
ఆగిపోయిన బ్యాండ్, బాజా, బరాత్..!
రాజస్తాన్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి..భారత్, పాకిస్తాన్‌ల మధ్య రాజుకున్న ఉద్రిక్తతలు.. సరిహద్దుల మూసివేత సామాన్యులకు ఎన్నో అవ స్థలు తెచ్చిపెట్టాయి. రాజస్తాన్‌లోని బర్మేర్‌కు చెందిన షైతాన్ సింగ్ అనే యువకుడికి పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్స్‌కు చెందిన కేసర్ కన్వర్‌తో నాలుగేళ్ల క్రితమే పెళ్లి నిశ్చయమైంది. వరుడికి, అతడి కుటుంబీలకు వీసా దొరక్క పెళ్లి ఇప్పటిదాకా జరగలేదు. ఫిబ్రవరి 28న వీసాలు మంజూరయ్యాయి.
ఈ నెల 30వ తేదీన సింధ్ ప్రావిన్స్‌లోని అమర్‌కోట్‌లో వధువు ఇంట్లో వివాహ వేడుక జరగాల్సి ఉంది. ఇందుకోసం సరిహద్దులకు రెండువైపులా ఉన్న కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇంతలోనే చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో బుధవారం అట్టారీ–వాఘా సరిహద్దును అధికారులు మూసివేశారు. విషయం తెలియని షైతాన్ సింగ్ కుటుంబం ఊరేగింపుగా అటారీ–వాఘా బోర్డర్ పాయింట్‌కు చేరుకుంది. అక్కడ ఆర్మీ అధికారులు అసలు విషయం చెప్పడంతో అంతా షాకయ్యారు. ‘ఎప్పటి నుంచో ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. కానీ, ఇలా జరిగింది’అంటూ షైతాన్ సింగ్ ఆవేదన చెందారు.
‘మమ్మల్ని ఆహ్వానించేందుకు బోర్డర్ పోస్ట్ వద్దకు చేరుకున్న మా బంధువులు చేసేది లేక తిరిగి వెళ్లిపోయారు’అని అతడి సోదరుడు చెప్పారు. ఉగ్రదాడుల కారణంగా తమ బంధుత్వాలు కూడా దెబ్బతింటున్నాయని అతడు పేర్కొన్నాడు. అయితే, ఈ కుటుంబానికి మరో చిన్న ఆశ మిగులుంది. అదేంటంటే, వీరి వీసాల గడువు మే 12వ తేదీ వరకు ఉండటం. అప్పటికల్లా తిరిగి సరిహద్దులు తెరుచుకుంటాయని, పెళ్లి జరుగుతుందని ఆశతో వీరున్నారు. కాగా, భారత, పాకిస్తాన్ సరిహద్దులకు సమీప ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉంటున్న సోధా రాజ్‌పుట్ వర్గం ప్రజల మధ్య వివాహ సంబంధాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి.