బాధితులు మాత్రమే కోర్టు తలుపులు తట్టాలా?
సుప్రీంకోర్టును అడగాలని రాష్ట్రపతికి ఏబీకే లేఖ
సామాజిక బాధ్యత గలవారు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చా?
గతంలో పోస్టుకార్డులను కూడా ఫిర్యాదులుగా స్వీకరించిన సుప్రీంకోర్టు
ఇప్పుడు ఏపీలో రైతుల ప్రయోజనాల పరిరక్షణలో వైఫల్యం
లోకస్ స్టాండి లేదంటూ నా వ్యాజ్యాన్ని తిరస్కరించారు
ఏపీ రాజధాని ప్రాంత ఎంపిక కమిటీకి చట్టబద్ధత లేదు
ముఖ్యమంత్రి ఏకపక్షంగా రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశారు
సాక్షి, న్యూఢిల్లీ: రైతుల ప్రయోజనాలు, జాతీయ వనరుల పరిరక్షణ విషయంలో గతంలో మాదిరిగా సామాజిక బాధ్యతగల వ్యక్తులెవరైనా సుప్రీకోర్టును ఆశ్రయించవచ్చా? లేక బాధితులు మాత్రమే కోర్టు తలుపులు తట్టాలా? అనే విషయాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్–143(1) కింద సుప్రీంకోర్టుకు ప్రస్తావించాలని సీనియర్ సంపాదకుడు, ఏపీ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు ఏబీకే ప్రసాద్.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఒక లేఖ రాస్తూ... ప్రజాప్రయోజనాలకు సంబంధించి న్యాయవ్యవస్థ, ప్రత్యేకించి సుప్రీంకోర్టు ప్రజలకు చిట్టచివరి ఆశ అని... పోస్ట్‌కార్డుల్లో వచ్చిన ఫిర్యాదులను కూడా ప్రజాహిత వ్యాజ్యాలుగా పరిగణించి అవసరమైన సహాయాన్ని అందించిందని గుర్తుచేశారు.
వ్యక్తులుగా, సామాజిక కార్యకర్తగా, పాత్రికేయులుగా సామాజిక స్పృహ ఉన్న వారెవరైనా సామాన్య ప్రజల లబ్ధికి ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తే తగు తీర్పుల ద్వారా సామాన్యుల ప్రయోజనాలను కాపాడాయని పేర్కొన్నారు. అయితే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ నేతృత్వంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తోందని ఆక్షేపించారు. ఏపీలో రైతులు, జాతీయ వనరుల పరిరక్షణలో, వనరులు, కాంట్రాక్ట్‌ల కేటాయింపుల్లో పారదర్శకత తీసుకురావడంలో సుప్రీంకోర్టు తమ విధులను నిర్వర్తించడంలో విఫలమైందని పేర్కొన్నారు.
ప్రజాహిత వ్యాజ్యాన్ని తిరస్కరించారు...
రాజధాని నగరం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని గుర్తించడాన్ని ప్రశ్నిస్తూ తాను దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిందని ఏబీకే తన లేఖలో రాష్ట్రపతికి తెలిపారు. లోకస్ స్టాండి వంటి సాంకేతిక కారణాలను వెతుకుతూ ప్రజలకు ఉపశమనాన్ని తిరస్కరించిందని పేర్కొన్నారు. ‘దురదృష్టవశాత్తూ సీజే నేతృత్వంలోని ధర్మాసనం నా పిటిషన్‌కు సంబంధించి ఫైలు ఓపెన్ చేయకుండానే భూమిని మీరు పోగొట్టుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ‘నేను జర్నలిస్టును’ అని చెప్పగానే ప్రధాన న్యాయమూర్తి కల్పించుకుని... రైతులను రానివ్వండి, వస్తే పరిశీలిస్తామని చెప్పారు. మా న్యాయవాది రాజధాని నిర్మాణంలో అవకతవకలను, రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనను ప్రస్తావించినప్పుడు.. ఆ అంశాలను కేంద్ర ప్రభుత్వం చూస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్న రైతులు బెదిరింపులు, దాడులకు గురైన వారు. రాజధాని నిర్మాణంలో పారదర్శకత ఉండాలని, అవినీతి రహితంగా ఉండాలని నా ప్రార్థన. కానీ దురదృష్టవశాత్తూ పిటిషన్‌ను తిరస్కరించారు. మేమంతా కూడా ప్రధానంగా రైతు కుటుంబాల వారమే..’ అని ఏబీకే ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం తగు విధంగా విధి నిర్వహణ చేయాల్సిన ప్రధాన న్యాయమూర్తి... తాను రామరాజ్యాన్ని తేలేనని వ్యాఖ్యానించినట్లు పత్రికల్లో వచ్చిందన్నారు. తన వ్యాఖ్యల ద్వారా తోటి న్యాయమూర్తుల్లో విశ్వాసాన్ని కలిగించలేకపోతున్నారని చెప్పారు.
ఏపీ విభజన చట్టం ప్రకారం ఏపీకి నూతన రాజధాని ఎంపిక కోసం పలు ప్రత్యామ్నాయాలు పరిశీలించి తగు సిఫార్సులు చేయడానికి శివరామకృష్ణన్ కమిటీని నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే రాజధాని ప్రాంతం ఎంపిక కోసం వ్యాపార లావాదేవీలున్న ఒక మంత్రి, ఇద్దరు టీడీపీ ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఈ కమిటీ ముఖ్యమంత్రి కోరికల మేరకే వ్యవహరించిందన్నారు.
రాజధాని ఏర్పాటుకు ప్రాంతాన్ని సూచించే విషయంలో శాసనసభ కానీ ఇతర వాటాదారులకు సంబంధం లేకుండా ముఖ్యమంత్రి స్వయంగా నిర్ణయించారని లేఖలో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి చట్టబద్ధత లేదన్నారు. ఏపీకి చెందిన ఈ చెల్లని కమిటీ సిఫార్సుల వల్ల 15 లక్షల ఎకరాల సారవంతమైన భూములను దేశం కోల్పోవడమే కాకుండా ఆర్థిక స్థితిపై ప్రభావం పడుతుందని, భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఏబీకే పేర్కొన్నారు.