జైపూర్: నూపుర్ శర్మను హత్య చేసేందుకు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్ జాతీయుడ్ని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) అధికారులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్ జిల్లాలో జులై 16న అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఐబీ సహా ఇతర నిఘా సంస్థల బృందం అతడ్ని విచారిస్తోంది.
జులై 16న రాత్రి 11 గంటల సమయంలో హిందుమల్‌కోట్ సరిహద్దు అవుట్‍పోస్టు వద్ద అనుమానాస్పద రీతిలో కన్పించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వివరించారు. అతని పేరు రిజ్వాన్ అశ్రఫ్ అని, పాకిస్థాన్‌లోని ఉత్తర పంజాబ్ మండీ బౌహద్దీన్ నగర వాసినని చెప్పాడని వెల్లడించారు. అతని వద్ద 11 అంగుళాల కత్తితో పాటు బ్యాగులో మతానికి సంబంధించిన పుస్తకాలు, బట్టలు, ఆహారం, మట్టి ఉన్నట్లు గుర్తించామన్నారు.
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మను చంపేందుకే తాను దేశం దాటి వచ్చినట్లు రిజ్వాన్ ప్రాథమిక విచారణలో చెప్పాడని అధికారులు పేర్కొన్నారు. అనంతరం తదుపరి విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరచగా.. 8 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఐబీ, రా, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు నిందితుడ్ని విచారిస్తున్నారు.
చదవండి: నూపుర్ శర్మకు ప్రాణహాని ఉంది నిజమే.. అరెస్టు నుంచి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు
Comments
Please login to add a commentAdd a comment