ఇదీ రైతు పోరాటమే | MP Woman Basanti Bai asks for loan from President Ramnath to buy helicopter | Sakshi
Sakshi News home page

ఇదీ రైతు పోరాటమే

Published Mon, Feb 15 2021 12:58 AM | Last Updated on Mon, Feb 15 2021 12:58 AM

MP Woman Basanti Bai asks for loan from President Ramnath to buy helicopter - Sakshi

బసంతీబాయ్‌: రైతు

‘ఎకార్డింగ్‌ టు ది గివెన్‌ సర్వే నెంబర్‌.. దీజ్‌ ప్యాడీ ఫీల్డ్స్‌ బిలాంగ్స్‌ టు పటేదార్‌ యూ నో..’ అన్నాడు రెవిన్యూ ఆఫీసర్‌! అతడేమన్నాడో బసంతీబాయ్‌కి అర్థం కాలేదు. ‘ఈ పొలం నాది. పొలానికి వచ్చిపోయే దారులన్నీ పరమానంద్‌ పటేదార్, ఆయన కొడుకులు మూసేశారు. దారులు తెరిపించండి’ అని వేడుకుంది. ‘పొలం నీదైతే కావచ్చు. పొలానికి వెళ్లే ఏదారీ నీ దారి కాదు’ అన్నాడు ఆఫీసర్‌!

పొలానికి దారి లేకుంటే బతికే దారీ లేనట్లే బసంతీబాయ్‌ కుటుంబానికి. పై అధికారులకు ఉత్తరం రాసింది. ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కి లెటర్‌ పెట్టింది. ఆయన దగ్గర్నుంచీ ఎవరూ రాలేదు. ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించుకుంది. ఆ లేఖ చేరిందీ లేనిదీ తెలియదు. చివరికి రాష్ట్రపతి రామ్‌నా£Š  కోవింద్‌కి లెటర్‌ రాసింది. ముందరి ఉత్తరాల్లో తన పొలానికి వెళ్లే దారులను తెరిపించండి అని రాసిన బసంతీబాయ్‌ రాష్ట్రపతికి రాసిన ఉత్తరంలో అలా రాయలేదు.

ఎలా రాస్తే ఆయన తనను పట్టించుకుంటాడని అనుకుందో అలా రాసింది. ‘‘అయ్యా.. మా ఇంటికి కొద్ది రూరంలో ఉన్న నా పొలానికి రోజూ వెళ్లి రావడానికి నాకొక హెలికాప్టర్‌ అవసరం అయింది. హెలికాప్టర్‌ను కొనడానికి లోన్‌ మంజూరు చేయించండి. అలాగే హెలికాప్టర్‌ నడిపే లైసెన్స్‌ ఇప్పించండి’’ అని విన్నవించుకుంది. రాష్ట్రపతి నుంచి ఇంకా ఏమీ సమాధానం రాలేదు. వచ్చేవరకు ఆమె కుటుంబానికి పస్తులే. ఆ పొలమే ఆమె జీవనాధారం.
∙∙
షగర్‌ తాలూకాలోని అగర్‌ గ్రామ రైతు బసంతీబాయ్‌. మధ్యప్రదేశ్‌లోని మండ్సార్‌ జిల్లాలో ఉంది ఆ గ్రామం. అక్కడే ఓ రెండెకరాల పొలం ఉంది బసంతీబాయ్‌కి. అందులో పండించుకునే ధాన్యం, కూరగాయలే ఆ కుటుంబాన్ని నడుపుతున్నాయి. ఉదయం వెళ్లడం, పొలం పనులు చేసుకుని చీకటి పడే వేళకు ఇంటికి చేరడం. ఇంట్లోని పశువులు కూడా ఆమె చేతి పలుగు–పారల్లా ఆమె వెంటే పొలానికి వెళ్లివచ్చేవి. అకస్మాత్తుగా ఇప్పుడు పొలానికి దారి లేకుండా పోయింది! పొలం కన్నా దారే ఇప్పుడు ఆమె ప్రాణాధారం అన్నంతగా అయింది.

ఆవుదూడ దగ్గరికి వెళ్లనివ్వకపోతే ఆవు ఎంత గింజుకుంటుందో.. ఆవులాంటి పొలం దగ్గరకి  తనను వెళ్లనివ్వకుండా చేసినందుకు బసంతీ అంత విలవిల్లాడింది. పటేదార్, ఆయన కొడుకులు పొలానికి వెళ్లే దారులన్నీ మూసేశారు. అడిగితే, ఆ దారులు తమ పొలం లోనివి అన్నారు. ఆమెను అటుగా రానివ్వలేదు. తన పొలంలోకి తనను పోనివ్వడంలేదు. వాళ్లకేదో ఆలోచన ఉన్నట్లు ఆమెకు అర్థమైంది. దారుల పేరు చెప్పి పొలాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు.

గవర్నమెంట్‌ ఆఫీసులకు కాళ్లరిగేలా తిరిగితే మనం గల్లీ నుంచి ఢిల్లీకి అంటుంటాం. అక్కడివాళ్లు ‘చౌపాల్‌ నుంచి భోపాల్‌’ అంటారు. అలా అన్ని ఆఫీసులకు, అందరు ఆఫీసర్‌ల దగ్గరకు తిరిగి, ఎవరికీ పట్టకపోవడంతోనే సీఎంకి, ప్రధానికి, రాష్ట్రపతికి ఉత్తరాలు రాసింది బసంతీబాయ్‌. రాష్ట్రపతికి ఆమె రాసిన ఉత్తరం వైరల్‌ అవుతోంది తప్పితే.. సహాయానికెవరూ రాలేదు. ఆమె సమస్యేమిటో వెళ్లి చూడమని జిల్లా కలెక్టర్‌ మనోన్‌ పుష్ప మహరాజ్‌ ఒక బృందాన్నయితే పంపారు కానీ, ఆ మహరాజ్‌ గారి టీమ్‌కు బసంతీరాయ్‌ బాధేమిటో అర్థం కాలేదు.

‘అంతా సవ్యంగానే ఉంది. దారులన్నీ తెరిచే ఉన్నాయి’ అని కలెక్టర్‌కి నివేదించారు! ఉన్నదారిని మూసేయడం ఏంటని వాళ్లు అడిగి ఉంటే బాధితురాలికి న్యాయం జరిగి ఉండేదేమో. పటేదార్‌ ఆ టీమ్‌ వచ్చినప్పుడు తెరిచి ఉంచిన దారిలో పొలానికి వెళ్లొళ్చి, ‘దారి తెరిచే ఉంది’ అని రిపోర్ట్‌ రాశారు. ఇక సమస్యేం కనిపిస్తుంది!  ఈ లోకంలో ఒక చిన్న ప్రాణి బతకడానికి ఎన్ని పెద్ద జీవాలను ఎదుర్కోవాలో బసంతీబాయ్‌కి తెలియంది కాదు కానీ, రాష్ట్రపతి ఏమైనా చేస్తాడా అని ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంది.

రాష్ట్రపతికి రాసిన ఉత్తరాన్ని చూపుతున్న బసంతీబాయ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement