న్యూఢిల్లీ : దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని,ఈ దశాబ్దం భారత్‌కు ఎంతో కీలకంగా మారనుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్ధేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా కోవింద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నవభారత్ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కొత్త పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ వల్ల మైనార్టీ మహిళలకు న్యాయం జరిగిందని వెల్లడించారు. ట్రాన్స్ జెండర్ హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. వివాదాస్పద రామజన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం దేశ ప్రజలు ఐక్యతగా వ్యవహరించడం హర్షణీయమని పేర్కొన్నారు.హింస వల్ల దేశ ప్రతిష్ట దిగజారుతుందని పేర్కొన్నారు.(కొనుగోలు శక్తి పెంపే బడ్జెట్ లక్ష్యం)
ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం చారిత్రాత్మకం
ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం చారిత్రాత్మకమని, ఈ నిర్ణయం వల్ల జమ్మూ, కశ్మీర్, లఢక్ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని, దేశంలో అమలయ్యే ప్రభుత్వ పథకాలన్నీ ఇప్పుడు కశ్మీర్‌కు కూడా వర్తిస్తున్నాయని వెల్లడించారు. సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్ నినాదంతో ప్రభుత్వం ముందుకెళుతుందని, అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం నిధులు భారీగా కేటాయించారని, అక్కడ రైల్వే వ్యవస్థను మరింత మెరుగుపరచనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలే బోడో సమస్యను పరిస్కరించారని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగించారని రాష్ట్రపతి వివరించారు. గత ఐదేళ్లలో దేశంలో చేపట్టిన కార్యక్రమాల వల్ల భారత్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని, బ్యాంకింగ్ రంగంలో భారత్ గణనీయమైన అభివృద్ది సాధించిందని పేర్నొన్నారు.
(అన్ని వర్గాలకు బడ్జెట్లో ప్రాధాన్యం: మోదీ)
సీఏఏ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం కలగదు
పౌరసత్వ సవరణ చట్టంపై మాట్లాడుతూ.. గాంధీ స్పూర్తితో పాకిస్తాన్‌లో ఉన్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులకు పౌరసత్వం ఇస్తున్నామని, ఇది మన కర్తవ్యమని తెలిపారు. సీఏఏ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదని, అందరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కోవింద్ వెల్లడించారు. పాలనా విభాగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, ప్రభుత్వ సేవలను వేగవంతంగా ప్రజలకు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో తోడ్పడుతుందని కోవింద్ స్పష్టం చేశారు. దేశంలో ఉన్న రైతుల సంక్షేమమే మా ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. మహిళా, శిశు సంక్షేమానికి భారీగా నిధులు వెచ్చించారని తెలిపారు.దేశంలో 27వేల ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. గంగా ప్రక్షాలన మంచి ఫలితాన్నిస్తోందన్నారు. భారత్‌లో విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగిందని, గుజరాత్‌లో ఏర్పాటు చేసిన స్టాట్యు ఆఫ్ యునిటీని(సర్దార్ వల్లబాయ్‌పటేల్ విగ్రహం) చూసేందుకు వేల సంఖ్యంలో విదేశీయులు వస్తున్నారని కోవింద్ తెలిపారు.
విదేశీ పెట్టుబడుల సంఖ్య గణనీయంగా పెరిగింది
జీఎస్టీ విధానం వల్ల ఆర్థిక రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, ఈ విధానం అమలు వల్ల రాష్ట్రాలు కూడా పలు ప్రయోజనాలు పొందుతున్నాయని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చినా భారత్ బలంగానే ఉందని, దేశంలో విదేశీ పెట్టుబడుల సంఖ్య గణనీయంగా పెరిగిందని రామ్‌నాథ్ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుందని కోవింద్ వెల్లడించారు.
అంతరిక్ష పరిశోధనల్లో గణనీయమైన ప్రగతి సాధించామని కోవింద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 విఫలమైనా అంతరిక్షంపై దేశ ప్రజల్లో ఆసక్తి పెరిగిందని, చంద్రయాన్-3కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గుర్తుచేశారు.దేశ అంతర్గత భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రామ్‌నాథ్ కోవింద్ వెల్లడించారు. ఇతర దేశాలతో సత్సంభాదాలు కొనసాగిస్తూనే దేశ సైనిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు సైనిక విభాగంలో భారీ మార్పులు తీసుకొచ్చామని, వారికి అత్యాధునిక ఆయుధాలను అందించామని రామ్‌నాథ్ కోవింద్ వెల్లడించారు
రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం తర్వాత భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.కాగా నల్ల బ్యాడ్జీలు ధరించి విపక్షాలు తమ నిరసనను వ్యక్తం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment