సాక్షి, న్యూఢిల్లీ: భారత 73వ గణతంత్ర వేడుకలు ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో బుధవారం అట్టహాసంగా జరిగాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాలు 21 తుపాకులతో సైనిక వందనం సమర్పించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులు, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో వీక్షకుల సంఖ్యను కుదించారు. 2500 మందిని రాజ్‌పథ్‌లో పరేడ్ చూసేందుకు అనుమతించారు. 15ఏళ్లలోపువారికి అనుమతి లేదు. కరోనా నేపథ్యంలో ఈసారి గణతంత్ర వేడుకలకు విదేశీ అతిథులను ఆహ్వానించలేదు.
ఆకట్టుకున్న సైనిక పరేడ్
రాజ్‌పథ్‌లో సైనిక పరేడ్ అదరహో అనిపించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్న వేళ.. భారత సైనిక సామర్థ్యాన్ని, దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా రిపబ్లిక్ డే పరేడ్ సాగింది. 16 కవాతు విభాగాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. సైన్యం, నౌకాదళం, వాయుసేన, కేంద్ర పారామిలటరీ దళాలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ సిబ్బంది మార్చ్ ఫాస్ట్‌లో పాల్గొన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్బంగా.. భారతీయ వాయుసేన 75 యుద్ధవిమానాలతో గ్రాండ్ ప్లైపాస్ట్ నిర్వహించింది. రఫేల్, సుఖోయ్, జాగ్వర్, అపాచీ వంటి ఫైటర్ జెట్స్ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment