మంత్రులు వెళ్లొచ్చు.. నేను వెళ్లకూడదా?: రాహుల్
న్యూఢిల్లీ: చైనా రాయబారితో సమావేశంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ మంత్రులు చైనాకు వెళ్లిరావచ్చు కానీ, ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీ తరఫు నుంచి భారత్‌లో ఉన్న చైనా అంబాసిడర్‌ను తాను కలవకూడదా? అని రాహుల్ ప్రశ్నించారు. చైనా అంబాసిడర్‌ను కలవడంపై మోదీ ప్రభుత్వం ఎందుకు రాద్దాంతం చేస్తోందో తనకు అర్ధం కావడం లేదని అన్నారు.
ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు చైనా హాస్పిటాలిటీ సర్వీసులను ఎందుకు వినియోగించుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వారంలో మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చైనా పర్యటనకు ఎందుకు వెళ్లారో చెప్పాలని అన్నారు. జాతీయ సమస్యల వివరాలను తనకు తెలియజెప్పడం ప్రభుత్వ కనీస ధర్మమని అన్నారు. చైనీస్ అంబాసిడర్, మాజీ భద్రతాసలహాదారు, ఈశాన్య రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు, భూటాన్ అంబాసిడర్లను తాను కలిసినట్లు వెల్లడించారు.