
భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
20వ ‘సెంట్రల్ కమిటీ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా’ ప్లీనరీలో, ఉన్నత–ప్రమాణాల సోషలిస్ట్ మార్కెట్ (Socialist Market) ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నాణ్యతా ఆర్థికాభివృద్ధితో అత్యున్నత అత్యాధునిక సోషలిస్ట్ దేశంగా చైనాను రూపొందింపజేయాలని ‘డ్రాగన్’ సంకల్పించింది. ప్రపంచ ఆర్థిక పురోగతికి 30 శాతానికి మించి దోహదపడుతున్న చైనాలో 2024లో ఆరు నెలల్లోనే 26,870 కొత్త విదేశీ –పెట్టుబడి కంపెనీలు వాణిజ్య రంగంలో అడుగుపెట్టాయి. ఆధునిక సోషలిస్ట్ దేశంగా డ్రాగన్, ‘వికసిత భారత్ 2047’ లక్ష్యంతో పురోగమిస్తున్న భారత్ (India) రెండూ, 280 కోట్ల జనావళి శ్రేయస్సు దిశలో నడుస్తున్నాయి.
ప్రస్తుతం మన దేశంలోని, ప్రతీ రాష్ట్రం, భారీ కార్పొరేట్ రంగ యాజమాన్యాలు మరింత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జాయింట్ వెంచర్‌లు, టెక్నాలజీ టై–అప్స్, సమృద్ధిగా ఎగుమతులు సాధించే ఆర్థికాభివృద్ధిని ఆశిస్తున్నాయి. అమెరికా (ట్రంప్ 2.0), చైనా (China) దిగుమతులపై ట్యారిఫ్‌ల పెంపుదల బెదిరింపులు చైనాకు తప్పేటట్టు లేదు. మన ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ కూడా వర్తక వ్యాపార సమతూక నిర్వహణకు చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (Foreign Direct Investment) ఆహ్వానించడం సమయోచితంగా సూచించారు. 2025లో భారత్–చైనా దేశాధినేతల పరస్పర సహకార సౌహార్ద బాంధవ్యానికి 2024 అక్టోబర్‌లో బ్రిక్స్, కజాన్ సమావేశం కొంత సానుకూలత కల్పించింది.
2024 నవంబర్‌లో భారత్–చైనా విదేశీ వ్యవహారాల మంత్రులు జైశంకర్, వాంగ్‌యీ కూడా రియో డి జెనీరోలో ద్వైపాక్షిక చర్చలలో పాల్గొన్నారు. ప్రపంచంలో ద్వితీయ ఆర్థిక సంపన్న దేశంగా 2024లో గుర్తింపు పొందింది. 2023లో మన దేశంతో 136.2 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వర్తక, వాణిజ్య భారీ భాగస్వామ్యం పొందింది. మన దేశపు అత్యంత నాణ్యతా ఉత్పత్తులకు చైనాలో ప్రోత్సాహం ఉండనే ఉంది. 2024లో మన దేశపు మిర్చి, ఇనుప ఖనిజం, పత్తి, నూలు చైనాకు ఎగుమతులలో వరుసగా 17 శాతం, 160 శాతం, 240 శాతాలకు పైగా వృద్ధి సాధించాయి. చైనా, అంతర్జాతీయ దిగుమతుల ఎక్స్‌పో వంటి ప్లాట్ ఫారాల పూర్తి వినియోగానికి భారత్‌లోని అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను ఆహ్వానిస్తూనే ఉంది.
చైనా – భారత్‌ల మధ్య నెలకొని ఉన్న సరిహద్దు వివాదం శతాబ్దాల సంఘర్షణల నేపథ్యం పరిశీలిస్తే... అంత సులభంగా పరి ష్కారం కాదని గ్రహించవచ్చు. రుణప్రదాతగా రాజనీతితో వ్యవహరిస్తున్న బడా చైనా సార్వభౌమ ఆధిపత్యపు కోరలలో చిక్కుకొన్న లావోస్, అంగోలా, 16 సబ్ – సహారా దేశాలు, కాంగో, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, కంబోడియా, నైజీరియా, ఈజిప్ట్ వంటి... మధ్య, స్వల్ప, అల్ప ఆదాయ దేశాలు విలవిలలాడుతున్నాయి. 2017లో శ్రీలంక తన మేజర్ నౌకాశ్రయం హాంబన్ తోటను చైనాకు స్వాధీనం చేయవలసి వచ్చింది. టిబెట్‌లో సియాంగ్ నదిపై (అస్సాంలో బ్రహ్మపుత్రా) అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులలో 60,000 మెగావాట్ ఉత్పత్తి సామర్థ్యం గల ప్రపంచంలోనే అతి పెద్దదైన జల విద్యుత్ కేంద్ర నిర్మాణం తలపెట్టింది.
చదవండి: 140 కోట్ల భారతీయులకూ అది అవమానమే!
అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమా ఖండూ ఇటీవల జనవరి నెలాఖరులో చైనా అంతర్జాతీయ జల ఒడంబడికలను ఎలా త్రోసిరాజంటున్నదీ చెప్పారు. ఆ భారీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ భవిష్యత్తులో సృష్టించే పెను పర్యావరణ, ప్రకృతి విధ్వంసాన్ని వివరిస్తూ చైనా వైఖరి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్ని చిక్కుముడుల మధ్య డ్రాగన్–ఎలిఫెంట్ సయోధ్య సాధ్యమా?
– జయసూర్య
సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment