letter to president
-
ఇదీ రైతు పోరాటమే
‘ఎకార్డింగ్ టు ది గివెన్ సర్వే నెంబర్.. దీజ్ ప్యాడీ ఫీల్డ్స్ బిలాంగ్స్ టు పటేదార్ యూ నో..’ అన్నాడు రెవిన్యూ ఆఫీసర్! అతడేమన్నాడో బసంతీబాయ్‌కి అర్థం కాలేదు. ‘ఈ పొలం నాది. పొలానికి వచ్చిపోయే దారులన్నీ పరమానంద్ పటేదార్, ఆయన కొడుకులు మూసేశారు. దారులు తెరిపించండి’ అని వేడుకుంది. ‘పొలం నీదైతే కావచ్చు. పొలానికి వెళ్లే ఏదారీ నీ దారి కాదు’ అన్నాడు ఆఫీసర్! పొలానికి దారి లేకుంటే బతికే దారీ లేనట్లే బసంతీబాయ్ కుటుంబానికి. పై అధికారులకు ఉత్తరం రాసింది. ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కి లెటర్ పెట్టింది. ఆయన దగ్గర్నుంచీ ఎవరూ రాలేదు. ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించుకుంది. ఆ లేఖ చేరిందీ లేనిదీ తెలియదు. చివరికి రాష్ట్రపతి రామ్నా£Š కోవింద్‌కి లెటర్ రాసింది. ముందరి ఉత్తరాల్లో తన పొలానికి వెళ్లే దారులను తెరిపించండి అని రాసిన బసంతీబాయ్ రాష్ట్రపతికి రాసిన ఉత్తరంలో అలా రాయలేదు. ఎలా రాస్తే ఆయన తనను పట్టించుకుంటాడని అనుకుందో అలా రాసింది. ‘‘అయ్యా.. మా ఇంటికి కొద్ది రూరంలో ఉన్న నా పొలానికి రోజూ వెళ్లి రావడానికి నాకొక హెలికాప్టర్ అవసరం అయింది. హెలికాప్టర్‌ను కొనడానికి లోన్ మంజూరు చేయించండి. అలాగే హెలికాప్టర్ నడిపే లైసెన్స్ ఇప్పించండి’’ అని విన్నవించుకుంది. రాష్ట్రపతి నుంచి ఇంకా ఏమీ సమాధానం రాలేదు. వచ్చేవరకు ఆమె కుటుంబానికి పస్తులే. ఆ పొలమే ఆమె జీవనాధారం. ∙∙ షగర్ తాలూకాలోని అగర్ గ్రామ రైతు బసంతీబాయ్. మధ్యప్రదేశ్‌లోని మండ్సార్ జిల్లాలో ఉంది ఆ గ్రామం. అక్కడే ఓ రెండెకరాల పొలం ఉంది బసంతీబాయ్‌కి. అందులో పండించుకునే ధాన్యం, కూరగాయలే ఆ కుటుంబాన్ని నడుపుతున్నాయి. ఉదయం వెళ్లడం, పొలం పనులు చేసుకుని చీకటి పడే వేళకు ఇంటికి చేరడం. ఇంట్లోని పశువులు కూడా ఆమె చేతి పలుగు–పారల్లా ఆమె వెంటే పొలానికి వెళ్లివచ్చేవి. అకస్మాత్తుగా ఇప్పుడు పొలానికి దారి లేకుండా పోయింది! పొలం కన్నా దారే ఇప్పుడు ఆమె ప్రాణాధారం అన్నంతగా అయింది. ఆవుదూడ దగ్గరికి వెళ్లనివ్వకపోతే ఆవు ఎంత గింజుకుంటుందో.. ఆవులాంటి పొలం దగ్గరకి తనను వెళ్లనివ్వకుండా చేసినందుకు బసంతీ అంత విలవిల్లాడింది. పటేదార్, ఆయన కొడుకులు పొలానికి వెళ్లే దారులన్నీ మూసేశారు. అడిగితే, ఆ దారులు తమ పొలం లోనివి అన్నారు. ఆమెను అటుగా రానివ్వలేదు. తన పొలంలోకి తనను పోనివ్వడంలేదు. వాళ్లకేదో ఆలోచన ఉన్నట్లు ఆమెకు అర్థమైంది. దారుల పేరు చెప్పి పొలాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు. గవర్నమెంట్ ఆఫీసులకు కాళ్లరిగేలా తిరిగితే మనం గల్లీ నుంచి ఢిల్లీకి అంటుంటాం. అక్కడివాళ్లు ‘చౌపాల్ నుంచి భోపాల్’ అంటారు. అలా అన్ని ఆఫీసులకు, అందరు ఆఫీసర్ల దగ్గరకు తిరిగి, ఎవరికీ పట్టకపోవడంతోనే సీఎంకి, ప్రధానికి, రాష్ట్రపతికి ఉత్తరాలు రాసింది బసంతీబాయ్. రాష్ట్రపతికి ఆమె రాసిన ఉత్తరం వైరల్ అవుతోంది తప్పితే.. సహాయానికెవరూ రాలేదు. ఆమె సమస్యేమిటో వెళ్లి చూడమని జిల్లా కలెక్టర్ మనోన్ పుష్ప మహరాజ్ ఒక బృందాన్నయితే పంపారు కానీ, ఆ మహరాజ్ గారి టీమ్‌కు బసంతీరాయ్ బాధేమిటో అర్థం కాలేదు. ‘అంతా సవ్యంగానే ఉంది. దారులన్నీ తెరిచే ఉన్నాయి’ అని కలెక్టర్‌కి నివేదించారు! ఉన్నదారిని మూసేయడం ఏంటని వాళ్లు అడిగి ఉంటే బాధితురాలికి న్యాయం జరిగి ఉండేదేమో. పటేదార్ ఆ టీమ్ వచ్చినప్పుడు తెరిచి ఉంచిన దారిలో పొలానికి వెళ్లొళ్చి, ‘దారి తెరిచే ఉంది’ అని రిపోర్ట్ రాశారు. ఇక సమస్యేం కనిపిస్తుంది! ఈ లోకంలో ఒక చిన్న ప్రాణి బతకడానికి ఎన్ని పెద్ద జీవాలను ఎదుర్కోవాలో బసంతీబాయ్‌కి తెలియంది కాదు కానీ, రాష్ట్రపతి ఏమైనా చేస్తాడా అని ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంది. రాష్ట్రపతికి రాసిన ఉత్తరాన్ని చూపుతున్న బసంతీబాయ్ -
ఒకరికొకరు టచ్‌లో విపక్ష నేతలు
న్యూఢిల్లీ: ఒకవేళ ఎన్డీయేకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రానిపక్షంలో, వెంటనే స్పందించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేందుకు వీలుగా ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు ఒకరితో మరొకరు టచ్‌లో ఉండనున్నారు. విపక్షాలన్నిటినీ ఒకతాటిపైకి తెచ్చేందుకు వీలుగా నిరంతర సంప్రదింపుల్లో ఉండాలని ఎన్డీయేతర పార్టీల నేతలు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఈ వర్గాల కథనం ప్రకారం.. ఎన్డీయేకి మెజారిటీ రాని పక్షంలో తమను ఒక సముదాయం (బ్లాక్)గా పేర్కొంటూ విపక్షాలు రాష్ట్రపతికి ఒక లేఖ రాస్తాయి. ఏకైక అతిపెద్ద పార్టీ విషయంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరతాయి. ఈ మేరకు విపక్ష పార్టీలు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించాయి. ఎన్నికల బరిలో 724 మంది మహిళలు సార్వత్రిక ఎన్నికల బరిలో 8,049 మంది అభ్యర్థులు ఉండగా, వీరిలో 724 మంది మహిళలు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు తెలిపాయి. 17వ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధికంగా 54 మంది మహిళా అభ్యర్థులను బరిలోకి దించగా, బీజేపీ 53 మందితో రెండో స్థానంలో నిలిచింది. బీఎస్పీ 24 మంది మహిళా అభ్యర్థులతో మూడో స్థానంలో ఉంది. 222 మంది మహిళలు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. -
మోదీ వ్యాఖ్యలపై రాష్ట్రపతికి కాంగ్రెస్ లేఖ
-
మోదీ వ్యాఖ్యలపై రాష్ట్రపతికి మన్మోహన్ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేతలపై అవాంఛనీయ, అణిచివేత వ్యాఖ్యలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని నిలువరించాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం లేఖ రాశారు. ఈ లేఖపై పలువురు ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు సంతకాలు చేశారు.గతంలో దేశ ప్రధానులందరూ ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో, విధులు నిర్వర్తించడంలో హుందాగా, గౌరవంగా వ్యవహరించేవారని, ప్రస్తుత ప్రధాని మాత్రం ప్రభుత్వాధినేతగా బెదిరింపు ధోరణిలో విపక్ష కాంగ్రెస్ నేతలను బహిరంగంగా హెచ్చరించేలా మాట్లాడుతున్నారని లేఖలో వారు ఆందోళన వ్యక్తం చేశారు. మే 6న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా హుబ్లీలో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని ప్రసంగం దిగజారుడు ధోరణికి పరాకాష్టలా సాగిందని వీడియో క్లిప్‌ను జతచేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై130 కోట్ల మంది ప్రజలను పాలించే ప్రధాని ఇలాంటి భాషను ఉపయోగించడం సరైందికాదని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో ఇలాంటి ధోరణులు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ప్రధాని ప్రయోగించిన పదజాలం విపక్ష నేతలను అవమానించేలా, శాంతికి భంగం వాటిల్లేలా ఉందని రాష్ట్రపతికి నివేదించారు. బెదిరింపులు, సవాళ్లను కాంగ్రెస్ అన్నివేళలా ధైర్యంగా ఎదుర్కొంటుందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ప్రధానిని నిరోధించాలని గౌరవ రాష్ట్రపతిని కోరుతున్నామన్నారు. -
బాధితులు మాత్రమే కోర్టు తలుపులు తట్టాలా?
సుప్రీంకోర్టును అడగాలని రాష్ట్రపతికి ఏబీకే లేఖ సామాజిక బాధ్యత గలవారు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చా? గతంలో పోస్టుకార్డులను కూడా ఫిర్యాదులుగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఇప్పుడు ఏపీలో రైతుల ప్రయోజనాల పరిరక్షణలో వైఫల్యం లోకస్ స్టాండి లేదంటూ నా వ్యాజ్యాన్ని తిరస్కరించారు ఏపీ రాజధాని ప్రాంత ఎంపిక కమిటీకి చట్టబద్ధత లేదు ముఖ్యమంత్రి ఏకపక్షంగా రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశారు సాక్షి, న్యూఢిల్లీ: రైతుల ప్రయోజనాలు, జాతీయ వనరుల పరిరక్షణ విషయంలో గతంలో మాదిరిగా సామాజిక బాధ్యతగల వ్యక్తులెవరైనా సుప్రీకోర్టును ఆశ్రయించవచ్చా? లేక బాధితులు మాత్రమే కోర్టు తలుపులు తట్టాలా? అనే విషయాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్–143(1) కింద సుప్రీంకోర్టుకు ప్రస్తావించాలని సీనియర్ సంపాదకుడు, ఏపీ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు ఏబీకే ప్రసాద్.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఒక లేఖ రాస్తూ... ప్రజాప్రయోజనాలకు సంబంధించి న్యాయవ్యవస్థ, ప్రత్యేకించి సుప్రీంకోర్టు ప్రజలకు చిట్టచివరి ఆశ అని... పోస్ట్కార్డుల్లో వచ్చిన ఫిర్యాదులను కూడా ప్రజాహిత వ్యాజ్యాలుగా పరిగణించి అవసరమైన సహాయాన్ని అందించిందని గుర్తుచేశారు. వ్యక్తులుగా, సామాజిక కార్యకర్తగా, పాత్రికేయులుగా సామాజిక స్పృహ ఉన్న వారెవరైనా సామాన్య ప్రజల లబ్ధికి ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తే తగు తీర్పుల ద్వారా సామాన్యుల ప్రయోజనాలను కాపాడాయని పేర్కొన్నారు. అయితే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ నేతృత్వంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తోందని ఆక్షేపించారు. ఏపీలో రైతులు, జాతీయ వనరుల పరిరక్షణలో, వనరులు, కాంట్రాక్ట్‌ల కేటాయింపుల్లో పారదర్శకత తీసుకురావడంలో సుప్రీంకోర్టు తమ విధులను నిర్వర్తించడంలో విఫలమైందని పేర్కొన్నారు. ప్రజాహిత వ్యాజ్యాన్ని తిరస్కరించారు... రాజధాని నగరం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని గుర్తించడాన్ని ప్రశ్నిస్తూ తాను దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిందని ఏబీకే తన లేఖలో రాష్ట్రపతికి తెలిపారు. లోకస్ స్టాండి వంటి సాంకేతిక కారణాలను వెతుకుతూ ప్రజలకు ఉపశమనాన్ని తిరస్కరించిందని పేర్కొన్నారు. ‘దురదృష్టవశాత్తూ సీజే నేతృత్వంలోని ధర్మాసనం నా పిటిషన్‌కు సంబంధించి ఫైలు ఓపెన్ చేయకుండానే భూమిని మీరు పోగొట్టుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ‘నేను జర్నలిస్టును’ అని చెప్పగానే ప్రధాన న్యాయమూర్తి కల్పించుకుని... రైతులను రానివ్వండి, వస్తే పరిశీలిస్తామని చెప్పారు. మా న్యాయవాది రాజధాని నిర్మాణంలో అవకతవకలను, రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనను ప్రస్తావించినప్పుడు.. ఆ అంశాలను కేంద్ర ప్రభుత్వం చూస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్న రైతులు బెదిరింపులు, దాడులకు గురైన వారు. రాజధాని నిర్మాణంలో పారదర్శకత ఉండాలని, అవినీతి రహితంగా ఉండాలని నా ప్రార్థన. కానీ దురదృష్టవశాత్తూ పిటిషన్‌ను తిరస్కరించారు. మేమంతా కూడా ప్రధానంగా రైతు కుటుంబాల వారమే..’ అని ఏబీకే ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం తగు విధంగా విధి నిర్వహణ చేయాల్సిన ప్రధాన న్యాయమూర్తి... తాను రామరాజ్యాన్ని తేలేనని వ్యాఖ్యానించినట్లు పత్రికల్లో వచ్చిందన్నారు. తన వ్యాఖ్యల ద్వారా తోటి న్యాయమూర్తుల్లో విశ్వాసాన్ని కలిగించలేకపోతున్నారని చెప్పారు. ఏపీ విభజన చట్టం ప్రకారం ఏపీకి నూతన రాజధాని ఎంపిక కోసం పలు ప్రత్యామ్నాయాలు పరిశీలించి తగు సిఫార్సులు చేయడానికి శివరామకృష్ణన్ కమిటీని నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే రాజధాని ప్రాంతం ఎంపిక కోసం వ్యాపార లావాదేవీలున్న ఒక మంత్రి, ఇద్దరు టీడీపీ ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఈ కమిటీ ముఖ్యమంత్రి కోరికల మేరకే వ్యవహరించిందన్నారు. రాజధాని ఏర్పాటుకు ప్రాంతాన్ని సూచించే విషయంలో శాసనసభ కానీ ఇతర వాటాదారులకు సంబంధం లేకుండా ముఖ్యమంత్రి స్వయంగా నిర్ణయించారని లేఖలో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి చట్టబద్ధత లేదన్నారు. ఏపీకి చెందిన ఈ చెల్లని కమిటీ సిఫార్సుల వల్ల 15 లక్షల ఎకరాల సారవంతమైన భూములను దేశం కోల్పోవడమే కాకుండా ఆర్థిక స్థితిపై ప్రభావం పడుతుందని, భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఏబీకే పేర్కొన్నారు. -
'వారిద్దరిపై సీబీఐతో విచారణ చేయించాలి'
-
'వారిద్దరిపై సీబీఐతో విచారణ చేయించాలి'
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్, చంద్రబాబులు అవినీతి రాజకీయాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. చంద్రబాబు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి దొరికిపోయారని, కేసీఆర్ 12మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీఆర్ఎస్లో చేర్చుకున్నారని జీవన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. ఇద్దరు సీఎంలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నారని, ఇద్దరి రాజకీయ అవినీతి బయటపడాలంటే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.