international border
-
పాక్ కాల్పులతో పెళ్లిళ్లకు చిక్కులు
శ్రీనగర్: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ సైన్యం జరుపుతున్న విచక్షణారహిత కాల్పులతో జమ్మూలోని పలు గ్రామాల్లో పెళ్లిళ్లకు చిక్కులొచ్చి పడ్డాయి. దాంతో చివరి నిమిషంలో పలు పెళ్లిళ్లకు వేదికను మార్చుకోవాల్సి రావడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. భారీ కాల్పుల దెబ్బకు అతిథులు పెళ్లి విందు మధ్య నుంచే అర్ధంతరంగా నిష్క్రమిస్తున్న ఉదంతాలూ చోటుచేసుకుంటున్నాయి. పాక్ రేంజర్లు ఇలా కాల్పులకు తెగబడటం 2021 కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఇదే తొలిసారి. గురువారం రాత్రి నుంచీ అరి్నయా తదితర ప్రాంతాలపై కాల్పులు ఏడు గంటలకు పైగా కొనసాగాయి. మరోవైపు వరి కోతల వేళ కాల్పులకు భయపడి కూలీలెవరూ పొలాలకు కూడా వెళ్లడం లేదు. బంకర్లోనే పాఠాలు! కాల్పుల భయంతో జమ్మూ జిల్లాలో పలు స్థానిక స్కూళ్లు మూతబడ్డాయి. అయితే సరిహద్దుకు సమీపంలోని షోగ్పూర్లో ఉన్న సర్కారీ పాఠశాల మాత్రం శుక్రవారం భూగర్భ బంకర్లలో నడిచింది! తమ ఇంట్లోవాళ్లు భయపడ్డా తాను మాత్రం స్కూలుకు హాజరయ్యానని సునీతా కుమారి అనే విద్యారి్థని చెప్పింది. ఆమెతో పాటు దాదాపు 20 మంది విద్యార్థులు స్కూల్లోని బంకర్లో పాఠాలు విన్నారు. -
అరుణాచల్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు గట్టి ఎదురుదెబ్బ..
వాషింగ్టన్: అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వాదిస్తున్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అరుణాచల్ ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమే తప్ప చైనాలో భాగం కాదని అగ్రరాజ్యం అమెరికా తేల్చిచెప్పింది. చైనా, అరుణాచల్ మధ్యనున్న మెక్‌మోహన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దు వద్ద యథాతథ స్థితిని మార్చడానికి చైనా ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సెనేటర్లు బిల్ హగెట్రీ, జెఫ్ మెర్క్లీ సెనేట్‌లో తీర్మానం ప్రవేశపెట్టగా మరో సెనేటర్ జాన్ కార్నిన్ కూడా దాన్ని ప్రతిపాదించారు. ‘‘స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌కు చైనా నుంచి ముప్పు కొనసాగుతున్న తరుణంలో ఈ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలకు అండగా నిలవడం అమెరికా బాధ్యత. ప్రత్యేకించి భారత్‌కు మా మద్దతు ఉంటుంది’’ అని హగెట్రీ పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద యథాతథ స్థితిని మార్చాలన్న చైనా కుటిల యత్నాలను ఖండిస్తున్నామని చెప్పారు. అమెరికా–భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ముందుకెళ్లనుందని అన్నారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌కు ‘క్వాడ్’ కూటమి మద్దతు ఉంటుందని వెల్లడించారు. సరిహద్దు వెంట వివాదాస్పద ప్రాంతాల్లో గ్రామాల నిర్మాణం, అరుణాచల్ భూభాగాలకు మాండరిన్ భాషలో మ్యాప్‌లను రూపొందించడాన్ని తీర్మానంలో ప్రస్తావించారు. -
గాల్లో గూఢచారులు: స్పై బెలూన్లు... కథా కమామిషు
ఓ బెలూన్ కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అమెరికా గగనతలంపై 60 వేల అడుగుల ఎత్తున ఎగురుతూ కన్పించిన ఈ చైనా బెలూన్ కచ్చితంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను భారీగా పెంచేసింది. అది కచ్చితంగా నిఘా బాపతేనని అమెరికా, వాతావరణ పరిశోధనలు చేస్తూ దారి తప్పిందని చైనా వాదిస్తున్నాయి. సైనిక రంగంలో నిఘా బెలూన్ల వాడకం ఈ ఉదంతంతో మరోసారి తెరపైకి వచ్చింది... ఈ కాలంలోనూ అవసరముందా? సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ ఉపగ్రహాలు, డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక ఈ నిఘా బెలూన్లతో పనేమిటన్న సందేహాలు సహజం. కానీ ఇప్పటికీ మిలటరీలో ఈ బెలూన్లకు ఎంతో ప్రాధాన్యముంది. ఉపగ్రహాలతో పోలిస్తే వీటిని చాలా చౌకలో తయారు చేయొచ్చు. నిర్ధిష్ట గగన తలాలకు పంపడమూ ఎంతో సులభం. గాలివాటానికి అనుగుణంగా బెలూన్ల దిశను మార్చవచ్చు. అత్యంత ఎత్తులో ప్రయాణించే ఈ బెలూన్లు సేకరించే సమాచారం, ఫొటోలు చాలా నాణ్యతతో ఉంటాయి. లక్షిత గగనతలాల్లో రోజుల తరబడి ప్రయాణించే సత్తా వీటికుంది. చైనా ప్రయోగం వెనక... అమెరికా, చైనా మధ్య తరచూ ఉద్రిక్తతలు నెలకొంటూనే ఉన్నాయి. తైవాన్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు, చైనాలో మానవహక్కుల నుంచి హాంగ్‌కాంగ్‌లో ప్రజాస్వామ్యం నిర్వీర్యం చేసే చర్యల దాకా తరచూ ఘర్షణాత్మక వాతావరణం నెలకొంటూనే ఉంది. కొంతకాలం క్రితం అప్పటి అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ సందర్శన నాటి నుంచీ విభేదాలు మరింత ముదిరాయి. చైనా 34 యుద్ధ విమానాలను,, 9 యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రంలో మోహరించింది. ప్రతిగా తైవాన్ కూడా యుద్ధ విమానాల్ని సన్నద్ధం చేయడం, తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించడం ఉద్రిక్తతల్ని పెంచింది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ చైనా పర్యటనకు కొద్ది రోజుల ముందే చైనా నిఘా బెలూన్ ఇలా అమెరికా గగనతలంలోకి ప్రవేశించి కలకలం రేపింది. తద్వారా అగ్రరాజ్యానికి చైనా ఓ రకంగా హెచ్చరికలు పంపిందని భావిస్తున్నారు. ఎప్పట్నుంచి వాడుకలో ఉన్నాయి? ► ఈ బెలూన్లను ఫ్రెంచి విప్లవం కాలం నుంచే వాడుతున్నారు. యుద్ధ భూమిలో ఆస్ట్రియా, డచ్ సైనిక దళాల కదలికలు తెలుసుకునేందుకు 1794లో ఫ్రాన్స్ వీటిని తొలిసారి వాడింది. ► గాల్లో చాలా ఎత్తున ఎగిరే ఈ బెలూన్ల ద్వారా సమాచార సేకరణ తేలిక కావడంతో అమెరికా అంతర్యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వీటి వాడకం పెరిగింది. ► రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఒక అడుగు ముందుకేసి ప్రత్యర్థులపై ఈ బెలూన్లతో బాంబు దాడులకు దిగిన సందర్భాలూ ఉన్నాయి! జపాన్ సైన్యం ప్రయోగించిన బెలూన్ బాంబు అమెరికాలో ఒరెగాన్ వుడ్‌ల్యాండ్‌లో పడి ముగ్గురు పౌరులు మరణించారు. ► రెండో ప్రపంచ యుద్దం తర్వాత ప్రాజెక్ట్ జెనెట్రిక్స్ పేరుతో అమెరికా ఈ బెలూన్లపై విస్తృతంగా ప్రయోగాలు చేసింది. 1950లో వీటి సాయంతో సోవియట్ భూభాగాన్ని ఫొటోలు తీసింది. ► అమెరికా ఆర్మీ ప్రాజెక్టు మొగల్ పేరుతో బెలూన్లకు మైక్రోఫోన్లను అమర్చి సోవియట్ యూనియన్ అణు పరీక్షలకు సంబంధించిన శబ్దాలను రికార్డు చేసింది. ఏమిటీ నిఘా బెలూన్లు? నిఘా బెలూన్లను అత్యంత తేలికైన హీలియం వాయువుతో నింపుతారు. కెమెరాలు, రాడార్లు, సెన్సార్లు, కమ్యూనికేషన్ పరికరాలు అమర్చుతారు. అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు సుదూర ప్రాంతాల్లోని సమాచారాన్ని కూడా అత్యంత స్పష్టతతో సేకరించగలవు. ప్రయాణికుల విమానాలు 40 వేల అడుగుల ఎత్తు దాటవు. ఈ స్పై బెలూన్లు భూమికి 60 వేల నుంచి, లక్షా 50 వేల అడుగుల ఎత్తులో రోజుల తరబడి ప్రయాణించే సామర్థ్యం కలిగినవి. స్పై బెలూన్లు... కథా కమామిషు ► ప్రచ్ఛన్న యుద్ధ తొలినాళ్లలో వీటిని విరివిగా వాడారు ► అత్యంత ఎత్తుల్లో రాడార్లకూ చిక్కకుండా వెళ్లగలవు ► సౌర పలకలు ► నిఘా పరికరాలు ► గాలివాటంగా కదులుతాయి ► కిందివైపు కెమెరా ఉంటుంది ► రాడార్ వ్యవస్థలను అనుసంధానించవచ్చు ► 24వేల నుంచి 37వేల మీటర్ల ఎత్తులో ప్రయాణించగలవు – సాక్షి, నేషనల్ డెస్క్ -
నూపుర్ శర్మను చంపేందుకు దేశ సరిహద్దు దాటిన పాకిస్థానీ
జైపూర్: నూపుర్ శర్మను హత్య చేసేందుకు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్ జాతీయుడ్ని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అధికారులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్ జిల్లాలో జులై 16న అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఐబీ సహా ఇతర నిఘా సంస్థల బృందం అతడ్ని విచారిస్తోంది. జులై 16న రాత్రి 11 గంటల సమయంలో హిందుమల్‌కోట్ సరిహద్దు అవుట్‌పోస్టు వద్ద అనుమానాస్పద రీతిలో కన్పించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వివరించారు. అతని పేరు రిజ్వాన్ అశ్రఫ్ అని, పాకిస్థాన్‌లోని ఉత్తర పంజాబ్ మండీ బౌహద్దీన్ నగర వాసినని చెప్పాడని వెల్లడించారు. అతని వద్ద 11 అంగుళాల కత్తితో పాటు బ్యాగులో మతానికి సంబంధించిన పుస్తకాలు, బట్టలు, ఆహారం, మట్టి ఉన్నట్లు గుర్తించామన్నారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మను చంపేందుకే తాను దేశం దాటి వచ్చినట్లు రిజ్వాన్ ప్రాథమిక విచారణలో చెప్పాడని అధికారులు పేర్కొన్నారు. అనంతరం తదుపరి విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరచగా.. 8 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఐబీ, రా, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు నిందితుడ్ని విచారిస్తున్నారు. చదవండి: నూపుర్ శర్మకు ప్రాణహాని ఉంది నిజమే.. అరెస్టు నుంచి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు -
‘పక్కా’గా కట్టేస్తోంది
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో డ్రాగన్ దేశం తన దురాక్రమణను యధేచ్ఛగా కొనసాగిస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా ఏడాది కాలంలోనే వాస్తవాధీన రేఖ వెంబడి 60 భవనాల సముదాయాన్ని నిర్మించింది. అంతర్జాతీయ సరిహద్దులు, వాస్తవాధీన రేఖ మధ్యలో భారత్ భూభాగంలో 6 కి.మీ. పరిధిలో ఈ కొత్త భవనాలు వెలిశాయి. 2019లో తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ ప్రాంతంలో భవనాలేవీ లేవు. ఎన్డీటీవీ వార్తా సంస్థ తాజాగా సంపాదించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ భవనాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అరుణాచల్ సరిహద్దుల్లో 100 ఇళ్లతో కూడిన ఒక గ్రామాన్నే నిర్మించిన చైనా దానికి 93 కి.