రేపు ప్రపంచ కేన్సర్ దినం అవగాహనే అసలు మందు!
Published Mon, Feb 3 2014 5:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM
న్యూఢిల్లీ: కేన్సర్... ఈ పేరు వింటేనే గుండెల్ల్లో రైళ్లు పరుగెడుతాయి. అదే మన సొంతవారికెవరికైనా కేన్సర్ ఉందని తెలిస్తే.. మన గుండె ఆగినంత పనవుతుంది. రోగితోపాటు అతని కుంటుంబం మొత్తం ఇక తమ జీవితం ముగిసిపోయిందన్న భావనలోకి వెళ్లిపోతుంది. ఇలాంటివారికి సంఘీభావం పలికేందుకు, వారిలో ధైర్యాన్ని నూరిపోసేందుకు వేలాదిమంది యువతీయువకులు, నగర ప్రముఖులు సామాజిక కార్యకర్తలు, క్రీడాకారులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రాజ్‌పథ్‌కు వచ్చారు. కేన్సర్ రోగులకు సంఘీభావంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తామూ మద్దతు పలుకుతున్నామని చెప్పారు.
ఏడో వార్షిక వాకథాన్‌లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని భారత మహిళా క్రికెట్ జట్లు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా జెండా ఊపి ప్రారంభించారు. కేన్‌సపోర్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం గురించి ఆ సంస్థ వ్యవస్థాపకులు హర్మలా గుప్తా మాట్లాడుతూ... ‘పశ్చిమ దేశాలతో పోలిస్తే కేన్సర్‌పై భారతీయులకు అవగాహన చాలా తక్కువ. కేన్సర్ ఒకసారి సోకిందంటే అది ఇక వ్యాప్తి చెందుతూనే ఉంటుందని, చివరికి మరణమే శరణ్యమని భావిస్తున్నారు. దాని నుంచి విముక్తి పొందే చికిత్స గురించి అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేస్తున్న చికిత్స చాలామంది రోగులకు అందుబాటులో ఉండడం లేదు. అందుబాటులో ఉన్న చికిత్స గురించి రోగులకు సమాచారం లేదు. అందుకే కేన్‌సపోర్ట్ సంస్థ కేన్సర్ బాధితులకు అండగా నిలుస్తుంది. ఈ విషయాన్ని చాటిచెప్పేందుకే ఏడో వార్షిక వాకథాన్‌లో కేన్సర్ రోగులకు సంఘీభావం ప్రకటిస్తున్నామ’న్నారు.
రోగి ఇంటికే కేన్సర్ చికిత్స
కేన్సర్ సోకిన వ్యక్తి మానసికంగా కుంగిపోతాడు. అతని కుటుంబం కూడా అచేతనంగా మారుతుంది. ఇటువంటి సమయంలో రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లడం, చికిత్స చేయించడం వంటివి చాలా కష్టంగా మారతాయి. ముప్పై సంవత్సరాల చిత్రా షా కూడా తన భర్తకు ఊపిరితిత్తుల కేన్సర్ సోకిందని తెలియగానే మానసికంగా బలహీనురాలైపోయింది. అప్పటికే ఇద్దరు పిల్లలు. వారిని పెంచే బాధ్యత, భర్తకు చికిత్స చేయించే బాధ్యతలన్నీ ఆమె భుజాలపైనే పడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో ఆమెకు కొండంత బలాన్నిచ్చే ఓ వార్త తెలిసింది. అదే రోగి వద్దకే కేన్సర్ చికిత్స. అదీ.. అందుబాటు ధరలో. హెడ్ మెడికల్ సర్వీస్, హెల్త్ కేర్ ఎట్ హోం సంస్థ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆ సంస్థ ప్రతినిధి గౌరవ్ ఠుక్రాల్ ఈ విషయమై మాట్లాడుతూ... ‘అసలే కేన్సర్ సోకిందనే బాధలో ఉన్న కుటుంబం ఆస్పత్రుల వెంట తిరిగి అనవసర ఖర్చులను భరించాల్సి వస్తుంది.
దీంతో వారికి వైద్యం కోసం అయ్యే ఖర్చుతోపాటు ఇతర ఖర్చులు కలిసి తడిసి మోపెడవుతాయి. సమయం లేనివారికైతే చికి త్స చేయించడం ఓ నరకమే. ఇటువంటి వారికోసమే మా సంస్థ ‘రోగుల వద్దకే చికిత్స’ కార్యక్రమంతో ముందుకొచ్చింది. ఇందులోభాగంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉండే అన్ని సదుపాయాలను కల్పిస్తాం. కేన్సర్ రోగులకు ఇంజెక్షన్ ద్వారా అందించే కీమోథెరపీని శిక్షణ పొందిన నర్సుల సాయంతో ఇంటివద్దనే అందించడం ద్వారా రోగికి అనవసరమైన వ్యయప్రయాసలను తగ్గించవచ్చు. అంతేకాక ప్రయాణ ఖర్చులు కూడా చాలావరకు తగ్గుతాయి. బయట ఆస్పత్రుల్లో అందిస్తున్నదానికంటే తక్కువ ధరకే ఈ సేవలను అందిస్తామ’ని చెప్పారు.
Advertisement
Advertisement