![China has built a second village in Arunachal - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/19/LOCATION.jpg.webp?itok=3k6iAHxf)
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో డ్రాగన్ దేశం తన దురాక్రమణను యధేచ్ఛగా కొనసాగిస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా ఏడాది కాలంలోనే వాస్తవాధీన రేఖ వెంబడి 60 భవనాల సముదాయాన్ని నిర్మించింది. అంతర్జాతీయ సరిహద్దులు, వాస్తవాధీన రేఖ మధ్యలో భారత్ భూభాగంలో 6 కి.మీ. పరిధిలో ఈ కొత్త భవనాలు వెలిశాయి. 2019లో తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ ప్రాంతంలో భవనాలేవీ లేవు.
ఎన్‌డీటీవీ వార్తా సంస్థ తాజాగా సంపాదించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ భవనాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అరుణాచల్ సరిహద్దుల్లో 100 ఇళ్లతో కూడిన ఒక గ్రామాన్నే నిర్మించిన చైనా దానికి 93 కి.మీ. దూరంలో తూర్పున ఈ భవన సముదాయాన్ని నిర్మించింది. మరోవైపు భారత్ ఆర్మీ ఈ శాటిలైట్ చిత్రాలను చూసి వాస్తవాధీన రేఖకి ఉత్తరాన ఈ భవన నిర్మాణం జరిగిందని, ఆ ప్రాంతం చైనా వైపే ఉందని అంటోంది. అరుణాచల్ సీఎం ప్రేమ ఖాండూ ఇతర ప్రభుత్వ అధికారులెవరూ ఈ కొత్త నిర్మాణాలపై పెదవి విప్పడం లేదు.
చైనా గత దశాబ్దకాలంగా సరిహద్దుల్లో అక్రమ నిర్మాణాలను పెంచుతోంది. నిఘా రెట్టింపు చేస్తోంది. భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతూ వస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఏకంగా 100 ఇళ్లతో కూడిన గ్రామాన్నే నిర్మించినట్టు ఈ ఏడాది మొదట్లోనే ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా వెల్లడింది. ఇటీవల అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ కూడా ఈ విషయాన్ని తన నివేదికలో ధ్రువీకరించింది. ఇలా ఇష్టారాజ్యంగా సరిహద్దుల్లో ఆక్రమణలు పెంచుకుంటూ వెళితే చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోమని భారత్ హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ చైనా ఏకపక్షంగా సరిహద్దుల్లో పౌరులు నివాసాలు ఏర్పరుచుకోవడానికి వీలుగా కొత్త భూ సరిహద్దు చట్టాన్ని కూడా తీసుకువచ్చింది.
భూటాన్‌లో 4 గ్రామాలు నిర్మించిన చైనా
భూటాన్‌లో చైనా దురాక్రమణ జోరుగా సాగుతోంది. డోక్లాం పీఠభూమికి సమీపంలో ఇటీవల చైనా 4 గ్రామాలను నిర్మించింది. దీనికి సంబంధించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలను కాంగ్రెస్ నేతలు పలువురు గురువారం ట్వీట్‌చేశారు. ఈ ఏడాది మే–నవంబర్ మధ్య చైనా ఈ నిర్మాణాలను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇలా సరిహద్దుల్లో చైనా భూముల్ని ఆక్రమించడం దేశ భద్రతకు పెనుముప్పుగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి, ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్మాణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment