నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సోనియా గాంధీ
మన్మోహన్ నివాసానికి తరలివచ్చిన వివిధ పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు, ప్రముఖులు
సాక్షి, న్యూఢిల్లీ: దివికేగిన ఆర్థిక సంస్కర్త మన్మో హన్ సింగ్‌కి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధా నమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తదితర ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. త్రివర్ణ పతాకం చుట్టిన మన్మోహన్ పార్థివదేహాన్ని ఢిల్లీలోని ఆయన నివాసమైన 3, మోతిలాల్ నెహ్రూ రోడ్డుకు తరలించారు. నివాళులర్పించడానికి శుక్రవారం పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో నాయకులు, కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పలువురు ప్రముఖులు తరలివచ్చారు.
ఈ సందర్భంగా దేశాభివృద్ధికి మన్మోహన్ అందించిన సేవలను స్మరించుకున్నారు. మన్మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన భార్య గురుశరణ్ కౌర్‌ను ఓదార్చారు. ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జె.పి.నడ్డాతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాందీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు మన్మోహన్ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.
ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఢిల్లీ సీఎం అతిశీ, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే కూడా నివాళులర్పించారు.
నేడు నిగమ్‌బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు
దివంగత మాజీ ప్రధాని అంత్యక్రియలు శనివారం ఉదయం జరుగుతాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ చెప్పారు. మన్మోహన్ పారి్థవదేహాన్ని ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తామని, ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ప్రజలు సందర్శించవచ్చని తెలిపారు. 9.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు. శనివారం ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్ శ్మశాన వాటికలో మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలియజేసింది. పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని రక్షణ శాఖకు సూచించినట్లు పేర్కొంది.
కేంద్ర మంత్రివర్గం సంతాపం
మన్మోహన్ మృతి పట్ల కేంద్ర మంత్రివర్గం సంతాపం ప్రకటించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ శుక్రవారం సమావేశమైంది. మన్మోహన్ ఆత్మశాంతి కోసం తొలుత రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ప్రభుత్వంతోపాటు యావత్తు దేశం తరఫున సంతాపం తెలియజేశారు. అనంతరం సంతాప తీర్మానం ఆమోదించారు. మహోన్నత రాజనీతిజు్ఞడు, ఆర్థికవేత్త, గొప్ప నాయకుడిని దేశం కోల్పోయిందని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా ఆయన మనందరిపై బలమైన ముద్ర వేశారని కొనియాడారు. మన్మోహన్ గౌరవార్థం ప్రభుత్వం ఏడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది.
సీడబ్ల్యూసీలో సంతాప తీర్మానం ఆమోదం
మన్మోహన్ సింగ్‌కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నివాళులర్పించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యా లయంలో భేటీ అయ్యింది. సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ హాజరయ్యారు. మన్మోహన్‌కు సంతాపం ప్రకటిస్తూ ఒక తీర్మా నం ఆమోదించారు. భారత రాజకీయాల్లో, ఆర్థిక వ్యవస్థలో అగ్రగణ్యుడు మన్మోహన్ అని కొనియాడారు. ఆయన కృషితో ప్రపంచస్థాయిలో మన దేశానికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభించాయని పేర్కొన్నారు. దేశంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన మన్మోహన్ చిరస్మరణీయులని ఉద్ఘాటించారు. ప్రజల తలరాతలు మార్చేలా ఎన్నో విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత ఆయనదేనని ప్రశంసించారు.
ఢిల్లీలో స్మారక చిహ్నం
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు దేశ రాజధాని ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమాచారాన్ని కాంగ్రెస్‌కు కూడా అందించినట్లు శుక్రవారం ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఇందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు కొంత సమయం పడుతుందని తెలిపాయి. అయినప్పటికీ ఈ అంశంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విమర్శించాయి.
అదే సంప్రదాయం పాటించాలి: ఖర్గే
ఢిల్లీలో మన్మోహన్ సింగ్‌కు స్మారకం నిర్మించడానికి వీలైన చోటేఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి రెండు పేజీల లేఖ రాశారు. మన మాజీ ప్రధానమంత్రులకు, రాజనీతిజు్ఞలకు అంత్యక్రియలు జరిగిన చోటే స్మారకం నిర్మించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే సంప్రదాయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి మన్మోహన్ అందించిన విశిష్టమైన సేవలను ఖర్గే తన లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతకముందు ఆయన ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. మన్మోహన్ స్మారక నిర్మాణంపై చర్చించారు. మన్మోహన్ శాశ్వత విశ్రాంతి తీసుకొనే ప్రదేశాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని, అదొక పవిత్రమైన స్థలంగా ఉండాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment