చైనా మ్యాప్‌ విడుదల.. సర్జికల్‌ స్ట్రైక్‌ చేసే దమ్ము మోదీకి ఉందా? | Sanjay Raut Asks PM To Surgical Strike On China Over Arunachal In New Map - Sakshi
Sakshi News home page

Sanjay Raut: చైనా మ్యాప్‌ విడుదల.. సర్జికల్‌ స్ట్రైక్‌ చేసే దమ్ము మోదీకి ఉందా?

Published Tue, Aug 29 2023 2:57 PM | Last Updated on Tue, Aug 29 2023 3:23 PM

Sanjay Raut asks PM To surgical strike On China Over Arunachal in new map - Sakshi

భారతలోని భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపుతూ సోమవారం చైనా అధికారికంగా ఓ మ్యాప్‌ను (standard map) విడుదల చేసిన విషయం తెలిసిందే. 2023 చైనా ఎడిషన్‌ పేరుతో విడుదలైన ఈ మ్యాప్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయిచిన్‌ వంటి వివాదాస్పద భూభాగాలను తమ దేశంలో అంతర్భాగంగా పేర్కొంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా చూపించడంతోపాటు తైవాన్‌, దక్షిణా చైనా సముద్రాన్ని కూడా తమ దేశ ప్రాంతాలుగా కలిపేసుకుంది. 

ఆ దమ్ము ఉందా?
అయితే చైనాకు పొరుగు దేశాలతో కలిసి జాతీయ సరిహద్దులను తెలుపుతూ రూపొందించిన ఈ మ్యాప్‌ రాజకీయ దుమారానికి తెరలేపింది. తాజాగా చైనా మ్యాప్‌ వివాదంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌  ఘాటుగా స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చైనాపై సర్జికల్‌ స్టైక్‌ చేసే దమ్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉందా అని ప్రశ్నించారు.

రాహుల్‌ చెప్పింది నిజమే!
‘చైనాపై దమ్ము, ధైర్యం ఉంటే చైనాపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేయండి. ప్రధాని మోదీ ఈ విషయంపై దృష్టి సారించాలి. ఇటీవలె మోదీ బ్రిక్స్‌ సదస్సులో పాల్గొన్నారు. అక్కడ చైనా అధికారులను ఆలింగనం కూడా చేసుకున్నారు. ఈ దృశ్యాలు మా మనసులను గాయపరిచాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే చైనా ఈ మ్యాప్‌ను విడుదల చేసింది. భారత్‌లోకి చైనా ప్రవేశించిందటూ రాహుల్‌ గాంధీ ముందే చెప్పారు. లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్ద మన భూభాగాన్ని చైనా కాజేసిందని రాహుల్‌ చెప్పింది నిజమే’ నని వ్యాఖ్యానించారు. 
చదవండి: మరోసారి చైనా కవ్వింపు చర్య.. అరుణాచల్‌, అక్సాయిచిన్‌ మావే! 

ఎన్నికలొస్తున్నాయి.. అల్లరు జరుగుతాయి
'ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ సర్జికల్ స్ట్రైక్ డ్రామా ఆడుతుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. పుల్వామా దాడి కూడా కుట్రపూరితంగా జరిగిందని  జమ్మూ కాశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎలక్షన్స్‌ ముందు అల్లర్లు జరిగే అవకాశం ఉంది. రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రామభక్తుల రైలుపై రాళ్లు రువ్వడం, బాంబులు విసరడం, దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగడం వంటివి జరిగే అవకాశం ఉందన్న భయం ప్రజల్లో ఉంది. 

హర్యానా అల్లర్లే ఉదాహరణ
ఇదంతా లోక్‌సభ ఎన్నికల్లో గెలవడం కోసమే. ప్రధాన రాజకీయ పార్టీల మనస్సులలోనూ ఈ ఆందోళన  ఉంది. ప్రతి విషయాన్ని ప్రజల ముందు ఉంచడం మన బాధ్యత. అలా జరగని పక్షంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. హర్యానాలో జరిగిన అల్లర్లే దీనికి ఉదాహరణ’ అని రౌత్‌ పేర్కొన్నారు.

రాహుల్‌ ఏమన్నారంటే..
ఈ నెల 17 నుంచి లద్దాఖ్‌లో కాంగ్రెస్‌ పర్యటించిన కాంగ్రెస్‌ నేత గాంధీ..  మన భూభాగాన్ని చైనా కాజేసిన విషయం లద్దాఖ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు. ‘వారం రోజులుగా లద్దాఖ్‌లో బైక్‌పై పర్యటిస్తున్నా. లద్దాఖ్‌ వ్యూహాత్మక ప్రదేశం. భారత్‌కు చెందిన వందలాది కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా లాక్కున్న విషయం పాంగోంగ్‌ సరస్సు వద్దకు వెళ్లినప్పుడు అర్థమయ్యింది. ఇక్కడి భూమిని అంగుళం కూడా చైనా ఆర్మీ ఆక్రమించుకోలేదంటూ ప్రధాని మోదీ చెప్పిందంతా పూర్తిగా అసత్యం. ప్రధాని నిజం చెప్పలేదు. చైనా మన భూభాగాన్ని కబ్జా చేసిందనే విషయం లద్దాఖ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసు’ అని రాహుల్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement