అభిప్రాయం
రానున్న బిహార్ ఎన్నికల్లో మహిళా ఓటు నిర్ణయాత్మకం కాబోతోందా? వారు కింగ్ మేకర్లు కాబోతున్నారా? 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులు 54.6 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుంటే, స్త్రీలు వారికన్నా ఎక్కువగా 59.7 శాతం మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. బిహార్‌లో ఇలా మహిళలు పెద్ద యెత్తున ఓటు వేసేందుకు తరలిరావడం దశాబ్దం పైనుంచి కనిపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విజయాన్ని ఖాయం చేయడంలో వారి ఓటు సహాయపడిందనడంలో సందేహం లేదు. కానీ ఈ నవంబర్‌లో పరిస్థితిలో మార్పు రావచ్చు.
వివాదాస్పదంగా మారిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమం తర్వాత సిద్ధమైన ఓటర్ల వివరాలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ప్రస్తుత ఓటర్ల జాబితాలోని మొత్తం 7.43 కోట్ల మందిలో మహిళల (3.5 కోట్ల మంది) కన్నా పురుషులు (3.92 కోట్ల మంది) ఎక్కువగా ఉన్నారు. అంటే, ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు మహిళా ఓటర్లు 892 మంది చొప్పున ఉన్నారు. ఈ మార్పు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే, 2015–20 మధ్యలో పురుష ఓటర్ల సంఖ్య 34.42 లక్షలు పెరిగితే, మహిళా ఓటర్లు 39.62 లక్షల మంది పెరిగారు.
మహిళల నాడి తెలుసుకొని...
బిహార్ ఎన్నికల్లో కులం పాత్ర ముఖ్యమైనదే కానీ, ప్రధానంగా నితీశ్ కుమార్ ఉత్సాహ ప్రోత్సాహాలతోనే ఎన్నికల రాజకీయాల్లో మహిళలు పాల్గొనడం పెరిగింది. పంచాయతీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు నిర్ణాయక శక్తిగా మారే విధంగా, వారు చురుకుగా పోలింగ్‌లో పాల్గొనేటట్లుగా ఆయన 2005 నుంచి కీలకమైన చర్యలు తీసుకుంటూ వచ్చారు. నిజం చెప్పాలంటే, రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించిన కారణంగానే గత రెండు ఎన్నికల్లో నితీశ్ విజయం సాధించగలిగారు. మహిళా సాధికారతకూ, మద్యనిషేదానికీ నితీశ్ ముడిపెట్టారు. తాగుడు వ్యసనం వల్ల మహిళలే ఎక్కువ ఇక్కట్లు పడుతున్నారంటూ ఆయన చేసిన వాదన వారిని ఆకట్టుకుంది.
స్కూళ్ళకు వెళ్ళే బాలికలకు సైకిళ్ళు, యూనిఫారాలు పంపిణీ చేయడం ద్వారా, మహిళా ఓటర్లను కూడగట్టుకునే పనిని ఆయన 25 ఏళ్ళ క్రితమే ప్రారంభించారు. వారిలో కొందరు వనితలు వ్యవస్థాపక సామర్థ్యం ఉన్నవారిగా నిరూపించుకున్నారు. కొందరు మాతృమూర్తులయ్యారు. ఇన్నేళ్ళుగా నితీశ్ పట్ల వారి మమకారం చెక్కుచెదరకుండా వస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ‘లాడ్లీ బెహనా యోజన’, ‘లడ్కీ బహిన్∙యోజన’ పథకాలను అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రారంభించి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉండవచ్చు; కానీ, మహిళలపై నితీశ్ ప్రభావం అంతకన్నా పెద్దది.
పోటాపోటీ వరాలు
అయితే, మహిళల్లో నితీశ్ పట్ల ఆదరణ తగ్గినట్లు ఇటీవలి ఒక ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆయన పదవి నుంచి వైదొలగి యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని మహిళల్లో చాలా మంది భావిస్తున్నారు. రాజకీయంగా మరింత పెద్ద పాత్ర వహించే విధంగా నితీశ్ తన కుమారుడు నిశాంత్‌ను తీర్చిదిద్దడం మొదలుపెట్టడానికి బహుశా అదే ప్రధాన కారణం కావచ్చు. రాష్ట్ర ఆర్థిక మంత్రి మార్గదర్శకత్వంలో నిశాంత్ ఎక్కువ సమయాన్ని సమస్తిపూర్ నియోజకవర్గంలో వెచ్చిస్తున్నప్పటికీ, ఆయన ఈ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయడం లేదు.
కనుక, రానున్న ఎన్నికల్లో నితీశ్‌దే ప్రధాన పాత్ర. మహిళా ఓటర్లపై తన పట్టును కొనసాగించేందుకు నితీశ్ యుక్తిని ప్రదర్శించారు. మహిళా ఔత్సాహికæ పారిశ్రామికవేత్తలకు ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ కింద ఇవ్వదలచిన రూ. 10,000 కోట్ల మొదటి విడత మొత్తాన్ని బదిలీ చేస్తున్నట్లు ఇటీవల ఆయన ప్రకటించారు. వ్యవస్థాపక సామర్థ్యం కనబరచిన మహిళలకు వచ్చే ఆరు నెలల్లో, మరో రూ. 2 లక్షల చొప్పున బదిలీ అవుతాయి. ఈ పథకం కింద దాదాపు రూ. 21,000 కోట్లను వెచ్చించనున్నారు.
నితీశ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరికొన్ని పథకాలు ప్రకటించారు. సుమారు 1.89 కోట్ల మంది వినియోగదారులకు రూ. 5,000 కోట్ల వ్యయంతో 125 మెగావాట్ల ఉచిత విద్యుత్తును అందించనున్నారు. సామాజిక భద్రతా పింఛను పథకం 1.11 కోట్ల మందికి లబ్ధి చేకూర్చనుంది. జీవిక, అంగన్‌వాడి, ‘ఆశా’ వర్కర్ల గౌరవ వేతనాలను పెంచారు. దీనివల్ల, ప్రభుత్వ ఖజానాపై మరో రూ.9,300 కోట్ల భారం పడనుంది. కొత్తగా ప్రకటించిన కేటాయింపుల వల్ల ఏటా అదనంగా రూ. 40,000 కోట్లు ఖర్చు కానున్నాయి. రాష్ట్ర వార్షిక రాబడి మొత్తం దాదాపు రూ. 56,000 కోట్ల మేరకు ఉంటుంది.
రూ. 7 లక్షల కోట్ల వ్యయమయ్యే ఈ ఉచిత పథకాల వాగ్దానాలను ఎలా నెరవేరుస్తారని ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రశ్నిస్తున్నారు. కానీ, జనాకర్షక వాగ్దానాలు చేయడంలో ఆయనా ఏమీ వెనుకబడి లేరు. ప్రతిపక్ష ‘మహాగuЇబంధన్’ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఖాయమని ఆయన హామీ ఇచ్చారు. ఆ ప్రతిపాదనలోని ఆర్థికాంశాలను తేజస్వి పరిశీలించలేదని వేరే చెప్పనక్కర లేదు. రాష్ట్రం అంత భారాన్ని మోయగల స్థితిలో ఎంతమాత్రం లేదు.
తగ్గని అతివల అగచాట్లు
ఇటీవల రాష్ట్రం నలుమూలల పర్యటించి, గ్రామాలు, పట్టణాలలోని మహిళలతో మాట్లాటిన సామాజిక ఉద్యమకారిణి షబ్నం హష్మీ వారి స్థితిగతులు ఏమీ బాగా లేవని చెబుతున్నారు. వనితలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారనీ, ‘హఫ్తాలు’ (రౌడీ మామూళ్ళు) చెల్లించుకోలేని మహిళల ఇళ్ళకు గూండాలు వచ్చి, ఉన్న వస్తువులను పట్టుకుపోతున్నారనీ ఆమె అంటున్నారు. ముఖ్యంగా, బిహార్ ఉత్తర ప్రాంతంలో మహిళలు తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారని ఆమె చెబుతున్నారు.
తమపైన, తమ పిల్లలపైన హింసాయుత చర్యలు పేట్రేగిపోతున్నాయని వారిలో చాలా మంది వాపోయారని హష్మీ వెల్లడిస్తున్నారు. రేషన్ కార్డు సంపాదించడాని కైనా లేదా రేషన్ కార్డులో కొత్త పేర్లు చేర్చడానికైనా అడుగడుగునా లంచాలు చెల్లించుకోవాల్సి వస్తోందన్నది మహిళల నుంచి ఎదురైన మరో ప్రధాన ఫిర్యాదు. నితీశ్ కుమార్ మహిళలకు స్నేహపూర్వకమైన పథకాలు చేపడుతున్నారని చేస్తున్న ప్రచారంలో పస లేదనీ, వాస్తవానికి, సామూహికంగా వలసపోతున్న, ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు మహిళల్లో పెరిగాయనీ హష్మీ మాట.
కాగా, గత ఎన్నికల్లో ఆర్.జె.డి., ఇతర ప్రతిపక్షాల వైపు ఓటర్లు మొగ్గినట్లు విశ్లేషణలు సూచించిన ప్రాంతాల్లో మహిళలు, ముస్లింల పేర్లు మాయమయ్యాయని లక్నో యూనివర్సిటీ మాజీ వైస్–చాన్స్‌లర్ ప్రొఫెసర్ రూప్ రేఖ అభిప్రాయపడుతున్నారు. బీజేపీ కార్యకర్తలు లక్నోలో పార్టీకి అనుకూలమైన, వ్యతిరేకమైన ప్రతి గడపనూ గుర్తించడాన్ని ఆమె అందుకు ఉదాహరణగా చూపుతున్నారు.
‘‘క్షేత్ర స్థాయిలో వారి (బీజేపీ) కార్యకర్తలు మరింత చురుకుగా ఉన్నారన్నది వాస్తవం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఏమైనా బిహార్‌లో తరాలలో మార్పు వచ్చిందనడంలో ఇసుమంత సందేహం కూడా అవసరం లేదు. తేజస్వీ యాదవ్, చిరాగ్ పాశ్వాన్ ఈ మార్పునకు కరదీపకులుగా ఉన్నారు. బిహార్‌లో పాచికలు పైకి ఎగిరాయి. అవి ఎవరికి అనుకూలంగా పడతాయన్నది ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే!
రష్మీ సెహగల్
వ్యాసకర్త రచయిత్రి, సీనియర్ జర్నలిస్ట్
(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)


