
19 రోజుల తరువాత సరిహద్దు రేఖ వెంబడి ప్రశాంతంగా గడిచిన రాత్రి
జమ్మూ/శ్రీనగర్/చండీగఢ్: భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణ అనంతరం ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జమ్మూకశ్మీర్, నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు చాలా ప్రశాంతంగా ఉంది. 19 రోజుల్లో మొదటిసారిగా షెల్లింగ్, కాల్పులు జరగకుండా ఉన్నాయని ఆర్మీ తెలిపింది. ఏప్రిల్ 22న పహల్గాం దాడి తర్వాత కాల్పుల విరమణ ఉల్లంఘనలలో మొదటిసారి పూర్తిగా విరామం కనిపించింది.
కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొన్ని గంటల తర్వాత, శనివారం రాత్రి, పాకిస్తాన్ జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు మీదుగా వరుస క్షిపణి, డ్రోన్ దాడులను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం మాత్రం ఎలాంటి హింసాత్మక ఘటనలు నమోదు కాలేదు. పూంచ్‌లోని సురాన్‌కోట్‌లో సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొన్నాయి.
పహల్గాం దాడి తరువాత ఏప్రిల్ 23 నుంచి మే 6 వరకు, నియంత్రణ రేఖ వెంబడి అనేక కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. రెండు రోజుల కిందట సూరన్‌కోట్‌లో భారీ కాల్పులు జరిగాయి. దీనితో నివాసితులు భయాందోళనకు గురయ్యారు. దాడి తరువాత, నివాసితులు పట్టణం నుంచి పారిపోయారు. కొందరు సమీపంలోని కొండ గ్రామాలు మరియు బంకర్లలో ఆశ్రయం పొందారు. మరికొందరు జమ్మూలోని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
పరిస్థితి ఇప్పుడు మెరుగుపడటంతో, ప్రజలు త్వరలో పూంచ్‌లోని తమ ఇళ్లకు తిరిగి రావాలని ఆశిస్తున్నారు. శ్రీనగర్, పఠాన్‌కోట్, రాజౌరి, అఖ్‌నూర్, జమ్మూ, కుల్గాం, శ్రీ గంగానగర్, బుద్గాంలలో సాధారణ పరిస్థితికి అద్దం పడుతూ అనేక దృశ్యాలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. సరిహద్దు ప్రాంతాలకే కాకుండా, చండీగఢ్‌తో సహా ఇతర ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేయడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.
రోజువారీ జీవితం తిరిగి ప్రారంభమైందని, పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉందని చండీగఢ్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలు సాధారణ సమయాల ప్రకారం తెరిచి ఉండటానికి పోలీసులు అనుతించారు. అయితే పౌరులు ఎలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని డిప్యూటీ కమిషనర్ హెచ్చరించారు. పగటి పూట ఎలాంటి సమస్యలు లేవని, రాత్రి 7.30 గంటల తరువాత దుకాణాలు మూసివేస్తుండటంతో సాధారణ జనజీవనానికి ఇబ్బందేమీ లేదని, ప్రజల జీవనోపాధి కూడా ప్రభావితం కావడం లేదని జైసల్మేర్‌కు చెందిన ఓ వ్యక్తి వివరించారు.