Netaji birth anniversary
-
నేతాజీ జయంతి సందర్భంగా సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విటర్ ద్వారా నివాళి అర్పించారు. స్వాతంత్ర్యం కోసం జీవితాన్నే త్యాగం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నా ఘననివాళి అని ట్వీట్ చేశారాయన. మరోవైపు ఏపీ సహా దేశవ్యాప్తంగా బోస్ 126వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్యం కోసం జీవితాన్నే త్యాగం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నా ఘననివాళి.#SubhashChandraBoseJayanti pic.twitter.com/u3hDesmO1j — YS Jagan Mohan Reddy (@ysjagan) January 23, 2023 జనవరి 23, 1897లో కటక్‌లో జన్మించారు సుభాష్ చంద్రబోస్. గాంధీజీ సహా పలువురు అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే.. బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టడానికి యత్నించారు. ఈ క్రమంలోనే ఆయన ప్రాణ త్యాగం చేశారు!. -
Subhash Chandra Bose: ఉర్రూతలూగించిన నేత!
క్రమశిక్షణ, దేశభక్తి, దైవభక్తి ఉన్న సేవాతత్పరుడు సుభాష్ చంద్రబోస్ మరణించి 78 ఏళ్లవుతోంది. అయినా ఆయన మరణానికి కారణమని చెబుతున్న విమాన ప్రమాద కారణం నేటికీ జవాబులేని ప్రశ్నగా నిలిచి పోయింది. ప్రభావతీ దేవి, జానకీ నాథ్ బోస్ దంపతుల సంతానంలో తొమ్మిదోవాడుగా సుభాస్ చంద్రబోస్ 1897 జనవరి 23న కటక్‌లో జన్మించారు. ఐసీఎస్‌లో అఖిల భారత స్థాయిలో నాలుగవ స్థానం పొందారు. బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్ సహాయ కార్యదర్శిగా దేశమంతా పర్యటిస్తూ చేసిన ప్రసంగాలకు లక్షలాది మంది ప్రేరణ పొందారు. ఉప్పు సత్యా గ్రహం సందర్భంగా బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసి అనేక జైళ్లలో తిప్పి, చివరికి దేశ బహిష్కరణ శిక్ష వేసింది. 1933లో ‘ఇండియన్ స్ట్రగుల్’ పుస్తకాన్ని రాశారు. తండ్రి మరణంతో భారత్‌కు తిరిగి రాగా, ఆరోగ్యం క్షీణిస్తే, చికిత్స కోసం ప్రజలు చందాలువేసి మరీ వియన్నా పంపారు. అప్పుడే యూరప్ పర్యటించారు. ఆ రోజుల్లోనే ముస్సోలినీ, హిట్లర్, రోమరోల వంటివారిని కలిశారు. నెహ్రూ అధ్యక్షతన లక్నోలో జరిగే కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యేందుకు దేశంలో దిగగానే ఆయనను ఖైదు చేసి ఎరవాడ జైలుకు పంపారు. 1937లో విడుదల కాగానే అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడై దేశమంతా పర్యటిస్తూ ప్రజలను స్ఫూర్తిదాయక ఉపన్యాసాలతో ఉర్రూతలూగించి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడయ్యారు! ఆది ఆయన పట్ల అసూయాపరులను పెంచింది. రెండవ పర్యాయం మళ్ళీ పోటీజేసి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గెలుపు కోసం ప్రయత్నించకుండానే పట్టాభి సీతారామయ్యపై గెలిచి కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారు. అయితే గాంధీజీకి ఆయన అధ్యక్షుడు కావడం ఇష్టం లేదు. దీంతో బోస్ కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి రాజీనామా చేశారు. వెంటనే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. వారపత్రిక కూడా వెలువరించడం మొదలు పెట్టి మరోసారి దేశమంతా పర్యటించారు. 1942 జనవరి 26న పులి బొమ్మతో రూపొందించిన జండా ఎగరేసి, బెర్లిన్లోనే ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించారు. 1941 ఫిబ్ర వరి 27న ఆజాద్ హింద్ ఫౌజ్ రేడియోలో అద్భుత ప్రసంగం చేసి యావత్ భారతాన్నీ ఆయన ఆవేశంలో ముంచెత్తారు. మహిళలకు రంగూన్లో ఝాన్సీ లక్ష్మీబాయి రెజి మెంట్ ఏర్పాటు చేసి యుద్ధ శిక్షణ మొదలు పెట్టారు. చలో ఢిల్లీ నినాదం ఇచ్చి ప్రత్యక్ష యుద్ధానికి ప్రణాళిక రచించి ఇంఫాల్, అండమాన్, నికోబార్‌లో స్వతంత్ర భారత పతాకాన్ని ఆవిష్కరించి సాగిపోయారు. ఇంతలో జపాన్ మీద అణుబాంబు పడ్డది. జపాన్ అతలాకుతలమై పోయింది. బోస్ నిస్సహాయుడై సహచరుల బలవంతంపై మంచూరియాలో సురక్షిత అజ్ఞాత స్థలానికి వెళ్ళడానికి అనిష్టంగానే జపాన్‌లో విమానం ఎక్కి తైపే వరకూ ప్రయాణించారు. 1945 ఆగస్ట్ 18న అకస్మాత్తుగా విమానంలో సాంకేతిక ఇబ్బంది వచ్చి కూలిపోయిందన్నారు. విమానంతో పాటే కోట్లాది భారతీయుల ఆశలూ నేల కూలాయి. 50 సంవత్సరాల వయసులోనే ఆ యోధునికి నూరేళ్ళూ నిండాయి. (క్లిక్ చేయండి: ‘కోహినూర్‌ను బ్రిటన్ దొంగిలించింది’) – నందిరాజు రాధాకృష్ణ (జనవరి 23 నేతాజీ జయంతి) -
Parakram Diwas: నేతాజీకి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌవది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. స్వతంత్ర పోరాటంలో నేతాజీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఈమేరకు ఇద్దరు ట్వీట్ చేశారు. 'పరాక్రమ్ దివస్ సందర్భంగా భరతమాత ముద్దుబిడ్డ నేతాజీకి నివాళులు. ఆయన ధైర్యసాహసాలు, వీర పరాక్రమం, దేశభక్తి ఆదర్శనీయం. నేతాజీ నాయకత్వంలో లక్షలాది మంది స్వతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు ముందుకువచ్చారు. ఆయనకు భారతీయులంతా ఎప్పటికీ రుణపడి ఉంటారు.' అని ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. On Parakram Diwas, we pay homage to one of the greatest sons of Bharat Mata, Netaji Subhas Chandra Bose. Netaji epitomises exceptional courage and patriotism. Under his leadership, millions joined the struggle for India's freedom. Indians will remain forever indebted to him. — President of India (@rashtrapatibhvn) January 23, 2023 'పరాక్రమ్ దివస్ సందర్భంగా నేతాజీకి నివాళులు. స్వతంత్ర పోరాటంలో ఆయన భాగస్వామ్యాన్ని స్మరించుకుందాం. బ్రిటిష్ పాలకులపై నేతాజీ వీరోచిత పోరాటం మరువలేనిది. ఆయన కలలుగన్న భారత్‌ను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నాం.' అని మోదీ ట్వీట్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని(జనవరి 23) కేంద్రం పరాక్రమ్ దివస్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. Today, on Parakram Diwas, I pay homage to Netaji Subhas Chandra Bose and recall his unparalleled contribution to India’s history. He will be remembered for his fierce resistance to colonial rule. Deeply influenced by his thoughts, we are working to realise his vision for India. — Narendra Modi (@narendramodi) January 23, 2023 చదవండి: వారణాసిలో సీఎన్జీ బోట్లు -
ఆరెస్సెస్ వారి నేతాజీ జయంతి వేడుకలు
కోల్‌కతా: స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్(ఐఎన్ఏ) వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆరెస్సెస్ సన్నద్ధమవుతోంది. ఈ తరుణంలో.. నేతాజీ కూతురు అనితా బోస్(80) స్పందించారు. జనవరి 23వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఈ సందర్భంగా.. కోల్‌కతాలోని షాహిద్ మినార్ గ్రౌండ్లో జయంతి వేడుకల నిర్వహణకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరు కానున్నారు. అయితే.. ఈ పరిణామంపై నేతాజీ కూతురు అనిత ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.. తన తండ్రి పేరును ఆరెస్సెస్, బీజేపీలు పాక్షికంగా వాడుకోవాలని యత్నిస్తున్నాయేమో అని అన్నారామె. ఆర్ఎస్ఎస్ భావజాలం.. జాతీయవాద నాయకుడైన తన తండ్రి(నేతాజీ) లౌకికవాదం, సమగ్రత ఆలోచనలు.. పరస్పర విజాతి ధృవాలను, అవి ఏనాడూ కలవవని ఆమె అన్నారు. సిద్ధాంతాల విషయానికొస్తే.. దేశంలోని ఇతర పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీకి, నేతాజీకి చాలా ఎక్కువ సారూప్యతలు ఉన్నాయన్నారామె. అన్నింటికి మించి ఆయన లెఫ్టిస్ట్ అనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆరెస్సెస్, బీజేపీలు ఆయన వైఖరిని ప్రతిబింబించలేవు. వాళ్లు అతివాదులు, నేతాజీది వామపక్ష భావజాలం అని ఫోన్ ద్వారా జర్మనీ నుంచి ఇక్కడి మీడియాతో ఆమె మాట్లాడారు. విభిన్న సమూహాలు నేతాజీ జన్మదినాన్ని వివిధ మార్గాల్లో జరుపుకోవాలని కోరుకుంటాయి. వారిలో చాలా మంది తప్పనిసరిగా ఆయన ఆలోచనలతో ఏకీభవిస్తున్నారు. అయితే.. నేతాజీ ఆశయాలను, ఆలోచనలను స్వీకరించాలని ఆర్ఎస్ఎస్ భావిస్తే అది ఖచ్చితంగా బాగుంటుంది అని అనిత బోస్ వెల్లడించారు. నేతాజీ.. ఆరెస్సెస్ విమర్శకుడా? అనే ప్రశ్నకు.. ఆ విషయంపై తనకు స్పష్టత లేదని ఆమె బదులిచ్చారు. అయితే.. ఆరెస్సెస్ గురించి, నేతాజీ భావజాలం గురించి మాత్రం తనకు స్పష్టత ఉందని, ఈ రెండు పొసగని విషయాలని ఆమె అన్నారు. ముఖ్యంగా నేతాజీ సెక్యులరిజం అనేది ఆరెస్సెస్‌కు సరిపోని అంశమని పేర్కొన్నారామె. ఇదిలా ఉంటే.. 2021లో తృణమూల్ కాంగ్రెస్-బీజేపీలు నేతాజీ 125వ జయంతి వేడుకల కోసం పోటాపోటీ పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల తరుణంలోనే ఆ రెండు పార్టీలు అలాంటి చర్యలకు దిగడం గమనార్హం. -
నేతాజీకి జాతి ఘన నివాళి
న్యూఢిల్లీ: ఆజాద్ హిందు ఫౌజ్ దళపతి, స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని జాతి యావత్తూ ఆయనకి ఘనంగా నివాళులర్పించింది. స్వతంత్ర భారతావని సాధన దిశగా వేసిన సాహసోపేత అడుగులు, బోస్‌ను ‘జాతికి స్ఫూర్తి ప్రదాత’గా నిలిపాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. గొప్ప జాతీయవాది, దూరదృష్టి కలిగిన నాయకుడు నేతాజీ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశవాసులకు పరాక్రమ్ దివస్ (నేతాజీ జన్మదినోత్సవం) శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి నేతాజీ అందించిన సేవలకు ప్రతి భారతీయుడు గర్విస్తాడని ప్రధాని ట్వీట్ చేశారు. అనంతరం ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆవిష్కరించారు. 28 అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పుతో ఉన్న ఈ విగ్రహాన్ని 4కే సామర్థ్యం ఉన్న ప్రొజక్టర్ ద్వారా ప్రదర్శిస్తున్నారు. గ్రానైట్‌తో రూపొందిస్తున్న నేతాజీ విగ్రహ నిర్మాణం పూర్తయ్యాక దీని స్థానంలో ఆ విగ్రహాన్ని స్థాపిస్తారు. కెన్ డూ.. విల్ డూ.. విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రజలందరూ నేతాజీ నుంచి కెన్ డూ (చేయగలము) విల్ డూ (చేస్తాము) అన్న స్ఫూర్తిని పొంది ముందడుగు వెయ్యాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఎందరో త్యాగధనులు, గొప్ప నాయకులు దేశానికి చేసిన సేవల్ని చరిత్ర పుటల నుంచి తొలగించే ప్రయత్నాలు జరిగాయని పరోక్షంగా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. గతంలో జరిగిన తప్పుల్ని సవరించుకుంటున్నామని, వారు దేశానికి సేవల్ని స్మరించుకుంటున్నామని చెప్పారు. దేశానికి స్వాంతంత్య్రం వచ్చిన వందేళ్లలోగా, అంటే 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదగాలన్న లక్ష్యాన్ని ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా 2019 నుంచి 2022 సంవత్సరం వరకు సుభాష్ చంద్రబోస్ ఆప్డా ప్రబంధన్ పురస్కార్‌లు ప్రదానం చేశారు. విపత్తు నిర్వహణలో అద్భతమైన ప్రతిభ చూపించిన సంస్థలకి, వ్యక్తులకి ఈ అవార్డులను ఇస్తున్నారు. జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబెకు నేతాజీ రీసెర్చ్ బ్యూరో నేతాజీ అవార్డుని బహుకరించింది. అబె తరఫున కోల్‌కతాలోని జపాన్‌కు చెందిన కౌన్సెల్ జనరల్ ఈ అవార్డుని స్వీకరించారు. నేతాజీ అవార్డు తనకి ఇవ్వడం గర్వకారణమని షింజో అబె తన సందేశాన్ని పంపించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల కోసం తాను ప్రయత్నిస్తానని చెప్పారు. ఆ భాగాల్ని అనువదించలేదు నేతాజీ సుభాష్ చంద్రబోస్దిగా అనుమానించిన చితాభస్మానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి జపాన్‌లోని రెంకోజీ ఆలయం అనుమతి ఇచ్చినట్టుగా తాజాగా వెలుగు చూసిన లేఖలో వెల్లడైంది. అప్పట్లో నేతాజీ అనుమానాస్పద మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎంకె ముఖర్జీ కమిషన్‌కు చితాభస్మం డీఎన్ఏ పరీక్షలకు అనుమతినిచ్చినట్టుగా టోక్యోలోని రెంకోజీ ఆలయం ప్రధాన పూజారి 2005లో భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే జపాన్ భాషలో ఉన్న లేఖలో ఆ భాగాన్ని అనువదించలేదని సుభాష్ చంద్రబోస్ సోదరుడు శరత్ బోస్ మనవరాలు మాధురి బోస్ ఆదివారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రెంకోజీ ఆలయం చితాభస్మంపై పరీక్షలకు అనుమతించలేదని ఆ కమిషన్ పేర్కొందని గుర్తు చేశారు. దేశ, విదేశాల్లో.. బోస్ జయంతిని సింగపూర్‌లో ఘనంగా జరిపారు. సింగపూర్ స్వాతంత్య్ర సాధనలో బోస్ పాత్రను దేశవాసులు స్మరించుకున్నారు. బోస్ జన్మదినోత్సవాన్ని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని బెంగాల్ సీఎం మమత డిమాండ్ చేశారు. ఆయన జ్ఞాపకార్థం జైహింద్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. నేతాజీ జన్మోత్సవ వేడుకలను తమిళనాడులో గవర్నర్, సీఎం ఘనంగా నిర్వహించారు. బెంగళూరులోని బోస్ విగ్రహాన్ని విధాన సభ ముందు ప్రతిష్టిస్తామని కర్ణాటక సీఎం ప్రకటించారు. ఒడిశాలో బోస్ జన్మస్థల మ్యూజియంలో పలు కార్యక్రమాలు జరిపారు. చండీగఢ్‌లో నేతాజీ నూతన విగ్రహాన్ని సీఎం ఖట్టర్ ఆవిష్కరించారు. At the programme to mark the unveiling of the hologram statue of Netaji Bose. https://t.co/OxRPKqf1Q7 — Narendra Modi (@narendramodi) January 23, 2022 -
నేతాజీ ఆచూకీ గురించి నేటికీ తెలియని మిస్టరీ!
న్యూఢిల్లీ: నేతాజీ మరణానికి సంబంధించిన ఫైళ్లను కేంద్రం ఎందుకు బయట పెట్టడం లేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. అంతేకాదు జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచిన నేతాజీ బూడిదను డీఎన్ఏ విశ్లేషణకు పంపాలని తృణమాల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఈ మేరకు నేతాజీ 125వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బెనర్జీ మాట్లాడుతూ...నేతాజీ ఆచూకీ గురించి నేటికీ మాకు తెలియదు. తాము అధికారంలోకి రాగానే దానిపై పని చేస్తామని కేంద్రం చెప్పింది. పైగా నేతాజీకి సంబంధించిన అన్ని ఫైళ్లను విడుదల చేసి, వర్గీకరించాం అని కేంద్రం పేర్కొంది. కానీ వాస్తవానికి అవి ఏం జరగలేదు. అని అన్నారు. అయితే నేతాజీ మరణానికి సంబంధించిన వివాదం బెంగాల్లో తీవ్ర భావోద్వేగ సమస్యగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు 1945లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించలేదని చాలామంది ఇప్పటికీ నమ్ముతుండటం విశేషం. అయితే 2017లో తృణమాల్ కాంగ్రెస్ పార్టీ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఆగస్ట్ 18, 1945న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించినట్లు కేంద్రం ధృవీకరించింది. పైగా నేతాజీకి సంబంధించిన అన్ని ఫైళ్లను నిర్వీర్యం చేసినట్లు కేంద్రం ప్రకటించింది. కానీ ఇంకోవైపు నేతాజీకి సంబంధించిన ఇంటెలీజెన్స్ బ్యూరో ఫైల్స్ ఇప్పటికీ ప్రజా బాహుళ్యంలో లేవని పరిశోధకులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు శేఖర్ రే "నేతాజీ ఫైల్స్" వర్గీకరణను డి-క్లాసిఫికేషన్ చేయాలని అభ్యర్థిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాము తీసుకువచ్చిన ఒత్తిడి మేరకు మన్‌కీ బాత్‌లో ఇండియా గేట్‌కి సమీపంలో దిగ్గజ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని మోదీ హామీ ఇచ్చారంటూ మమతా బెనర్జీ ఆరోపించారు. (చదవండి: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నేతాజీ అవార్డు ప్రదానం) -
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నేతాజీ అవార్డు ప్రదానం
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి పురస్కరించుకుని నేతాజీ రీసెర్చ్ బ్యూరో.. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు "నేతాజీ అవార్డు 2022"ను ప్రదానం చేసింది. ఈ మేరకు కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ నివాసంలో ఆదివారం వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో నేతాజీ అవార్డు 2022ను అబేకు ప్రదానం చేస్తున్నట్లు నేతాజీ రీసెర్చ్ బ్యూరో తెలిపింది. అయితే ఈ అవార్డును కోల్‌కతాలోని జపాన్ కాన్సుల్ జనరల్ నకమురా యుటాకా అబే తరపున ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌లోని జపాన్ రాయబారి సతోషి సుజుకీ న్యూఢిల్లీ నుంచి ప్రసంగించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడి మనవడు, నేతాజీ రీసెర్చ్ బ్యూరో డైరెక్టర్ అయిన సుగతా బోస్, అబేను నేతాజీకి గొప్ప ఆరాధకుడిగా అభివర్ణించారు. (చదవండి: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి.. నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని) -
AP: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళులర్పించిన గవర్నర్
సాక్షి, విజయవాడ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతికి అందించిన నిస్వార్థ సేవను దేశం ఎప్పటికీ మరువదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నిజమైన జాతీయవాదిగా భారతదేశం పట్ల ఆయనకున్న ప్రేమ, దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయమని తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని దేశవ్యాప్తంగా ‘పరాక్రమ్ దివస్’గా జరుపుకుంటున్న శుభతరుణంలో ఆదివారం విజయవాడ రాజ్‌భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఇప్పటికీ దేశంలోని అనేకమంది ప్రజల హృదయాల్లో నేతాజీ జీవించే ఉన్నారని తెలిపారు. బోసు జయంతి సందర్భంగా జరుపుకునే ‘పరాక్రమ్ దివస్’ దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు కష్టనష్టాలను ఎదుర్కొనేందుకు అవసరమైన ధైర్యాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. నేతాజీ అడుగుజాడల్లో నడవడానికి ‘పరాక్రమ్ దివస్’ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు. -
నేతాజీ జయంతి.. నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
స్వాతంత్ర్య సమర యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (జనవరి 23, 2022) ఆయనను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి.. "నేతాజీసుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా భారతదేశం ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా నివాళులు అర్పిస్తోంది. స్వేచ్ఛా భారతదేశం, ఆజాద్ హింద్ ఆలోచనకు, తన తీవ్రమైన నిబద్ధతను నెరవేర్చడానికి నేతీజీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు -- ఆయనను జాతీయ చిహ్నంగా మార్చాయి. ఆయన ఆదర్శాలు, త్యాగం ప్రతి భారతీయుడికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది' అని ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. "దేశప్రజలందరికీ పరాక్రమ్ దివస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయనకు నా గౌరవప్రదమైన నివాళులు. ఆయన జయంతి సందర్భంగా నేను నేతాజీకి నమస్కరిస్తున్నాను. మన దేశానికి ఆయన చేసిన స్మారక సహకారానికి ప్రతి భారతీయుడు గర్విస్తాడు" అని ట్వీట్లో పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని 73వ గణతంత్ర దినోత్సవాలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ నేతాజీకి పుష్పాంజలి ఘటించనున్నారు. అనంతరం ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మరోపక్క, గణతంత్ర దినోత్సవం పరేడ్‌కు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జరగబోయే పరేడ్‌లో 16 మార్చ్ఫాస్ట్ బృందాలు, 17 మిలటరీ బ్యాండ్ బృందాలు, 25 శకటాలు పాల్గొంటున్నాయి. ఆర్మీ తరఫున 14 రకాల ఆయుధాలను పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. सभी देशवासियों को पराक्रम दिवस की ढेरों शुभकामनाएं। नेताजी सुभाष चंद्र बोस की 125वीं जयंती पर उन्हें मेरी आदरपूर्ण श्रद्धांजलि। I bow to Netaji Subhas Chandra Bose on his Jayanti. Every Indian is proud of his monumental contribution to our nation. pic.twitter.com/Ska0u301Nv— Narendra Modi (@narendramodi) January 23, 2022 India gratefully pays homage to Netaji Subhas Chandra Bose on his 125th birth anniversary. The daring steps that he took to fulfil his fierce commitment to the idea of a free India — Azad Hind — make him a national icon. His ideals and sacrifice will forever inspire every Indian.— President of India (@rashtrapatibhvn) January 23, 2022 -
దేశభక్తి మహిళాశక్తి
‘దేశమంటే మట్టికాదోయ్! దేశమంటే మనుషులోయ్!’ గురజాడ అప్పారావుగారు ఎంత చక్కగా చెప్పారు. కానీ ఆ కాలానికీ ఈ కాలానికి కాస్త మార్పు వచ్చింది. దేశమంటే ఇప్పుడు మనుషులు కాదు. మహిళా శక్తులు. ఏ ఉద్యమమైనా చూడండి... ఏ ఉద్యోగమైనా చూడండి. మహిళలే ముందుంటున్నారు. ఏం ఉంటున్నారూ.. పర్సెంటేజ్ చూడండి. ఆఫీస్‌లలో మగవాళ్లే ఉంటున్నారు. ఆర్మీలలో మగవాళ్లే ఉంటున్నారు. ఉండటం ముఖ్యం కాదు. ముందుండటం ముఖ్యం. పౌరసత్వ చట్టంపై నిరసన. ఎవరు ముందుంటున్నారు? మహిళలు! పర్యావరణ పరిరక్షణ. ఎవరు ముందుంటున్నారు? మహిళలు! ఢిల్లీలో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎంత కాలుష్యం అయినా ఉండనివ్వండి. గాలిలో ప్రస్తుతం స్వచ్ఛమైన దేశభక్తి గుండెల్ని తాకుతోంది. నిన్న.. నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతి. రెండు రోజులు గడిస్తే గణతంత్ర దినోత్సవం. నేడు.. అమెజాన్ ప్రైమ్ వీడియో.. ‘ది ఫర్గాటెన్ ఆర్మీ.. ఆజాదీ కె లియే’ వెబ్ సిరీస్ ప్రారంభం! మహిళా శక్తికి.. ఈ మూడు సందర్భాలకు సంబంధం ఏమిటి? యుద్ధంలోకి మొదటిసారిగా మహిళల్ని తెచ్చింది నేతాజీ! స్వాతంత్య్ర సంగ్రామంలో మహిళా సైనిక దళాన్ని ఏర్పాటు చేసి, వాళ్ల చేతికి తుపాకులిచ్చారు నేతాజీ. సరిగ్గా శత్రువుల గుండెల్లోకి పేల్చేలా వారికి శిక్షణ ఇచ్చారు. కదన రంగంలో ముందుకు కదలడానికి ఆ మహిళలకు.. కట్టుకున్న చీరలు అడ్డుపడలేదు కానీ... ఆరంభంలోనే.. యుద్ధంలోకి స్త్రీలెందుకు, స్త్రీల చేతులకు తుపాకులెందుకు అని మగాళ్లు ముఖం చిట్లిస్తూ అడ్డొచ్చారు. నేతాజీ వినలేదు. ఆజాద్ హింద్ ఫౌజ్ (నేతాజీ సారథ్యం వహించిన సైన్యం)కి ప్రత్యేకమైన పోరాట వ్యూహాలు ఉన్నప్పటికీ.. భారీ బలగాల్లేవు. మహిళాశక్తిపై నమ్మకంతో, విశ్వాసంతో వారిని సంగ్రామంలోకి ఆహ్వానించారు.నేతాజీ. అందుకోసం 1943 జూలై 9న సింగపూర్‌లో సమావేశం జరిగింది. ‘‘ఏం చేస్తారు బోస్.. ఆడవాళ్లు సైన్యంలోకి వచ్చి?’’ మగవాళ్లెవరో లేచి అడిగారు నేతాజీని. ‘‘ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసిందో అదే చేస్తారు’’ అన్నారు నేతాజీ! ‘‘తిరుగుబాటుకు, స్వాతంత్య్ర సంగ్రామానికి అప్పుడున్నది ఒక్క లక్ష్మీబాయే. ఇప్పుడు ప్రతి మహిళా ఒక లక్ష్మీబాయి. నేను నమ్ముతున్నాను.. మహిళలూ కదిలొస్తే మనకు స్వాతంత్య్రం సిద్ధిస్తుంది. మహిళలూ యుద్ధరంగంలోకి దుమికితే.. భారతదేశం అణువణువునా స్వాతంత్య్ర కాంక్ష రగులుతోందన్న సంకేతం బ్రిటన్‌కు అందుతుంది’’.. అన్నారు నేతాజీ. ఆ వెంటనే.. చెయ్యి ముందుకు చాస్తూ.. ప్రమాణం చేస్తున్నట్లుగా.. ‘‘మన మహిళా దళం పేరు.. ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్’. మరణ ధిక్కార మహిళా దళం మనది’’ అన్నారు. ‘ది ఫర్గాటెన్ ఆర్మీ.. ఆజాదీ కె లియే’లో ఓ సన్నివేశం ఎల్లుండి.. జనవరి 26. గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే). భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఈ ఏడాదికి మన గణతంత్రానికి డెబ్భై యేళ్లు పూర్తవుతాయి. రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చినప్పటికీ రాజ్యాంగ రచనా సమాలోచనలు ప్రారంభమైంది మాత్రం దేశానికి స్వాతంత్య్రం రాకముందే! 1946 డిసెంబర్ 9, ఉదయం 10.45 గంటలకు న్యూఢిల్లీలోని రఫీమార్గ్‌లో ఉన్న కాన్స్టిట్యూషన్ హాల్లో (ఇప్పటి పార్లమెంట్ హౌస్‌లోని సెంట్రల్ హాల్) తొలి రాజ్యాంగ సమావేశం జరిగింది. రాజనీతిజ్ఞులు, ఆలోచనాపరులు, మేధావులు.. మొత్తం 207 మంది ఆ కీలకమైన చర్చా సమావేశానికి హాజరయ్యారు. వారిలో 15 మంది మహిళలే! అప్పట్లో అదేమీ తక్కువ సంఖ్య కాదు. ఆ పదిహేను మందిలో కూడా ఒకరు ముస్లిం. ఇంకొకరు దళిత వర్గం. బేగమ్ అజీజ్ రసూల్, దాక్షాయణి వేలాయుధన్. మిగతా పదమూడు మందీ.. రేణుకా రాయ్, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, హంసా మెహ్తా, పూర్ణిమా బెనర్జీ, రాజ్‌కుమారి అమృత్‌కౌర్, మాలతీ చౌదరి, లీలా రాయ్, సుచేత కృపలాని, సరోజినీ నాయుడు, విజయలక్ష్మీ పండిట్, అమ్ము స్వామినాథన్, యానీ మాస్కరీన్, కమలా చౌదరి. ఒక్కో మహిళదీ ఒక్కో సామాజిక, రాజకీయ నేపథ్యం. రాజ్యాంగ రచనలో వీరి సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, ఉద్దేశాలు, అభ్యంతరాలు, సందేహాలు, సంశయాలకు... వీటన్నిటికీ ప్రాధాన్యం లభించింది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో మహిళ సామాజిక హక్కులు ఇప్పుడొక ప్రత్యేక అధ్యాయంగా ఉండటానికి కారణం ఆనాటి ఈ పదిహేను మంది మహిళా సభ్యుల మాటకు లభించిన విలువేనంటారు జె.ఎన్.యు. ప్రొఫెసర్ నీరజా గోపాల్ జయాల్. పాలనకు రాజ్యాంగం శక్తి అయితే ఆ శక్తికి స్త్రీ స్వరూపం ఈ పదిహేను మందీ! రాణీ ఝాన్సీ రెజిమెంట్లా.. వీరి రాజ్యాంగ మహిళా సైనిక దళం. తొలి రాజ్యాంగ సమావేశంలోని 15 మంది మహిళా సభ్యులలో పదకొండు మంది 24 జనవరి 2020. ఈ రోజే! అమెజాన్ ప్రైమ్ వీడియోలో.. ‘ది ఫర్గాటెన్ ఆర్మీ.. ఆజాదీ కె లియే’ మినీ వెబ్ సిరీస్ మొదలవుతున్నాయి. అమెజాన్ అనగానే ఇవేవో నాటకీయ మహిళా దేశభక్తి ప్రసారాలని అనుకోకండి. సుభాస్ చంద్రబోస్ నడిపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లోని సైనికుల వాస్తవ గాథలతో పాటు.. ఆయన స్థాపించిన రాణీ ఝాన్సీ రెజిమెంట్‌లోని మహిళా సైనికుల వీరగాథల్నీ అమెజాన్ చూపించబోతోంది. వీటికి దర్శకత్వం వహిస్తున్నది కబీర్ ఖాన్. కాబూల్ ఎక్స్‌ప్రెస్, న్యూయార్క్, ఏక్ థా టైగర్, బజ్రంగి భాయ్‌జాన్, ఫాంటమ్, ట్యూబ్‌లైట్ వంటి విభిన్న కథా చిత్రాలను తీసిన కబీర్ ఖాన్.. ఇరవై ఏళ్ల క్రితమే దూరదర్శన్ కోసం ఇదే థీమ్‌తో ‘ది ఫర్గాటెన్ ఆర్మీ’ అనే డాక్యుమెంటరీ చేశారు. తాజా.. ఫర్గాటెన్ ఆర్మీ’లో.. ప్రధానంగా మహిళా యోధుల స్ఫూర్తిదాయకమైన పోరాట అనుభవాలను శార్వరీ వాగ్ (సిరీస్‌లో మాయ) ప్రధాన కథానాయికగా చిత్రీకరిస్తున్నారు. ఒకప్పుడు సమాజంలోని అన్ని వర్గాలూ కలిస్తే ఒక ఉద్యమం అయ్యేది. ఇప్పుడు ఏ ఉద్యమానికైనా మహిళా వర్గమే ముందుంటోంది. ముందుండే వారెప్పుడూ యోధులే. శక్తులే. ఇప్పుడిక ‘దేశమంటే మహిళలోయ్’ అనాలా? అనకపోయినా, అంటే ఒప్పుకోడానికి ఎవరూ ఇబ్బంది పడక్కర్లేదు. నేతాజీ ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్’లో కొందరు -
ఆనాడు డైరీలో రాసుకున్నారు: మోదీ
న్యూఢిల్లీ: వలసవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించి స్వాతంత్ర్యానికై ఉద్యమించిన నేతాజీకి భారతావని ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతీయుల క్షేమం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదన్నారు. గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా ప్రధాని మోదీ ఆయనను స్మరించుకున్నారు. ఈ మేరకు... ‘‘జనవరి 23, జనవరి 1897న జానకీనాథ్ బోస్... ‘ మధ్యాహ్నం కుమారుడు జన్మించాడు’ అని డైరీలో రాసుకున్నారు. ఆ కుమారుడు గొప్ప పోరాట యోధుడిగా నిలిచాడు. భారత స్వాతంత్ర్య సంగ్రామానికి తన జీవితాన్ని అర్పించాడు. ఆయనను స్మరించుకోవడం మనకు గర్వకారణం’’ అని మోదీ ట్వీట్ చేశారు. కాగా ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు నేతాజీకి ట్విటర్ వేదికగా నివాళులు అర్పించారు. అదే విధంగా బాలాసాహెబ్ ఠాక్రేకు సైతం మోదీ నివాళులు అర్పించారు. ఠాక్రే జయంతి సందర్భంగా.. ప్రజా సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. భారతీయ విలువలకు నిదర్శనంగా నిలిచిన ఆయన.. లక్షలాది మందికి ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. On 23rd January 1897, Janakinath Bose wrote in his diary, “A son was born at midday.” This son became a valorous freedom fighter and thinker who devoted his life towards one great cause- India’s freedom. I refer to Netaji Bose, who we proudly remember on his Jayanti today. pic.twitter.com/wp3UjudKJ4 — Narendra Modi (@narendramodi) January 23, 2020 నేతాజీకి సీఎం జగన్ నివాళులు స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 123వ జయంతి సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. భారత్ కోసం ఆయన చూపిన తిరుగులేని పోరాటతత్వం, అసమాన దేశభక్తి.. దేశం స్వాతంత్ర్యం పొందడానికి దోహదం చేసిందని సీఎం జగన్ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు నేతాజీ స్ఫూర్తిప్రదాత అని పేర్కొన్నట్టు సీఎంవో ట్విటర్లో తెలిపింది. యువతకు స్పూర్తి: విజయసాయిరెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆయనను స్మరించుకున్నారు. నేతాజీ స్పూర్తితో ఎంతో మంది యువత నాడు స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. అటువంటి గొప్ప పోరాటయోధుడికి నివాళులు అర్పిస్తున్నా అని ట్వీట్ చేశారు. My humble tributes to one of the greatest heroes of our freedom struggle, Netaji Subhas Chandra Bose, on his birth anniversary. Netaji was an inspiration to thousands of Indian youth to join the struggle for independence. pic.twitter.com/7BtxyDELdO — Vijayasai Reddy V (@VSReddy_MP) January 23, 2020 -
నేడు నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేయనున్న మోదీ
న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన రహస్య ఫైళ్లను శనివారం బహిర్గతం చేయనున్నారు. బోస్ జయంతి సందర్భంగా ఈ రోజు నేతాజీ కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ 100 డిజిటల్ కాపీలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బోస్ కుటుంబ సభ్యులు 20 మంది పాల్గొంటారు. నేతాజీ జయంతిని పురష్కరించుకుని పార్లమెంట్ వద్ద జరిగే కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. అనంతరం నేతాజీ ఫైళ్లను విడుదల చేస్తారు. గత అక్టోబర్‌లో నేతాజీ కుటుంబ సభ్యులను కలిసిన సందర్భంగా నేతాజీ రహస్య ఫైళ్లను వెల్లడిస్తామని ప్రధాని వారికి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మమతా బెనర్జి నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇటీవల నేతాజీకి సంబంధించిన 64 రహస్య పత్రాలను బహిర్గతం చేసింది. నేతాజీ విమాన ప్రమాదంలో మృతిచెందినట్లు తాజాగా వెల్లడైన పత్రాలు చెబుతున్నాయి. బోస్ మిస్టరీ ఛేదించేందుకు ఏర్పాటు చేసిన వెబ్సైట్ బోస్‌ఫైల్స్.ఇన్ఫో వీటిని బయటపెట్టింది. నేతాజీ తైపీలో 1945 ఆగస్టు 18వ తేదీన జరిగిన విమాన ప్రమాదం తర్వాత అదే రోజు నగర శివారులోని ఆస్పత్రిలో చనిపోయినట్లు ఇవి చెబుతున్నాయి.