మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నత స్థాయి కమిటీ ఊహించినట్టుగానే జమిలి ఎన్నికలకు జైకొట్టింది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో, ఆ తర్వాత వంద రోజుల్లో మునిసిపాలిటీలు, పంచాయతీల ఎన్నికలు జరపాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేస్తూ, సదరు కమిటీ గత వారం నివేదిక సమర్పించింది. సిఫార్సులు ఊహించినవే అయినప్పటికీ, నిర్ణీత కాలవ్యవధి ఏమీ లేకపోయినా 2024 సార్వత్రిక ఎన్నికలకు కొద్దిగా ముందుగా కమిటీ ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ (ఓఎన్‌ఓఈ) ప్రతిపాదనను తెర మీదకు తేవడం అనుమానాలు రేపింది.
రాజ్యాంగ సవరణ, ఒకే ఎన్నికల జాబితా – ఎన్నికల గుర్తింపు కార్డు, త్రిశంకు సభ – అవిశ్వాస తీర్మాన పరిస్థితులు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు – పోలింగ్ సిబ్బంది – పోలీసు బలగాల ఏర్పాట్ల లాంటి పలు అంశాలపై కమిటీ కీలక సిఫార్సులు ఇప్పుడు చర్చ రేపుతున్నాయి. మన ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలనూ, సమాఖ్య చట్రాన్నే మార్చేసే సత్తా ఈ ప్రతిపాదనకు ఉండడమే అందుకు కారణం.
కోవింద్ సారథ్యంలో 2023 సెప్టెంబర్‌లో ఈ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి కమిటీలో భాగం కావడానికి నిరాకరించారు. మొత్తం 8 మంది సభ్యుల కమిటీ 65 సమావేశాలు జరిపి, అనుకున్నట్టుగానే ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. జాతీయ, రాష్ట్ర పార్టీల అభిప్రాయాల్ని తెలుసుకున్నామనీ, న్యాయకోవిదుల మొదలు ఆర్థికవేత్తల దాకా పలువురి సూచనలు కోరామనీ కమిటీ తెలిపింది. అయితే, నివేదికను గమనిస్తే అవసరమైన లోతైన అధ్యయనం, విశ్లేషణ సాగినట్టు తోచదు.
అన్ని వర్గాలనూ ఈ అధ్యయన ప్రక్రియలో భాగం చేసినట్టు అనిపించదు. తూతూ మంత్రపు తతంగం చివరకు 21 సంపుటాల్లో, 18,626 పేజీల్లో, మొత్తం 11 అధ్యాయాలు, అనేక అనుబంధాల బృహన్నివేదిక రూపం మాత్రం సంతరించుకుంది. రాష్ట్రపతికి మార్చి 14న కమిటీ తన నివేదికను అందించడంతో ప్రధాన ఘట్టం ముగిసింది. త్వర లోనే లా కమిషన్ సైతం తన నివేదికను ఇవ్వనుంది. ఇక, వచ్చే 2029 ఎన్నికల్లోగా దాన్ని ఎలా ఆచ రణలోకి తేవాలన్నది కేంద్రం చేతిలో ఉంది. కమిటీ ఏకగ్రీవ సిఫార్సు గనక అది ముగిసిన కథ అన కుండా, వ్యతిరేకిస్తున్న వారి సముచితమైన భయాందోళనల్ని విని, సమాధానపరచడం అవసరం.
నిజానికి, ఒకేసారి లోక్‌సభ, శాసనసభలకు ఎన్నికలు జరగడం కనివిని ఎరుగనిదేమీ కాదు. చట్టం ఏమీ లేకపోయినా స్వతంత్ర భారతావనిలో ఎన్నికలు మొదలయ్యాక తొలి రోజుల్లో ఏకకాలంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. అయితే, అయిదేళ్ళ కాలవ్యవధి పూర్తికాక ముందే రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసే ధోరణి మొదలయ్యాక, 1967 తర్వాత నుంచి ఈ ఏకకాల విధానానికి తెర పడింది. తరువాత కూడా మధ్య మధ్యలో ఈ జమిలి ఎన్నికల ఆలోచన తొంగిచూసినా, వడివడిగా అడుగులు పడింది మాత్రం ఇప్పుడే.
మోదీ సారథ్యంలోని బీజేపీ ఆది నుంచి జమిలి ఎన్నికల నిర్వహణ జపం చేస్తోంది. అందుకు తగ్గట్టే ఇప్పుడు కోవింద్ కమిటీ జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసింది. జమిలి ఎన్నికలను 15 పార్టీలు వ్యతిరేకించాయని కమిటీ పేర్కొంది కానీ, వ్యతిరేకిస్తున్నవారిని ఒప్పించడానికీ, సద్విమర్శలను తీసుకొని సరిదిద్దుకోవడానికీ చేసిందేమిటో తెలియదు. అలాగే, ఒకే దశలో ఎన్నికలు చేయలేక 7 విడతల్లో, 40 రోజులపైగా ఎన్నికలు జరుపుతున్న పాలకులు ఒకేసారి ఎన్నికలు ఎలా చేయగలరన్నదీ సందేహమే!
ఒకరకంగా, ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ వల్ల అటు ప్రభుత్వానికీ, ఇటు పార్టీలకూ ఎన్నికల ఖర్చు తగ్గుతుందనే మాట నిజమే. అలాగే, కాస్తంత వ్యవధి తేడాతో మునిసిపల్, పంచాయతీ సహా అన్ని ఎన్నికలూ ఒకేసారి జరగడం వల్ల పాలనకు తరచూ అంతరాయాలు ఏర్పడవు. అయితే, ఈ విధానం మన సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందనేదీ అంతే వాస్తవం. ఇక, ఈ పద్ధతిలో రాష్ట్ర అసెంబ్లీలకు నిర్ణీత కాలవ్యవధి కన్నా ముందే మంగళం పాడి, ఆనక ప్రతి ప్రభుత్వానికీ నిర్ణీత వ్యవధిని నిర్ణయించడం ప్రజాస్వామ్య సిద్ధాంతాలకే విరుద్ధం.
ఒకవేళ గనక ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అర్ధంతరంగా కూలిపోతే, ఆ తర్వాత ఎన్నికైన ప్రభుత్వం ఆ వర్తమాన లోక్‌సభా కాలం ఉన్నంత వరకే అధికారంలో కొనసాగాలనడం మరో తిరకాసు. అన్నిటి కన్నా పెద్ద భయం మరొకటుంది. ఏకకాలంలో కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల వల్ల ప్రాంతీయ, స్థానిక అంశాలను మింగేసి, జాతీయ అంశాలే పైకొచ్చే ప్రమాదం ఉంది. ఎన్నికల వ్యూహంలో, వ్యయంలో జాతీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి పార్టీలు దీటుగా నిలబడడమూ కష్టమే. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా చిన్న పార్టీలు కనిపించకుండా పోతాయని సమాజ్‌వాదీ పార్టీ లాంటివి బాహాటంగానే చెబుతున్నాయి.
నిజానికి, ఏకకాలపు ఎన్నికల వల్ల ఓటర్లలో 77 శాతం మంది కేంద్రంలో, రాష్ట్రంలో – రెండు చోట్లా ఒకే పార్టీకి ఓటేస్తారని 2015 నాటి ఓ సర్వే తేల్చింది. రెండు ఎన్నికల మధ్య ఆరు నెలల విరామం ఉంటే, 61 శాతమే అలా ఓటేస్తారట. అంటే ఒక రకంగా ఈ జమిలి ఎన్నిక కేంద్రంలో చక్రం తిప్పుతున్న పార్టీలకే వాటంగా మారవచ్చు. అసలు ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అనే ఈ ఆలోచన వెనుక అసలు మతలబు... దేశంలో అధ్యక్ష తరహా పాలన తీసుకు రావాలన్న బీజేపీ ఆలోచన అని మరికొందరి వాదన.
అందుకు రాజ్యాంగ సవరణలు సహా అనేకం అవసరం. దానికి తగ్గట్టే దీర్ఘకాలిక వ్యూహంతో బీజేపీ 400 పైచిలుకు సీట్లతో సంపూర్ణ మెజారిటీని కోరుతోందని విశ్లేషణ. అవతలి వారివి ‘అనవసర భయాందోళనలు’ అని కొట్టిపారేస్తే సరిపోదు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొనే ముందు మరింత విస్తృత స్థాయి సంప్రతింపులు జరపడం అవసరం. అంతేకానీ, డబ్బు ఆదా పేరిట ప్రజాస్వామ్య స్ఫూర్తినీ, సమాఖ్య స్వభావాన్నీ నీరు గార్చడం సమర్థనీయం కానే కాదు.
ఇది ఏకగ్రీవ సి‘ఫార్సు’
Published Thu, Mar 21 2024 12:13 AM | Last Updated on Thu, Mar 21 2024 12:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment