార్సల్స్ మనదేశ సైనిక, సాంస్కృతిక, చారిత్రక విశిష్టతలను మరోసారి కళ్లకు కట్టాయి. పారామిలిటరీ బలగాలు, ఎన్సీసీ కేడెట్లు మిలిటరీ బ్యాండ్ల సంగీతం హోరులో నిర్వహించిన కవాతులు ఆద్యంతం అలరించాయి. వివిధ రాష్ట్రాలు, మంత్రిత్వశాఖలు ప్రదర్శించిన శకటాలు ‘మినీ భారత్’ను రాజ్‌పథ్‌కు మోసుకొచ్చాయి. అయితే ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ శకటాలు ఈసారి ప్రదర్శనలో కనిపించలేదు. న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనల కోసం సిద్ధమవడానికి రాజ్‌పథ్‌లో గురువారం నిర్వహించిన ఫుల్‌డ్రెస్ రిహార్సల్స్ మనదేశ సాంస్కృతిక, సైనిక పాటవాన్ని కళ్లకు కట్టాయి. అంతేకాదు వీక్షకులకు ఆద్యంతం వినోదం, విజ్ఞానాన్ని పంచాయి. ఈ ఉత్సవాల కారణంగా ఇండియాగేటు పరిసర ప్రాంతాల్లో మాత్రం ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. రైజినాహిల్స్ నుంచి ఎర్రకోట వరకు సైనిక, పోలీసు దళాలు నిర్వహించిన కవాతులను వీక్షించడానికి రాజ్‌పథ్‌కు వేలాది మంది చేరుకున్నారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీకి చెందిన మువ్వన్నెల హెలికాప్టర్లు మనదేశ జెండాలను ప్రదర్శిస్తూ గాలిలో చేసిన విన్యాసాలతో ఈ కార్యక్రమం ప్రారంభమయింది. మొట్టమొదటి స్వదేశీ తయారీ తేలికపాటి యుద్ధవిమానం తేస్, టి-90 భీష్మా ట్యాంక్, ఎంబీటీ అర్జున్ ఎంకే 2 వంటివి మన సైన్యం సత్తాను చాటాయి. వీటికితోడు అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు భారత్‌లో సాంకేతిక విజ్ఞాన పురోగతిని కళ్లకుకట్టాయి. పారామిలిటరీ బలగాలు, ఎన్సీసీ కేడెట్లు మిలిటరీ బ్యాండ్ల సంగీతం హోరులో నిర్వహించిన కవాతులు ఆద్యంతం అలరించాయి. అందంగా అలంకరించిన ఒంటెలపై సైనికబ్యాండ్లు, సైనికులు నిర్వహించిన కవాతులు అదనపు ఆకర్షణగా నిలిచాయి. వివిధ రాష్ట్రాలు, మంత్రిత్వశాఖలు ప్రదర్శించిన శకటాలు ‘మినీ భారత్’ను రాజ్‌పథ్‌కు మోసుకొచ్చాయి. 13 రాష్ట్రాలు, ఐదు మంత్రిత్వశాఖలు, విభాగాల శకటాలు భారతదేశ ఆర్థికసామర్థ్యం, ఘన సాంస్కృతిక వారసత్వం, విజ్ఞానాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్భుతంగా ప్రదర్శించాయి. ఈ ప్రదర్శనలో తొలుత ఉత్తరప్రదేశ్ శకటం ‘సుభా ఏ బనారస్’ను ప్రదర్శించారు. బనారస్ చారిత్రక నేపథ్యం, సాంస్కృతిక సంపదను ఇది అద్భుతంగా చూపించగలిగింది. జమ్మూకాశ్మీర్‌లోని పీర్పంజల్లో నిర్మించిన అతిపొడవైన సొరంగం నమూనాను రైల్వేశాఖ తొలిసారిగా ప్రదర్శించింది. రైల్వేశాఖ గత ఏడాదే ఈ మార్గాన్ని ప్రారంభించింది. భూవిజ్ఞానాలు, వ్యవసాయ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖలు కూడా తమ తమ శకటాలను ప్రదర్శనలో ఉంచాయి. మహారాష్ట్ర, తమిళనాడు, అసోం, అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మేఘాలయ, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, చండీగఢ్ కేంద్రపాలిత ప్రభుత్వ శ కటాలు కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నాయి. ఈ ఏడాది సాహసబాలల పురస్కారాలకు ఎంపికైన 25 మంది విద్యార్థులు ఈ ఫుల్‌డ్రెస్ రిహార్సల్స్‌లో పాలుపంచుకున్నారు. నాగాలాండ్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ నృత్యాలతో కొందరు విద్యార్థులు సత్తా చాటారు. సశస్త్రసీమాబల్ అధికారులు చేసిన సాహస విన్యాసాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. మోటారుబైకులు, నిచ్చెనలతో చేసిన విన్యాసాలు, మానవ పిరమిడ్లు, బొకేలు, ‘చక్రరూపం’ తదితర విన్యాసాలు ‘వాహ్వా’ అనిపించాయి. వాయుసేన విమానాలు ప్రదర్శించిన విన్యాసాలతో ఈ కార్యక్రమం ముగిసింది. త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ఉద్యోగులు కూడా ఫుల్‌డ్రెస్ రిహార్సల్స్‌కు హాజరయ్యారు. -
జన్‌పథ్‌లో జనం లేరు.. రాజ్‌పథ్‌లో రాజు లేడు: నరేంద్రమోడీ
సాక్షి, హైదరాబాద్: ‘‘గుజరాత్ విజయరహస్యం ఏంటని నన్ను చాలామంది ప్రశ్నిస్తుంటారు. దానికి నా జ వాబు.. నేనూ పనిచేస్తాను. నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీమ్ పనిచేస్తుంది. ఆ టీమ్‌కు అన్ని అధికారాలు, నిధులు ఇచ్చాను. దాంతో వారు ఏ సమస్యపైనా స్పందించి పరిష్కరించగలరు. కేంద్రంలోని పాలకులు ఈ పని చేయటంలేదు. ఢిల్లీలో ఉన్న రెండు ముఖ్య ప్రాంతాలు.. జన్‌పథ్, రాజ్‌పథ్. జన్‌పథ్‌లో జనంలేరు, రాజ్‌పథ్‌లో రాజు లేడు. కానీ పాలన సాగుతోంది’’ అని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్రమోడీ ఎద్దేవా చేశారు. ఆదివారం ఒక రోజు పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన మోడీని రాష్ట్రానికి చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కలిశారు. మోడీ బస చేసిన హోటల్‌కు వెళ్లి కొందరు ఒక్కొక్కరుగా, మరికొందరు బృందాలుగా ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన వారిని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. కేంద్ర ప్రభుత ్వం దేశం కోసం ప్రజోపయోగ పనులేవీ చేయటం లేదని, అది దుర్మార్గమని మండిపడ్డారు. ‘‘మన సమస్యలకు పరిష్కారాలున్నాయి. కానీ ఆ పరిష్కారాలు చూపేవారు లేక మన దేశం ఈ విధంగా ఉంది. దేశం కోసం పనిచేయాలనే తపన ఉన్న వారు కాంగ్రెస్‌లో కరువయ్యారు. దేశానికి ఉపయోగపడే ఏ పని చేసేందుకైనా నేను సిద్ధం. అందుకు కార్యకర్త హోదాలో పనిచేశాను. ఇప్పుడు చేస్తున్నాను. భవిష్యత్తులోనూ చేస్తాను’’ అని పేర్కొన్నారు. ప్రపంచ అభివృద్ధి కంటే భారత్ పదేళ్లు వెనకబడి ఉందని, ఆ లోటును పూడ్చుకునేందుకు శ్రమించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. యువతను దేశ భవిష్యత్తులో భాగంగా చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం మోడీ ఎల్బీ స్టేడియంకు బయల్దేరి వెళ్లారు. విమానాశ్రయంలో ఘన స్వాగతం... బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నవభారత యువభేరి’ సభలో పాల్గొనటానికి మోడీ ఆదివారం హైదరాబాద్ వచ్చారు. ఉదయం 10.10 నిమిషాలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి బీజీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా 11 గంటలకు హోటల్‌కు చేరుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3.45 గంటల వరకు రాష్ట్రానికి చెందిన సినీ, పారిశ్రామిక తదితర రంగాల ప్రముఖులు హోటల్లో మోడీని కలిశారు. ‘రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ’ గుజరాత్‌లోనూ అమలు చేస్తాం! ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం విద్యార్థులకు వరమని మోడీ పేర్కొన్నారని, గుజరాత్లో ఆ తరహా పథకం అమలుకు కృషిచేస్తామని చెప్పారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. హోటల్లో మోడీని కలిసిన కృష్ణయ్య వెనకబడిన వర్గాల సమస్యలు పరిష్కరించేందుకు సహకారం అందించాలని కోరారు. బీసీలకు అన్యాయం జరిగిందన్న మోడీ.. వారి సమస్యలు, పరిష్కారాలను తమ పార్టీ ఎజెండాలో చే రుస్తామని హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. ఆరోగ్యశ్రీ వంటి పథకాన్ని గుజరాత్‌లోనూ అమలుచేస్తామని మోడీ పేర్కొన్నట్లు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వాలని, వికలాంగ, వృద్ధాప్య, వితంతు పెన్షన్ల మొత్తాలను పెంచాలనే డిమాండ్లను ప్రస్తావిస్తూ ఆయన మోడీని కలిశారు. లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు టి.బెల్లయ్య నాయక్ మోడీని కలిసి గిరిజనులు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి బీజేపీ తరఫున కృషిచేయాలని విన్నవించారు. మోడీ సభ సైడ్‌లైట్స్. - నవభారత్ నిర్మాణ్‌లో భాగంగా బీజేపీ నిర్వహించ తలపెట్టిన 100 సభల్లో హైదరాబాద్ సభే మొదటిది. - నిర్ణీత సమయానికి దాదాపు గంట ఆలస్యంగా మోడీ 4 గంటలకు స్టేడియంలోకి ప్రవేశించారు. ఆ వెంటనే స్టేడియం మొత్తం మోడీ.. మోడీ అనే నినాదాలు, కేరింతలతో మారుమోగింది. - మోడీ తన ప్రసంగం ప్రారంభంలో మూడు నిమిషాల పాటు తెలుగులో మాట్లాడారు. - సభా ప్రాంగణంలోని ఫ్లెక్సీల్లో మోడీ మినహా బీజేపీ నేతలెవరి చిత్రాలూ లేవు. - సభకు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా యువత హాజరయ్యారు. - మోడీ ఎక్కువ భాగం కాంగ్రెస్‌ను దునుమాడడంతో పాటు దేశభక్తి అంశాలపై మాట్లాడారు. - ‘మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను.. మీరో విషయం ఆలోచించారా..?’ అంటూ సభకు హాజరైనవారి దృష్టిని ప్రసంగంపైనే కేంద్రీకరించేలా చూశారు. - ‘సభకు హాజరైన యువతకు మైదానంలో చోటు చాలలేదు..కానీ, నా గుండెల్లో మీ అందరికీ చోటుంది’ అంటూ యువతను ఆకట్టుకున్నారు. - తమ దృష్టిలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఉందంటూ... అందరికీ దగ్గరయ్యే యత్నం చేశారు. - గుజరాతీయులకు, తెలుగువారికి దగ్గరి సంబంధం ఉందంటూ.. తనను తాను ఇక్కడివారికి దగ్గరివాడిగా చూపే ప్రయత్నం చేశారు. - ముఖ్యంగా ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. కాంగ్రెస్‌ను ఖతం చేయాలనే ఆయన కలను నిజం చేయాలని పిలుపునిచ్చారు. - {పసంగంలో పదే పదే ‘నవ జవానో (యువతీయువకులారా)’ అంటూ యువతనే ప్రధానంగా సంబోధించారు. - మోడీ ప్రసంగం దాదాపు 45 నిమిషాల పాటు.. ఒక్కో విషయాన్ని ఒకటికి రెండు సార్లు స్పష్టంగా ప్రస్తావిస్తూ సాగింది. - {పసంగం ఆఖరులో.. ‘మనం సాధించగలం (యస్ వి కెన్), మనం చేయగలం (యస్ వి డూ) అని... భారత్ మాతాకీ జై, వందేమాతరం అని సభికులతో నినాదాలు చేయించారు. - ముఖ్యంగా అందరితో.. ‘జై ఆంధ్రా.. - జై తెలంగాణ.. జై సీమాంధ్ర’ అనిపించారు. - సభికులందరికీ రెండు చేతులు ఊపుతూ ధన్యవాదాలు తెలిపారు. రెండు చేతులతో విక్టరీని ప్రదర్శిస్తూ.. వేదిక దిగి వెళ్లిపోయారు.