జన్‌పథ్‌లో జనం లేరు.. రాజ్‌పథ్‌లో రాజు లేడు: నరేంద్రమోడీ
సాక్షి, హైదరాబాద్: ‘‘గుజరాత్ విజయరహస్యం ఏంటని నన్ను చాలామంది ప్రశ్నిస్తుంటారు. దానికి నా జ వాబు.. నేనూ పనిచేస్తాను. నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీమ్ పనిచేస్తుంది. ఆ టీమ్‌కు అన్ని అధికారాలు, నిధులు ఇచ్చాను. దాంతో వారు ఏ సమస్యపైనా స్పందించి పరిష్కరించగలరు. కేంద్రంలోని పాలకులు ఈ పని చేయటంలేదు. ఢిల్లీలో ఉన్న రెండు ముఖ్య ప్రాంతాలు.. జన్‌పథ్, రాజ్‌పథ్. జన్‌పథ్‌లో జనంలేరు, రాజ్‌పథ్‌లో రాజు లేడు. కానీ పాలన సాగుతోంది’’ అని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్రమోడీ ఎద్దేవా చేశారు. ఆదివారం ఒక రోజు పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన మోడీని రాష్ట్రానికి చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కలిశారు. మోడీ బస చేసిన హోటల్‌కు వెళ్లి కొందరు ఒక్కొక్కరుగా, మరికొందరు బృందాలుగా ఆయనతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా తనను కలిసిన వారిని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. కేంద్ర ప్రభుత ్వం దేశం కోసం ప్రజోపయోగ పనులేవీ చేయటం లేదని, అది దుర్మార్గమని మండిపడ్డారు. ‘‘మన సమస్యలకు పరిష్కారాలున్నాయి. కానీ ఆ పరిష్కారాలు చూపేవారు లేక మన దేశం ఈ విధంగా ఉంది. దేశం కోసం పనిచేయాలనే తపన ఉన్న వారు కాంగ్రెస్‌లో కరువయ్యారు. దేశానికి ఉపయోగపడే ఏ పని చేసేందుకైనా నేను సిద్ధం. అందుకు కార్యకర్త హోదాలో పనిచేశాను. ఇప్పుడు చేస్తున్నాను. భవిష్యత్తులోనూ చేస్తాను’’ అని పేర్కొన్నారు. ప్రపంచ అభివృద్ధి కంటే భారత్ పదేళ్లు వెనకబడి ఉందని, ఆ లోటును పూడ్చుకునేందుకు శ్రమించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. యువతను దేశ భవిష్యత్తులో భాగంగా చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం మోడీ ఎల్‌బీ స్టేడియంకు బయల్దేరి వెళ్లారు.
విమానాశ్రయంలో ఘన స్వాగతం...
బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నవభారత యువభేరి’ సభలో పాల్గొనటానికి మోడీ ఆదివారం హైదరాబాద్ వచ్చారు. ఉదయం 10.10 నిమిషాలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి బీజీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా 11 గంటలకు హోటల్‌కు చేరుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3.45 గంటల వరకు రాష్ట్రానికి చెందిన సినీ, పారిశ్రామిక తదితర రంగాల ప్రముఖులు హోటల్‌లో మోడీని కలిశారు.
‘రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ’ గుజరాత్‌లోనూ అమలు చేస్తాం!
ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం విద్యార్థులకు వరమని మోడీ పేర్కొన్నారని, గుజరాత్‌లో ఆ తరహా పథకం అమలుకు కృషిచేస్తామని చెప్పారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. హోటల్‌లో మోడీని కలిసిన కృష్ణయ్య వెనకబడిన వర్గాల సమస్యలు పరిష్కరించేందుకు సహకారం అందించాలని కోరారు. బీసీలకు అన్యాయం జరిగిందన్న మోడీ.. వారి సమస్యలు, పరిష్కారాలను తమ పార్టీ ఎజెండాలో చే రుస్తామని హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. ఆరోగ్యశ్రీ వంటి పథకాన్ని గుజరాత్‌లోనూ అమలుచేస్తామని మోడీ పేర్కొన్నట్లు ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వాలని, వికలాంగ, వృద్ధాప్య, వితంతు పెన్షన్ల మొత్తాలను పెంచాలనే డిమాండ్లను ప్రస్తావిస్తూ ఆయన మోడీని కలిశారు. లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు టి.బెల్లయ్య నాయక్ మోడీని కలిసి గిరిజనులు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి బీజేపీ తరఫున కృషిచేయాలని విన్నవించారు.
మోడీ సభ సైడ్‌లైట్స్.
- నవభారత్ నిర్మాణ్‌లో భాగంగా బీజేపీ నిర్వహించ తలపెట్టిన 100 సభల్లో హైదరాబాద్ సభే మొదటిది.
- నిర్ణీత సమయానికి దాదాపు గంట ఆలస్యంగా మోడీ 4 గంటలకు స్టేడియంలోకి ప్రవేశించారు. ఆ వెంటనే స్టేడియం మొత్తం మోడీ.. మోడీ అనే నినాదాలు, కేరింతలతో మారుమోగింది.
- మోడీ తన ప్రసంగం ప్రారంభంలో మూడు నిమిషాల పాటు తెలుగులో మాట్లాడారు.
- సభా ప్రాంగణంలోని ఫ్లెక్సీల్లో మోడీ మినహా బీజేపీ నేతలెవరి చిత్రాలూ లేవు.
- సభకు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా యువత హాజరయ్యారు.
- మోడీ ఎక్కువ భాగం కాంగ్రెస్‌ను దునుమాడడంతో పాటు దేశభక్తి అంశాలపై మాట్లాడారు.
- ‘మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను.. మీరో విషయం ఆలోచించారా..?’ అంటూ సభకు హాజరైనవారి దృష్టిని ప్రసంగంపైనే కేంద్రీకరించేలా చూశారు.
- ‘సభకు హాజరైన యువతకు మైదానంలో చోటు చాలలేదు..కానీ, నా గుండెల్లో మీ అందరికీ చోటుంది’ అంటూ యువతను ఆకట్టుకున్నారు.
- తమ దృష్టిలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఉందంటూ... అందరికీ దగ్గరయ్యే యత్నం చేశారు.
- గుజరాతీయులకు, తెలుగువారికి దగ్గరి సంబంధం ఉందంటూ.. తనను తాను ఇక్కడివారికి దగ్గరివాడిగా చూపే ప్రయత్నం చేశారు.
- ముఖ్యంగా ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. కాంగ్రెస్‌ను ఖతం చేయాలనే ఆయన కలను నిజం చేయాలని పిలుపునిచ్చారు.
- {పసంగంలో పదే పదే ‘నవ జవానో (యువతీయువకులారా)’ అంటూ యువతనే ప్రధానంగా సంబోధించారు.
- మోడీ ప్రసంగం దాదాపు 45 నిమిషాల పాటు.. ఒక్కో విషయాన్ని ఒకటికి రెండు సార్లు స్పష్టంగా ప్రస్తావిస్తూ సాగింది.
- {పసంగం ఆఖరులో.. ‘మనం సాధించగలం (యస్ వి కెన్), మనం చేయగలం (యస్ వి డూ) అని... భారత్ మాతాకీ జై, వందేమాతరం అని సభికులతో నినాదాలు చేయించారు.
- ముఖ్యంగా అందరితో.. ‘జై ఆంధ్రా..
- జై తెలంగాణ.. జై సీమాంధ్ర’ అనిపించారు.
- సభికులందరికీ రెండు చేతులు ఊపుతూ ధన్యవాదాలు తెలిపారు. రెండు చేతులతో విక్టరీని ప్రదర్శిస్తూ.. వేదిక దిగి వెళ్లిపోయారు.