
మృతులకు నివాళిగా మౌనం పాటిస్తున్న మోదీ, తదితరులు; నివాళులర్పిస్తున్న భద్రతా సిబ్బంది
న్యూఢిల్లీ: 2001లో పార్లమెంట్‌పై ఉగ్ర దాడి ఘటనలో నేలకొరిగిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా జాతి యావత్తూ మంగళవారం నివాళులర్పించింది. పార్లమెంట్ భవనం వెలుపల జరిగిన కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అన్ని పార్టీల ఎంపీలు ఘనంగా నివాళులర్పించారు. 2001 పార్లమెంట్ దాడి ఘటనలో వీరమరణం పొందిన వారికి జాతి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని రాష్ట్రపతి ముర్ము అనంతరం ట్వీట్ చేశారు. దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వారి త్యాగాన్ని, ధైర్యసాహసాలను ఎన్నడూ మరువబోమని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో తెలిపారు.
ఘనంగా నివాళులర్పించిన రాజ్యసభ
అంతకుముందు, పార్లమెంట్‌పై దాడి ఘటనలో ప్రాణాలర్పించిన వారికి రాజ్యసభ నివాళులర్పించింది. సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నిలబడి మౌనం పాటించారు. సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాయ్ మాట్లాడారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో డిసెంబర్ 13వ తేదీ ఎప్పటికీ విషాదకరమైన రోజుగానే గుర్తుండిపోతుందన్నారు. 2001 డిసెంబర్ 13వ తేదీన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థలకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు పార్లమెంట్ వద్ద కాల్పులకు తెగబడ్డారు. పార్లమెంట్ భవనంలోకి చొచ్చుకుపోయేందుకు వారు చేసిన యత్నాన్ని బలగాలు తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ మహిళా జవాను ఒకరు, పార్లమెంట్ సిబ్బంది ఇద్దరు, జర్నలిస్ట్ ఒకరు ప్రాణాలు కోల్పోగా భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాదులందరూ హతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment