India Pakistan border
-
Viral: ఆమె వల్లే భారత్-పాక్ గొడవ!!
విద్యార్థులు జవాబు పత్రాల్లో సరదగా చిత్ర విచిత్రమైన సమాధానాలు రాస్తూ కాలేజీ, లెక్చరర్ల దృష్టిలో పడుతూ ఉంటారు. ప్రశ్న పత్రంలో అడిగిన ప్రశ్నకు బదులు ఫన్నీ జవాబు రాసి వైరల్‌గా మారిన సంఘటనలు కూడా చాలానే చూశాం. అయితే తాజాగా ఇటువంటి సరదా ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్తాన్‌లోని దోల్పూర్ జిల్లాలో ఓ కాలేజీ పొలిటికల్ సైన్స్ పరీక్షలో భాగంగా ప్రశ్నపత్రంలో భారత్‌కు పాకిస్తాన్ మధ్య ఏ బార్డర్ (హిందిలో ‘సీమా’) ఉంటుంది? దాని పొడవు ఎంత? అని ఉంది. దీంతో ఓ విద్యార్థి తన చిలిపితనానికి పని చెప్పాడు. ‘సీమా’ పేరుతో తన క్లాస్‌లో ఓ ఆమ్మాయి ఉండటంతో.. భారత్-పాక్ మధ్య బోర్డర్‌గా‘సీమా హైదర్’ ఉంది. అంతే కాదు ఆమె ఎత్తు 5 అడుగలు 6 ఇంచులు కూడా ఉందని రాశాడు. Question - Bharat aur Pakistan ke bich kaun si seema hai, lambai batao? Answer - Dono desho ke bich Seema Haider hai, uski lambai 5 ft 6 inch hai, dono desho ke bich isko lekar ladai hai. pic.twitter.com/25d5AvUlwl — Narundar (@NarundarM) December 21, 2023 అక్కడిదాగా బాగానే ఉన్న.. భారత్- పాక్ దేశాల మధ్య సీమా హైదర్ 5 అడుగుల 6 ఇంచుల ఎత్తులో ఉండటం వల్ల ఆమె కోసమే రెండు దేశాలు గొడవ పడుతున్నాయి అంటూ ఫన్నీగా ఆన్సర్ రాశారు. దీనికి సంబంధించి జవాబు పత్రాన్ని ఓ ఎక్స్(ట్వీటర్) యూజర్ పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘అతను వాట్సాప్ యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్’, ‘అతను రాసిన జవాబుకు ఒక మార్క్ ఎక్స్ట్రాగా వేయాలి’, పేపర్‌పై ఇన్విజిలేటర్ సంతకం లేదని.. అది నకిలీ పేపర్’ అని నెటజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
కుదిరి చెదిరిన ఒప్పందం
దీర్ఘకాల సరిహద్దు ఘర్షణలను పరిష్కరించే ఒక ఒప్పందం భారత్, పాకిస్తాన్ మధ్య దాదాపుగా కుదిరినట్లు కనిపించిందని సతీందర్ లాంబా పుస్తకం ‘ఇన్ పర్స్యూట్ ఆఫ్ పీస్’ వెల్లడిస్తోంది. ఈ ఒప్పందం కోసం ఇరుదేశాలు తెరవెనుక చర్చలను విస్తారంగా కొనసాగించాయనీ, దాదాపు సంతకాల దాకా వచ్చాయనీ ఈ పుస్తకం చెబుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికలపై భారత్ దృష్టి పెట్టిన తర్వాత ఈ ప్రక్రియ నత్తనడక నడిచి ఆగిపోయింది. ఈ ఒప్పందం కుదిరివుంటే, చరిత్రే మారిపోయేది. ఈ ఒప్పంద ప్రక్రియను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇరుపక్షాలూ భావిస్తే దానికి అవసరమైన మార్గదర్శక సూత్రాలు సిద్ధంగా ఉన్నాయని ఈ పుస్తకం గట్టిగా చెబుతోంది. మాజీ రాయబారి సతీందర్ లాంబా రచించిన పుస్తకం ‘ఇన్ పర్సూ్యట్ ఆఫ్ పీస్’ విషాదకరంగా ఆయన మరణానంతరం ప్రచురితమైంది. అయితే భారత్, పాకిస్తాన్ బ్యాక్ చానెల్‌కు (గుప్త లేదా ద్వితీయ శ్రేణి సమా చార బదిలీ మార్గం) సంబంధించిన అద్భుతమైన వివరాలను ఈ పుస్తకం వెల్లడించింది. అలాగే రెండు దేశాలు ఒప్పందానికి ఎంత సమీపానికి వచ్చాయో కూడా ఇది చక్కగా వివరించింది. యూపీఏ ప్రభుత్వ రెండో పాలనా కాలంలో, ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ పదేళ్ల పాలన చివరలో ఈ ముసాయిదా ఒప్పందంపై సంతకాలు చేయడానికి కూడా అంగీ కారం కుదిరిందని ఈ పుస్తకం నిర్ధారిస్తోంది. ‘2003 మే నుంచి 2014 మార్చి వరకు బ్యాక్ చానెల్ సమా వేశాలు 36 జరిగాయి’ అని నాకు తెలిసిన సతీ (సతీందర్) రాశారు. ఈ ఒప్పందంలో చాలావరకు జనరల్ ముషారఫ్ హయాంలో ముగింపునకు వచ్చింది. ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఏమీ జరగ లేదు. కానీ నవాజ్ షరీఫ్ ‘ఈ ప్రక్రియకు కొత్త ఊపును, వేగాన్ని తీసు కొచ్చారు’. దురదృష్టవశాత్తూ, ఆ తర్వాత ‘భారత్ దృష్టి 2014 సార్వ త్రిక ఎన్నికల వైపు మళ్లింది.’ నేను అనుకునేది సరైనదే అయితే, రెండు సందర్భాల్లో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరే పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదట 2007లో అది సాధ్యపడేట్టు కనిపించింది కానీ ముషారఫ్‌కు ఉన్న ‘అంతర్గత సమస్యల’ వల్ల వీగిపోయింది. ఇక రెండోది– ఇది నా వ్యాఖ్యానం – ఎన్నికల వైపు దృష్టిని భారత్ మరల్చడానికి ముందుగా నవాజ్ షరీఫ్ కాలంలో! అనూహ్య ఘటన అయితే, మోదీ గెలుపుతో ఆశలేమీ పోలేదు. ‘బ్యాక్ చానెల్ ప్రక్రియను కొనసాగించాలనే ఉద్దేశం ఉన్నట్లు కనిపించింది’ అని సతీ పేర్కొన్నారు. ‘ఈ అంశంపై ఫైల్ని సమీక్షించారు. ఈ ఒప్పందంలో ఎలాంటి ముఖ్యమైన మార్పూ ఉండబోదని కూడా నాకోసారి చెప్పారు. ప్రత్యేక దూతగా ఒక విశిష్ట రాయబారిని నియమించాలని కూడా ప్రధానమంత్రి మోదీ భావించారు. నన్ను ఆయన్ని కలవాలని కోరారు.’ కానీ ఆ రాయబారిని నియమించనేలేదు. మోదీ ప్రభుత్వం 2017 ఏప్రిల్‌లో మరోసారి ఆ ఒప్పందం కోసం ప్రయత్నించింది. ‘ప్రధాని కార్యాలయంలోని సీనియర్ అధికారి ఒకరు నన్ను కలవడానికి మా ఇంటికొచ్చారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో భేటీ కావడానికి మీరు పాకిస్తాన్ వెళ్లాలని ప్రధాని కోరుకుంటున్నారని ఆయన నాతో చెప్పారు’. అయ్యో! అయితే, భారత్ తరహా ఒక పరిణామం దీన్ని మొగ్గలోనే తుంచేసింది. షరీఫ్‌తో చర్చించాల్సిన అంశాల వివరాలతో పాటు పాకిస్తాన్‌కు ప్రయాణించడానికి అవసరమైన ట్రావెల్ డాక్యుమెంట్లను ఇవ్వాలని సతీందర్ కోరి, వాటికోసం వేచి ఉన్నారు. కానీ ఆ తరుణంలోనే విచిత్రమైన ఘటన జరిగింది. ‘దూతగా వ్యవహరిస్తున్న ఒక ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త తన వ్యక్తిగత విమానంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీ కావడానికి పాకిస్తాన్ వెళ్లారనే వార్తను నేను చూశాను. అలాంటి పరిస్థితుల్లో ఒకే ఉద్దేశం కోసం పాక్ ప్రధాని వద్దకు వెళ్లడానికి ఇద్దరు వ్యక్తులు ప్రాతినిధ్యం వహించడం సరైంది కాదు.’ ఆ వ్యాపారవేత్త పేరు సతీందర్ బయటపెట్టలేదు. అయితే ఆయన సజ్జన్ జిందాల్ కావచ్చునని పాకిస్తాన్ హైకమిషనర్‌గా పనిచేసిన అబ్దుల్ బాసిత్ అన్నారు. ‘ఈ అంశం మీద నేను జరిపిన చివరి సంభాషణ ఇదే’ అని సతీందర్ రాశారు. మన్మోహన్ సింగ్ పాలనలో ఇరుదేశాల మధ్య ఒప్పందం దాదాపుగా ఫలవంతమయ్యేటట్టు కనిపించిందని సతీందర్ చెప్పిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. ‘ప్రధాని మన్మోహన్‌తో నేను 68 సార్లు కలిసినట్లు నా డైరీ గుర్తుచేసింది’. పైగా ‘ఈ పరిణామాల గురించిన మొత్తం సమాచారం ప్రణబ్ ముఖర్జీకి తెలియజేయడమైంది’. 2006 నవంబర్‌లో సోనియాగాంధీకి ఈ ఒప్పంద వివరాలు తెలపడం జరిగింది. అంతకుముందు 2005లో ఆర్మీ చీఫ్ ఈ విషయంలో పాలు పంచుకున్నారు. పైగా అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అడ్వాణీ, బ్రజేశ్ మిశ్రా, ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీ మహమ్మద్ సయీద్, కరణ్ సింగ్, గులామ్ నబీ ఆజాద్‌లకు కూడా ఈ సమా చారం అందించడం జరిగింది. ఈ ఒప్పందం ఫలితం భారత రాజ్యాంగానికీ, జమ్ము–కశ్మీర్ రాజ్యాంగానికీ, పార్లమెంటరీ తీర్మానాలకూ అనుగుణంగా ఉండేలా ప్రయత్నాలు జరిగాయి. ప్రధాన న్యాయ మూర్తి ఆనంద్‌తో 2006 మార్చి నుంచి 2007 మార్చి మధ్యలో సతీందర్ ఆరుసార్లు సమావేశమయ్యారు. ప్రఖ్యాత న్యాయవాది ఫాలీ నారిమన్‌ను కూడా కలిశారు. సరిహద్దులు మారవు ముషారఫ్ నాలుగు సూత్రాల(ఫోర్–పాయింట్ ఫార్ములా)పై, మన్మోహన్ సింగ్ అమృత్‌సర్‌లో చేసిన ప్రసంగంలోని మూడు ఆలోచనలపై ఈ ఒప్పందం ఆధారపడింది. ఈ చర్చలకు పెట్టుకున్న 14 మార్గదర్శక సూత్రాలను సతీందర్ పేర్కొన్నారు. వాటిల్లో కొన్ని: ‘సరిహద్దులను తిరగరాసే ప్రసక్తి లేదు.’ ‘ఎల్ఓసీ(నియంత్రణ రేఖ)కి ఇరువైపులా, ముఖ్యంగా జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైనిక కదలికలను కనిష్ఠ స్థాయిలో ఉంచాలి.’ ‘నియంత్రణ రేఖకు ఇరు వైపులా అంతర్గత నిర్వహణ కోసం స్వయంపాలనను ఏర్పర్చాలి.’ ‘నియంత్రణ రేఖకు ఇరువైపులా ఉన్న ప్రజలు ఒక వైపు నుంచి మరొక వైపునకు వెళ్లడానికి స్వేచ్ఛ ఉండాలి.’ అలాగే, ‘ప్రభుత్వ విధానంగా ఉగ్రవాదాన్ని ఉపయోగించకుండా, తన భూభాగాన్ని రాజ్యేతర శక్తులకు అనుమతించకుండా పాక్ కట్టడి చేయాలి’. ఈ ఒప్పందం జరిగివుంటే, ‘చరిత్ర క్రమాన్ని మార్చివేయడం సాధ్యపడేది’. అయితే ఇప్పటికి కూడా ఇది ముగిసిపోలేదని సతీందర్ సూచిస్తున్నారు. ‘ఈ ఒప్పంద సంభావ్యత ఇప్పటికీ ఉనికిలో ఉంది. ముసాయిదా ఒప్పంద సూత్రాలు కానీ, దాని పాఠం కానీ ఇప్పటికీ ఉన్నాయి. ఒప్పంద ప్రక్రియను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉందని ఇరుపక్షాలూ భావించినప్పుడు ఎప్పుడైనా దాన్ని మొదలు పెట్టవచ్చు’. నేననుకోవడం ఆశ అనేది నిత్యవసంతం! - కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
Radcliffe Line: అది మహా విషాదపు విభజన రేఖ
బ్రిటిష్ పార్లమెంట్ ప్రకటించిన పథకం ప్రకారం భారత్ స్వాతంత్య్ర ప్రక్రియకు 1948 జూన్ మాసం వరకూ సమయం ఉంది. కానీ అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ అంతవరకూ ఆగకుండా హడావిడిగా ఆ ప్రక్రియను ముగించేశాడు. ఈ తొందరపాటు చర్యే అనేక సమస్యలకు కారణమయింది. భారత ఉపఖండ విభజన కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి, ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది సీరిల్ జాన్ ర్యాడ్ క్లిఫ్‌ను చైర్మన్‌గా నియమించాడు వైస్రాయ్. 1947 జూలై 17న ఢిల్లీ చేరుకున్న ర్యాడ్ క్లిఫ్‌కు భారత భూగోళం గురించి, భారతీయుల సంస్కృతి, నాగరికత, ఆచారాల గురించి ఏమాత్రం అవగాహన లేదు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, కొద్దిపాటి క్రైస్తవ జనాభా నివసించే కొన్ని ప్రాంతాలను మరో దేశంగా విడదీయటం చాలా క్లిష్టమైన పని. అయినా పశ్చిమ, తూర్పు సరిహద్దులతో ఐదు వారాల్లోగా ముస్లింల కోసం కొత్త దేశాన్ని (పాకిస్థాన్) ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించాడు వైస్రాయ్. సరిహద్దు రేఖను నిర్ణయించడానికి భారత భూగోళం మ్యాపు తీసుకుని విభజన ప్రక్రియ మొదలెట్టారు కమిటీ సభ్యులు. ఒకరోజు పశ్చిమ సరిహద్దు పంజాబ్ ప్రాంతం, మరోరోజు తూర్పు సరిహద్దు బెంగాల్ ప్రాంతంలోని ముస్లిం ఇలాఖాలను విమానం నుండి విహంగ వీక్షణం చేసింది కమిటీ. ఇంతలో బ్రిటిష్ పార్లమెంట్ భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చే బిల్లును ఆమోదించిందన్న వార్త సుడిగాలిలా భారత్‌కు చేరింది. అంతే, తూర్పు నుండి పశ్చిమానికి ముస్లింలు; పశ్చిమం నుండి తూర్పుకు హిందువులు, సిక్కులు వలస పోవడం ప్రారంభించారు. మత విద్వేషాలు భగ్గుమన్నాయి. ఒకవైపు పరిస్థితులు చేజారుతుంటే... మరోవైపు పోలీసు, పరిపాలనా శాఖలకు సంబంధించిన బ్రిటిష్ ఉన్నతాధికారులు ఒక్కరొక్కరుగా లండన్ వెళ్ళిపోసాగారు. 1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్య్రం ప్రకటించి ఆంగ్లేయులు వెళ్ళిపోనున్నట్లు లార్డ్ మౌంట్ బాటెన్ రేడియో ప్రకటన కూడా చేశారు. పరిస్థితులు గమనించిన ర్యాడ్ క్లిఫ్ 1947 ఆగష్టు 11న త్వరత్వరగా బౌండరీ కమిషన్ రిపోర్టు పూర్తి చేసి మరుసటి రోజు లండన్ తిరిగి వెళ్ళిపోయాడు. ఆగస్టు 17న ర్యాడ్ క్లిఫ్ బోర్డర్ కమిషన్ అవార్డ్ వివరాలు ప్రజలకు బహిర్గత మయ్యాయి. వలసపోతున్న ప్రజలపై దాడులు జరిగి పది లక్షల మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. ప్రఖ్యాత జర్నలిస్టు కులదీప్ నయర్ జరిపిన ఇంటర్వ్యూలో ర్యాడ్ క్లిఫ్ కొన్ని వాస్తవాలను ప్రస్తావిస్తూ, ‘...4096 కి.మీ. పశ్చిమ భాగం, 3323 కి. మీ. తూర్పు భాగంతో భారత ఉపఖండాన్ని ఐదు వారాల్లో విభజించడం అసంభవమే. కానీ వైస్రాయ్ డిక్కీ (మౌంట్ బాటెన్) ఆదేశంతో నాకు గత్యంతరం లేకపోయింది అప్పుడు’ అని చెప్పాడు. ‘ర్యాడ్ క్లిఫ్ సర్! 15 ఆగస్టులోగా మీరు కేవలం సరిహద్దు గీత గీసి ఇవ్వండి, చాలు మాకు’ అని నెహ్రూ, పటేల్, జిన్నా, ఒకే మాట చెప్పారు. ఆవిధంగా, నేను గీసి ఇచ్చిన బౌండరీ లైన్ మ్యాపు, బౌండరీ కమిషన్ అవార్డుగా పరిగణించి, తనకు తానుగా వైస్రాయ్ మౌంట్ బాటెన్ కొన్ని మార్పులు చేర్పులు చేసి అధికారికంగా వెల్లడి చేశాడు’ అని తేల్చేశాడు. పశ్చిమ ప్రాంతంలో పెద్ద నగరం ఏదీ లేదని ర్యాడ్ క్లిఫ్ ఆఖరు క్షణంలో లాహోర్ నగరాన్ని భారత్ నుండి వేరు చేశాడు. అటు వైపు కలిపిన గురుదాస్ పూర్ జిల్లాను మళ్ళీ భారత్‌లోకి చేర్చాడు. అమృత్‌సర్‌లోని పలు తెహసీళ్లు, గ్రామాలను తిరిగి పాక్‌లో కలిపాడు. ఆజాదీకా అమృత మహోత్సవం సందర్భంగా, 75 ఏళ్ల క్రితం సరిహద్దు ప్రాంతాల్లో అసువులు బాసిన అమాయక ప్రజలను ఒక్కసారి స్మరించుకోవడం ఎంతైనా అవసరం. (క్లిక్: మేము ఈ దేశ పౌరులమేనా?) - జిల్లా గోవర్ధన్ విశ్రాంత ప్రావిడెంట్ ఫండ్ కమిషనరు -
సరిహద్దుల్లో బీటింగ్ రిట్రీట్
-
సరిహద్దు పహారాలో ఉమెన్ రైఫిల్స్
భారత్ పాక్ సరిహద్దుల్లో దశాబ్దాలుగా పురుషుల పహారానే ఉంది. కాని చరిత్రలో మొదటిసారి ఆరుగురు మహిళలు అక్కడ కావలికి తుపాకీ పట్టారు. సముద్రమట్టానికి 10 వేల అడుగుల ఎత్తున విధులు నిర్వర్తిస్తున్న ఉమెన్ రైఫిల్స్ మన సైన్యానికి కొత్త డేగకళ్లు అయ్యారు. పాకిస్తాన్–భారత్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ సమీపంలో ఉండే కీలకమైన గస్తీ పాయింట్ ‘సాధనా టాప్’. సముద్రమట్టానికి పదివేల అడుగుల ఎత్తున ఉండే ఈ పాయింట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు అత్యంత సమీపం. పి.ఓ.కె నుంచి పాక్ దన్ను ఉన్న ఉగ్రవాదులు, నకిలీ కరెన్సీ, ఆయుధాలు, డ్రగ్స్ ఈ పాయింట్ నుంచే కాశ్మీర్‌లోకి అడుగుపెడతాయి. దశాబ్దాలుగా ఇక్కడ భారత సైనికులు పహారా కాస్తుంటారు. అయితే ఇన్నాళ్లు పురుష సైనికులు మాత్రమే పహారా కాశారు. చరిత్రలో మొదటిసారి ఇక్కడ 30 మంది మహిళలు గస్తీకి నియుక్తులు కావడం విశేషం. ఉమెన్ రైఫిల్స్ దేశంలో అత్యంత సుదీర్ఘ చరిత్ర ఉన్న పారామిలటరీ దళం అస్సాం రైఫిల్స్. దీనికి మహిళా విభాగం కూడా ఉంది. ఆ విభాగం నుంచి 30 మంది మహిళా సైనికులను డిప్యుటేషన్ మీద సైన్యంలోకి తీసుకుని వాస్తవాధీన రేఖ వద్ద గస్తీకి పెట్టారు సైనికాధికారులు. ఆ మహిళా సైనికాధికారి పర్యవేక్షణలో పని చేసే ఈ ఆరుమంది మగసైనికులతో పాటుగా విధులు నిర్వర్తించాలి. గ్రామీణుల కోసం సాధనా టాప్ చుట్టుపక్కల నలభై పల్లెటూళ్లు ఉన్నాయి. ఈ పల్లెల్లో ఉన్నవారు పనుల కోసం ఉపాధి కోసం నిత్యం సాధనా టాప్ గుండా కాశ్మీర్లో రాకపోక లు సాగిస్తూ ఉంటారు. అయితే ఉగ్రవాదులు, సంఘ విద్రోహులు ఈ గ్రామీణులతో కలిసిపోయి ప్రయాణించే వీలు ఉంటుంది. సైనికులు వీరిని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ గ్రామీణుల్లో మహిళలు కూడా ఉంటారు కనుక మగ సైనికులకు పరిమితులు ఏర్పడుతున్నాయి. అలాంటి సమయంలో సోదాకు మహిళా సైనికులు అవసరమని ఉమెన్ రైఫిల్స్‌ను నియమించారు. వీరు విధుల్లో చేరినప్పటి నుంచి గ్రామీణులు సౌకర్యంగా ఉంటున్నారట. మగ సైనికులతో మాట కలపడం కంటే మహిళా సైనికులతో మాట కలపడం సులువుగా ఉందని వారి అభిప్రాయం. ఇక మహిళలైతే సైనికులైనా వారూ సాటి మహిళలే కనుక ధైర్యం గా సోదాలకు సహకరిస్తున్నారు. అదే సమయంలో ఇంత ప్రమాదకరమైన చోట విధులను నిర్వర్తిస్తున్న వారిని చూసి మెచ్చుకుంటున్నారు. ఆర్మీలో, నేవీలో, ఎయిర్‌ఫోర్స్‌లో వినిపిస్తున్న స్త్రీల విజయాలకు ఇది ఒక కొనసాగింపు. సాహస కొనసాగింపు. -
సరిహద్దులో ‘కొత్త ప్రణాళిక’
న్యూఢిల్లీ: పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి అక్రమ చొరబాట్లను ఆపేందుకు కేంద్రం కొత్త ప్రణాళిక రచించింది. చొరబాట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఉక్కు కంచెలను ఏర్పాటు చేయనున్నామని అధికారులు శుక్రవారం తెలిపారు. దీని కోసం అస్సాంలోని సిల్చార్ వద్ద పైలెట్ ప్రాజెక్టుగా ఏడు కిలోమీటర్ల పొడవున కత్తెరించినా తెగని ఉక్కు కంచె నిర్మించి పరిశీలిస్తున్నారు. ఈ కంచెకు కిలోమీటరుకు రూ. 2 కోట్లు ఖర్చవుతోందని చెప్పారు. పంజాబ్‌లోని అమృత్సర్ వద్ద కూడా 60 కిలోమీటర్ల సరిహద్దు వద్ద కూడా సింగిల్–రో ఉక్కు కంచెను నిర్మించబోతున్నారు. సీడీఎస్‌కు సాయంగా పలువురు అధికారుల నియామకం న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ నేతృత్వంలో కొత్తగా రూపొందించిన సైనిక వ్యవహారాల విభాగంలో ఇద్దరు జాయింట్ సెక్రటరీలు, 13 మంది డిప్యూటీ సెక్రటరీలు, 25 మంది కార్యదర్శి స్థాయి కింది సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. త్రివిధ దళాల సమాహారమైన సీడీఎస్‌ను కలసికట్టుగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నియామకాలు దోహదపడుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ నెల 1న దేశ తొలి త్రిదళాధిపతిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రక్షణ శాఖ అధికారులతో రావత్ వరుసగా భేటీ అవుతున్నారు. భవిష్యత్ రక్షణ సవాళ్లను ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా కేంద్రం సీడీఎస్‌ను ఏర్పాటు చేసింది. అత్యవసర సమయంలో త్రివిధ దళాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో సీడీఎస్ ప్రముఖ పాత్ర పోషించనుంది. సీడీఎస్ బాధ్యతలతోపాటు త్రివిధ దళాలకు సంబంధించిన విషయాలపై రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుగానూ రావత్ వ్యవహరించున్నారు. (చదవండి: రాజకీయాలకు మేము దూరం) -
‘విశ్వాస’ ఘాతుకం
న్యూఢిల్లీ: దాయాది దేశాల ప్రజల్లో పరస్పరం విశ్వాసం నెలకొల్పాలన్న సదుద్దేశంతో వాస్తవాధీన రేఖ వెంబడి వాణిజ్యానికి భారత్ ఇచ్చిన అవకాశాన్ని ఉగ్రవాదులు దుర్వినియోగం చేస్తున్నారు. వాస్తవాధీన రేఖకు ఇరువైపుల ఉన్న భారత వ్యతిరేక శక్తులు(హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులు) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అక్రమ వ్యాపార లావాదేవీలతో విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఆ సొమ్ము నంతా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఉగ్రవాద మూకలకు అందిస్తున్నాయి. ఆ సొమ్ముతో ఉగ్రవాదులు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు సేకరించి భారత్‌పై దాడులకు పాల్పడుతున్నాయి. అంతేకాకుండా ఈ దారి గుండా మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ కూడా భారత దేశంలోకి పెద్ద ఎత్తున వచ్చి పడుతోంది. ఈ విషయం గుర్తించిన భారత దేశం సరిహద్దు వాణిజ్యాన్ని నిషేధించింది. పకడ్బందీగా.... సరిహద్దు ఆవల నుంచి వివిధ పదార్ధాలు, వస్తువులను ఈ మార్గం గుండా భారత దేశానికి రవాణా చేస్తారు. ఆ సమయంలో సరుకు అసలు ధర కంటే బాగా తక్కువ ధరను ఇన్వాయిస్లో చూపిస్తారు. మన దేశంలో వ్యాపారులు ఆ సరుకులను మార్కెట్ ధరకు అమ్మి అత్యధిక లాభాలు సంపాదిస్తున్నారు. ఇలా వచ్చిన అధిక లాభాలను ఉగ్రవాదులకు అందజేస్తున్నారు. ఉగ్రవాద, వేర్పాటువాద సంస్థలతో సంబంధాలు ఉన్న వారు సరిహద్దుకు ఇరువైపుల వ్యాపారాల పేరుతో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని భద్రతా దళ అధికారులు చెబుతున్నారు. వీరే కాకుండా సరిహద్దు దాటి పాక్‌లో ప్రవేశించి అక్కడి ఉగ్ర సంస్థల్లో చేరిన భారతీయులు కొందరు మన దేశంలో ఉన్న వారి బంధు, మిత్రులతో వ్యాపార సంస్థలు పెట్టించి వారి ద్వారా కూడా ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నారని వారు వివరించారు. ఈ దారి గుండా జమ్ము,కశ్మీర్లోకి చేరిన మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ, ఆయుధాలు ఇక్కడి ఉగ్రవాద, వేర్పాటు వాదులకు అందుతున్నాయని, ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా అవుతున్నాయని వారు తెలిపారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్నారన్న ఆరోపణపై అరెస్టు చేసిన జహూ అహ్మద్ వతాలి అనే వ్యాపారి ఎల్వోసీ ట్రేడర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షుడని తేలింది. జహూకు చెందిన కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. 12 మందిని అరెస్టు చేశారు. వేల కోట్ల వాణిజ్యం భారత ప్రభుత్వం 2008లో వాస్తవాధీన రేఖ వెంబడి రెండు చోట్ల వాణిజ్యానికి అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి ఈ దారిలో రూ. 6,900 కోట్ల లావాదేవీలు జరిగాయి. మన దేశం నుంచి అరటిపళ్లు, ఎంబ్రాయిడరీ వస్తువులు, చింతపండు, ఎర్రమిర్చి వంటివి ఎగుమతి అవుతోంటే, కాలిఫోర్నియా బాదంపప్పు, ఎండు ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, మామిడి వంటివి దిగుమతి అవుతున్నాయి. 21 రకాల వస్తువులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో కాలిఫోర్నియా బాదం పప్పు వల్లే వ్యాపారులు అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ మార్గంలో అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, పరిస్థితిని సమీక్షించి వాణిజ్యాన్ని మళ్లీ అనుమతించాలా వద్దా అన్నది నిర్ణయిస్తామని అధికారులు చెప్పారు. -
అధీనరేఖ రక్తసిక్తం
భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో, ముఖ్యంగా అధీనరేఖ వద్ద కొన్నాళ్లుగా మళ్లీ ఉద్రి క్తతలు పెరుగుతున్నాయి. అధీన రేఖ నిశ్శబ్ద రేఖగా ఎప్పుడూ లేదు. కానీ రెండు నెలలుగా అక్కడ చోటు చేసుకున్న ఉదంతాలు గమనిస్తే గత పదిహేనేళ్లలో ఇంత చేటు ఘర్షణలు ఎప్పుడూ లేవని అర్ధమవుతుంది. ఆదివారం పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో భారత కెప్టెన్‌తోసహా నలుగురు జవాన్లు కన్నుమూశారు. అయిదురోజుల్లో ఇలా చనిపోయిన జవాన్ల సంఖ్య 9కి చేరుకుంది. ఇరువైపులా సైని కులతోపాటు సాధారణ పౌరులు కూడా ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎందరో క్షతగాత్రులవుతున్నారు. అధీనరేఖకు, అంతర్జాతీయ సరిహద్దుకు చేర్చి ఉన్న గ్రామాల్లోని ఇళ్లు నిలువునా తూట్లు పడి కనబడుతున్నాయి. సాధారణ పౌరులు ఇళ్లూ వాకిళ్లూ వదిలి సురక్షిత ప్రాంతాలకు వలసపోతున్నారు. పాకిస్తాన్ సైన్యం జరుపుతున్న కాల్పుల కారణంగా అటు అధీన రేఖ వద్ద, ఇటు అంతర్జాతీయ సరిహద్దు వద్ద గత నవంబర్ నుంచి 500 పాఠ శాలలు మూసేయవలసి వచ్చింది. గత సంవత్సరం అధీన రేఖ వద్ద పాకిస్తాన్ వైపు నుంచి 881 కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటుచేసుకోగా ఒక్క డిసెంబర్లోనే అవి 147 ఉన్నాయి. మొన్న జనవరి 1 నుంచి ఇంతవరకూ దాదాపు 240 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. గత నెలలో ఈ ఉదంతాల్లో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య గత ఏడాది ఉదంతా లన్నిటా మరణించినవారి సంఖ్యతో సమానంగా ఉన్నదంటున్నారు. చాలా సంద ర్భాల్లో మన సైన్యం గట్టి జవాబిచ్చింది. పర్యవసానంగా అటువైపు కూడా ప్రాణ నష్టం ఉంటున్నది. తొలుత మీరు కాల్పులు జరిపారంటే మీరు జరిపారని పర స్పరం ఆరోపణలు చేసుకోవడం కూడా సర్వసాధారణమైంది. ఇలాంటి ఉల్లంఘనలు జరిగినప్పుడు ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చర్యలు తీసుకోవడానికి ఇరు దేశాల సైనిక డైరెక్టర్ జనరళ్ల(డీజీఎంఓ) మధ్యా హాట్‌లైన్ సదుపాయం ఉంది. ఈమధ్య కాలంలో ఒకటి రెండుసార్లు అలా మాట్లా డుకున్నారని అంటున్నారు. కానీ ఫలితం లేదు. 2016 సెప్టెంబర్‌లో మన సైన్యం పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి అక్కడ చొరబాటుదార్ల కోసం నిర్మించిన శిబిరాలను ధ్వంసం చేసింది. అంతక్రితం ఉడీ సెక్టార్లో లష్కరే తొయిబా ఉగ్రవాదులు సైనిక స్థావరంపై దాడిచేసి బిహార్ బెటాలియన్‌కు చెందిన 19మంది జవాన్ల ప్రాణాలు తీసినందుకు ప్రతీకారంగా ఈ సర్జికల్ దాడులు జరిగాయి. అయితే అవి సైతం పాకిస్తాన్‌ను కట్టడి చేయలేకపోయాయని ఆ తర్వాత సాగుతున్న ఘర్షణల పరంపరను గమనిస్తే అర్ధమవుతుంది. 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక అధీనరేఖ, అంతర్జాతీయ సరిహద్దు ప్రశాంతంగా ఉన్నాయని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. అయితే ఉల్లంఘనల సంఖ్య మొదట్లో చాలా స్వల్పంగా ఉండేది. కానీ 2013 దాటాక ఈ ఉదంతాలు క్రమేపీ పెరుగుతూ 2015 నాటికి మితిమీరాయి. వాటితోపాటే మరణాల సంఖ్య పెరు గుతోంది. ఇదంతా చొరబాటుదార్ల సమస్యతో మొదలవుతున్నదని మన నిపుణులు చెబుతున్నారు. లష్కరే తొయిబా, ఇతర సంస్థలకు చెందిన మిలిటెంట్లకు పాక్ సైన్యం మారణాయుధాలిచ్చి భారత్ గడ్డపై ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తూ అందులో భాగంగానే కాల్పులు జరుపుతున్నదని వారు విశ్లేషిస్తున్నారు. ఉడీ సెక్టార్లో మన సైన్యానికి భారీ నష్టం కలగజేసిన లష్కరే మిలిటెంట్లు అలా ప్రవే శించినవారే. ఇరు దేశాల మధ్యా రెండుసార్లు పూర్తి స్థాయి యుద్ధాలు చోటు చేసుకున్నాయి. 1999లో కార్గిల్‌లో చొరబడేందుకు పాక్ సైన్యం చేసిన ప్రయత్నాన్ని మన జవాన్లు తిప్పికొట్టారు. ఆ సందర్భంగా దాదాపు మూడు నెలలు చిన్నపాటి యుద్ధం జరిగింది. యుద్ధ సమయాల్లో ప్రభుత్వం ముందుగానే సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తుంది. అక్కడ జవాన్ల కదలికలు ముమ్మరమవుతాయి. యుద్ధం ముగిసిందన్న ప్రకటన వచ్చేవరకూ ఊరు వెళ్లడం క్షేమం కాదని అందరికీ తెలుస్తుంది. కానీ అధీనరేఖ, అంతర్జాతీయ సరిహద్దుల్లోని గ్రామాల ప్రజలది ఏడాది పొడవునా అయోమయ స్థితి. ఈ క్షణం అంతా సవ్యంగానే ఉన్నదని పిస్తుంది. మరుక్షణంలో సరిహద్దుల ఆవలి నుంచి శతఘ్నులు, మోర్టార్లు గర్జిస్తాయి. అవి ఎప్పుడు శాంతిస్తాయో తెలియదు. పొలం పనికెళ్లినవారో, బడి నుంచి తిరిగొస్తున్న పిల్లలో, ఇంట్లో పనిచేసుకుంటున్న మహిళో వాటి బారిన పడతారు. ప్రాణాలైనా పోవచ్చు. తీవ్రంగా గాయపడి శాశ్వత వైకల్యమూ రావొచ్చు. చావు బతుకుల మధ్య ఉండే సన్నటి సరిహద్దు రేఖ అక్కడ చెదిరిపోతుంది. చిత్రమేమంటే ఈ కాల్పుల విరమణ ఉల్లంఘనలూ, వాటిననుసరించి ఉండే పరస్పర హెచ్చ రికలు, వాటికి కొనసాగింపుగా ఆరోపణల యుద్ధం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉన్నా రెండు దేశాల మధ్యా వాణిజ్య లావాదేవీలు ఆగవు. అలా ఆపి రోజూ కోట్లాది రూపాయల వ్యాపారాన్ని నష్టపోవడానికి రెండు దేశాలూ సిద్ధంగా ఉండవు. అయితే ఇరు దేశాల మధ్యా సామరస్య వాతావరణం ఏర్పడితే ఈ వాణిజ్యం మరిన్ని వందల రెట్లు పెరుగుతుందని, అది రెండు ఆర్థిక వ్యవస్థలనూ బలోపేతం చేస్తుందని పాకిస్తాన్ సైన్యం గుర్తించదు. రెండు దేశాల డీజీఎంఓల మధ్యా హాట్‌లైన్ సదుపాయం ఉన్నమాట నిజమే అయినా ఆచరణలో అది పెద్దగా ఉపయోగపడటం లేదు. సమస్యకు మూలంగానీ, దానికి పరిష్కారంగానీ అక్కడ లేకపోవడమే ఇందుకు కారణం. ఇరు దేశాల మధ్యా ఉన్నత స్థాయి చర్చలు జరగడం, అంతర్జాతీయ వేదికల ద్వారా పాకిస్తాన్‌పై ఒత్తిళ్లు తీసుకురావడం ముఖ్యం. అలాగే కశ్మీర్లో ప్రశాంతత నెలకొనడానికి రాజకీయ పరమైన చర్యలు కూడా ప్రారంభించాలి. అక్కడ ప్రశాంతత నెలకొంటే సరిహద్దుల్లో పాక్ ఆటలు సాగవు. ఇప్పుడు అధీనరేఖ వద్ద దాదాపు యుద్ధ వాతావరణం నెల కొంది. దీన్ని సాధారణ స్థితికి తీసుకురావడమన్నది తన చేతుల్లోనే ఉన్నదని పాక్ నాయకత్వం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. -
సినిమాలో చూపినట్టు ఆ సొరంగం నిజమే!
జమ్ముకశ్మీర్: అనుకోకుండా తప్పిపోయి భారత్‌కు వచ్చిన చిన్నారి 'మున్నీ'ని తిరిగి పాకిస్థాన్ చేర్చేందుకు అష్టకష్టాలు పడతాడు బజరంగీ భాయ్‌జాన్. భద్రతా దళాల కళ్లుగప్పి సరిహద్దుల మీదుగా భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లేందుకు భారీ భూసొరంగం మార్గం ఒకటి దొరకడంతో దాని నుంచి ఎలాగోలా పాక్ చేరుకుంటాడు. ఇది సల్మాన్ ఖాన్ నటించిన సూపర్‌హిట్ సినిమా 'బజరంగీ భాయ్‌జాన్'లోని ఓ సన్నివేశం. భారత్-పాక్ మధ్య భూసొరంగం ఉన్నట్టు ఆ సినిమాలో చూపింది కల్పితమే కావొచ్చుకానీ, అలాంటి సొరంగం మార్గం నిజంగానే ఇరుదేశాల సరిహద్దుల కింద ఉందని తాజాగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) గుర్తించింది. పాక్ నుంచి జమ్ముకశ్మీర్ లోకి చొరబడేందుకు వీలుగా ఉన్న ఓ సొరంగాన్ని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద గురువారం కనుగొన్నారు. జమ్ము జిల్లాలోని ఆర్ఎస్ పుర సెక్టర్లో అల్లా మేయి కోథాయ్ ప్రాంతంలో ఈ భారీ భూసొరంగాన్ని బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఇది 50 అడుగుల పొడవుతో ఉన్నట్టు గుర్తించారు. బీఎస్ఎఫ్ అధికారులు ఈ భూసొరంగం ఉన్న ప్రదేశానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి అక్రమంగా చొరబాట్లు జరిపేందుకు ఈ భూసొరంగాన్ని ఉపయోగించుకుంటున్నారా? అన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.