సొరంగం నుంచి ఉగ్రవాదులు
సాంబా సెక్టార్‌లో గుర్తించిన సైన్యం
న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో మంగళవారం బలగాల చేతుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు సొరంగం ద్వారా చొరబడినట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) చీఫ్ కేకే శర్మ చెప్పారు. అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వద్ద పొలాల్లో 80 మీటర్ల సొరంగ మార్గం ద్వారా అక్రమంగా ప్రవేశించినట్లు చెప్పారు. ‘చమ్లియాల్ ఔట్‌పోస్టు వద్ద ఆపరేషన్ పూర్తరుున తర్వాత కంచెను పరిశీలించాం. ఉగ్రవాదులు కంచెను తొలగించిన ఆనవాళ్లేవీ కనపడలేదు. అరుుతే బుధవారం ఉదయం అక్కడ 2బై2 చిన్న సొరంగమార్గాన్ని గుర్తించాం. పంట పొలాల్లో దీన్ని తవ్వారు.’ అని చెప్పారు. ఈ సొరంగం.. అంతర్జాతీయ సరిహద్దు నుంచి 75-80 మీటర్ల దూరంలో, కంచె నుంచి 35-40 మీటర్లు ఉంది. దాడిలో జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ హస్తం ఉందనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన ముష్కరుల వద్ద జైషే మొహమ్మద్‌కు చెందిన ‘అఫ్జల్ గురు దళం (ఏజీఎస్)’ అని ఉర్దూలో రాసి ఉన్న నోట్ లభ్యమైంది.
రైళ్ల పేల్చివేతకు కుట్ర
సాంబా సెక్టార్‌లో చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులు దేశంలో భారీ విధ్వంసం చేసేందుకు కుట్ర పన్నారు. రైళ్లను, రైలు పట్టాలను పేల్చేయడం లాంటి వరుస దాడులకు పన్నాగం పన్నినట్లు బీఎస్‌ఎఫ్ అదనపు డెరైక్టర్ జనరల్ అరుణ్ చెప్పారు. 5 చైన్ ఐఈడీ (అత్యాధునిక పేలుడు పదార్థాలు), ద్రవరూపంలోని పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టించాలనుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి ఐదు సీసాల ట్రైనైట్రోగ్లిసరిన్ అనే ద్రవ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటితోపాటు 3 ఏకే 47 తుపాకులు, 20 మేగజీన్లు, 517 బుల్లెట్లు, 8ఎంఎం పిస్టల్, 20 గ్రెనేడ్లు, జీపీఎస్ సెట్ స్వాధీనం చేసుకున్నారు.
ఆర్మీ చీఫ్ సమీక్ష
నగ్రోటాలో దాడి జరిగిన ప్రాంతాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ సందర్శించారు. దాడి వివరాలను కమాండర్లు సుహాగ్‌కు వివరించారు. భద్రతా పరిస్థితులను ఆయన సమీక్షించారు.