వెనక్కి పంపేస్తే నష్టమే! | Sakshi Guest Column On immigrants return from US By Donald Trump Govt | Sakshi
Sakshi News home page

వెనక్కి పంపేస్తే నష్టమే!

Published Sun, Feb 9 2025 4:50 AM | Last Updated on Sun, Feb 9 2025 4:50 AM

Sakshi Guest Column On immigrants return from US By Donald Trump Govt

అక్రమ వలసదారులను అమెరికా నుంచి వెనక్కి పంపుతున్న దృశ్యం

అభిప్రాయం

2024 ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ సాధించిన విజయానికీ – బైడెన్‌ పాలనా కాలంలో అమెరికా ద్రవ్యోల్బణం పెరగడం, దేశ దక్షిణ సరి హద్దులో వలసదారుల ప్రవాహం వంటివాటి పట్ల ఓటర్లకు ఉన్న అసంతృప్తికీ మధ్య దగ్గరి సంబంధం ఉంది.

ట్రంప్‌ తన రెండవ పదవీకాలంలో మొదటి రోజున తీసుకున్న చర్యలను పరిశీలిద్దాం. సరిహద్దును మూసివేయడం, సరైన పత్రాలు లేని వలసదారులపై కఠినంగా వ్యవహరించడం, అలాగే పౌరులు కాని వారి పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దుచేయడంవంటి అంశాలపై అధ్యక్షుడు వరుసగా ఆదేశాలు జారీ చేశారు.

అక్రమ వలసలపై ఇంతటి అణచివేతకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడంలో ట్రంప్‌ ఉద్దేశ్యం ఓటర్లలో ప్రజాదరణ పొందడమే. ఇటీవలి ఆక్సియోస్‌–ఇప్సోస్‌ పోల్‌లో 10 మందిలో తొమ్మిది మంది రిపబ్లి కన్లతోపాటు దాదాపు సగం మంది డెమొక్రాట్లు కూడా అనధికార వలసదారుల సామూహిక బహిష్కరణకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. బహిష్కరణ కోసం ఎంపిక చేసుకున్న పద్ధతుల దగ్గరికి వచ్చేటప్పటికి... అంటే కుటుంబాలను వేరు చేయడం లేదా పిల్లలుగా అమెరికాకు వచ్చిన వారిని బహిష్కరించడం వంటివాటికి మద్దతు పలచబడుతోంది.

ట్రంప్‌ ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడానికి అమెరికన్‌ కాంగ్రెస్‌ కూడా సిద్ధంగా ఉంది. జనవరి 7న, ప్రతినిధుల సభ లేకన్‌ రిలే చట్టాన్ని ఆమోదించింది. దొంగతనం,దోపిడీ, కస్టమర్‌గా దుకాణాలలో ప్రవేశించి వస్తువులను దొంగిలించడం వంటివే కాక అంతకు మించిన హింసాత్మక నేరాలకు పాల్పడే అనధికార వలసదారులను బహిష్కరించడాన్ని ఈ చట్టం సులభతరం చేస్తుంది. 

మొదటి రోజే సెనేట్‌ తమ ముందుకొచ్చిన బిల్లును 64–35 ఓట్లతో ఆమోదించింది. 12 మంది డెమొక్రాట్లు కూడా రిపబ్లికన్లతో కలిసి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో సరైన పత్రాలు లేని వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటే ఆర్థిక పరిణామాలు ఎలా ఉంటాయనే విషయంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రకారం, 2022లో దాదాపు కోటి 10 లక్షల మంది అనధికార వలసదారులు అమెరికాలో ఉన్నారు. వారిలో 80 లక్షల 30 వేలమంది శ్రామికులు. గత రెండేళ్లలో వలసదారుల సంఖ్య పెరగడంతో, ఇప్పుడు కోటిమంది అనధికార కార్మికులు ఉండవచ్చని అంచనా. ఇది అమెరికా శ్రామిక శక్తిలో 6 శాతం. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్‌ నగరాల్లోనే దాదాపు సగం మంది వీరు ఉన్నారు.

సామూహిక బహిష్కరణలను సమర్థించేవారి వాదన ఏమిటంటే, అవి అమెరికన్‌ కార్మికులకు ఒక వరం. సామూహిక తొలగింపులు అమెరికన్లకు ఉద్యోగాలను కల్పిస్తాయనీ, వారి వేతనాలను పెంచుతాయనీ ట్రంప్‌ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ స్టీఫెన్‌ మిల్లర్‌ వాదన. అనధికార వలస కార్మికులు ఇలాంటి ఉద్యోగాల కోసం స్థానికంగా జన్మించిన కార్మికులతో పోటీ పడుతున్నారని ఈ వాదన చెబుతోంది. అయితే ఇది వాస్తవం కాదని అనేక అధ్యయనాల వల్ల తేలుతోంది. నిజానికి నమోదుకాని వలసదారులు తరచుగా అమెరికన్‌ కార్మికులు కోరుకోని ఉద్యోగాలను తీసుకుంటారని ఇవి చెబుతున్నాయి. 

ఇందుకు ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎంప్లాయర్స్‌’ కోవిడ్‌–19 మహమ్మారి కాలంలో సుమారు 1,00,000 సీజనల్‌ వ్యవసాయ ఉద్యోగాలలో ఎంత మంది నిరుద్యోగ అమెరికన్లు చేరతారో తెలుసుకోవడానికి నిర్వహించిన సర్వే ఒక మంచి ఉదాహరణ. లక్ష ఉద్యోగాలకు గాను కేవలం 337 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని సర్వే చెప్పింది. కాలానుగుణ వలసదారులు లేకపోతే, కార్మికుల కొరత (ఆహార కొరత) కొనసాగే అవకాశం ఉందని సర్వే తెలిపింది.

అనధికార వలసదారులు చేపట్టే అతి సాధారణమైన 15 వృత్తులలో అమెరికాలో జన్మించిన కార్మికులు–అనధికార వలస కార్మికులు ఎంతెంత మంది ఉన్నారనే సంగతినిని ‘బ్రూకింగ్స్‌’ అధ్యయనం చెబు తోంది. స్థానిక కార్మికులు, అధికారిక వలస కార్మికుల కంటే అనధికార వలసదారులు తక్కువ జీతం, ప్రమాదకరమైన, తక్కువ ఆకర్షణీ యమైన ఉద్యోగాలను ఎక్కువగా తీసుకుంటారని ఈ అధ్యయనం ప్రధానంగా తేల్చింది.

అక్రమ వలస కార్మికులను బలవంతంగా పంపివేసే చర్య వల్ల అనేక రంగా లపై వివిధ స్థాయుల్లో కార్మికుల సరఫరాపై ప్రభావం పడుతుందని ‘ది ఎకానమిస్ట్‌’ ఎత్తి చూపింది. ముఖ్యంగా వ్యవసాయంపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. అమెరికాలోని 25 లక్షలమంది వ్యవసాయ కార్మికులలో దాదాపు 40 శాతం మంది అనధికార వలస దారులేనని అంచనా. వీరి తొలగింపు వల్ల గృహ నిర్మాణం కూడా ప్రభా వితమయ్యే అవకాశం ఉంది. అనధికార వలసదారులు గృహ నిర్మాణ శ్రామిక శక్తిలో ఆరవ వంతు ఉన్నారు.

బహిష్కరణలు ఎంత విస్తృతంగా ఉన్నాయనే దానిపైనే మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం ఆధారపడి ఉంటుంది.  ట్రంప్‌ లక్షలాదిమంది వలసదారులను సాగనంపే ‘అమెరికన్‌ చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ కార్యక్రమం’ నిర్వహిస్తామని బెదిరించినప్పటికీ... చట్టపరమైన, రవాణాపరమైన, ఆర్థిక, రాజకీయ పరమైన అడ్డంకుల వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం కష్టమే! 

ఇంతలోనే, ‘అమెరికన్‌ పాలనాయంత్రాంగం 10 లక్షలమంది బహిష్కరణతో ప్రారంభించి... ఆపై అక్కడి నుండి ఇంకా ముందుకు వెళ్ళవచ్చు’ అని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సూచించారు. పీటర్సన్‌ ‘ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్స్‌’ చేసిన అధ్యయనంలో, 1956లో అధ్యక్షుడు ఐజెన్‌ హోవర్‌ ‘ఆపరేషన్‌ వెట్‌బ్యాక్‌’ కేంపెయిన్‌ సమయంలో చేసిన  13 లక్షల బహిష్కరణల సంఖ్యకు సమానమైతే  గనక, ప్రస్తుత బహిష్కరణల ఫలితంగా 2028లో అమెరికా... జీడీపీ దాని ప్రాథమిక అంచనా కంటే 1.2 శాతం తక్కువగా ఉంటుందట!

సక్రమ పత్రాలు లేని కార్మికులు... ప్రభుత్వ ప్రాయోజిత ప్రయోజనాలను పొందుతూ పన్నులు చెల్లించని ‘అమాం బాపతు’ అని మరొక వాదన ఉంది. ‘ఫెడరేషన్‌ ఫర్‌ అమెరికన్‌ ఇమ్మి గ్రేషన్‌ రిఫార్మ్‌’ నుండి వచ్చిన డేటా ఆధారంగా, అక్రమ వలసదారులు 2023లో అమెరికన్‌ పన్ను చెల్లింపుదారులు కట్టిన పన్నుల్లో 150 బిలియన్‌ డాలర్ల ఖర్చుకు కారణమయ్యారని ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ‘ప్రభుత్వ ఖర్చు తగ్గింపు కార్యక్రమం’ పేర్కొంటోంది.  

దీనికి ప్రధాన కారణం... ‘వారు తక్కువ సగటు విద్యా స్థాయులను కలిగిఉండటం, ఫలితంగా తక్కువ పన్ను చెల్లింపులు జరగడం, పైగా వారు తరచుగా వారి పిల్లల తరఫున సంక్షేమ కార్య క్రమాలకు అర్హత పొందడం’ అని ‘సెంటర్‌ ఫర్‌ ఇమ్మిగ్రేషన్‌ స్టడీస్‌’కు చెందిన స్టీవెన్‌ కమరోటా వాదన.

అయితే, మొత్తం వలసదారుల విషయానికి వచ్చేటప్పటికి ఈ వాదన సరికాదు. కోవిడ్‌–19 మహమ్మారి తర్వాత వలసదారులు 90 లక్షలకు పెరిగారంటే రాబోయే 10 సంవత్సరాలలో అమెరికా ప్రభుత్వ ఆదాయానికి అది 1.2 ట్రిలియన్‌ డాలర్లను జోడిస్తుందని, ప్రభుత్వ తప్పనిసరి కార్యక్రమాలకు ఖర్చులు 300 బిలియన్‌ డాలర్ల మేరకు మాత్రమే పెరుగుతాయని ‘కాంగ్రెషనల్‌ బడ్జెట్‌ ఆఫీస్‌ నివేదిక’ అంచనా వేసింది. వలసదారులు స్థానికంగా జన్మించిన కార్మికుల కంటే తక్కువ సంఖ్యలో ఉన్నారు. పైగా వారు పదవీ విరమణ వయస్సుకు చేరుకునే వరకు సామాజిక భద్రత, మెడికేర్‌ నుండి ప్రయోజనాలను పొందకపోవడం గమనార్హం.

చివరగా, నేటి వలసల గురించి చర్చ... పత్రాలు లేని వలస దారులపై కేంద్రీకృతమై ఉన్నప్పటికీ, 34 సంవత్సరాలుగా అమెరికా వలస చట్టాలు గణనీయంగా నవీకరించబడలేదని రెండు వైపులా ఉన్న రాజకీయ నాయకులు గుర్తించాలి. తగ్గుతున్న సంతా నోత్పత్తి రేటు కారణంగా అమెరికా జనాభా పెరుగుదల మందగించడంతో, అమెరికా కార్మిక మార్కెట్‌ వృద్ధికి ప్రధాన ఆధారం చట్టబద్ధమైన వలసల ద్వారానే లభిస్తుంది.

వలసలను అరికట్టడం వల్ల ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉంది. అమెరికాకు వలస వచ్చిన చాలా మంది దక్షిణ సరిహద్దు నుంచే ఉధృతంగా రావడానికి ముఖ్య కారణం కాలం చెల్లిన అమెరికా వలస చట్టాలు అని గుర్తించాలి.

నికోలస్‌ సార్జెన్‌ 
వ్యాసకర్త ఫోర్ట్‌ వాషింగ్టన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌కు ఆర్థిక సలహాదారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement