
డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) వలస విధానాలు ఎల్లప్పుడూ జాత్యహంకారంతో, ద్వంద్వ నీతితో, మానవ గౌరవాన్ని పూర్తిగా విస్మరించే ధోరణితో ముడిపడ్డవే. విద్య, ఉద్యోగం, మంచి భవిష్యత్తు కోసం అమెరికాకు వెళ్లిన భారతీయులను (Indians) అవమానకరంగా వెనక్కి పంపింది. వీళ్లంతా నేరస్తులు కాదు. ఆ దేశం అక్రమ వలసదార్ల వల్ల భారీ లాభాలు గడించింది. వలసదార్ల రంగు నలుపైనా, చట్టం అక్రమ వలసదార్లని చెప్పినా, వారి సాంకేతిక నైపుణ్యం అమెరికన్ కార్పొరేట్లకి అంటరానిది కాదు. ట్రంప్ సర్కార్ వచ్చాక మన వాళ్ళను క్రిమినల్స్‌లాగా వేటాడి నిర్బంధించింది. సంకెళ్ళతో అమెరికా సైనిక విమానాల్లో కుక్కి అమృతసర్‌లో దింపేసి వెళ్ళింది. అది ఆ 104 మందికే కాదు మొత్తం 140 కోట్ల భారతీయులకూ అవమానమే!
అమెరికా (America) నుంచి భారత్‌కు చేరుకున్న వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. వారి దీన గాథలు వింటే కడుపు తరుక్కు పోతుంది. ఏజంట్ల మాటలకు మోసపోయి లక్షలు చెల్లించి వెళ్లిన వీరు అమెరికా భూమిపై అడుగు పెట్టడానికి పడిన పాట్లు వర్ణనాతీతం. మైళ్ల కొద్దీ కాలినడక, చిన్నబోటులో ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణించి అమెరికా గడ్డపై కాలు పెట్టడం, ఆ వెంటనే వీరిని అదుపులోకి తీసుకున్న అధికారులు చీకటి గదుల్లో బంధించడం... వీరి ప్రస్థానంలో మరపురాని ఘట్టాలు. అక్కడ వేలాది మంది పంజాబీ యువకులూ, పిల్లలూ కనిపించారనీ, అందరిదీ ఒకటే దుఃస్థితి అనీ తిరిగివచ్చిన వారు చెబుతున్నారు.
ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లిన విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తే తప్ప అక్కడ జీవించే పరిస్థితి లేదు. అమెరికా పంపేందుకు ఇక్కడ బ్యాంకుల ద్వారా రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు అప్పు చేసి ఇంకా కొంత మంది ఆస్తులు తాకట్టు పెట్టి విదేశాలకు పంపించారు. చదువు పూర్తయిన తర్వాత కూడా ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) పూర్తి చేసి ఏదో ఒక కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తూ కొంతలో కొంత మిగుల్చుకుని తల్లిదండ్రులకు పంపేవారు. ఇక్కడి తల్లిదండ్రులు వారి పిల్లల కోసం చేసిన అప్పులు తీర్చడానికి ఆ డబ్బులు జమచేస్తూ ఉంటారు.
ఇదీ చదవండి: వెనక్కి పంపేస్తే నష్టమే!
చదువు కోసం వెళ్లిన వారు కూడా ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ తల్లిదండ్రులకు భారం కాకుండా చూసుకునే వారు. కానీ ఇప్పుడు విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగాలు విద్యా సంస్థలు, యూనివర్సిటీ క్యాంపస్‌ల బయట చేయడానికి వీలు లేదన్న నిబంధనను గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నిస్తుండడంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు నెలకు రూ. 60 వేల నుంచి రూ. 80 వేల వరకూ పంపించాల్సి వస్తోంది.
ఇదీ చదవండి: అమెరికాలో భగ్నస్వప్న గాథ!
అట్లాంటా, ఒహాయో, క్యాలిఫోర్నియా, న్యూజెర్సీ, న్యూయార్క్, చికాగో, డల్లాస్‌లలో తెలుగు విద్యార్థులు (Telugu Students) ఎక్కువగా ఉన్నారు. ఇది ఒక సమస్య అయితే ఓపీటీ పూర్తయిన తర్వాత ఏ ఉద్యోగం దొరక్క అమెరికాలో ఏదో ఒక పని చేసుకుంటూ జీవించే వారిపై ట్రంప్ ప్రభుత్వం కక్షకట్టింది. అక్కడ ఒత్తిడిలో ఉన్న యువత ఫోన్లు ఎత్తకపోతే కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. వారు ఏ ఆపదలో ఇరుక్కుపోయారో అనే ఆందోళన ఇందుకు కారణం. ఇది కేవలం భారతీయులకు, భారత దేశానికి చెందిన సమస్యే కాదు. ఎన్నో ప్రపంచ దేశాల సమస్య. అందుకే ట్రంప్ దుందుడుకు విధానాలపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా మానవత్వంతో వ్యవహరించాలి.
– వెంకటేష్, పీడీఎస్‌యూ