
ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేతలపై అవాంఛనీయ, అణిచివేత వ్యాఖ్యలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని నిలువరించాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం లేఖ రాశారు. ఈ లేఖపై పలువురు ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు సంతకాలు చేశారు.గతంలో దేశ ప్రధానులందరూ ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో, విధులు నిర్వర్తించడంలో హుందాగా, గౌరవంగా వ్యవహరించేవారని, ప్రస్తుత ప్రధాని మాత్రం ప్రభుత్వాధినేతగా బెదిరింపు ధోరణిలో విపక్ష కాంగ్రెస్ నేతలను బహిరంగంగా హెచ్చరించేలా మాట్లాడుతున్నారని లేఖలో వారు ఆందోళన వ్యక్తం చేశారు.
మే 6న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా హుబ్లీలో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని ప్రసంగం దిగజారుడు ధోరణికి పరాకాష్టలా సాగిందని వీడియో క్లిప్‌ను జతచేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై130 కోట్ల మంది ప్రజలను పాలించే ప్రధాని ఇలాంటి భాషను ఉపయోగించడం సరైందికాదని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో ఇలాంటి ధోరణులు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ప్రధాని ప్రయోగించిన పదజాలం విపక్ష నేతలను అవమానించేలా, శాంతికి భంగం వాటిల్లేలా ఉందని రాష్ట్రపతికి నివేదించారు. బెదిరింపులు, సవాళ్లను కాంగ్రెస్ అన్నివేళలా ధైర్యంగా ఎదుర్కొంటుందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ప్రధానిని నిరోధించాలని గౌరవ రాష్ట్రపతిని కోరుతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment