
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి యోగా నాటకం: దిగ్విజయ్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి యోగా కార్యక్రమాల పేరుతో కొత్త నాటకానికి తెర తీశారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కేంద్రం నిర్ణయించడాన్ని బుధవారం ఆయన ట్విటర్‌లో తప్పుబట్టారు. మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలని చెప్పడం తప్పుకాదని, అయితే దాన్ని ఓ మతపరమైన, రాజకీయపరమైన కార్యక్రమంగా నిర్వహించాలని అనుకోవడం దురదృష్టకరమన్నారు. తానూ 40 ఏళ్లుగా ప్రాణాయామం చేస్తున్నానని పేర్కొన్నారు.
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌పథ్‌లో భారీ కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. దేశంలోని అన్ని పాఠశాలల్లో 21న యోగా కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఎంపీఎల్‌బీ) సహా పలు ముస్లిం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని దిగ్విజయ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.