విద్యార్థులకు ప్రధాని మోదీ పిలుపు
పార్లమెంట్ పాత భవనంలో చర్చ
న్యూఢిల్లీ: భావిభారత పౌరులైన విద్యార్థులు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నేతాజీ జయంతిని పురస్కరించుకుని పరాక్రమ్ దివస్ కార్యక్రమంలో భాగంగా పాత పార్లమెంట్ భవంతిలో నేతాజీ చిత్రపటం వద్ద మోదీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులనుద్దేశించి తర్వాత మోదీ ప్రసంగించారు. ‘ నాడు స్వరాజ్యం కోసం ప్రజలు ఐక్యంగా మెలిగారు. నేడు ప్రజల మధ్య అదే ఐక్యత సాధిస్తే అది వికసిత భారత్‌కు బాటలు వేస్తుంది. దేశాన్ని బలహీనపరిచే, దేశ ఐక్యతను నీరుగార్చే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నేతాజీ నుంచి స్ఫూర్తి పొందాలి. అభివృద్ధి చెందిన భారత్‌ను సాధించాలన్న లక్ష్యంగా ముందుకుసాగే మనందరికీ నేతాజీ సదా స్ఫూర్తినందిస్తూనే ఉంటారు.
కంఫర్ట్ జోన్‌ను వీడదాం
తర్వాత మోదీ కటక్‌లో జరిగిన పరాక్రమ్ దివస్ కార్యక్రమంలోనూ వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ నేతాజీ ఎప్పుడూ తాను సౌకర్యవంతమైన జీవితం(కంఫర్ట్‌జోన్‌లో) గడపాలనుకోలేదు. దేశ స్వాతంత్య్ర కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ సాకారం కావాలంటే మనందరం కంఫర్ట్ జోన్‌ను వీడి కష్టించి పనిచేయాలి. ప్రపంచస్థాయి అత్యుత్తమ పనితీరు కనబరచాలి. మెరుగైన పనితీరు మీద దృష్టిపెట్టాలి. అభివృద్ధి చెందిన భారత్‌నే సుభాష్ చంద్రబోస్ కలలుగన్నారు. వికసిత్ భారత్‌ను సాక్ష్యాత్కారింపజేసుకుని నేతాజీకి నిజమైన నివాళులు అర్పిద్దాం’’ అని అన్నారు.
నిజమైన నేత
చర్చలో పాల్గొన్న విద్యార్థులతో మోదీ మాట్లాడారు. నేతాజీ బోధనల్లో నీకేం ఇష్టం? అని ఒక అమ్మాయిని అడగ్గా.. ‘‘నాకు మీ రక్తం ఇవ్వండి. నేను మీకు స్వా తంత్య్రాన్ని ఇస్తా.. అనే మాటలు ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటాయి. అన్నింటికన్నా ఆయనకు దేశమే ముఖ్యం. దేశంలో కర్భన ఉద్గారాల వెల్లడిని తగ్గించాలి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలి. ఇందుకోసం ఎలక్ట్రిక్ వాహనాలు, బస్సులు వాడాలి’’ అని అమ్మాయి చెప్పింది. దీంతో మోదీ కల్పించుకుని.. ‘‘ మా ప్రభుత్వం అదే బాటలో పయనిస్తోందికదా. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం 1,200 విద్యుత్ బస్సులను సమకూర్చింది. మరిన్ని అందుబాటులోకి తేనుంది. పీఎం సురక్షా యోజన సైతం తెచ్చాం. ఇంటి పైకప్పుపై సౌరఫలకాల వ్యవస్థ ఏర్పాటుచేసుకుంటే నెలనెలా విద్యుత్ బిల్లుల బాధ ఉండదు’’ అని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment