Ramnath Kovind
-
శరవేగంగా ‘జమిలి’ అడుగులు! బిల్లు ఆమోదం పొందాలంటే..
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని.. అందుకోసం ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ను తీసుకురావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర కేబినెట్ ఇవాళ న్యూఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశం ముందుకు జమిలి ఎన్నికల బిల్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ శీతాకాల సమావేశాల్లోనే గనుక చర్చకు వస్తే.. అసలు ఓటింగ్ ఎలా జరుగుతుంది? జమిలి ఎన్నికల బిల్లును ఆమోదింపజేసుకోగలిగే ‘బలం’ ఎన్డీయేకు ఉందా?..రాబోయే సాధారణ ఎన్నికలు.. జమిలిగానే జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకోసం వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. కానీ, పార్లమెంటులో రాజ్యాంగ సవరణలకు కూటమికి అవసరమైన సంఖ్యా బలం లేదు. అయినా ఈ బిల్లు ఆమోదించుకునేందుకు ముందుకెళ్లాలని మోదీ భావిస్తున్నారు.ముందుగా పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెడతారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దానిని రిఫర్ చేసే అవకాశం ఉండొచ్చు. అవసరం అనుకుంటే జేపీసీ.. వివిధ పార్టీలతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టొచ్చు.మెజారిటీ ఎంత ఉండాలంటే.. ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానం కోసం రూపొందించిన బిల్లు.. రాజ్యాంగ సవరణలతో ముడిపడిన అంశం. కాబట్టి.. ఉభయ సభల్లోనూ మూడింట రెండో వంతు మెజారిటీ కచ్చితంగా అవసరం.👉రాజ్యసభలో 245 మంది సభ్యులంటే.. కనీసం 164 ఓట్లు పడాలి👉అలాగే.. లోక్‌సభలో 545 మంది సభ్యులుంటే.. 364 ఓట్లు రావాలి.ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం సాధారణ మెజారిటీతోనే నడుస్తోంది. కాబట్టి.. ఓటింగ్ సమయానికల్లా మూడింట రెండో వంతు మెజారిటీ మద్దతు సంపాదించుకోవాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలకు మొత్తం 47 పార్టీల్లో 32 పార్టీలు జై కొట్టిన సంగతి తెలిసిందే. అంటే 13 రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి.ఒకే దేశం.. ఒకే ఎన్నికకు సంబంధించిన ముసాయిదా బిల్లును రూపకల్పన చేసే పని.. కేంద్ర న్యాయ శాఖ చూసుకుంటోంది. ఇక ఈ బిల్లు బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశం ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ అది కుదరకుంటే.. వచ్చే బుధవారం జరగబోయే కేబినెట్ సమావేశానికి ముందైనా రావొచ్చు. సంబంధిత ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం గనుక పొందితే.. పార్లమెంటు ముందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు రానుంది.ప్రస్తుత లోక్‌సభ గడువు 2029 దాకా ఉంది. కానీ, ఈ మధ్యలోనే దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది.వచ్చే ఏడాది అంటే 2025లో.. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2026లో..అసోం(పూర్వపు అస్సాం)పశ్చిమ బెంగాల్పుదుచ్చేరితమిళనాడుకేరళ2027లో..గోవాఉత్తరాఖండ్పంజాబ్మణిపూర్ఉత్తర ప్రదేశ్హిమాచల్ ప్రదేశ్గుజరాత్ఈ స్టేట్స్ ఎన్నికల టైంలోనే.. జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ భావిస్తోంది. 2028లో..త్రిపురమేఘాలయానాగాలాండ్కర్ణాటకమిజోరాంఛత్తీస్గఢ్మధ్యప్రదేశ్రాజస్థాన్తెలంగాణ2029లో..అరుణాచల్ ప్రదేశ్సిక్కింఆంధ్రప్రదేశ్ఒడిషాజమ్ము కశ్మీర్హర్యానాజార్ఖండ్మహారాష్ట్రకోవింద్ కమిటీ సిఫార్సులుజమిలి ఎన్నికల కోసం.. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొన్ని నెలల పాటు చర్చలు, సూచనలు, సలహాలు తీసుకుని ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికకు గతంలోనే కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయం విదితమే. కోవింద్ నివేదిక ఆధారంగా.. అందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర న్యాయ శాఖ రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ముసాయిదా బిల్లును కేబినెట్ భేటీలో ఓకే చేసి .. ఆపై బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి.. ఆమోదం కల్పించాలని మోదీ సర్కార్ యోచిస్తోంది.ఇప్పుడు కాకుంటే..జమిలి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బిల్లు రూపొందినట్లు బీజేపీ వర్గాల పేర్కొంటున్నాయి. ఈ బిల్లును ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఆ తర్వాత ఈ జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ సమావేశాల్లో వీలు కాని పక్షంలో వచ్చే సమావేశాల్లో అయినా.. దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. -
ఇది ఏకగ్రీవ సి‘ఫార్సు’
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నత స్థాయి కమిటీ ఊహించినట్టుగానే జమిలి ఎన్నికలకు జైకొట్టింది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో, ఆ తర్వాత వంద రోజుల్లో మునిసిపాలిటీలు, పంచాయతీల ఎన్నికలు జరపాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేస్తూ, సదరు కమిటీ గత వారం నివేదిక సమర్పించింది. సిఫార్సులు ఊహించినవే అయినప్పటికీ, నిర్ణీత కాలవ్యవధి ఏమీ లేకపోయినా 2024 సార్వత్రిక ఎన్నికలకు కొద్దిగా ముందుగా కమిటీ ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ (ఓఎన్ఓఈ) ప్రతిపాదనను తెర మీదకు తేవడం అనుమానాలు రేపింది. రాజ్యాంగ సవరణ, ఒకే ఎన్నికల జాబితా – ఎన్నికల గుర్తింపు కార్డు, త్రిశంకు సభ – అవిశ్వాస తీర్మాన పరిస్థితులు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు – పోలింగ్ సిబ్బంది – పోలీసు బలగాల ఏర్పాట్ల లాంటి పలు అంశాలపై కమిటీ కీలక సిఫార్సులు ఇప్పుడు చర్చ రేపుతున్నాయి. మన ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలనూ, సమాఖ్య చట్రాన్నే మార్చేసే సత్తా ఈ ప్రతిపాదనకు ఉండడమే అందుకు కారణం. కోవింద్ సారథ్యంలో 2023 సెప్టెంబర్‌లో ఈ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి కమిటీలో భాగం కావడానికి నిరాకరించారు. మొత్తం 8 మంది సభ్యుల కమిటీ 65 సమావేశాలు జరిపి, అనుకున్నట్టుగానే ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. జాతీయ, రాష్ట్ర పార్టీల అభిప్రాయాల్ని తెలుసుకున్నామనీ, న్యాయకోవిదుల మొదలు ఆర్థికవేత్తల దాకా పలువురి సూచనలు కోరామనీ కమిటీ తెలిపింది. అయితే, నివేదికను గమనిస్తే అవసరమైన లోతైన అధ్యయనం, విశ్లేషణ సాగినట్టు తోచదు. అన్ని వర్గాలనూ ఈ అధ్యయన ప్రక్రియలో భాగం చేసినట్టు అనిపించదు. తూతూ మంత్రపు తతంగం చివరకు 21 సంపుటాల్లో, 18,626 పేజీల్లో, మొత్తం 11 అధ్యాయాలు, అనేక అనుబంధాల బృహన్నివేదిక రూపం మాత్రం సంతరించుకుంది. రాష్ట్రపతికి మార్చి 14న కమిటీ తన నివేదికను అందించడంతో ప్రధాన ఘట్టం ముగిసింది. త్వర లోనే లా కమిషన్ సైతం తన నివేదికను ఇవ్వనుంది. ఇక, వచ్చే 2029 ఎన్నికల్లోగా దాన్ని ఎలా ఆచ రణలోకి తేవాలన్నది కేంద్రం చేతిలో ఉంది. కమిటీ ఏకగ్రీవ సిఫార్సు గనక అది ముగిసిన కథ అన కుండా, వ్యతిరేకిస్తున్న వారి సముచితమైన భయాందోళనల్ని విని, సమాధానపరచడం అవసరం. నిజానికి, ఒకేసారి లోక్‌సభ, శాసనసభలకు ఎన్నికలు జరగడం కనివిని ఎరుగనిదేమీ కాదు. చట్టం ఏమీ లేకపోయినా స్వతంత్ర భారతావనిలో ఎన్నికలు మొదలయ్యాక తొలి రోజుల్లో ఏకకాలంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. అయితే, అయిదేళ్ళ కాలవ్యవధి పూర్తికాక ముందే రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసే ధోరణి మొదలయ్యాక, 1967 తర్వాత నుంచి ఈ ఏకకాల విధానానికి తెర పడింది. తరువాత కూడా మధ్య మధ్యలో ఈ జమిలి ఎన్నికల ఆలోచన తొంగిచూసినా, వడివడిగా అడుగులు పడింది మాత్రం ఇప్పుడే. మోదీ సారథ్యంలోని బీజేపీ ఆది నుంచి జమిలి ఎన్నికల నిర్వహణ జపం చేస్తోంది. అందుకు తగ్గట్టే ఇప్పుడు కోవింద్ కమిటీ జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసింది. జమిలి ఎన్నికలను 15 పార్టీలు వ్యతిరేకించాయని కమిటీ పేర్కొంది కానీ, వ్యతిరేకిస్తున్నవారిని ఒప్పించడానికీ, సద్విమర్శలను తీసుకొని సరిదిద్దుకోవడానికీ చేసిందేమిటో తెలియదు. అలాగే, ఒకే దశలో ఎన్నికలు చేయలేక 7 విడతల్లో, 40 రోజులపైగా ఎన్నికలు జరుపుతున్న పాలకులు ఒకేసారి ఎన్నికలు ఎలా చేయగలరన్నదీ సందేహమే! ఒకరకంగా, ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ వల్ల అటు ప్రభుత్వానికీ, ఇటు పార్టీలకూ ఎన్నికల ఖర్చు తగ్గుతుందనే మాట నిజమే. అలాగే, కాస్తంత వ్యవధి తేడాతో మునిసిపల్, పంచాయతీ సహా అన్ని ఎన్నికలూ ఒకేసారి జరగడం వల్ల పాలనకు తరచూ అంతరాయాలు ఏర్పడవు. అయితే, ఈ విధానం మన సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందనేదీ అంతే వాస్తవం. ఇక, ఈ పద్ధతిలో రాష్ట్ర అసెంబ్లీలకు నిర్ణీత కాలవ్యవధి కన్నా ముందే మంగళం పాడి, ఆనక ప్రతి ప్రభుత్వానికీ నిర్ణీత వ్యవధిని నిర్ణయించడం ప్రజాస్వామ్య సిద్ధాంతాలకే విరుద్ధం. ఒకవేళ గనక ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అర్ధంతరంగా కూలిపోతే, ఆ తర్వాత ఎన్నికైన ప్రభుత్వం ఆ వర్తమాన లోక్‌సభా కాలం ఉన్నంత వరకే అధికారంలో కొనసాగాలనడం మరో తిరకాసు. అన్నిటి కన్నా పెద్ద భయం మరొకటుంది. ఏకకాలంలో కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల వల్ల ప్రాంతీయ, స్థానిక అంశాలను మింగేసి, జాతీయ అంశాలే పైకొచ్చే ప్రమాదం ఉంది. ఎన్నికల వ్యూహంలో, వ్యయంలో జాతీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి పార్టీలు దీటుగా నిలబడడమూ కష్టమే. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా చిన్న పార్టీలు కనిపించకుండా పోతాయని సమాజ్‌వాదీ పార్టీ లాంటివి బాహాటంగానే చెబుతున్నాయి. నిజానికి, ఏకకాలపు ఎన్నికల వల్ల ఓటర్లలో 77 శాతం మంది కేంద్రంలో, రాష్ట్రంలో – రెండు చోట్లా ఒకే పార్టీకి ఓటేస్తారని 2015 నాటి ఓ సర్వే తేల్చింది. రెండు ఎన్నికల మధ్య ఆరు నెలల విరామం ఉంటే, 61 శాతమే అలా ఓటేస్తారట. అంటే ఒక రకంగా ఈ జమిలి ఎన్నిక కేంద్రంలో చక్రం తిప్పుతున్న పార్టీలకే వాటంగా మారవచ్చు. అసలు ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అనే ఈ ఆలోచన వెనుక అసలు మతలబు... దేశంలో అధ్యక్ష తరహా పాలన తీసుకు రావాలన్న బీజేపీ ఆలోచన అని మరికొందరి వాదన. అందుకు రాజ్యాంగ సవరణలు సహా అనేకం అవసరం. దానికి తగ్గట్టే దీర్ఘకాలిక వ్యూహంతో బీజేపీ 400 పైచిలుకు సీట్లతో సంపూర్ణ మెజారిటీని కోరుతోందని విశ్లేషణ. అవతలి వారివి ‘అనవసర భయాందోళనలు’ అని కొట్టిపారేస్తే సరిపోదు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొనే ముందు మరింత విస్తృత స్థాయి సంప్రతింపులు జరపడం అవసరం. అంతేకానీ, డబ్బు ఆదా పేరిట ప్రజాస్వామ్య స్ఫూర్తినీ, సమాఖ్య స్వభావాన్నీ నీరు గార్చడం సమర్థనీయం కానే కాదు. -
ONOE: హంగ్ వస్తే?
ఎప్పటి నుంచో వినిపిస్తున్నట్లుగానే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ జమిలి ఎన్నికలకు జైకొట్టింది. ఈ కమిటీ తను నివేదించిన నివేదికలో పలు అంశాలకు సిఫార్సు చేసింది. హంగ్ వచ్చినా, అవిశ్వాస తీర్మానం వంటి పరిస్థితులు నెలకొన్నా,మళ్ళీ ఎన్నికలు నిర్వహించి కొత్త సభను ఏర్పాటుచేయాలని సూచించింది. ఒకప్పటి ఏకకాల ఎన్నికలను పునరుద్ధరించాలన్నది ప్రధాన సిఫార్సు.దేశానికి స్వాతంత్ర్య లభించిన తొలిరోజుల్లో ఈ వ్యవస్థ ఉండేది. ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంతో పాటు దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడానికి జమిలి ఎన్నికలు ఉపయోగపడతాయని బిజెపి ప్రభుత్వం చెబుతున్న మరోమాట. అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం తొలిదశ కాగా,ఈ ఎన్నికలు జరిగిన 100రోజుల లోపే మున్సిపాలిటీలు, పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించడం రెండో దశలో జరగాల్సిన కార్యాచరణగా ఉండాలని ఈ కమిటీ బలంగా చెబుతోంది. కాకపోతే,దీనికోసం ఆర్టికల్ 325ను సవరించాలి. ఈ సవరణకు రాష్ట్రాల సహకారం అవసరం. రేపటి ఎన్నికల ఫలితాల తర్వాత కానీ,ఆ యా పార్టీల బలాబలాలు తెలియరావు. 'ఒకే దేశం - ఒకే ఎన్నిక' అంశంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆ మధ్య వివరణ ఇచ్చారు.జమిలి ఎన్నికల నిర్వహణలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటుచేసిన అత్యున్నత కమిటీ తుది నివేదిక అందించడానికి నిర్దిష్టమైన గడువేమీలేదని ఆయన స్పష్టం చేశారు. దీనిని బట్టి చూస్తే,ఇప్పుడప్పుడే ఈ వ్యవహారం తేలదని అర్థం చేసుకోవచ్చు.2024 లోపే జమిలి ఎన్నికలు జరుగవచ్చని గతంలో కొందరు జోస్యం చెప్పారు. దానికి తెరపడిందన్నది సత్యం. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సివుంది. ఆ తర్వాత భవిష్యత్తులో జరుగబోయే ఎన్నికల నాటికి ఏదైనా స్పష్టత వస్తుందేమో! చూడాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు,లోక్ సభకు ఏక కాలంలో ఎన్నికలు జరపాలనే నినాదాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదే పదే వినిపిస్తూనే వున్నారు. మొదటి నుంచీ జమిలి ఎన్నికల నిర్వహణపై ఆయన పట్టుదలగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే, ఈ అంశంపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో గత సంవత్సరం సెప్టెంబర్ లో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే దిశగా కమిటీ పనిచేయడం కూడా ప్రారంభించింది. ప్రజల నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానించింది. స్పందన కూడా విశేషంగా వచ్చింది. వేలాదిగా ఈ -మెయిల్స్ వచ్చాయి. కేంద్రం మొన్నామధ్యనే 6 జాతీయ పార్టీలు, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. ఇప్పటివరకూ 35 పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది.జమిలి ఎన్నికలకు సంబంధించి న్యాయ కమిషన్ నుంచి కూడా సలహాలు తీసుకుంది. మరి కొన్ని నెలల వ్యవధిలోనే సాధారణ ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో,ప్రతిపక్ష పార్టీల వ్యాఖ్యల వేడి పెరుగుతోంది. ముఖ్యంగా తృణమూల్ పార్టీ అధినేత్రి,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జమిలి ఎన్నికలకు ససేమిరా అంటున్నారు.అదే విషయాన్ని స్పష్టం చేస్తూ రామ్ నాథ్ కోవింద్ కమిటీకి ఉత్తరం కూడా రాశారు. ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వాన్ని అనుమతించే వ్యవస్థగా మారుతుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలకు తాము దూరంగానే ఉంటామని స్పష్టం చేశారు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలువివిధ కారణాలతో తమ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేకపోవచ్చని గత చరిత్రను గుర్తుచేస్తున్నారు. అనేకసార్లు లోక్ సభ రద్దయిందని, భవిష్యత్తులో కూడా అటువంటి పరిస్థితులు తలెత్తుతాయనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఓటర్ల ఎన్నికల విశ్వాసాన్ని ఉల్లంఘించడం న్యాయమా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు.తృణమూల్ పాటు మిగిలిన ప్రతిపక్ష పార్టీలకు అనేక భయాలు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. 'జమిలి' అంటే రాష్ట్రాలపై దాడి చేయడమేనని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శనా బాణాలు సంధిస్తునే వున్నారు.ఈ ఎన్నికల వల్ల సామాన్యులకు ఒరిగేదేంటని కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు. 2029 నుంచి లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేలా లా కమిషన్ ఓ ఫార్ములా రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లా కమిషన్ ఇంకా తుది నివేదికను తయారుచేయాల్సివుంది. పంచాయతీల నుంచి పార్లమెంట్ దాకా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్నది బిజెపి ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ముఖ్యంగా,దీనివల్ల డబ్బు ఆదా అవుతుందని,ఆ ధనాన్ని అభివృద్ధి పనుల కోసం కేటాయించవచ్చని మోదీ సర్కార్ వాదిస్తోంది.ఈ చర్చ ఈనాటిది కాదు.2019లో రెండవసారి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే అన్ని పార్టీలను ఆహ్వానించి దీనిపై చర్చ కూడా జరిపారు.అప్పట్లో దేశ వ్యాప్తంగా మొత్తం నలబై రాజకీయ పార్టీలను ఈ సమాలోచనకు ఆహ్వానించారు. 21పార్టీలు మాత్రమే హాజరయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు అప్పట్లో జమిలి ఎన్నికలకు జై కొట్టాయి. వచ్చిన మిగిలిన పార్టీలు విభిన్న స్వరాలను వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగానే ఉంది. లోక్ సభకు,శాసనసభలకు సమాంతరంగా ఏకకాలంలో జరపడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ప్రధానంగా ఖర్చు కలిసివస్తుందన్నది వాస్తవమే. వివిధ ఎన్నికల కోడ్ పేరుతో జరగాల్సిన కార్యక్రమాలు జరగకుండా పనులు ఆగిపోవడం, సమయం వృధా అవ్వడం మొదలైన వాటికి అడ్డుగోడ పడుతుంది.తద్వారా పనిరోజులు పెరుగుతాయి. ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. కనీసం రెండు,మూడు రాష్ట్రాలలో ఎన్నికలు తప్పనిసరిగా వస్తుంటాయి.ఈ నేపథ్యంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడే పరిస్థితి వస్తుంది.అదే అన్ని చోట్ల సమాంతర ఎన్నికల విధానం అందుబాటులో ఉంటే,కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మరింతగా పరిపాలనపై దృష్టి సారించే వెసులుబాటు ఉంటుంది. ఐదేళ్లకొకసారి అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల రాజకీయ సుస్థిరత నెలకొనే అవకాశం ఉంది.బిజెపి ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికలపై కొందరు అనేక అనుమానాలు, సందేహాలు,అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ఈ ప్రతిపాదన వల్ల ఎటుచూసినా,కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికే ఎక్కువ మేలుజరుగుతుందనీ,అందుకే, దీనిపై బలంగా ప్రచారం చేస్తోందనే భావంలో ప్రతిపక్షాలు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి సంపూర్ణమైన బలం లేకపోతే, వివిధ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి వస్తుందనీ, దీని వల్ల కేంద్రంలో పాలనకు అవరోధాలు ఏర్పడతాయనే అనుమానాలు బిజెపికి ఉన్నాయి. ప్రస్తుతం,దేశంలో బిజెపి బలంగానే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బలహీనంగా వుంది. ఆంధ్రప్రదేశ్‌లో చాలా బలహీనంగా ఉంది. తమిళనాడు,కేరళలో కూడా అదే తీరు. తెలంగాణలో కాస్త బలిపడినట్లు తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో మాత్రం బిజెపి బలంగా కనిపిస్తోంది. కొన్ని రోజుల వ్యవధిలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుంది. ఫలితాలు ఎలా ఉండబోతాయో ఇంకా స్పష్టత రావాల్సివుంది. జమిలి ఎన్నికలు జరిగితే, ఐదేళ్లపాటు యథేచ్ఛగా తమ విధానాలను అమలుపరిచే స్వేచ్ఛ మరింత బలంగా ఉంటుందనే అభిప్రాయంలోనే బిజెపి మొదటి నుంచి వుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగా ఆధిక్యత వస్తుందనీ,దాని వల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందనే భయంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.దీని వల్ల వారు అనుసరించే విధానాల వల్ల దేశ సమగ్రతకు జమిలి ఎన్నికల వల్ల భంగం కలిగే ప్రమాదం ఉందనీ కొందరు విమర్శిస్తున్నారు.పరోక్షంగా అధ్యక్ష వ్యవస్థకు నిర్మాణం చేపట్టే ప్రతిపాదనలు దీని వెనకాల దాగి ఉన్నాయనే భయాలు కొందరిలో లేకపోలేదు.ఈ భయాలన్నీ ప్రధాన జాతీయ పార్టీ కాంగ్రెస్ కు, ఆ పార్టీని అనుసరిస్తున్న కొన్ని పార్టీలకు ఉన్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే, కొన్ని శాసనసభల పదవీకాలాన్ని కుదించాలి,కొన్నింటిని పొడిగించాలి.ఇటువంటి కీలకమైన చర్యలకు రాజ్యాంగ సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనికి సరిపడా బలం ఉభయ సభల్లోనూ బిజెపికి ఉంది. 'సమాంతర ఎన్నికల'పై, 2018 ఆగస్టులో లా కమీషన్ ఒక ముసాయిదా నివేదిక సమర్పించింది. చట్ట సవరణ జరిగిన తర్వాత, దేశంలోని సగం రాష్ట్రాల శాసనసభలు ఆమోదం తెలపాల్సిన అవసరం కూడా ఉంది.ఇక్కడ కూడా బిజెపికి వాతావరణం అనుకూలంగానే ఉంది.లోక్ సభ, శాసనసభలకు ఎన్నికలు జరిగినప్పుడు కొన్నిచోట్ల క్రాస్ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. శాసనసభకు స్థానిక పార్టీకి వేసి, లోక్ సభకు జాతీయ పార్టీకి వేసే మైండ్ సెట్ కొందరు ఓటర్లలో ఉంటుంది.ఫలితాలు తదనుగుణంగా వచ్చిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎల్లవేళలా,అధికారంలో ఉండే పార్టీలకు సంపూర్ణమైన మెజారిటీ ఉండకపోవచ్చు.సంకీర్ణంగా ప్రభుత్వాలు నడిపే క్రమంలో, విభేదాల వల్ల ప్రభుత్వం పడిపోయినప్పుడు,ఎన్నికలు మళ్ళీ నిర్వహించాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఏమి చేయాలి? అనే సందేహాలు ఉన్నాయి. ఇలా జమిలి ఎన్నికల అంశంలో అనేక అనుకూల, ప్రతికూల అంశాలు,సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటిపై దేశ వ్యాప్తంగా సమగ్రమైన చర్చ జరగాలి. ప్రజామోదాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలి.మంచిచెడు, లాభనష్టాలు బేరీజువేసుకోవాలి. "కేవలం ఇది చర్చించే విషయం కాదని,భారత్ కు ఎంతో అవసరం", అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేకమార్లు ఉద్ఘాటించారు. పార్టీల రాజకీయ స్వార్ధాలు ఎట్లా ఉన్నా,దేశ ప్రజల మంచికి,దేశ ప్రగతికి పట్టంకట్టే విధానాలను స్వాగతించవచ్చు. 2029 లో నైనా జరుగుతాయా? అన్నది వచ్చే ఎన్నికల్లో ఫలితాలను బట్టి కొంత అంచనా వెయ్యవచ్చు.ఈసారి ఎన్నికల్లో 400 స్థానాల లక్ష్యంతో బిజెపి కదనరంగంలో దిగుతోంది.కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా చాలా బలంగా వున్నాయి. ఇండియా కూటమి మధ్య ఐక్యత ఆశించిన స్థాయిలో లేదన్నది నేటి మాట.జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే? ప్రణాళిక చాలా అవసరం.ఈవిఎంలు, వీవీప్యాట్ లు,భద్రతా సిబ్బంది మొదలైన అనేక అంశాలలో పకడ్బందీ ప్రణాళికలు రచించుకోవాల్సివుంటుంది. :::మాశర్మ -
రెండు దశల్లో 'జమిలి' ఎన్నికలు..
-
రెండు దశల్లో జమిలి ఎన్నికలు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు నివేదిక సమర్పించిన రామ్‌నాథ్ కోవింద్ కమిటీ..ఇంకా ఇతర అప్డేట్స్
-
జమిలి ఎన్నికలు: రాష్ట్రపతికి నివేదిక అందించిన కోవింద్ కమిటీ
సాక్షి, ఢిల్లీ: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నేడు నివేదకను అందించింది. ఈ సందర్భంగా పార్లమెంట్, అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు ఒకేసారి జరగాలని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. అయితే, ఈ ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్నిరకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం జరిపింది. జమిలి ఎన్నికలపై 18,629 పేజీల నివేదికను తయారు చేశారు. ఈ నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కోవింద్ సహా కమిటీ సభ్యులు సమర్పించారు. The High-Level Committee on simultaneous elections, chaired by Ram Nath Kovind, Former President of India, met President Murmu at Rashtrapati Bhavan and submitted its report. Union Home Minister Amit Shah was also present. pic.twitter.com/zd6e5TMKng — ANI (@ANI) March 14, 2024 కాగా, దాదాపు 190 రోజుల పాటు జమిలీ ఎన్నికలపై కమిటీ అధ్యయనం జరిపింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించింది. అనంతరం నివేదికను రూపొందించింది. లోక్‌సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్‌ను సవరించాలని కమిటీ తమ నివేదికలో సూచించినట్లు సమాచారం. మూడుస్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. The High-Level Committee on simultaneous elections, chaired by Ram Nath Kovind, Former President of India, has met President Murmu at Rashtrapati Bhavan and submitted its report. The Report comprises of 18,626 pages, and is an outcome of extensive consultations with… — ANI (@ANI) March 14, 2024 ఇదిలా ఉండగా.. ఏకకాల ఎన్నికల జరగాలని కేంద్రంలోని మోదీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే 2023 సెప్టెంబరులో దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను నియమించింది. కేంద్ర మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, కమిటీ సెక్రెటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది. -
‘జమిలి ఎన్నికలు.. అధ్యయన కమిటీని రద్దు చేయండి’
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ రకమైన ఆలోచనే అప్రజాస్వామికమని ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల విధానం.. సమాఖ్య విధానానికి, రాజ్యాంగ మూలాలకు చాలా వ్యతిరేకమని తెలిపారు. ఆయన శుక్రవారం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన జమిలి ఎన్నికల అధ్యయన కమిటికీ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానాన్ని వ్యతిరేకిస్తోందని అన్నారు. అభివృద్ధి చెందుతున్న, బలమైన రాజ్యాంగం ఉన్న భారత దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించటం అంత అవసరం లేదన్నారు. దానిని అమలు చేయటం కోసం ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ రద్దు చేయాలని కమిటీ కార్యదర్శి నితిన్ చంద్ర రాసిన లేఖలో పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగానికి పాల్పడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 18, 2023న ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ.. జమిలి ఎన్నికల విధానంపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు కూడా కోరిన విషయం తెలిసిందే. అయితే వారు ముందుగానే అమలు చేద్దామని నిశ్చయించుకున్న తర్వాత ప్రజల వద్ద నుంచి సంప్రదింపులను కోరటం ఎందుకని ప్రశ్నించారు. అధ్యయన కమిటీని సైతం పక్షపాత ధోరణితో ఏర్పాటు చేశారని అన్నారు. కమిటీ ఏర్పాటు విషయంతో ప్రతిక్షాలు, పలు రాష్ట్రాల అభిప్రాయాల మేరకు ఏర్పాటు చేయలేదని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం ఎన్నికల ఖర్చును ప్రజలు కూడా అంగీకరించడనికి సిద్ధం ఉన్నారని తెలిపారు. ఐదేళ్లలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఎన్నికలకు ఖర్చు చేసే డబ్బు.. చాలా తక్కువని ఆయన లేఖలో గుర్తుచేశారు. చదవండి: లాలూ, తేజస్వీలకు మళ్లీ ఈడీ నోటీసులు -
జమిలి ఎన్నికల ఉన్నతస్థాయి కమిటీ తొలి భేటీ
ఢిల్లీ: జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఏర్పడిన కమిటీ నేడు ఢిల్లీలో తొలిసారి సమావేశం కానుంది. లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నిక జరపడానికి కావాల్సిన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయనున్నారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక నిర్వహించడానికి రాజకీయ పార్టీలు, నిపుణుల సలహాలు స్వీకరించనున్నారు. ఒకే దేశం-ఒకే దేశం ఎన్నిక నిర్వహించడానికి ఏర్పడిన కమిటీ అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్ నిన్న ఒడిశా పర్యటనలో భాగంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 23న జమిలి ఎన్నికల కమిటీ మొదటి భేటీ ఉందని చెప్పారు. జమిలీ ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మందితో కూడిన ఓ కమిటీని ఏర్పరిచింది. ఒకేసారి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సిన సర్దుబాట్లు, సూచనలను కమిటీ పరిశీలించనుంది. రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఇదీ చదవండి: Tender Voting: టెండర్ ఓటింగ్ అంటే ఏమిటి? -
'ఒకే దేశం ఒకే ఎన్నికలు' కమిటీ మొదటి సమావేశానికి డేట్ ఫిక్స్!
న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే ఎన్నికలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన వేసిన కమిటీ తొలిసారి అధికారికంగా సమావేశం కానుంది. ఈ సమావేశానికి సెప్టెంబర్ 23న ముహూర్తం ఖరారైంది. ముహూర్తం ఫిక్స్.. కొద్ది రోజుల క్రితం ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చిన కేంద్రం అనుకుందే తడవు హుటాహుటిన ఈ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాయాలు గురించి అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోని కీలక సభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, న్యాయశాఖ కార్యదర్శి నితిన్ చంద్ర సహా ఇతర ముఖ్య నేతలు సెప్టెంబర్ 6న సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి అధికారిక సమావేశాన్ని సెప్టెంబర్ 23న నిర్వహించాలని నిర్ణయించింది కమిటీ. కమిటీ కర్తవ్యం ఏమిటి? అయితే ఈ నెల 23న జరిగే సమావేశంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విషయమై ప్రాధమిక కార్యాచరణ గురించి చర్చించనున్నారు. దీని కోసం రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా ఒకవేళ ఉంటే వాటి గురించి పూర్తిస్థాయి అధ్యయనం చేసి కేంద్రానికి నివేదించనున్నారు. రాజ్యాంగంతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం లేదా ఇతర చట్టాల సవరణలు చేయాల్సి ఉందా అన్న అంశాలపై కూడా గురించి చర్చించనున్నారు. ఉన్నతస్థాయి కమిటీ.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షత వహించనున్న ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ లోక్‌సభ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, మాజీ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్, మాజీ లోక్‌సభ సెక్రెటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి సభ్యులుగా ఉన్నారు. కేంద్ర న్యాయ శాఖా మంత్రి అర్జున్ మేఘవాల్ ప్రత్యేక ఆహ్వానితులుగా సమావేశాలకు హాజరు కానుండగా న్యాయ శాఖ కార్యదర్శి నితిన్ చంద్ర ఈ ప్యానెల్‌కు సెక్రెటరీగా వ్యవహరించనున్నారు. పార్లమెంట్ సెషన్ ముగిసిన వెంటనే! ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు పూర్తైన మరుసటి రోజునే ఈ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏకకాలంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడంపైనే ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరగనుందని పుకార్లు చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ కమిటీ సమావేశాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. #WATCH | On the 'One Nation, One Election' committee, former President and chairman of the committee, Ram Nath Kovind says "The First meeting will take place on 23rd September" pic.twitter.com/FU1gvzMi7j — ANI (@ANI) September 16, 2023 ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది? -
రామ్‌నాథ్ కోవింద్ కమిటీ మొదటి సమావేశంలో కీలకాంశాలు
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాసంలో జమిలీ ఎన్నికలపై జరుగుతున్న తొలి సమావేశం సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, న్యాయశాఖ కార్యదర్శి ఇతర నేతలు హాజరయ్యారు. 'వన్ నేషన్ వన్ ఎలెక్షన్'పై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు మొదటిసరి అధికారికంగా సమావేశమయ్యింది. ఈ హైలెవెల్ కమిటీ సమావేశంలో ఏడు కీలక అంశాలపై చర్చించి సిఫారసులు చేయనుంది. రాజ్యాంగ సవరణలు: ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. అందుకు ఏయే రాజ్యాంగ అధికారణల సవరణలు చెయ్యాలో, ఏయే చట్టాల సవరణ చెయ్యాలో కమిటీ అధ్యయనం చేస్తుంది. రాష్ట్రాల అనుమతి: ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించడానికి ఏవైనా రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తే వాటి సవరణకు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరా? లేక కేంద్రమే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళవచ్చా అన్నదానిపై కూడా స్పష్టతనివ్వాలి. సంకీర్ణాలైతే : ఇక ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను కూడా అధ్యయనం చేసి హంగ్ అసెంబ్లీ, అవిశ్వాస తీర్మానం, ఫిరాయింపుల సమయంలో ఏం చేయాలనే దానిపై కూడా ఈ కమిటీ సూచనలు తెలియజేయాలి. సాధ్యం కాకపోతే: ఒకేసారి దేశమంతా ఎన్నికలు సాధ్యం కాని పక్షంలో, విడతలవారీగా ఎన్నికలను జరిపి సమ్మిళితం చేసే అవకాశం ఉందా లేదా అన్నదానిపై కమిటీ పూర్తి వివరాలను తెలియజేయాలి. భవిష్యత్తు : ఒకసారి పరిస్థితులు అనుకూలించి ఒకేసారి ఎన్నికల వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత, మళ్లీ ఇది దెబ్బ తినకుండా తదనంతరం కూడా కొనసాగడానికి అవసరమైన చర్యలపై కూడా సిఫారసులు చెయ్యాలి. సిబ్బంది: ఒకేసారి ఎన్నికలకు ఈవీఎంలు, వివి ప్యాట్ల అవసరం ఎంత? వాటితో పాటు మానవ వనరుల అవసరమెంతో కూడా స్పష్టమైన నివేదిక సమర్పించాలి. ఒక్కటే ఓటర్ కార్డు: లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఒకటే ఓటరు జాబితా ఉండేలా చర్యలు తీసుకునే అంశమై ఎటువంటి కార్యాచరణను సిద్ధం చేసుకోవాలో తెలియజేయాలి. ఇది కూడా చదవండి: ఇండియా కంటే 'భారత్' మేలు: లాలూ ప్రసాద్ యాదవ్ -
‘జమిలి’తో మరింత జోష్!
సాక్షి, హైదరాబాద్: ‘జమిలి’ఎన్నికల అంశం రాష్ట్ర బీజేపీలో మరింత జోష్ నింపుతోంది. అసెంబ్లీతోపాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో బీజేపీకి లాభమని ఆ పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. ఈ నెల 18న మొదలుకాబోయే పార్లమెంటు సమావేశాల్లో జరిగే చర్చలు, ప్రకటించే అంశాలతో దేశంలో రాజకీయాలు, ఎన్నికల ఎజెండా మారిపోతాయని.. పరిస్థితి పూర్తిగా బీజేపీకి అనుకూలంగా మారిపోతుందని అంటున్నారు. కొంతకాలంగా ‘వన్ నేషన్– వన్ ఎలక్షన్’అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చిన కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం.. తాజాగా దీనిపై కసరత్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ ఉన్నతస్థాయి కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ‘జమిలి’తోపాటు ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్–యూసీసీ), ఇతర ముఖ్యమైన అంశాలకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టవచ్చనే ప్రచారం సాగుతోంది. ఇవన్నీ బీజేపీకి రాజకీయంగా అనుకూలత పెంచుతాయని భావిస్తున్నారు. ఆలస్యంగా జరిగితే ఎంతో మేలు! నిర్ణీత గడువు కంటే మూడు, నాలుగునెలలు ఆలస్యమవడంతోపాటు లోక్‌సభతో కలిపి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. బీజేపీకి తిరుగు ఉండదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయని అంచనా వేస్తున్నారు. వచ్చే మార్చి లేదా ఏప్రిల్ వరకు ఎన్నికలు ఆగితే.. ఆలోగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష మార్పు, ఇతర అంశాలతో పార్టీ కేడర్‌లో ఏర్పడిన సందిగ్థత తొలగిపోతుందని అంటున్నారు. పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు వీలవుతుందని పేర్కొంటున్నారు. అభ్యర్థులపై కసరత్తు రాష్ట్ర అసెంబ్లీతోపాటు లోక్‌సభకు సంబంధించి కూడా బీజేపీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేని గోవా, కర్ణాటక, ఇతర రాష్ట్రాల ముఖ్యనేతలకు రాష్ట్రంలోని మూడేసి ఎంపీ స్థానాలకు ఇన్చార్జులుగా బాధ్యతలు అప్పగించారు. వారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పని మొదలుపెట్టారు. ఆయా చోట్ల పార్టీ బలాబలాలు, సత్తా ఉన్న, క్షేత్రస్థాయిలో పట్టున్న నేతలను గుర్తించడంలో మునిగిపోయారు. మరోవైపు అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లోని అసంతృప్త నేతలను ఆకర్షించేందుకూ బీజేపీ ప్రయత్నిస్తోంది. ఎన్నికల సన్నద్ధతపై ఫోకస్ బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్.. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. గతంలో నిర్ణయించినట్టుగా ఈ నెల 7న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టకుండా.. ఉమ్మడి జిల్లాల వారీగానే కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యాక.. పది ఉమ్మడి జిల్లాల వారీగా అసెంబ్లీ కోర్ కమిటీల సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనితోపాటు సెపె్టంబర్ 17న చేపట్టాల్సిన కార్యక్రమాలు, బస్సుయాత్రలపై సమీక్షించినట్టు సమాచారం. -
వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై కమిటీ ఏర్పాటు.. సభ్యులు వీరే..
సాక్షి, హైదరాబాద్: కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై తాజాగా హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఎనిమిది మంది సభ్యులతో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. వివరాల ప్రకారం.. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రక్రియపై కేంద్రం స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే శనివారం రామ్‌నాథ్ కోవింద్ ఛైర్మన్‌గా ఎనిమిది మంది సభ్యుల హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కేంద్రహోం అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ, గులాం నబీ ఆజాద్, సంజయ్ కొఠారి, హరీష్ సాల్వే, సుభాష్ కష్యప్, 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్కే సింగ్ ఉన్నారు. ఈ కమిటీకి కార్యదర్శిగా కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. Govt of India constitutes 8-member committee to examine ‘One nation, One election’. Former President Ram Nath Kovind appointed as Chairman of the committee. Union Home Minister Amit Shah, Congress MP Adhir Ranjan Chowdhury, Former Rajya Sabha LoP Ghulam Nabi Azad, and others… pic.twitter.com/Sk9sptonp0 — ANI (@ANI) September 2, 2023 ఇక, దేశంలోని వ్యక్తులు, సంస్థలు, నిపుణుల నుంచి అభిప్రాయాలు సలహాలును హై లెవెల్ కమిటీ తీసుకోనుంది. కాగా, సాధ్యమైనంత త్వరగా కమిటీ సిఫార్సులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏడు కీలక అంశాలపై సిఫారసు చేయాలని కమిటీకి లక్ష్యం 1. ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణపై సాధ్యాసాధ్యాల పరిశీలన. ఏ రాజ్యాంగ సవరణలు చట్టాలకు సవరణ చేయాలో సిఫారసు చేయాలి. 2. రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరా? కాదా?. 3. హంగ్ అసెంబ్లీ, అవిశ్వాస తీర్మానం, ఫిరాయింపుల సమయంలో ఏం చేయాలనే దానిపై సిఫారసు ఇవ్వాలి. 4. ఒకేసారి దేశమంతా ఎన్నికలు సాధ్యం కానీ పక్షంలో, విడతలవారీగా ఎన్నికలను జరిపి సమ్మిళితం చేసే అవకాశంపై సిఫారసు. 5. ఒకేసారి ఎన్నికల వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత మళ్లీ ఈ సైకిల్ దెబ్బ తినకుండా అవసరమైన చర్యలపై సిఫారసులు. 6. ఒకేసారి ఎన్నికలకు అవసరమయ్యే ఈవీఎంలు, వీవీప్యాట్లు, మానవ వనరుల అవసరమెంతో తేల్చాలి. 7. లోకసభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఒకటే ఓటరు జాబితా ఉండేలా చర్యలు. ఇది కూడా చదవండి: మళ్ళీ అధికారంలోకి వస్తే వారిని తలకిందులుగా వేలాడదీస్తాం: అమిత్ షా -
Jamili Elections: 'జమిలి'పై కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలపై ఓవైపు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి కార్యాచరణ సిద్ధం చేస్తుండగా, మరోవైపు ముందస్తు ఎన్నికల ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం పదును పెడుతోంది. ఈ నెల 18 నుంచి 5 రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించి ముందస్తు ఎన్నికల అంశాన్ని కేంద్రం ఇప్పటికే తెరపైకి తీసుకొచ్చింది. దానికి మరింత బలం చేకూర్చేలా ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జమిలి ఎన్నికల అంశాన్ని తేల్చడానికి 16 మంది సభ్యులతో ఈ కమిటీని నియమించింది. కమిటీ విధివిధానాలు, గడువుపై కేంద్రం త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేయనుందని సమాచారం. ఈ పరిణామాలన్నీ చూస్తే ముందస్తు ఎన్నికల హడావుడి మొదలైనట్లే కనిపిస్తోంది. జమిలి ఎన్నికలపై ఇప్పటికే పార్లమెంటరీ స్థాయీ సంఘం, లా కమిషన్ అధ్యయనం చేసి, తమ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాయి. జమిలి ఎన్నికల పట్ల అవి సానుకూలంగా స్పందించాయి. భాగస్వామ్యపక్షాల అభిప్రాయాలు తెలుసుకోనున్న కమిటీ ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’పై తొలిసారిగా 2019 జూన్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. అప్పట్లో సమాజ్‌వాదీ పార్టీ, టీఆర్ఎస్(ఇప్పటి బీఆర్ఎస్), శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలు ఆ ఆలోచనకు మద్దతు ప్రకటించాయి. ఆ తర్వాత 2020 నవంబర్‌లో 80వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సదస్సులో ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దాదాపు 3 సంవత్సరాల అనంతరం కేంద్ర ప్రభుత్వం దీనిపై కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జమిలి ఎన్నికలకు సంబంధించిన చట్టపరమైన అంశాలను కమిటీ పరిశీలిస్తుంది. నిపుణులు, రాజకీయ పార్టీల నేతలతోపాటు సామాన్య ప్రజల అభిప్రాయాలను సైతం స్వీకరిస్తుంది. భాగస్వామ్యపక్షాల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత తన నివేదికను కేంద్ర పభుత్వానికి సమర్పిస్తుంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలతోపాటే మొత్తం 12 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తారన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. కోవింద్‌తో జేపీ నడ్డా భేటీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. కోవింద్ నేతృత్వంలో కమిటీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొద్దిసేపటి తర్వాత ఈ భేటీ జరిగింది. కమిటీ కూర్పుపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. కమిటీలో సభ్యులుగా ఎవరెవరు ఉండాలన్న దానిపై అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. ప్రత్యేక సమావేశాల అజెండా త్వరలోనే: ప్రహ్లాద్ జోషీ ఈ నెల 18వ తేదీ నుంచి జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా రూపకల్పన తుది దశలో ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. అజెండాలో పొందుపరిచే అంశాలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. అతి త్వరలోనే అజెండాను బహిర్గతం చేస్తామన్నారు. ప్రత్యేక సమావేశాలకు కావాల్సినంత సమయం ఉందన్నారు. ఇదిలా ఉండగా, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల చివరి రోజైన ఈ నెల 22న పార్లమెంట్ సభ్యుల గ్రూప్ ఫొటోల చిత్రీకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా ఇలాంటి ఫొటోలను పార్లమెంట్ టర్మ్ మొదలైన తొలి రోజు లేదా చివరి రోజు చిత్రీకరిస్తుంటారు. తరచూ ఎన్నికలతో నష్టమే.. దేశంలో ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ నిర్వహించాల్సిన అవసరం ఉందని రామ్‌నాథ్ కోవింద్ గతంలో పలు సందర్భాల్లో చెప్పారు. ‘‘తరచూ దేశంలో ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతుండడంతో మానవ వనరులపై భారం పడుతోంది. ఎన్నికల వ్యయం పెరిగిపోతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది’’ అని 2018లో పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో కోవింద్ చెప్పారు. 2014 మేలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే దేశం–ఒకే ఎన్నికపై చర్చ ప్రారంభమైంది. దేశంలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతాయని లా కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతోపాటు అభివృద్ధి పనులకు ఆటంకాలు ఉండవని వెల్లడించింది. దేశంలో 1967 దాకా లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. మోదీ ప్రభుత్వ పదవీ కాలం మరికొన్ని నెలల్లో ముగియనుంది. జమిలి ఎన్నికల వ్యవహారాన్ని ఇంకా సాగదీయకుండా ఏదో ఒకటి తేల్చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ‘సమాఖ్య’కు విఘాతం: విపక్షాలు ‘జమిలి’పై రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటుపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి స్పందించింది. కేంద్ర ప్రభుత్వ ఆలోచనను తప్పుపట్టింది. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయొద్దని డిమాండ్ చేసింది. రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ అనేది ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఇది కూడా చదవండి: దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు షాక్.. -
బాబాసాహెబ్ కలల సాకారంలో...
అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఆర్టికల్ 370 మన రాజ్యాంగంలో భాగమైంది. మోదీ బలమైన సంకల్పం ఫలితంగా ఆర్టికల్ 370 రద్దు సాధ్యమై, ఇవాళ భారతదేశంతో జమ్ము–కశ్మీర్ ఏకీకరణ స్వప్నం సాకారమైంది. మోదీ చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు, విధానాలన్నింటి లోనూ అంబేడ్కర్ ప్రభావం సుస్పష్టం. మోదీ అనేకమంది నాయకుల నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ, అంబేడ్కర్ ముద్ర ఆయన పాలనా శైలిలో సర్వత్రా కనిపిస్తుంది. ‘భారతీయతే మన నిజమైన గుర్తింపు. బలమైన దేశ నిర్మాణం కోసం మనమంతా కుల, మత, జాతి భేదాలను పక్కకునెట్టి ముందడుగు వేయాలి’ అన్న మన భారతరత్న అంబేడ్కర్‌కు మోదీ నిజమైన వారసుడన్నది నా అభిప్రాయం. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మన సమాజ భాగ స్వాములైన బడుగు, బలహీన వర్గాల వారి ఆశలు, ఆకాంక్షలకు రెక్కలు తొడిగిన రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్‌ను స్మరించుకోవాల్సిన అవసరం ఎంత యినా ఉంది. స్వాతంత్య్రం తర్వాత దేశ ప్రగతికి వివిధ ప్రభుత్వాలు తమ వంతు కృషి చేసినప్పటీకీ అంబేడ్కర్ కన్న కలల్లో ఏళ్ల తరబడి నెరవేరని ఎన్నో స్వప్నాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం సాకారం చేసింది. ఈ రోజు మన ప్రియతమ ప్రధానమంత్రి పుట్టినరోజు. ఆయనతో నాది చాలా సుదీర్ఘ, చిరస్మరణీయ అనుబంధం. సంస్థలో ఒకరిగా, ముఖ్యమంత్రిగా, ఇవాళ ప్రధానమంత్రిగా ఆయన పనిచేయడం నేను చూస్తూ వచ్చాను. దళితులు, ఆదివాసీలు, మహిళల సాధికారతలో ఆయన ప్రదర్శించిన శ్రద్ధాసక్తులు నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఆ మేరకు బాబాసాహెబ్‌కు నిజమైన శిష్యుడిగా భారతదేశాన్ని సమసమాజంగా రూపుదిద్దడానికి మోదీ ముమ్మర కృషి చేస్తున్నారు. మోదీ చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు, విధానాలు తదితరాలన్నింటిలోనూ అంబే డ్కర్ ప్రభావం సుస్పష్టం. ఒక సంస్థలో సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా, నేడు ప్రధానమంత్రిగానూ మోదీ సదా బాబాసాహెబ్ బాటలోనే నడుస్తున్నారు. తదనుగుణంగా దేశానికేగాక ప్రపంచం మొత్తానికీ చిరకాలం గుర్తుండిపోయే బహుమతిని ‘పంచతీర్థం’ రూపంలో మోదీ అందించారు. బాబాసాహెబ్ జయంతిని ‘సమతా దినోత్సవం’గా నిర్వహించాలని నిర్ణయించడమేగాక నవంబర్ 26ను భారత ‘రాజ్యాంగ దినోత్సవం’గానూ మోదీ ప్రకటించారు. ప్రధాని మోదీ చూపిన ఈ చొరవతో ఐక్యరాజ్య సమితి కూడా బాబాసాహెబ్ 125వ జయంతి వేడుకను నిర్వహించింది. అంబేడ్కర్ కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ నెరవేరని– ఆర్టికల్ 370 రద్దు, స్వయం సమృద్ధ భారతం స్వప్నాలను మోదీ ప్రభుత్వం పటిష్ఠ చర్యలతో సాకారం చేయగలిగింది. కాగా, ఆనాడు అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఆర్టికల్ 370 మన రాజ్యాంగంలో భాగమైంది. దీంతో భారతదేశంలో జమ్ము–కశ్మీర్ విలీనానికి అడ్డుకట్ట పడింది. అయితే, మోదీ బలమైన సంకల్పం, దీక్ష ఫలితంగా ఆర్టికల్ 370 రద్దు సాధ్యమై, ఇవాళ భారతదేశంతో జమ్ము–కశ్మీర్ ఏకీకరణ స్వప్నం సాకారమైంది. అదేవిధంగా శక్తిమంతమైన స్వయం సమృద్ధ భారతదేశ నిర్మాణం దిశగా ప్రధానమంత్రి మోదీ ఉద్యమ సంక ల్పంతో శ్రమిస్తున్నారు. ‘స్వయం సమృద్ధం’ కావడం ద్వారానే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించగలదని అంబేడ్కర్ గట్టిగా విశ్వసించారు. కానీ, భారతదేశాన్ని స్వావలంబన మార్గంలో నడి పించడంలో మునుపటి ప్రభుత్వాలకు సంకల్పం, చిత్తశుద్ధి లోపిం చాయి. కానీ, మోదీ ఈ పరిస్థితిని చక్కదిద్ది, భారత ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించడం ద్వారా ప్రపంచానికి మన శక్తిని చాటారు. కాబట్టే మన బలమేమిటో ప్రపంచం ఇవాళ గుర్తించింది. రాష్ట్రపతి హోదాలో నేను పలు సామాజిక సమస్యలు, పాలనా వ్యవహారాలపై ప్రధానితో సంభాషించినప్పుడల్లా వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన అవినీతి గురించి ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేసేవారు. ఈ జాడ్యం కారణంగా ఎక్కువగా నష్టపోతున్నది పేదలేనని చెప్పేవారు. ఈ నేపథ్యంలో గడచిన ఎనిమిదేళ్లుగా మోదీ అవినీతిపై అలుపెరుగని నిర్ణయాత్మక పోరాటం చేస్తున్నారు. తదనుగుణంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలన్నీ నిరుపేద లందరికీ అందేలా ఆయన చేసిన కృషిని మనమంతా ప్రత్యక్షంగా చూశాం. పర్యవసానంగా ఇవాళ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ సాఫీగా సాగిపోతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వ పథకాలన్నీ నిరుపేదలపై కరుణను ప్రతిబింబించేవి కావడం గమనార్హం. మన ప్రజాస్వామ్య వ్యవస్థను అనువంశిక రాజకీయాలు నియంత్రించడం మోదీకి తీవ్ర ఆందోళన కలిగించిన మరో అంశం. ఈ అనువంశిక రాజకీయాలు చిత్తశుద్ధితో, శ్రమించి పనిచేసే రాజ కీయ కార్యకర్తల హక్కులను ఏ విధంగా లాగివేసుకుంటాయనే అంశంపై ఆయన సదా గళం విప్పుతూనే వచ్చారు. మోదీ ఎల్లప్పుడూ అర్హత ప్రాతిపదికగానే నాయకులను, కార్యకర్తలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అనువంశిక రాజకీయాలపై మోదీ చేసిన యుద్ధం ఇప్పటికే తన ప్రభావం చూపుతోంది. ఈ మేరకు మన ప్రజాస్వా మ్యాన్ని పటిష్ఠం, మరింత శక్తిమంతం చేసేది ప్రతిభ ఆధారిత రాజకీయాలే తప్ప అనువంశిక రాజకీయాలు కావన్నది స్పష్టమైంది. మోదీ పాలన శైలికి మరో నిలువెత్తు నిదర్శనం ‘పద్మ’ పురస్కరాలు. ఒకనాడు సంపన్న, పలుకుబడిగల వర్గాలకు ‘విశేష పరి గణన’ ఇచ్చేవిగా భావించబడిన ఈ పురస్కారం నేడు ‘సామా న్యుడి’తో తన అనుబంధాన్ని పునరుద్ధరించుకుంది. ఈ మేరకు ఇవాళ ‘జన సామాన్యం’తో మమేకమైన వారికి అంకితం చేయబడ్డాయి. అత్యంత వెనుకబడిన రంగాలలో అభివృద్ధి, తదనుగుణంగా అట్టడుగు వర్గాల జీవితాల్లో కొత్త అధ్యాయం లిఖించే విధంగా ప్రభుత్వం చేపట్టిన రెండు కీలక చర్యల గురించి ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలిచాను. ఇందులో ఒకటి ‘ఆకాంక్షాత్మక జిల్లాల కార్య క్రమం’ కాగా, రెండోది ‘ఆదర్శ గ్రామాల పథకం’. మోదీ విశిష్ట ఆలోచన శైలికి ఇదే నిదర్శనం. వేలెత్తి చూపలేని పటిష్ట ప్రణాళికలు, లోపరహితంగా వాటిని అమలు చేయడం వల్ల నిరుపేదల జీవితాల్లో సుస్పష్టమైన మార్పులు వచ్చాయి. అనేక సాంఘిక సంక్షేమ పథకాలే ఇందుకు తిరుగులేని ఉదాహరణలు. వీటిలో ప్రపంచంలోనే అత్యంత భారీ ఉచిత రేషన్ పథకమైన ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ అత్యంత విశిష్టమైనది. భారతీయులు కరోనా మహ మ్మారిపై సాహసోపేత పోరాటం సలుపుతున్న నేపథ్యంలో ప్రవేశ పెట్టిన ఈ పథకం ద్వారా 80 కోట్ల మందికిపైగా ప్రజలు ప్రయోజనం పొందారు. మహమ్మారి వైరస్‌పై భారత్ పోరాటాన్ని ప్రధాని మోదీ ఏ విధంగా ముందుండి నడిపారో నేను ప్రత్యక్షంగా చూశాను. మన శాస్త్రవేత్తలు, వైద్యులు ఒకటికి రెండు ‘దేశీయ’ (మేడ్ ఇన్ ఇండియా) టీకాలను రూపొందించడంలో ఆయనిచ్చిన చేయూత, మద్దతు నిరుపమానం. దీంతో మనందరికీ భద్రత లభించడమేగాక అనేక ఇతర దేశాల ప్రజానీకం సంక్షేమానికీ మనమంతా తోడ్పడినట్ల యింది. మరోవైపు మహమ్మారి గరిష్ఠ స్థాయిలో విజృంభించే నాటికి 100 కోట్ల మంది భారతీయులకు టీకాలు వేసే బృహత్తర కార్యాచర ణను కూడా ప్రధానమంత్రి చేపట్టారు. తద్వారా ప్రపంచంలోనే అత్యంత భారీ, వేగవంతమైన టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి, విజయవంతం చేశారు. అనేక అభివృద్ధి చెందిన దేశాలను కోవిడ్ ఊపిరాడకుండా చేసిన సమయంలో ప్రధాని మన ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమేగాక విస్తరించారు. సమయ స్ఫూర్తితో కూడిన విధానపరమైన కార్యక్రమాల ద్వారా ఆర్థిక వృద్ధి స్తంభించకుండా ఎంతో జాగ్రత్త వహించారు. మోదీ గత ఎనిమిదేళ్ల పాలన అత్యద్భుతం. మోదీ అనేకమంది నాయకుల నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ, అంబేడ్కర్ ముద్ర ఆయన పాలన శైలిలో సర్వత్రా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘భారతీయతే మన నిజమైన గుర్తింపు. బలమైన దేశ నిర్మాణం కోసం మనమంతా కుల, మత, జాతి భేదాలను పక్కకునెట్టి ముందడుగు వేయాలి’ అన్న మన భారతరత్న అంబేడ్కర్‌కు మోదీ నిజమైన వారసుడన్నది నా అభి ప్రాయం. అంబేడ్కర్ అడుగుజాడల్లో మన ప్రధాని ‘దేశమే ప్రథమం’ అనే నినాదాన్ని తారకమంత్రంగా స్వీకరించారు. మరోవైపు సుపరి పాలన, సామాజిక సమన్వయం, క్రమశిక్షణలనే విశిష్ట లక్షణాలతో ఆయన ప్రభుత్వం దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోంది. (నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు) రామ్‌నాథ్ కోవింద్ (భారత మాజీ రాష్ట్రపతి) -
తప్పులు పట్టలేక టీడీపీ కులాల ప్రస్తావన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎటువంటి వివక్ష లేకుండా సామరస్యంతో కలిసిమెలిసి ఉంటున్న ప్రజల మధ్య కులం, మతం అంటూ విష బీజాలు నాటి పబ్బం గడుపుకోవాలని టీడీపీ చూస్తోందని వైఎస్సార్పీపీ నేత, ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలో పాలక పక్షమైన వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్రంలో కులమతాల చిచ్చు పెట్టాలని చూస్తున్నారని టీటీడీ నేత చంద్రబాబు అంటుంటే, ఆయన పుత్రరత్నం లోకేష్ ఒకడుగు ముందుకేసి సీఎం జగన్ పెత్తనం మొత్తం ఒక సామాజికవర్గానికి అప్పజెప్పారని రంకెలు వేయడం సిగ్గుచేటు అని బుధవారం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుపట్టడానికి కారణాలేవీ కనిపించని పచ్చ పార్టీ నేతలు కులం ప్రస్తావనతో ప్రభుత్వం పైన, సీఎం జగన్ పైన అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. టీడీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తన పర్యటన అనుభవం పేరుతో ఏపీ రాజకీయాలకు కుల విశ్లేషణ జోడిస్తున్నారని అన్నారు. సీఎం కులం వారికే ఎక్కువ మేలు జరుగుతోందని అదే పార్టీకి చెందిన కొందరు నేతలంటుంటే.. జగన్ కులం వారూ అసంతృప్తితో ఉన్నారని బుచ్చయ్య వంటి వృద్ధ నేతలు వెల్లడించడం చంద్రబాబు పార్టీలోని గందరగోళానికి అద్దం పడుతోందన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎలా వ్యవహరించాలో టీడీపీ నేతలకు, కార్యకర్తలకు ఎవరైనా అమరావతిలో శిక్షణ ఇస్తే ఐదు కోట్ల మంది ఆంధ్రులకు మేలు జరుగుతుందని విజయసాయిరెడ్డి హితవు పలికారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో విజయసాయిరెడ్డి భేటీ సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయిన విజయసాయిరెడ్డి తిరుమల శ్రీవారి ప్రతిమను బహూకరించారు. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. అనంతరం మహాత్మాగాంధీ స్మృతి స్థల్‌ను సందర్శించిన విజయసాయిరెడ్డి గాంధీజీకి నివాళులర్పించారు. -
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు ప్రసంగం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జాతినుద్దేశించి వీడ్కోలు ప్రసంగం ఇచ్చారు రామ్‌నాథ్ కోవింద్. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా గొప్పగా ఉందన్నారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఈ సంస్కృతి నేటి యువతను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. 21వ శతాబ్దం భారత్‌దే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాను కాన్పుర్ దేహాత్ జిల్లా పరౌఖ్ గ్రామంలోని పేద కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి చేరినట్లు కోవింద్ పేర్కొన్నారు. రాష్ట్రపతిగా తన శాయశక్తుల మేరకు బాధ్యతలు నిర్వర్తించినట్లు తెలిపారు. తనకు సమాజంలోని అన్ని వర్గాలు, ముఖ్యంగా పార్లమెంటేరియన్లు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. సోమవారం ఆమె భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చదవండి: ఉద్ధవ్ థాక్రేకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు.. ఆయన తలరాత ఆ రోజే ఖరారైంది -
రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం 16వ రాష్ట్రపతి ఎన్నికల కోసం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. జూలై 25వ తేదీలోగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకోనుంది. ఇక, ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. నామినేటెడ్ సభ్యులు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కులేదు. కాగా, పార్లమెంట్ ప్రాంగణం, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. రిట్నరింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరించనున్నారు. - ఇక, ఈనెల 15వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. - నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 29. - నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూలై 2. - జూలై 18న పోలింగ్, - జూలై 21వ తేదీన కౌంటింగ్ జరుగనుంది. బ్యాలెట్ విధానంలో రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి పదవికి కూడా ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు. ఈసారి బ్రాహ్మణులకు రాష్ట్రపతి, ముస్లింలకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, అగ్రవర్ణాల నుంచి రేసులో సుమిత్రా మహాజన్, రాజ్‌నాథ్ సింగ్ ఉన్నట్టు సమాచారం. మైనార్టీ కోటాలో గులామ్ నబీ ఆజాద్, నఖ్వీ, అరిఫ్ మహ్మద్ ఖాన్ ఉన్నారు. ఎంపీ ఓటు విలువ 700 ఉండగా.. అత్యధికంగా యూపీలో ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉంది. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 10,98,903 ఓట్లు ఉండగా.. బీజేపీకి 4,65,797, మిత్రపక్షాలకు 71,329 ఓటు ఉన్నాయి. ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయేకు 49 శాతం ఓట్లు ఉన్నాయి. యూపీఏకు 24.02 శాతం, ఇతర పార్టీలకు 26.98 శాతం ఓట్లు ఉన్నాయి. -
ఫ్యాక్టరీలో భారీ పేలుడు... 13 మంది మృతి
లక్నో: ఢిల్లీ సమీపంలోని యూపీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 13 మంది మృతి చెందగా.. ఆరుగురు గాయపడనట్లు తెలిపారు. ఈ ఘటన పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది. ఆ సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 30 మంది ఇన్నారని పోలీసులు తెలిపారు. ఈ పేలుడు తాకిడికి చుట్టుపక్కల ఉన్న కొన్ని ఫ్యాక్టరీల పైకప్పులు దెబ్బతిన్నాయని చెప్పారు. ఐతే ఈ ఫ్యాక్టరీకి ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కోసం లైసెన్స్ ఇస్తే ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం బాణసంచా తయారు చేస్తున్నామని చెబుతుండటం గమనార్హం. దీంతో పోలీసులు ఫ్యాక్టరీ యజమాని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఈ మేరకు ఈ ఘటనలో చనిపోయిన మృతుల పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు గల కారణాల గురించి ప్రత్యేక నిపుణులతో సత్వరమే విచారణ జరపించాలని ముఖ్యమంత్రి యోగి ఆదేశించారు. అంతేకాదు బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహయం అందించాలని ఆదిత్యనాథ్ జిల్లా పరిపాలనాధికారులను కోరారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు ఆన్లైన్లో తెగ వైరల్ అవుతున్నాయి. (చదవండి: ఢిల్లీలో భానుడి భగభగలు... ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ) -
చిన్న ఫోటోగ్రాఫర్...అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతికే వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌గా
పావగడ: తాలూకాలోని ఓబుళాపుర గ్రామంలో ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన కృష్ణమూర్తి, నాగరత్నమ్మ దంపతుల కుమారుడు వై కే లోకనాథ్ ఫొటోగ్రఫీ రంగంలో ఉన్నత స్థానానికి ఎదిగాడు. చిన్నపాటి ఫొటోగ్రాఫర్‌గా వృత్తిని ప్రారంభించిన ఆయన నేడు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వ్యక్తిగత ఫొటో గ్రాఫర్‌గా ఎదిగాడు. బెంగుళూరులో కలర్ ల్యాబ్ నిర్వహిస్తున్న అతని చిన్నాన్న ఎంసీ గిరీశ్ ప్రేరణతో ప్రభుత్వ చలనచిత్ర, జయచామరాజేంద్ర పాలిటెక్నిక్‌లో చేరారు. 1989లో డిప్లొమా పూర్తి చేశాడు. ప్రసార భారతి ఛానల్లో విధులు నిర్వహించాడు. తదనంతరం ఢిల్లీలో అడుగు పెట్టి ఛాయాగ్రహ వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగి చివరకు ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ఛాయాగ్రాహకుడిగా ఎంపికయ్యాడు. రెండు దశాబ్దాల పాటు ప్రధాని కార్యాలయంలో విధులు నిర్వహించిన ఆయన ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌గా రాష్ట్రపతి భవన్లో విధులు నిర్వహిస్తున్నాడు. అతని ఎదుగుదల పట్ల గ్రామస్థులు, బంధువులు, స్నేహితులు హర్షం ప్రకటించారు. (చదవండి: ‘మాజీ ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త’) -
రాష్ట్రపతి, సీజేఐతో ఏపీ గవర్నర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను ఆయన రాష్ట్రపతికి వివరించారని సమాచారం. అంతకుముందు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోంమంత్రి అమిత్‌షాలను గవర్నర్ విడివిడిగా కలిశారు. సీజేఐను కలిసిన గవర్నర్.. అలాగే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను కూడా గవర్నర్ హరిచందన్ కలిశారు. కాగా, ఈ నెల 22న ఢిల్లీ వచ్చిన గవర్నర్ 23వ తేదీన ప్రధాని మోదీని కలవగా, 24న నేషనల్ వార్ మెమోరియల్‌ను తన సతీమణితో కలిసి సందర్శించిన విషయం తెలిసిందే. గవర్నర్ దంపతులు మంగళవారం ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్తారని సమాచారం. -
పద్మభూషణ్ అందుకున్న కృష్ణ ఎల్ల దంపతులు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో సేవలు చేసినవారికి అందజేసే పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం సోమవారం రాష్ట్రపతిభవన్‌లో జరిగింది. మార్చి 21న తొలి విడతలో 54 మందికి అవార్డులు ఇవ్వగా.. సోమవారం 74 మందికి పురస్కారాలు అందజేశారు. అందులో నలుగురు తెలుగువారు ఉన్నారు. భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్ల, ఆయన సతీమణి సుచిత్ర ఎల్ల ఇద్దరికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేశారు. కూచిపూడి నాట్య కళాకారిణి గడ్డం పద్మజారెడ్డి, కోయ కళాకారుడు సకిని రామచంద్రయ్య కూడా పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం పద్మజారెడ్డి, రామచంద్రయ్య ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పద్మశ్రీ అవార్డు తనకు మహాశివుడు ఇచ్చిన వరమని, దీనిని తన నాట్య గురువు దివంగత శోభానాయుడుకు అంకితం చేస్తున్నానని పద్మాజారెడ్డి చెప్పారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆదివాసీ కథలే తనను ఈ స్థాయికి తెచ్చాయని సకిని రామచంద్రయ్య అన్నారు. (చదవండి: గూర్ఖాల్యాండ్ డిమాండ్‌ను వదిలిన మోర్చా) -
పద్మ అవార్డుల ప్రదానంలో ఆసక్తికర ఘటన.. వీడియో వైరల్
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా కేంద్రం దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి గాను మొత్తం 128 పద్మ పురస్కారాలను ప్రకటించగా.. అందులో నలుగురికి పద్మ విభూషణ్,17 మంది పద్మభూషణ్, 107 మంది పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. అయితే, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానం జరిగింది. పద్మా పురస్కారాలను రామ్‌నాథ్ కోవింద్ గ్రహీతలకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అవార్డుల ప్రదానం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పద్మ శ్రీ అవార్డు అందుకునే ముందు 125 ఏళ్ల యోగా గురువు స్వామి శివానంద ప్రధాని నరేంద్ర మోదీకి పాదాభివందనం చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ సైతం ఆయనకు ప్రతి నమస్కారం చేశారు. ఈ సందర్భంగానే శివానంద.. రాష్ట్రపతికి కూడా పాదాభివందనం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రపతి కోవింద్ ప్రేమతో పైకి లేపారు. మరోవైపు.. భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించారు. ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన కుమార్తెలు క్రితిక, తరణి స్వీకరించారు. కాగా, రాధే శ్యామ్ ఖేంకాకు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించగా.. ఆయన కుమారుడు అవార్డును అందుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, పారాలింపిక్ రజత పతక విజేత దేవేంద్ర జఝారియా పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు. తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్‌కు చెందిన కిన్నెర మొగిలయ్య, తెలుగు రాష్ట్రాల్లో ప్రవచనకర్త గరికపాటి నరిసింహారావులు పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు. అయితే, విడతల వారీగా అవార్డుల ప్రదానం చేపట్టగా.. సోమవారం ఇద్దరికి పద్మవిభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు. రెండో విడతలో అవార్డుల ప్రదానం మార్చి 28న జరగనుంది. #WATCH Swami Sivananda receives Padma Shri award from President Ram Nath Kovind, for his contribution in the field of Yoga. pic.twitter.com/fMcClzmNye — ANI (@ANI) March 21, 2022 -
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసిన ప్రధాని మోదీ
-
మన శక్తిని చాటిచెప్పారు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘సముద్ర జలాల్లో ఎదురవుతున్న సమస్యల్ని తిప్పికొట్టేందుకు స్నేహపూర్వక దేశాలతో కలిసి భారత నౌకాదళం రాజీలేని పోరాటం చేయాలి. హిందూ మహా సముద్రంలో ప్రధాన భద్రతా భాగస్వామిగా భారత్ వ్యవహరించాలి’ అని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. విశాఖపట్నం సముద్ర జలాల్లో సోమవారం ఉదయం నిర్వహించిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి పాల్గొన్నారు. భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రయాణిస్తూ.. లంగరు వేసిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను ఆయన సమీక్షించారు. ‘‘70 శాతం నౌకలు స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్నాయి. ఇది శుభపరిణామం. కోవిడ్ సమయంలో భారత నావికాదళం చేసిన సేవలు అమోఘం. స్నేహపూర్వక దేశాలకు అవసరమైన మందులను సముద్రసేతు, మిషన్ సాగర్ వంటి కార్యక్రమాల ద్వారా వారికి చేరవేసింది. వైజాగ్ అని పిలిచే విశాఖ నగరం అందమైన చారిత్రక నగరం. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుత సహకారం అందించింది’’ అని రాష్ట్రపతి కొనియాడారు. నౌకాదళంతో పాటు జాతినుద్దేశించి ప్రసంగించిన రామ్నా«థ్ కోవింద్ ఇంకా ఏమన్నారంటే.. ఆనందం కలిగించింది.. ఈరోజు మీతో కలిసి ప్రయాణించడం చాలా సంతోషంగా ఉంది. నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, హెలికాప్టర్లు మొదలైన భారత నౌకాదళ సంపత్తి సామర్థ్యాన్ని సమీక్షించడం చాలా ఆనందం కలిగించింది. పీఎఫ్ఆర్ సందర్భంగా నిర్వహించిన విన్యాసాలు, కవాతు, ఇతర అంశాలన్నీ సముద్ర జలాల్లో భారత నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని, దేశానికి ఇండియన్ నేవీ అందిస్తున్న సేవల్ని ప్రతిబింబిస్తున్నాయి. అకస్మాత్తుగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భారత నౌకాదళం ఎంత సంసిద్ధతతో ఉంటుందో ఇవి ప్రస్ఫుటిస్తున్నాయి. వైజాగ్.. ఓ అందమైన నగరం వైజాగ్.. అని పిలిచే విశాఖపట్నం అందమైన నగరం. శతాబ్దాల కాలంగా ముఖ్యమైన ఓడరేవుగా గుర్తింపు పొందింది. దేశాల మధ్య వాణిజ్య, వ్యాపారాలకు ఇది కీలక ప్రాంతం. ఆరో శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకూ పారిశ్రామిక, ఆర్థిక వ్యవస్థకు విశాఖపట్నం ముఖ్యమైన కేంద్రం. రానున్న రోజుల్లో కూడా ఇది కొనసాగాలి. ఇక్కడ ఏర్పాటైన తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం ఈ విషయాలన్నింటికీ సాక్షీభూతంగా ఉంది. 1971లో పాకిస్థాన్ యుద్ధ సమయంలో వైజాగ్ అద్భుతమైన సహకారం అందించింది. ఈ విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘ది గోల్డెన్ స్వర్ణిమ్ విజయ్’ వేడుకలు ఇటీవలే ముగిశాయి. ఈ విజయోత్సవాలు తూర్పు నౌకాదళం పాటవాల్ని గుర్తుచేస్తుంటాయి. పాకిస్థాన్ జలాంతర్గామి ’ఘాజీ’ని సముద్రంలో జలసమాధి చేయడమనేది పాక్‌కు నిర్ణయాత్మక దెబ్బ. ఈ ఘటన తర్వాతే 1971 యుద్ధం దేశ చరిత్రలో అత్యంత బలమైన విజయాలలో ఒకటిగా నిలిచింది. నౌకాదళ సేవలు ప్రశంసనీయం సముద్ర భద్రతని పటిష్టపర్చుకుంటూ.. దేశంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, అందరికీ భద్రత కల్పించేందుకు నౌకాదళం దృష్టి కేంద్రీకరించాలి. మిత్ర దేశాలతో సహకార చర్యలు కొనసాగించాలి. ప్రపంచ వాణిజ్యంలో సింహభాగం శాసిస్తున్న హిందూ మహా సముద్ర ప్రాంతం భద్రతాపరంగా చాలా కీలకం. ఇక్కడ ఏ చిన్న సంఘటన ఎదురైనా సత్వరమే స్పందిస్తూ తనదైన శైలిలో దూసుకెళ్తున్న భారత నౌకాదళ సేవలు ప్రశంసనీయం. ముఖ్యంగా.. కోవిడ్ కష్ట కాలంలో భారత నౌకాదళం అందించిన సేవలు శ్లాఘనీయం. ఔషధాలను సరఫరా చేయడంతోపాటు వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో కీలకంగా వ్యవహరించింది. హిందూ మహా సముద్రంలో ఏ సమస్య తలెత్తినా.. ‘ప్రాధాన్య భద్రతా భాగస్వామి’గానూ. ‘మొట్టమొదట స్పందించే దేశంగానూ భారత్ ముందు వరుసలో నిలబడాలని కాంక్షిస్తున్నాను. ఏపీ ప్రభుత్వానికి అభినందనలు ఇండియన్ నేవీ స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ‘మేక్ ఇన్ ఇండియా’ పిలుపుతో ముందంజలో ఉంటూ ఇటీవల కాలంలో తయారుచేస్తున్న యుద్ధ నౌకలు, జలాంతర్గాముల్లో 70 శాతం స్వదేశీ పరిజ్ఞానం ఉండటం భారత్ గర్వించదగ్గ విషయం. అణు జలాంతర్గాముల్నీ నిర్మిస్తున్నాం. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు తయారుచేస్తున్న అగ్రదేశాల సరసన భారత్ నిలవడం గర్వకారణం. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణంతో ఇది సాధ్యమైంది. గతేడాది డిసెంబర్లో నా కొచ్చి పర్యటనలో ‘విక్రాంత్’ను పరిశీలించాను. ’ఆత్మనిర్భర్ భారత్’ నిర్మాణానికి ఇది నాంది పలుకుతోంది. ద్వైపాక్షిక మరియు బహుపాక్షిక విన్యాసాల్ని నిరంతరం నిర్వహిస్తుండటం ద్వారా.. స్నేహపూర్వక దేశాలతో సత్సంబంధాలు పటిష్టం చేసుకుంటూ ఇంటర్ ఆపరేబిలిటీని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. సముద్ర సమస్యలను పరిష్కరించడానికి పరస్పర సహకార భాగస్వామ్యాన్ని నిర్మించుకోవాలి. ఈ విషయంలో త్వరలో నిర్వహించనున్న మిలాన్–2022 విజయవంతం కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ చారిత్రాత్మకమైన విన్యాసాలకు ఆహ్వానం పలుకుతున్న భారత నౌకాదళాన్ని అభినందిస్తున్నాను. అలాగే, పీఎఫ్ఆర్, మిలాన్–2022 వేడుకల్ని ఘనంగా నిర్వహించే విషయంలో పూర్తి సహకారం అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నాను. పీఎఫ్ఆర్ విజయవంతం చేసేందుకు మద్దతు పలికిన జిల్లా అధికారులు, విశాఖ ప్రజలకు ధన్యవాదాలు. ఈరోజు ఎంతో సంతృప్తినిచ్చింది. భారత నౌకాదళాన్ని చూసి దేశం గర్విస్తోంది. భారతదేశ జాతీయ ప్రయోజనాలను పరిరక్షిస్తున్న భారత నౌకాదళానికి శుభాకాంక్షలు చెబుతున్నాను.. అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన ప్రసంగాన్ని ముగించారు. -
ఉప్పొంగిన తూర్పుతీరం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారతదేశ నౌకాదళ శక్తి సామర్థాల్ని చూసి సంద్రం ఉప్పొంగింది. త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. దేశ రక్షణ విషయంలో అగ్రరాజ్యాలతో పోటీపడుతూ.. తన పాటవాన్ని భారత నౌకాదళం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. సమరానికి ఏ క్షణమైనా సన్నద్ధమంటూ సంద్రంలో సవాల్ చేస్తూ నాలుగు వరుసల్లో నిలుచున్న యుద్ధ నౌకలు.. త్రివర్ణ పతాకానికి సగర్వంగా సెల్యూట్ చేస్తూ శత్రు సైన్యాన్ని జలసమాధి చేసేందుకు సిద్ధమంటూ సబ్మెరైన్లు.. గాలికంటే వేగంగా దూసుకెళ్తూ మిగ్ విమానాలు హోరెత్తించాయి. గగన తలంలో దేశ గర్వానికి ప్రతీకలుగా యుద్ధ విమానాల విన్యాసాలు.. సముద్ర కెరటాలతో పోటీపడుతూ చేతక్ హెలికాప్టర్లు అలరించాయి. యుద్ధమైనా, సహాయమైనా క్షణాల్లో వాలిపోతామంటూ మెరైన్ కమాండోలు చేసిన విన్యాసాలు.. వెరసి భారత నౌకాదళ సర్వ సంపత్తి ఒకేచోట చేరి నిర్వహించిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ ప్రపంచ దేశాలు మొత్తం విశాఖ వైపు చూసేలా చేసింది. మొత్తంగా త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నిర్వహించిన భారత యుద్ధ నౌకల సమీక్ష ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్–2022) ఆద్యంతం ఆకట్టుకుంది. గౌరవ వందనం భారతదేశ చరిత్రలో ఇది 12వ ఫ్లీట్ రివ్యూ. దేశ తూర్పు తీరంలో మూడో సమీక్షగా విశాఖలో జరుగుతున్న పీఎఫ్ఆర్ సోమవారం జరిగింది. ఇందులో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఆదివారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి హార్బర్‌కు రాకముందు 150 మంది సెయిలర్స్ గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించారు. 9 గంటలకు రాష్ట్రపతి హార్బర్ చేరుకున్నారు. ఈయనకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్, నాలుగు నౌకాదళ కమాండ్ల చీఫ్‌లు వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా, వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్, వైస్ అడ్మిరల్ హంపిహోలి, లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సింగ్ తదితరులు స్వాగతం పలికారు. ముందుగా 21 తుపాకులతో భారత నౌకాదళం సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించిన రాష్ట్రపతి.. ప్రెసిడెన్షియల్ యాచ్‌గా సిద్ధంగా ఉన్న ఐఎన్ఎస్ సుమిత్ర యుద్ధనౌకలో సతీసమేతంగా సమీక్షకు బయలుదేరారు. నౌక ముందుభాగంలో ప్రత్యేకంగా సిద్ధంచేసిన డెక్‌పై రాష్ట్రపతి దంపతులు ఆశీనులు కాగా.. రెండువైపులా రక్షణ మంత్రి, గవర్నర్, నౌకాదళాధిపతి కూర్చున్నారు. నౌకాదళ గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్. చిత్రంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నౌకాదళాధిపతి హరికుమార్ నౌకాదళ పాటవాల్ని సమీక్షించిన రాష్ట్రపతి ఈ ఏడాది పీఎఫ్ఆర్కు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా సమన్వయకర్తగా వ్యవహరించారు. రాష్ట్రపతిని తీసుకుని ప్రెసిడెన్షియల్ యాచ్ ఐఎన్ఎస్ సుమిత్ర ముందుకు సాగుతుండగా.. సుమిత్ర కాన్వాయ్‌గా ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ సావిత్రి, టాంగో–39, టాంగో–40 యుద్ధనౌకలు బయల్దేరాయి. బంగాళాఖాతం సముద్ర జలాల్లో నాలుగు వరుసల్లో లంగరు వేసిన యుద్ధనౌకల మధ్యగుండా సాగుతూ వాటిపై నుంచి నౌకాదళ సిబ్బంది సమర్పించిన గౌరవ వందనాన్ని త్రివిధ దళాధిపతి స్వీకరించారు. యుద్ధ నౌకల సిబ్బంది ప్రతి వార్ షిప్ ముందు నిల్చుని టోపీలని చేతితో తిప్పుతూ రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు. మొత్తం షిప్‌లను సమీక్షించిన తర్వాత సబ్‌మెరైన్ కాలమ్‌లో ఉన్న ఐఎన్ఎస్ వేలా, ఐఎన్ఎస్ సింధుకీర్తి, ఐఎన్ఎస్ సింధురాజ్ జలాంతర్గాముల్ని ఆయన సమీక్షించారు. అబ్బురపరిచిన విన్యాసాలు ఇక రెండు గంటలకు పైగా సాగిన నౌకాదళ సమీక్షలో ఇండియన్ నేవీ.. తన సామర్థ్యాల్ని ఘనంగా ప్రదర్శించింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన చేతక్ హెలికాప్టర్లతో పాటు సీకింగ్స్, కామోవ్, యుటిలిటీ హెలికాఫ్టర్ (యూహెచ్)–త్రీహెచ్, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఎఎల్‌హెచ్)లతో పాటు డార్నియర్స్, మిగ్–29కే, హాక్స్, మల్టీ మిషన్ మేరీటైమ్ ఎయిర్క్రాఫ్టŠస్ పీ8ఐ, ఐఎల్ 38 మొదలైన యుద్ధ విమానాలు నిర్వహించిన విన్యాసాలు ఉత్కంఠగా సాగాయి. యుద్ధ నౌకల సమీక్ష అనంతరం ఒకేసారి అన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లు గాల్లోకి దూసుకుపోతూ ఫ్లై పాస్ట్ నిర్వహించాయి. ఈ యుద్ధ విమానా విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఈ సందర్భంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ల డెమోతో మెరైన్ కమాండోలు నిర్వహించిన వాటర్ పారా జంప్స్, విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తపాలా బిళ్ల విడుదల చేసిన రాష్ట్రపతి ప్రతి పీఎఫ్ఆర్ లేదా ఐఎఫ్ఆర్ నిర్వహించిన తర్వాత దాని పేరుతో పోస్టల్ స్టాంప్, కవర్ విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సోమవారం పీఎఫ్ఆర్–2022 జ్ఞాపకార్థం తపాలా శాఖ రూపొందించిన స్టాంప్, పోస్టల్ కవర్ని నేవల్ బేస్‌లో రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర కమ్యునికేషన్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ జె చౌహాన్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్. హరికుమార్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.