
శివసేన నేత సంజయ్ రౌత్
సాక్షి, ముంబై: భారత ఆర్మీపై, ఆయుధ సంపత్తిపై శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ సైన్యం మరోసారి దురాగతానికి తెగబడి కాల్పులు జరపగా ఆర్మీ లెఫ్టినెంట్ అధికారి, ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. మరో ముగ్గురు జవాన్లు పాక్ కాల్పుల్లో గాయపడ్డారు. దీనిపై శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో స్పందించారు. పాకిస్తాన్ వద్ద ఆయుధాలున్నాయి. భారత్ వద్ద కూడా ఆయుధాలున్నాయి. అదే పాక్ అయితే ఆ తుపాకులు, ఆయుధాలతో దాడులకు పాల్పడి భారత్ జవాన్లను హత్యచేస్తుంది. భారత్ మాత్రం తమ ఆయుధ సంపత్తిని, ఇతరత్రా సామాగ్రిని కేవలం ప్రదర్శన కోసం ఉంచుతోందని, రాజ్‌పథ్‌లో ప్రశంసలు పొందేందుకు వాటిని ప్రదర్శిస్తారని సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలకు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే అధినేతలు, ప్రతినిధులకు భారత ఆర్మీ ఆయుధాలను ప్రదర్శించి ప్రశంసలు పొందడానికే కదా మన తుపాకులు, ఆయుధాలు అని ప్రశ్నించారు. పాక్ దురాగతాలకు పాల్పడిన సందర్భంలో భారత ఆర్మీ సైతం అదే స్థాయిలో దాయాదికి బుద్ధి చెప్పాలని అభిప్రాయపడ్డారు. కాగా, ఆదివారం పూంచ్‌లోని షాపూర్ సెక్టార్‌లో, రాజౌరీ జిల్లాలోని భీంభేర్ గలీ సెక్టార్‌లో పాక్ సైనికులు తుపాకులు, మోర్టార్లతో విరుచుకుపడ్డ ఘటనలో నలుగురు అమరులైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment