అమెరికా అమానుషత్వం
సహజ వనరులు పుష్కలంగా ఉన్న దేశాలపై కన్నేసి వాటిని నయానో భయానో ఒప్పించి అక్కడి ప్రాంతాలను దురాక్రమించాలని చూస్తున్న అమెరికా... పొట్టకూటి కోసం తనను ఆశ్రయించినవారి పట్ల మాత్రం అమానుషంగా, హేయంగా ప్రవర్తిస్తున్నదని రుజువైంది. సైనిక విమానంలో అమృత్ సర్ చేరుకున్నవారి కథనాలు వింటుంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లకు గొలుసులు కట్టి, కూర్చోవటానికి కూడా అసౌకర్యంగా ఉండే సైనిక విమానంలో పశువుల్ని తరలించిన చందాన మనవారిని తీసుకొచ్చారు. ఇందులో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు కూడా ఉన్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి. గత నెలలో కొలంబియా, మెక్సికో దేశాలవారిని ఈ పద్ధతిలోనే పంపటానికి ప్రయత్నించినప్పుడు వాటినుంచి నిరసన వ్యక్తమైంది. అమెరికా సైనిక విమానాలకు అనుమతినీయబోమన్నాయి. చివరకు కొలంబియా తలొగ్గినా మెక్సికో మాత్రం తమ విమానాన్ని పంపి వలసదారులను వెనక్కు తెచ్చుకుంది. బ్రెజిల్ సైతం తమవారిపట్ల అమానుషంగా వ్యవహరించటాన్ని ఖండించింది. భారతీయులకు జరిగిన అవమానంపై సహజంగానే పార్లమెంటులో గురువారం ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారిని గుర్తించి వెనక్కు పంపటం ఏ దేశంలోనైనా జరిగేదే. పార్లమెంటులో విదేశాంగమంత్రి జైశంకర్ చెప్పినట్టు అక్రమ వలసదారులను వెళ్లగొట్టడం కొత్తేమీ కాదు. ఏ దేశమూ అలాంటివారిని సమర్థించదు. అక్రమ వలసల్ని ప్రోత్సహించదు. కానీ వెనక్కు పంపే క్రమం మానవీయంగా, నాగరికంగా ఉండాలి. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి. చట్టబద్ధంగానో, చట్టవిరుద్ధంగానో తమ భాష, తమ ప్రాంతం కానివారు ప్రవేశిస్తే సహజంగానే స్థానికుల్లో అనేక సంశయాలు కలుగుతాయి. తెలియని భయాందోళనలుంటాయి. ప్రభుత్వాలకుండే ఇతరేతర అనుమానాలు సరేసరి. అమెరికాలో రిపబ్లికన్ల ఏలుబడివున్నా, డెమాక్రాట్ల ప్రభుత్వం నడిచినా అక్రమ వలసదారులను కనికరించింది లేదు. కాకపోతే ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో దాన్నొక బూచిగా చూపారు. శ్వేతజాతీయులు ఎదుర్కొంటున్న సకల సమస్యలకూ మూలం వలసదారులేనన్న భ్రమ కలగజేయటంలో, వారికి డెమాక్రటిక్ పార్టీ మద్దతునిస్తున్నదని నమ్మించడంలో విజయం సాధించారు. తాను అధికారంలోకొచ్చాక అలాంటి వారందరినీ గుర్తించి పంపేస్తానని పదే పదే చెప్పారు. ఆ ప్రచారం ఆయనకు గణనీయంగా వోట్లు రాల్చింది. కానీ తమది ప్రపంచంలోనే పురాతన ప్రజా స్వామ్య వ్యవస్థ అని స్వోత్కర్షకు పోయే దేశం వలసదారులను పశువులకన్నా హీనంగా పరిగణించటం, వారి కనీస మానవహక్కులను బేఖాతరు చేయటం సబబేనా? వలసదారులు తిరుగుబాటు చేయడానికి రాలేదు. వారి దగ్గర మారణాయుధాలుండవు. ఏజెంట్లను నమ్మి, వారికి లక్షలకు లక్షలు అర్పించుకుని నిజంగా అమెరికా చాన్సు వచ్చిందేమోనన్న భ్రమలో కొందరు నిర్భాగ్యులు విమానం ఎక్కుతారు. వారిని ఇటలీ, బ్రెజిల్, మెక్సికో, పెరూవంటి దేశాల్లో దించి ‘మీ చావు మీరు చావండ’ని గాలికొదిలేస్తారు. తమ దగ్గరున్న కాగితాలు నిజమైన వేనన్న భ్రమలో ఉన్న వలసదారులకు అప్పుడిక ఏం చేయాలో పాలుపోదు. చివరకు దేవుడిపై భారంవేసి ముందుకు పోవటానికే నిర్ణయించుకుని కొండలూ, గుట్టలూ, నదులూ దాటుకుంటూ తిండీతిప్పలూ లేక నీరసించి అమెరికా సరిహద్దులకు చేరుకుంటారు. అదృష్టం ఉంటే అక్కడి భద్రతా బలగాల కళ్లుగప్పి ఆ దేశంలోకి ప్రవేశిస్తారు. లేదా దొరికిపోయి జైళ్లపాలవుతారు. భ్రమ లన్నీ అడుగంటి, అక్కడ ఉండలేక, వెనక్కొచ్చే దారి దొరక్క జైళ్లలో మగ్గుతారు. సవ్యంగా పంపితే ‘బతుకు జీవుడా’ అనుకుంటూ అక్కడినుంచి నిష్క్రమించటానికే అత్యధికులు సిద్ధంగా ఉంటారు. అలాంటివారిపైనా ట్రంప్ ప్రతాపం! అప్పుడెప్పుడో వియత్నాం మొదలుకొని వర్తమానంలో గాజా వరకూ అమెరికా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేర్వేరు దేశాల్లో సాగించిన అకృత్యాల మాటేమిటి? వాటికి పడాల్సిన శిక్షేమిటి? ఏనాడైనా ఆత్మసమీక్ష చేసుకుందా? ఎడ్వర్డ్ స్నోడెన్, చెల్సియా మానింగ్ వంటివారు బట్టబయలు చేసిన రహస్య పత్రాలను ఒకసారి అమెరికా చదువుకుంటే మంచిది. అక్రమ వలసదారులను సమర్థించాలని ఎవరూ చెప్పరు. కానీ అమెరికా వ్యవహరించిన తీరును మన ప్రభుత్వం ఖండించాల్సిన అవసరం లేదా? గతంలో యూపీఏ హయాంలో అమెరి కాలో మన దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేపై వచ్చిన ఆరోపణలు ఆసరా చేసుకుని ఆమెకు సంకెళ్లు వేసి, వివస్త్రను చేసి తనిఖీ చేసినప్పుడు మన ప్రభుత్వం అప్పటి అమెరికా రాయబారి నాన్సీ పావెల్‌ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. భారత్‌లో పర్యటిస్తున్న అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల్ని కలుసుకునేందుకు మన నాయకులు నిరాకరించారు. అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బందికిచ్చే అనేక రాయితీలనూ, సౌకర్యాలనూ ఉపసంహరించారు. దౌత్యరంగంలో రెండు దేశాల మధ్యా విడ దీయరాని అనుబంధం ఉండి వుండొచ్చు. అది మనకు మిత్ర దేశమే కావొచ్చు. వలస దారులను సవ్యంగా పంపి వుంటే సమస్యే ఉత్పన్నమయ్యేది కాదు. కానీ జరిగింది అందుకు భిన్నం. ఈ విషయమై పార్లమెంటులో వ్యక్తమైన అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి. తప్పును తప్పని చెప్పితీరాలి. వలసదారుల విషయంలో ఎలా వ్యవహరించాలో చెప్పే అంతర్జాతీయ ఒడంబడిక లున్నాయి. అగ్రరాజ్యమైనంత మాత్రాన వాటిని బేఖాతరు చేస్తానంటే కుదరదు. మున్ముందు ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకోకూడదనుకుంటే మన నిరసనను తెలియజేయటమే ఉత్తమం.