మీ. దూరంలో తూర్పున ఈ భవన సముదాయాన్ని నిర్మించింది. మరోవైపు భారత్ ఆర్మీ ఈ శాటిలైట్ చిత్రాలను చూసి వాస్తవాధీన రేఖకి ఉత్తరాన ఈ భవన నిర్మాణం జరిగిందని, ఆ ప్రాంతం చైనా వైపే ఉందని అంటోంది. అరుణాచల్ సీఎం ప్రేమ ఖాండూ ఇతర ప్రభుత్వ అధికారులెవరూ ఈ కొత్త నిర్మాణాలపై పెదవి విప్పడం లేదు. చైనా గత దశాబ్దకాలంగా సరిహద్దుల్లో అక్రమ నిర్మాణాలను పెంచుతోంది. నిఘా రెట్టింపు చేస్తోంది. భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతూ వస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఏకంగా 100 ఇళ్లతో కూడిన గ్రామాన్నే నిర్మించినట్టు ఈ ఏడాది మొదట్లోనే ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా వెల్లడింది. ఇటీవల అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ కూడా ఈ విషయాన్ని తన నివేదికలో ధ్రువీకరించింది. ఇలా ఇష్టారాజ్యంగా సరిహద్దుల్లో ఆక్రమణలు పెంచుకుంటూ వెళితే చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోమని భారత్ హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ చైనా ఏకపక్షంగా సరిహద్దుల్లో పౌరులు నివాసాలు ఏర్పరుచుకోవడానికి వీలుగా కొత్త భూ సరిహద్దు చట్టాన్ని కూడా తీసుకువచ్చింది. భూటాన్‌లో 4 గ్రామాలు నిర్మించిన చైనా భూటాన్‌లో చైనా దురాక్రమణ జోరుగా సాగుతోంది. డోక్లాం పీఠభూమికి సమీపంలో ఇటీవల చైనా 4 గ్రామాలను నిర్మించింది. దీనికి సంబంధించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలను కాంగ్రెస్ నేతలు పలువురు గురువారం ట్వీట్‌చేశారు. ఈ ఏడాది మే–నవంబర్ మధ్య చైనా ఈ నిర్మాణాలను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇలా సరిహద్దుల్లో చైనా భూముల్ని ఆక్రమించడం దేశ భద్రతకు పెనుముప్పుగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి, ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్మాణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు. -
సరిహద్దుల్లో రబ్బర్ బోట్ల కలకలం..
శ్రీనగర్ : వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి టెర్రర్ లాంచ్ ప్యాడ్ల వద్ద రబ్బర్ బోట్లు కనిపించడంతో సరిహద్దుల్లో భద్రతా దళాలు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశాయి. రబ్బర్ పడవలను నిఘా వర్గాలు గుర్తించడంతో సరిహద్దు వెంబడి చిన్న నీటివనరులు, తీరప్రాంతాల్లో భద్రతా దళాలు గస్తీని తీవ్రతరం చేశాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అఖ్నూర్, సాంబ, కథువ, జమ్మూ డివిజన్లలో నిఘా సంస్థలు 13 చిన్ననీటి వనరులను గుర్తించి ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించాయి. తీరప్రాంతంలో నౌకలు, పడవల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రవేశించి దాడులకు తెగబడతారని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఉగ్రవాదులు కృష్ణ గటి నది ద్వారా దేశంలోకి చొరబాట్లను ప్రేరేపించవచ్చని భద్రతా దళాలను నిఘా వర్గాలు హెచ్చరించాయి. గుజరాత్ తీరం గుండా ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించి దాడులకు తెగబడవచ్చని, అండర్ వాటర్ దాడులకు పాల్పడవచ్చని నిఘా సంస్థలు చేసిన హెచ్చరికలతో భద్రతా దళాలు, నేవీ కోస్ట్‌గార్డ్స్ అప్రమత్తమయ్యాయి. -
యుద్ధానికి పాక్ సన్నాహాలు
ఇస్లామాబాద్ : ఇండో-పాక్ సరిహద్దులో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత మెరుపుదాడులపై తీవ్ర అసహనంతో ఊగిపోతున్న పాక్ ప్రతిదాడులకు సిద్ధమని పేర్కొనడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. పాక్ నేతల గాంభీర్య ప్రకటనలకు తోడు అంతర్జాతీయ సరిహద్దు, వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ సేనలు, ట్యాంక్‌లు మోహరించడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పూంచ్ సెక్టార్లో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటంతో పదిమంది జవాన్లు గాయపడ్డారు. పలు నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. భారత సేనలు ప్రతిఘటించడంతో పాక్ వైపు కూడా నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. మంజికోట్,పూంచ్, నౌషెరా, రాజోరి, అఖ్నూర్, సియోల్‌కోట్ సెక్టార్లలో కాల్పులు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. పాక్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైనా దీటుగా ప్రతిస్పందించేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. -
కాల్పుల విరమణకు తూట్లు
జమ్మూ: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట భారత బలగాలు లక్ష్యంగా మంగళవారం రాత్రి విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ దాడిలో ఓ అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్ అధికారి సహా నలుగురు సరిహద్దు భద్రతాదళం(బీఎస్ఎఫ్) జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయమై బీఎస్ఎఫ్ పశ్చిమ కమాండ్ అదనపు డైరెక్టర్ జనరల్(ఏడీజీ) కేఎన్ చౌబే స్పందిస్తూ.. ‘కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు భారత్ అంగీకరిస్తే, పాకిస్తాన్ మాత్రం దానికి తూట్లు పొడిచింది. పాక్ చేయాల్సింది చేసింది. ఈ నమ్మక ద్రోహానికి దీటుగా స్పందించడం ఇప్పుడు మావంతు’ అని వ్యాఖ్యానించారు. సాంబా జిల్లాలోని రామ్‌గఢ్ సెక్టార్లో ఉన్న ఛామ్లియాల్ బోర్డర్ పోస్ట్‌కు రక్షణ సామగ్రిని తీసుకెళ్తున్న బీఎస్ఎఫ్ బృందంపై పాక్ రేంజర్లు మంగళవారం రాత్రి 9.40 గంటలకు ఏకపక్షంగా కాల్పులు జరిపారన్నారు. దీంతో వీరిని రక్షించేందుకు అసిస్టెంట్ కమాండెంట్ జితేందర్ సింగ్ బృందం అక్కడికి చేరుకోగానే పాక్ బలగాలు వెంటనే మోర్టార్లను ప్రయోగించాయన్నారు. ఈ దాడిలో బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేందర్ సింగ్(రాజస్తాన్)తో పాటు ఎస్సై రజ్నీశ్ కుమార్(యూపీ), ఏఎస్సై రామ్నివాస్(రాజస్తాన్), కానిస్టేబుల్ హన్స్‌రాజ్(రాజస్తాన్) ప్రాణాలు కోల్పోయినట్లు చౌబే తెలిపారు. పాక్ కాల్పుల్లో గాయపడ్డ ఐదుగురు జవాన్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నామన్నారు. పాక్ కాల్పులు బుధవారం తెల్లవారుజాము 4.30 గంటలవరకూ కొనసాగాయనీ, భారత బలగాలు పాక్ దాడిని దీటుగా తిప్పికొట్టాయన్నారు. దీనిపై పాక్‌కు నిరసన తెలియజేస్తామన్నారు. -
కాల్పుల విరమణకు పాకిస్తాన్ తూట్లు
జమ్మూ / శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట భారత పోస్టులు, పౌర ఆవాసాలపై ఆదివారం ఎలాంటి కవ్వింపు లేకుండా విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. పాక్ రేంజర్లు జరిపిన ఈ కాల్పుల్లో ఇద్దరు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జవాన్లు ప్రాణాలు కోల్పోగా, ఓ పోలీస్ అధికారి సహా 14 మంది గాయపడ్డారు. 2003 కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంవో) గత నెల 29న అంగీకరించారు. ఈ ఘటన జరిగి వారంరోజులు కూడా గడవకముందే పాకిస్తాన్ ఆదివారం తెల్లవారుజామున 1.15 గంటలకు జమ్మూలోని అఖ్నూర్, కనచాక్, ఖౌర్ సెక్టార్లపై మోర్టార్లు, భారీ ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు పాక్ దాడిని దీటుగా తిప్పికొట్టాయి. పాక్ కాల్పుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ ఏఎస్సై ఎస్.ఎన్.యాదవ్(47), కానిస్టేబుల్ వీకే పాండేలు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వీరిద్దరూ మృతిచెందారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో పాక్ వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. పాక్ మాటల్లో ఒకటి చెప్పి, చేతల్లో మరొకటి చేస్తుందని తాజా ఘటన రుజువు చేసిందని జమ్మూ ఫ్రాంటియర్ బీఎస్ఎఫ్ ఐజీ రామ్ అవతార్ మండిపడ్డారు. రక్తపాతాన్ని ఆపండి: మెహబూబా జమ్మూకశ్మీర్‌లో రక్తపాతాన్ని ఆపేందుకు భారత్, పాక్‌ల డీజీఎంవోలు వెంటనే మరోసారి చర్చలు జరపాలని ఆ రాష్ట్ర సీఎం మెహబూబా ముఫ్తీ విజ్ఞప్తి చేశారు. శ్రీనగర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇరుదేశాల కాల్పులతో జవాన్లు, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు వేర్పాటువాదులు కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసం ముందుకు రావాలన్నారు. కశ్మీర్ సమస్యను రాజకీయంగానే పరిష్కరించగలమన్నారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో రంజాన్‌మాసంలో మిలటరీ ఆపరేషన్లు నిలిపివేసిన నేపథ్యంలో ఉగ్రవాద సంస్థల్లో కశ్మీరీ యువత భారీగా చేరుతోందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ ఏడాదిలో కశ్మీర్ నుంచి 81 మంది యువకులు వివిధ ఉగ్ర సంస్థల్లో చేరినట్లు వెల్లడించాయి. ఈ ఏడాదే విచ్చలవిడిగా.. సంవత్సరం పాక్ కాల్పుల ఘటనలు 2015 287 2016 271 2017 860 2018(మే చివరి నాటికి) 1252 -
సరిహద్దులో పేట్రేగిన పాక్
జమ్మూ / ఆర్నియా / శ్రీనగర్: కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ మరోసారి తూట్లు పొడిచింది.అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట జమ్మూకశ్మీర్‌లోని గ్రామాలు, బీఎస్ఎఫ్ ఔట్‌పోస్టులు లక్ష్యంగా పాక్ రేంజర్లు బుధవారం మోర్టార్లు, భారీ ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆర్ఎస్ పురా, ఆర్నియా, బిష్నాహ్, రామ్‌గఢ్, సాంబా సెక్టార్లలో కొన్నిచోట్ల మంగళవారం అర్థరాత్రి నుంచే పాక్ బలగాలు కాల్పులు ప్రారంభించాయని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ కాల్పులు క్రమంగా మిగతా సెక్టార్లకూ విస్తరించాయన్నారు. పాక్ కాల్పుల నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవడంతో ఆర్నియా పట్టణం నిర్మానుష్యంగా మారిపోయిందన్నారు. ఆర్నియా పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 76,000 మందికి పైగా ప్రజలు ప్రాణ భయంతో సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారన్నారు. మరోవైపు పాక్ కాల్పుల మోతపై బిషన్‌సింగ్(78) అనే స్థానికుడు స్పందిస్తూ.. ‘1971 తర్వాత ఇంత భారీస్థాయిలో షెల్లింగ్‌ను నేనెప్పుడూ చూడలేదు. వెంటనే పాకిస్తాన్‌తో యుద్ధం చేసి ఈ సమస్యలన్నింటిని ఒకేసారి పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీని మేం డిమాండ్ చేస్తున్నాం’ అని చెప్పారు. మరోవైపు అనంతనాగ్ జిల్లాలో గస్తీలో ఉన్న బలగాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్‌ను విసిరి పరారయ్యారు. ఈ ఘటనలో 10 మంది పౌరులు గాయపడ్డారు. -
జమ్మూలో పాక్ బలగాల దుశ్చర్య
జమ్మూ: కశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ బలగాలు రెచ్చిపోయాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఆర్ఎస్ పుర, బిష్నా, ఆర్నియా సెక్టార్లలోని గ్రామాలు, బోర్డర్ ఔట్‌పోస్టులపై మోర్టార్లు, బుల్లెట్ల వర్షం కురిపించాయి. ఈ కాల్పుల్లో జార్ఖండ్‌కు చెందిన బీఎస్ఎఫ్ జవాను సీతారాం ఉపాధ్యాయ, నలుగురు పౌరులు ప్రాణాలుకోల్పోయారు. 12 మంది గాయపడ్డారు. పాక్ బలగాల చర్యలను మన బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయని బీఎస్ఎఫ్ ఐజీ జమ్మూ ఫ్రాంటియర్ రామ్ అవతార్ చెప్పారు. 2011లో సీతారాం బీఎస్ఎఫ్లో చేరారు. అతనికి మూడేళ్ల కుమారుడు, ఏడాది కుమార్తె ఉన్నారని అధికారులు తెలిపారు. నేడు కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటన ప్రధాని మోదీ రెండు రోజులపాటు కశ్మీర్లో పర్యటిస్తారు. లఢఖ్, కశ్మీర్ లోయ మధ్య అన్ని కాలాల్లోనూ రాకపోకలు సాగించేందుకు వీలుగా నిర్మించనున్న ప్రతిష్టాత్మక జోజిల్లా సొరంగం పనులను ఆయన శనివారం ప్రారంభించనున్నారు. శ్రీనగర్ రింగ్‌రోడ్, జమ్మూ రింగ్‌రోడ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. కిషన్‌గంగా పవర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. -
పాక్ పోస్టులపై బీఎస్ఎఫ్ మోర్టార్ల వర్షం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట భారత గ్రామాలు, పోస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న పాక్ బలగాలకు దీటుగా జవాబిస్తున్నట్లు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఉన్నతాధికారి ఒకరు సోమవారం తెలిపారు. పాక్ ఆర్మీ పోస్టులే లక్ష్యంగా ఇప్పటివరకూ బీఎస్ఎఫ్ 9,000 రౌండ్ల మోర్టార్ షెల్స్‌ను ప్రయోగించిందని వెల్లడించారు. భారత బలగాలు చాలా కచ్చితత్వంతో చేసిన దాడిలో పాక్ ఆర్మీకి చెందిన పలు పోస్టులు, మోర్టార్ లాంచింగ్ ప్యాడ్లు, ఆయుధాలు, ఇంధన డంప్‌లు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. భారత బలగాల దాడిలో పాక్ రేంజర్ల ఇంధన డంప్ ధ్వంసమవుతున్న రెండు వీడియోల్ని విడుదల చేశారు. జమ్మూ వెంట ఉన్న 190 కి.మీల అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని తెలిపారు. జమ్మూలోని మక్వాల్–కనచక్ బోర్డర్ పోస్టుల మధ్య ఉన్న చికెన్‌నెక్ ప్రాంతంపై తొలిసారి పాక్ కాల్పులు జరిపిందని వెల్లడించారు. భారత బలగాల తీవ్ర ప్రతిస్పందనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ రేంజర్లను పోత్సహించేందుకు ఆ దేశ సీనియర్ ఆర్మీ కమాండర్లు సరిహద్దుకు చేరుకోవడాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. భారత బలగాలతో చర్చలు జరిపేందుకు, ఫ్లాగ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు పాక్ రేంజర్లు విముఖత చూపుతున్నారని చెప్పారు. కాల్పుల మాటున దేశంలోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉండటంతో అంబుష్ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. ఆగని పాక్ కాల్పులు జమ్మూ, రాజౌరీ జిల్లాల్లోని మూడు సెక్టార్లపై పాకిస్తాన్ బలగాలు సోమవారం కూడా విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఆదివారం సాయంత్రం నుంచి మొదలైన ఈ కాల్పులు సోమవారం తెల్లవారుజాము 5.45 గంటల వరకూ కొనసాగాయని ఓ బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు. -
పాక్ కాల్పుల్లో 11కు చేరిన మృతులు
జమ్మూ: పాకిస్తాన్ వరుసగా నాలుగోరోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ(ఎల్వోసీ)తో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న జమ్మూ, కథువా, సాంబా, పూంచ్, రాజౌరీ ప్రాంతాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడి సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీకే రాయ్ ప్రాణాలు కోల్పోయినట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. దీంతో గత నాలుగు రోజుల్లో పాక్ కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 11కు చేరుకుందన్నారు. చనిపోయినవారిలో ముగ్గురు ఆర్మీ, ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ఆరుగు రు పౌరులున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని 40,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. గణతంత్ర వేడుకల వేళ అలజడి సృష్టించేందుకు నలుగురు ఉగ్రవాదులు కశ్మీర్లోకి ప్రవేశించవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. -
సరిహద్దుల్లో భారత్ ప్రతీకారం!
జమ్మూ: అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ కుయుక్తులకు భారత్ దీటైన సమాధానం ఇస్తోంది. సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న బీఎస్ఎఫ్ హెడ్‌కానిస్టేబుల్‌పై పాక్ సైనికులు కాల్పులు జరిపి హతమార్చటంతో రాత్రికి రాత్రే భారత బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. బుధవారం రాత్రి సాంబా సెక్టార్ సమీపంలో దాయాదిపై విరుచుకుపడిన భారత బలగాలు మూడు పాక్ ఔట్‌పోస్టులను ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో 8–10 పాకిస్తాన్ రేంజర్లు హతమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించగా.. పాక్‌కు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందని బీఎస్ఎఫ్ ఐజీ రామ్ అవతార్ వెల్లడించారు. అటు, జమ్మూ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుగుండా చొరబాటుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని బీఎస్ఎఫ్ భగ్నం చేసింది. ఓ ఉగ్రవాదిని కాల్చి చంపగా మిగిలిన వారు పారిపోయారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, పాక్‌తో 200 కిలోమీటర్ల మేర ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ ‘ఆపరేషన్ అలర్ట్’ ప్రారంభించింది. వేడెక్కిన సరిహద్దు బుధవారం రాత్రి ఆర్పీ హజారా అనే కానిస్టేబుల్ సాంబా సెక్టార్ సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తుండగా.. పాకిస్తాన్ వైపునుంచి అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయి. భారత బలగాలు అప్రమత్తమై ప్రతిస్పందించేలోపే హజారా బుల్లెట్ గాయాలతో నేలకొరిగారు. వెంటనే బీఎస్ఎఫ్ ప్రతీకారానికి దిగింది. సాంబా సెక్టార్లో పాక్ మోర్టార్లున్న ప్రాంతాన్ని గుర్తించి భారత బలగాలు ఎదురుదాడి చేశాయి. ఈ స్థాయిలో ప్రతిఘటనను ఊహించని పాక్‌కు ఈ మెరుపుదాడితో తీవ్ర నష్టం వాటిల్లింది. సోలార్ ప్యానళ్లు, ఆయుధాలు నష్టపోయాయని.. ప్రాణనష్టం భారీగానే ఉండొచ్చని భారత ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. చొరబాట్లపై ‘ఆపరేషన్ అలర్ట్’ శీతాకాలంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మంచు తీవ్రస్థాయిలో కురుస్తుంది. ఈ పరిస్థితుల్లో గస్తీకాసేందుకు ప్రతికూల వాతావరణం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకుని పాక్ వైపునుంచి చొరబాట్లకు అవకాశం ఉంటుంది. అందుకే వీటిని నిరోధించేందుకు బీఎస్ఎఫ్ అంతర్జాతీయ సరిహద్దు వెంట ‘ఆపరేషన్ అలర్ట్’ను ప్రారంభించింది. మరోవైపు, పీవోకే సరిహద్దుల్లోని ఆర్ఎస్ పుర సెక్టార్లో ముగ్గురు ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నించగా బలగాలు తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఓ అనుమానిత ఉగ్రవాది చనిపోగా మిగిలిన వారు పారిపోయారని అధికారులు వెల్లడించారు. -
సొరంగం నుంచి ఉగ్రవాదులు
సాంబా సెక్టార్లో గుర్తించిన సైన్యం న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని సాంబా సెక్టార్లో మంగళవారం బలగాల చేతుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు సొరంగం ద్వారా చొరబడినట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) చీఫ్ కేకే శర్మ చెప్పారు. అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వద్ద పొలాల్లో 80 మీటర్ల సొరంగ మార్గం ద్వారా అక్రమంగా ప్రవేశించినట్లు చెప్పారు. ‘చమ్లియాల్ ఔట్‌పోస్టు వద్ద ఆపరేషన్ పూర్తరుున తర్వాత కంచెను పరిశీలించాం. ఉగ్రవాదులు కంచెను తొలగించిన ఆనవాళ్లేవీ కనపడలేదు. అరుుతే బుధవారం ఉదయం అక్కడ 2బై2 చిన్న సొరంగమార్గాన్ని గుర్తించాం. పంట పొలాల్లో దీన్ని తవ్వారు.’ అని చెప్పారు. ఈ సొరంగం.. అంతర్జాతీయ సరిహద్దు నుంచి 75-80 మీటర్ల దూరంలో, కంచె నుంచి 35-40 మీటర్లు ఉంది. దాడిలో జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ హస్తం ఉందనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన ముష్కరుల వద్ద జైషే మొహమ్మద్‌కు చెందిన ‘అఫ్జల్ గురు దళం (ఏజీఎస్)’ అని ఉర్దూలో రాసి ఉన్న నోట్ లభ్యమైంది. రైళ్ల పేల్చివేతకు కుట్ర సాంబా సెక్టార్లో చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులు దేశంలో భారీ విధ్వంసం చేసేందుకు కుట్ర పన్నారు. రైళ్లను, రైలు పట్టాలను పేల్చేయడం లాంటి వరుస దాడులకు పన్నాగం పన్నినట్లు బీఎస్ఎఫ్ అదనపు డెరైక్టర్ జనరల్ అరుణ్ చెప్పారు. 5 చైన్ ఐఈడీ (అత్యాధునిక పేలుడు పదార్థాలు), ద్రవరూపంలోని పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టించాలనుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి ఐదు సీసాల ట్రైనైట్రోగ్లిసరిన్ అనే ద్రవ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటితోపాటు 3 ఏకే 47 తుపాకులు, 20 మేగజీన్లు, 517 బుల్లెట్లు, 8ఎంఎం పిస్టల్, 20 గ్రెనేడ్లు, జీపీఎస్ సెట్ స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ చీఫ్ సమీక్ష నగ్రోటాలో దాడి జరిగిన ప్రాంతాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ సందర్శించారు. దాడి వివరాలను కమాండర్లు సుహాగ్‌కు వివరించారు. భద్రతా పరిస్థితులను ఆయన సమీక్షించారు. -
కాశ్మీర్లో మళ్లీ పాక్ రేంజర్ల కాల్పులు
జమ్ము కాశ్మీర్‌లోని సాంబా, జమ్ము జిల్లాల పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దులో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ రేంజర్లు భారత భూభాగంపై కాల్పులు జరిపారు. అయితే దీనివల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. సాంబా జిల్లాలోని రాంగఢ్ సెక్టార్లో పాకిస్థాన్ రేంజర్లు బీఎస్ఎఫ్ శిబిరాల మీద కాల్పులు జరిపినగ్లో ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. అయితే బీఎస్ఎఫ్ కూడా చూస్తూ ఊరుకోలేదని, వాళ్లు కూడా ఎదురు కాల్పులు జరిపారని ఆయన అన్నారు. అంతర్జాతీయ సరిహద్దులతో పాటు జమ్ము కాశ్మీర్‌లోని నియంత్రణరేఖ వద్ద పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే జమ్ము కాశ్మీర్లో ఎన్నికలు కూడా జరగనుండటంతో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకునేలా ఉండాలని సైన్యం అప్రమత్తం అయ్యింది. -
వారికి బంకర్లే రక్షణ..!
జమ్మూకాశ్మీర్ పల్లె ప్రజల దుస్థితి.. పాక్ కాల్పుల మోతతో భయంభయంగా గడుపుతున్న కాశ్మీరీలు.. న్యూఢిల్లీ: ఇరుకు బంకర్లలో పిల్లలను హత్తుకుని బిక్కుబిక్కుమంటున్న తల్లులు.. ఎప్పుడేం జరుగుతుందోనని భయంభయంగా ఊరివైపు చూస్తున్న తండ్రులు.. కాస్త దూరంలో చెవులు చిల్లులు పడేలా బాంబు పేలుళ్లు.. కాల్పుల మోతలు..! కూలిన ఇళ్లు, క్షతగాత్రుల హాహాకారాలు.. ! ఇదంతా ఏ గాజాలోనో, అఫ్ఘానిస్థాన్‌లోనో, ఇరాక్‌లోనో కనిపించే దృశ్యమనుకుంటే పొరపడినట్లే! ఇది.. సాక్షాత్తూ భారతావని శిరస్సులాంటి జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తున్న అనుదిన వ్యథాభరిత చిత్రం..!! కాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో రెండు వారాలుగా పాక్ బలగాలు జరుపుతున్న కాల్పులు అక్కడి గ్రామాల ప్రజలకు వణుకు పుట్టిస్తున్నాయి. కాల్పుల్లో శనివారం వరకు ముగ్గురు కాశ్మీరీలు మృతిచెందగా, పదిమందికిపైగా గాయపడ్డారు. పాక్ కాల్పులకు భయపడి వందలాది ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఆర్ఎస్ పురా సెక్టార్ త్రేవా గ్రామ ప్రజలను దగ్గర్లోని బంకరే ఆదుకుంటోంది. దాదాపు పదిమంది మాత్రమే పట్టే ఈ ఇరుకు బంకర్లో మహిళలు, పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. భోజనం చేయగానే అక్కడికి వెళ్తున్నారు. సరిహద్దులోని పలు గ్రామాల ప్రజలు పదేళ్ల కిందట వాడి వదిలేసిన బంకర్లను శుభ్రం చేసి వాడుకుంటున్నారు. పొదలు, గుట్టల మధ్యలో ఉన్న వీటి ప్రవేశమార్గాలు చాలా ఇరుకుగా ఉన్నాయి. ఒకరి వెనుక ఒకరు లోనికి వెళ్లాల్సిన పరిస్థితి! పాక్ వైపు నుంచి ఎప్పుడే ఉపద్రవం ముంచుకొస్తుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామని కరోతోంటా ఖుర్ద్ గ్రామవాసి ఓమ్ ప్రకాశ్ చెప్పారు. 2003లో ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పొడుస్తుండడంతో దానికి కాలం చెల్లిపోయినట్లేనని స్థానికులు అంటున్నారు. సరిహద్దు ఘర్షణలు ఇరు దేశాల మధ్య సాగుతున్న శాంతి చర్చలపై ప్రభావం చూపుతున్నాయి. -
మరోసారి కాల్పులకు తెగబడిన పాక్
జమ్మూ: పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్ పురా సెక్టర్లో బీఎస్ఎఫ్ జవాన్లే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతుందని పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం జమ్మూలో వెల్లడించారు. బీఎస్ఎఫ్ జవాన్లు వెంటనే అప్రమత్తమై పాక్ సైన్యంపైకి కాల్పులు జరుపుతున్నారని చెప్పారు. అయితే గత అర్థరాత్రి నుంచి ఇరువైపులా కాల్పులు హోరాహోరిగా కొనసాగుతున్నాయని తెలిపారు. పాక్ కాల్పుల నేపథ్యంలో మన జవాన్లకు ఎటువంటి గాయాలు కాలేదని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. -
