న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు వక్రభాష్యాలు చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. గల్వాన్ లోయ ప్రాంతంలో చైనా దురాక్రమణను అడ్డుకునే క్రమంలో సోమవారం ఘర్షణ తలెత్తిన విషయాన్ని ప్రధాని స్పష్టం చేసినట్లు వెల్లడించింది. వాస్తవాధీన రేఖను దాటేందుకు యత్నించిన డ్రాగన్ సైన్యానికి భారత జవాన్లు ధీటుగా బదులిచ్చారని.. అందుకే చైనా సైనికులు మన భూభాగంలో చొరబడలేదని పునరుద్ఘాటించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.(భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదు)
‘‘వాస్తవాధీన రేఖ వెంబడి దురాక్రమణకు యత్నిస్తే భారత్ తీవ్రంగా స్పందిస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అంతేగాక గతంలో కంటే ఇప్పుడు సవాళ్లను మరింత గొప్పగా ఎదుర్కొంటున్నామని ఉద్ఘాటించారు. సరిహద్దుల్లో ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే భారత బలగాలు నిర్ణయాత్మకంగా బదులు చెబుతున్నాయన్నారు. వాస్తవాధీన రేఖ వద్ద చైనా అక్రమ నిర్మాణాలు, దురాక్రమణను అడ్డుకునే క్రమంలో జూన్ 15న గల్వాన్‌లో ఘర్షణ తలెత్తిందని స్పష్టం చేయబడింది. మన సాయుధ బలగాల ధైర్యసాహసాల పర్యవసానంగా.. వాస్తవాధీన రేఖ వెంబడి మన భూభాగంలోకి చైనీయులు ఎవరూ రాలేదన్నది ఆయన ఉద్దేశం’’ అని పేర్కొంది.('చైనా దురాక్రమణకు మోదీ లొంగిపోయారు')
కాగా సరిహద్దుల్లో చైనాతో యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం అఖిలపక్ష భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. భారత భూభాగంలోకి ఎవరూ రాలేదని, సరిహద్దు క్షేమమని, మన ఆర్మీ పోస్ట్‌లను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే గల్వాన్ లోయ హింసాత్మక ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ స్పందిస్తూ.. చైనా దురాక్రమణకు తలొగ్గిన ప్రధాని నరేంద్ర మోదీ భారత భూభాగాన్ని చైనాకు అప్పజెప్పారంటూ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. భారత జవాన్లు ఏ ప్రాంతంలో అమరులయ్యారో చెప్పాలంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర మంత్రులు రాహుల్ తీరుపై మండిపడ్డారు. ఇలాంటి సమయాల్లో రాజకీయాలు చేయవద్దంటూ హితవు పలికారు. ఇక తాజాగా పీఎంఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. (రాహుల్-అమిత్ షా మధ్య ట్విటర్ వార్)
Comments
Please login to add a commentAdd a comment