న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాసంలో జమిలీ ఎన్నికలపై జరుగుతున్న తొలి సమావేశం సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, న్యాయశాఖ కార్యదర్శి ఇతర నేతలు హాజరయ్యారు.
'వన్ నేషన్ వన్ ఎలెక్షన్'పై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు మొదటిసరి అధికారికంగా సమావేశమయ్యింది. ఈ హైలెవెల్ కమిటీ సమావేశంలో ఏడు కీలక అంశాలపై చర్చించి సిఫారసులు చేయనుంది.
రాజ్యాంగ సవరణలు: ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. అందుకు ఏయే రాజ్యాంగ అధికారణల సవరణలు చెయ్యాలో, ఏయే చట్టాల సవరణ చెయ్యాలో కమిటీ అధ్యయనం చేస్తుంది.
రాష్ట్రాల అనుమతి: ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించడానికి ఏవైనా రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తే వాటి సవరణకు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరా? లేక కేంద్రమే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళవచ్చా అన్నదానిపై కూడా స్పష్టతనివ్వాలి.
సంకీర్ణాలైతే : ఇక ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను కూడా అధ్యయనం చేసి హంగ్ అసెంబ్లీ, అవిశ్వాస తీర్మానం, ఫిరాయింపుల సమయంలో ఏం చేయాలనే దానిపై కూడా ఈ కమిటీ సూచనలు తెలియజేయాలి.
సాధ్యం కాకపోతే: ఒకేసారి దేశమంతా ఎన్నికలు సాధ్యం కాని పక్షంలో, విడతలవారీగా ఎన్నికలను జరిపి సమ్మిళితం చేసే అవకాశం ఉందా లేదా అన్నదానిపై కమిటీ పూర్తి వివరాలను తెలియజేయాలి.
భవిష్యత్తు : ఒకసారి పరిస్థితులు అనుకూలించి ఒకేసారి ఎన్నికల వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత, మళ్లీ ఇది దెబ్బ తినకుండా తదనంతరం కూడా కొనసాగడానికి అవసరమైన చర్యలపై కూడా సిఫారసులు చెయ్యాలి.
సిబ్బంది: ఒకేసారి ఎన్నికలకు ఈవీఎంలు, వివి ప్యాట్ల అవసరం ఎంత? వాటితో పాటు మానవ వనరుల అవసరమెంతో కూడా స్పష్టమైన నివేదిక సమర్పించాలి.
ఒక్కటే ఓటర్ కార్డు: లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఒకటే ఓటరు జాబితా ఉండేలా చర్యలు తీసుకునే అంశమై ఎటువంటి కార్యాచరణను సిద్ధం చేసుకోవాలో తెలియజేయాలి.
ఇది కూడా చదవండి: ఇండియా కంటే 'భారత్' మేలు: లాలూ ప్రసాద్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment