
అభిప్రాయం
సైనిక విమానంలో చేతికి సంకెళ్లతో అమెరికా నుండి భారతీయులను బహిష్కరిస్తున్న చిత్రం మనలో చాలా మందిని తీవ్ర బాధలో ముంచెత్తింది. మెరుగైన జీవితాన్ని ఆశించిన మన తోటి పౌరులు, సోదర సోదరీమణులు ఇటువంటి అవమానకరమైన పరిస్థితులలో స్వదేశానికి తిరిగి రావడం వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు; తక్షణ, సమష్టి ప్రతిస్పందన అవసరమైన జాతీయ అవమానం.
హై ప్రొఫైల్ సందర్శనలు, ఫోటో ఆప్‌లపై దృష్టి సారించే పర్సనాలిటీ ఆధారితమైన విదేశాంగ విధానం... విదేశాలలో చట్టపరమైన వివాదాలలో చిక్కుకున్న పౌరులను రక్షించడానికి అవసరమైన స్థిరమైన దౌత్యాన్ని పక్కనపెడుతుందనే విషయాన్ని మనం విస్మరించగలమా? నాటకీయ హావభావాలు దృశ్యపరంగా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, కష్టాల్లో ఉన్నవారికి కాన్సులర్ తక్షణ మద్దతు లభించేలా చూసుకోవడంలో రోజువారీ పనిని అవి నిర్లక్ష్యం చేయడానికి దారితీస్తున్నాయి.
ప్రపంచంలో వివిధ దేశాలకు వలసవెళ్లిన భారతీయుల కార్యక్రమాలు వ్యక్తిగత బ్రాండింగ్ కోసం విలాసవంతంగా, లీడర్ కేంద్రంగా జరిగే ధోరణిని మనం చూశాం. అయినప్పటికీ, ఈ వలసపోయిన వారిలో అత్యంత దుర్బలమైన సభ్యులు నిర్బంధం, బహిష్కరణను ఎదుర్కొన్నప్పుడు లేదా జీవనోపాధిని కోల్పోయినప్పుడు... వారికి తగినంత ప్రభుత్వ సహాయం లేకుండా పోతోంది.
ఈ నేపథ్యంలో మనం ఒక కలతపెట్టే ప్రశ్నను ఎదుర్కోవలసి వస్తుంది: మన ప్రజలు భారతదేశం నుండి వెళ్లిపోవడానికి ఎందుకు ఇంత తీవ్రమైన ప్రమాదాలను సైతం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? బలవంతంగా తిరిగి వచ్చిన ప్రతి వ్యక్తికీ లోతైన గాయం ఉంది – అది వ్యక్తులు నిరాశతో దేశం నుంచి వెళ్ళిపోయేలా చేసే వ్యవస్థాగత వైఫల్యాల కథ.
అందరికీ సహాయం చేయడంలో లేదా దేశంలోని ప్రతి మూలలో ఆశను నింపడంలో మన సమాజ అసమర్థత... తమ ఇష్టానికి వ్యతిరేకంగా భారతదేశానికి తిరిగి వచ్చే వారి దృశ్యాలున్న వీడియోలలో బహిర్గతమవుతోంది. ఒకప్పుడు వారిని ప్రేరేపించిన స్వప్నాలు ఇప్పుడు బహిష్కరణతో భంగమయ్యాయి.
దేశంలో నెలకొని ఉన్న నిర్మాణాత్మకమైన అసమానతలను, స్పష్టమైన ఆర్థిక పరిస్థితులను మనం విస్మరించలేము. ఇవి చాలా మంది భారతీయులను ప్రమాదకరమైన ప్రయాణాలను ఎంచుకోవడానికి ప్రేరేపించాయి. దీర్ఘకాలిక నిరుద్యోగం నుండి తక్కువ వేతనాల వరకు; గ్రామీణ దుఃస్థితి నుండి పట్టణ పేదరికం వరకు... ఎన్నో కారకాలు! ఇవి కేవలం దేశం నుంచి ‘బయటపడవేసే కారకాలు’ మాత్రమే కావు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థాగత నిర్లక్ష్యానికి సంకే తాలు! అయితే ప్రపంచ అసమానతలు మరిన్ని సమస్యలను పెంచుతాయనుకోండి.
కానీ ప్రాథమిక సమస్య ఏమిటంటే మన సొంత ఇల్లు (భారత్) అస్తవ్యస్తంగానే ఉంది. భారతదేశంలో యువతీ యువకులకు ఎటువంటి ఆచరణీయమైన మార్గాలూ కనిపించనప్పుడు స్థిరమైన జీవనో పాధి, గౌరవప్రదమైన ఉపాధి లేకపోవడంతో... విదేశాల్లో ఉన్నప్పుడు వీసాలు గడువు ముగిసినా అక్కడే ఉండడానికి ప్రయత్నించడం లేదా సరైన డాక్యుమెంటేషన్ లేకుండా బయటి దేశాలలోకి ప్రవేశించడం... మెరుగైన భవిష్యత్తును పొందేందుకు ఏదైనా మార్గం కోసం ప్రయత్నించడం జరూర్ అవసరంగా మారుతుంది.
ఇలాంటి సంక్షుభిత క్షణాల్లో, భారత ప్రభుత్వానికి తన పౌరులను ఎక్కడ ఉన్నా రక్షించాల్సిన రాజ్యాంగబద్ధమైన, నైతిక బాధ్యత ఉందని మనం గుర్తు చేసుకోవాలి. ప్రభుత్వ బాధ్యత మన సరిహద్దుల వద్దే ముగియదు. బహిష్కరణ ప్రక్రియ గౌరవంగా జరుగుతోందని నిర్ధారించడానికి కాన్సులర్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుత అవమా నకరమైన దృశ్యాలు ప్రభుత్వ ప్రమత్తతనే సూచిస్తోంది. ఇప్పుడు చాలా మంది భారతీయులు బహిష్కరణ చర్యలను ఎదుర్కొంటున్నందున, ఈ బాధాకరమైన ప్రక్రియలో తీవ్రమైన బలప్రయోగాన్ని, అవమానకరమైన పరిస్థితులను నివారించ డానికి మన అధికారులు చర్యలు తీసుకోవడం అత్యవసరం.
భారత ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా, కేవల స్పందనాత్మకంగా ఉండకూడదు. అన్నింటి కంటే ముందు, బహిష్కృతుల సంఖ్య గురించి పారదర్శకత ఉండాలి. బహిష్కరణను ఎదుర్కొంటున్న వారికి చట్టపరమైన, ప్రయాణ పరమైన సహాయంతో సహా భారత కాన్సులేట్ సమగ్ర మద్దతును అందించాలి. చాలామంది బ్యాంకు ఖాతాలు, వాహనాలు, ఇతర ఆస్తులను వదిలివేసి వస్తున్నారు. వాటిని వారు అమెరికాలో ఇప్పటికీ చట్టబద్ధంగా కలిగి ఉన్నారు.
భారతదేశం నుండి వీటిని అందుకోవడానికి, నిర్వహించడానికి వారికి సహాయం చేయాలి. వలసలో ఉన్నవారితో, పౌర సమాజంతో కలిసి పనిచేస్తూ, బహిష్క రణకు ముందే... లేదా బహిష్కరణ జరిగిన వెంటనే వారి ఆస్తిని రక్షించడంలో, వెనక్కు తీసుకురావడంలో భారతీయులకు మనం ముందస్తుగా మద్దతు ఇవ్వాలి. అలాంటి చర్యలు లేకుంటే, వ్యక్తులు మరింత ఆర్థిక నష్టానికి గురవుతారు. వారి కష్టాలు మరింత పెరుగుతాయి కూడా!
సమీప భవిష్యత్తులో బహిష్కరించబడే వారిలో తోడు లేని మైనర్లు, గర్భిణులు, అత్యవసర వైద్యం లేదా మానసిక అవసరాలు ఉన్న ఇతరులు ఎవరైనా ఉండవచ్చు. ఈ బలవంతపు తొలగింపుల సమయంలో కుటుంబాలు, పిల్లలు, మహిళలు ఎదుర్కొనే చికిత్స గురించి ఆందోళన ఉంది. భారతదేశానికి తిరిగి వచ్చిన బహిష్కృతుల గతి ఏమిటి? వారిలో చాలామందికి ఎటువంటి భరోసా ఉండదు. కొందరికి తమ వలస కారణంగా పేరుకుపోయిన అప్పులు ఇక్కడ ఎదురవుతాయి. మరికొందరు విదేశా లలో స్థిరపడటంలో ‘విఫలమయ్యారు’ అనే ఎగతాళి మాటను ఎదుర్కోవలసి వస్తుంది.
విదేశీ తీరాలపై ఆశలను పెట్టుకున్న వ్యక్తుల ‘విధి’ ఇప్పుడు మరింత ప్రమాదంలో ఉంది. మనలో అత్యంత దుర్బలమైన వారితో... అంటే తీవ్రమైన అవసరం కారణంగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లి, బాధతో తిరిగి వచ్చిన వారితో మనం ఎలా వ్యవహరిస్తాం అనే అంశంలో మన దేశ గౌరవం, నైతిక నిర్మాణం పరీక్షించబడతాయి.
భారతదేశం నిజంగా ప్రపంచ శక్తిగా ఎదగాలని కోరుకుంటే, దాని పౌరులు అభివృద్ధి చెందడానికి దేశం నుండి పారిపోవాల్సిన అవసరం లేదని నిర్ధారించుకోవడం ద్వారా ప్రారంభించాలి. అంతర్గతమైన ఆర్థిక అసమానతలను ఎదుర్కోవాలంటే... మరింత సమ్మిళితమైన, గౌరవప్రదమైన మాతృభూమిని సృష్టించాలనే సమష్టి సంకల్పాన్ని చేసుకోవాలి. ఈ బహిష్కరణలు ఈ అవసరాన్నే డిమాండ్ చేస్తున్నాయి.
మనోజ్ కుమార్ ఝా
వ్యాసకర్త రాజ్యసభ సభ్యుడు (రాష్ట్రీయ జనతా దళ్)