సరిహద్దు గ్రామాలపై పాక్ కాల్పులు
గట్టిగా తిప్పికొట్టిన బీఎస్ఎఫ్ పాక్ దాడుల్లో పలు ఇళ్లు ధ్వంసం.. జమ్మూ: సరిహద్దులో పాకిస్థాన్ బలగాల ఆగడాలు శ్రుతిమించాయి. జమ్మూకాశ్మీర్‌లోని జమ్మూ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ రేంజర్లు దాడులకు తెగబడ్డారు. అర్నియా, ఆర్ఎస్ పురా ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి దాటాక 2 గంటల నుంచి 15 భారత ఆర్మీ ఔట్పోస్టులతోపాటు పలు గ్రామాలపై కాల్పులు జరిపి మోర్టారు బాంబులు పేల్చారు. బీఎస్ఎఫ్ జవాన్లు ఈ దాడులను బలంగా తిప్పికొట్టారు. ఆదివారం ఉదయం వరకు ఇరుపక్షాల మధ్య కాల్పులు కొనసాగాయి. పాక్ దాడుల్లో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. కొన్ని పశువులూ చనిపోయాయి. పలు గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పాక్ జవాన్లు ఇటీవల భారీస్థాయిలో కాల్పుల విరమణను ఉల్లంఘించడం ఇదే తొలిసారి. కాల్పుల విరమణకు గండికొట్టడం గత నాలుగు రోజుల్లో ఐదోసారి. పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనపై ఆ దేశంతో మాట్లాడాలని కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. జమ్మూ సరిహద్దులో చొరబాట్లను నియంత్రించడానికి ప్రభుత్వం మరో రెండు వేల మంది బీఎస్ఎఫ్ జవాన్లను మోహరించింది. ఇదిలా ఉండగా, అస్సాంలోని దోల్దోలీ అభయారణ్యంలో ఆదివారం అనుమానిత తీవ్రవాదులు నాగాలాండ్ వైపు నుంచి భద్రతా బలగాలపై భారీస్థాయిలో కాల్పులు జరిపారు. ఒక పోలీసు మృతిచెందగా, ఒక ఫారెస్ట్ గార్డు, కార్మికుడు గాయపడ్డారు. పోలీసులకు, తీవ్రవాదులకు మధ్య కొన్ని గంటలపాటు కాల్పులు సాగాయి. -
మోడీ వస్తున్నారు - ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు!
జమ్మూ కాశ్మీర్ కి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రానున్నారు. దీంతో రెచ్చిపోయిన పాక్ సేనలు గత 24 గంటల్లో రెండు సార్లు అంతర్జాతీయ సరిహద్దు దాటి చొరబడేందుకు ప్రయత్నించాయి. రెండు సార్లూ మట్టి కరిచాయి. ముగ్గురు పాక్ తీవ్రవాదులు ఖతం అయ్యారు. పూంఛ్ జిల్లాలోని కృష్ణాఘాటీ సెక్టర్ లోనే ఈ రెండు చొరబాటు యత్నాలు జరిగాయి. తొమ్మిది మంది ఉగ్రవాదులు చొరబాటు యత్నానికి పాల్పడినప్పుడు కాల్పులు జరిగాయి. ఈ ఘటనల్లో ముగ్గురు ఉగ్రవాదులుచనిపోయారు. మిగతా వారు వెనుతిరిగారు. మన జవాన్లకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రధానమంత్రి పదవి చేపట్టిన తరువాత మోడీ తొలిసారి జమ్మూ కాశ్మీరుకు రానున్నారు. ఆయన జమ్మూలో ఉధమ్ పూర్ కట్రా రైల్వే సేవలను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి శ్రీనగర్ వెళ్లి శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షిస్తారు. -
జమ్మూలో తీవ్రవాదుల దాడి: ఏడుగురికి తీవ్ర గాయాలు
-
జమ్మూలో తీవ్రవాదుల దాడి: ఏడుగురికి తీవ్ర గాయాలు
జమ్మూలోని కథువా జిల్లాలో హీరా నగర్ పోలీస్ స్టేషన్‌పై ఈ రోజు తెల్లవారుజామున తీవ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో మొత్తం ఏడుగురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారని ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బుల్లెట్లుతో తీవ్ర గాయాల పాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని వారు తెలిపారు. తీవ్రవాదుల దాడిలో గాయపడిన వారిలో ఐదుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు ఉన్నారని ఉన్నతాధికారులు వివరించారు. గ్రానెడ్లు, అధునిక ఆయుధాలు చేత పట్టి తీవ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి మరి ఆ దాడికి ఒడిగట్టారని చెప్పారు. సంఘటన సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. స్థానికంగా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అన్నారు. భారత్ - పాక్ సరిహద్దులకు కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో కథువా జిల్లా ఉందని ఉన్నతాధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.