రాజ్‌పథ్ వద్ద సోమవారం పహారా కాస్తున్న పారామిలటరీ సైనికుడు
న్యూఢిల్లీ: ఒకవైపు గణతంత్ర దినోత్సవాలు, మరోవైపు మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కిసాన్ గణతంత్ర పరేడ్.. దేశ రాజధాని ఢిల్లీలో ఒకేరోజు రెండు ముఖ్యమైన కార్యక్రమాలు. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు జరిగే రాజ్‌పథ్‌లో, రైతులు ట్రాక్టర్ పరేడ్ తలపెట్టిన మార్గాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్‌పథ్‌లో అధికారిక గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాతే ట్రాక్టర్ పరేడ్ ప్రారంభిస్తామని, సెంట్రల్ ఢిల్లీలోకి ప్రవేశించబోమని రైతు సంఘాల నాయకులు సోమవారం ప్రకటించారు. ఈ పరేడ్‌లో దాదాపు 2 లక్షల ట్రాక్టర్లు, రైతుల శకటాలు పాల్గొంటాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ సరిహద్దులోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ పాయింట్ల నుంచి పరేడ్ మొదలవుతుందన్నారు.
► రిపబ్లిక్ డే వేడుకలు జరిగే రాజ్‌పథ్‌లో 6,000 మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
► పరేడ్‌లో పాల్గొనే రైతులు 24 గంటలకు సరిపడా ఆహార పదార్థాలను వెంట తెచ్చుకోవాలని రైతు నాయకులు సూచించారు.
► ఆయుధాలు, మద్యం, అనుచిత బ్యానర్లు ప్రదర్శించవద్దని చెప్పారు.
► సింఘు బోర్డర్ నుంచి ప్రారంభమయ్యే ట్రాక్టర్ పరేడ్ 63 కిలోమీటర్లు, టిక్రీ బోర్డర్ నుంచి మొదలయ్యే పరేడ్ 62 కిలోమీటర్లు, ఘాజీపూర్ బోర్డర్ నుంచి నిర్వహించే పరేడ్ 68 కిలోమీటర్లు కొనసాగుతుంది.
రైతులకు బెస్ట్ ఆఫర్ ఇచ్చాం
మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలును ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరాలపాటు నిలిపివేస్తామంటూ ప్రభుత్వం తరపున రైతులకు ‘బెస్ట్ ఆఫర్’ ఇచ్చామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సోమవారం చెప్పారు. ఈ ఆఫర్‌ను రైత సంఘాల నేతలు త్వరలోనే పునఃపరిశీలించి, వారి నిర్ణయాన్ని తమకు తెలియజేస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. రైతు సంఘాలు సానుకూలంగా స్పందిస్తే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు.
కొత్త సాగు చట్టాలను రైతులే రద్దు చేస్తారు
ముంబై: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో తన మెజార్టీని అడ్డం పెట్టుకొని రాజ్యాంగాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొస్తోందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత,శరద్ పవార్ మండిపడ్డారు. ఆయా చట్టాలను ప్రభుత్వం రద్దు చేయకపోతే ప్రజలే ఆ పని పూర్తిచేస్తారని, అధికార పార్టీని కూల్చేస్తారని హెచ్చరించారు. అక్కడ కేవలం పంజాబ్ రైతులే ఉన్నారని కొందరు అంటున్నారని, పంజాబ్ ఏమైనా పాకిస్తానా? అని ప్రశ్నించారు.
రాజ్యాంగాన్ని అవమానించారు
పార్లమెంట్‌లో సమగ్రమైన చర్చ జరగకుండానే వ్యవసాయ బిల్లులను ఆమోదించారని శరద్ పవార్ తప్పుపట్టారు. పూర్తిస్థాయిలో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇలా చేయడం రాజ్యాంగాన్ని అవమా నించడమే అవుతుందన్నారు.
బడ్జెట్ రోజు పాదయాత్ర
న్యూఢిల్లీ: మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటంలో ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ వరకూ పాదయాత్ర చేపట్టనున్నట్లు రైతు సంఘాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాల రద్దు దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి పార్లమెంట్ దాకా పాదయాత్ర చేపట్టనున్నట్లు క్రాంతికారి కిసాన్ యూనియన్ నేత దర్శన్ పాల్ సోమవారం చెప్పారు. కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేయాలన్న తమ డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment