Mohammed pravakta
-
రాజాసింగ్ సస్పెన్షన్‌పై కిషన్ రెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆయనను బీజేపీ అధిష్ఠానం సస్పెండ్ చేసిన విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. రాజాసింగ్ ఏం మాట్లాడారనే విషయం కూడా తనకు తెలియదన్నారు. యూట్యూబ్‌లో ఆయన మాట్లాడిన వీడియో చూసేందుకు ప్రయత్నించానని కానీ, ఎక్కడా అందుబాటులో లేదని పేర్కొన్నారు. కాగా.. మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని రాజాసింగ్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. చదవండి: ‘రాజీ’ ఎరుగని బీజేపీ ఎమ్మెల్యే.. ఏడికైతే ఆడికైతది.. తగ్గేదెలే! -
నూపుర్ శర్మను చంపేందుకు దేశ సరిహద్దు దాటిన పాకిస్థానీ
జైపూర్: నూపుర్ శర్మను హత్య చేసేందుకు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్ జాతీయుడ్ని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అధికారులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్ జిల్లాలో జులై 16న అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఐబీ సహా ఇతర నిఘా సంస్థల బృందం అతడ్ని విచారిస్తోంది. జులై 16న రాత్రి 11 గంటల సమయంలో హిందుమల్‌కోట్ సరిహద్దు అవుట్‌పోస్టు వద్ద అనుమానాస్పద రీతిలో కన్పించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వివరించారు. అతని పేరు రిజ్వాన్ అశ్రఫ్ అని, పాకిస్థాన్‌లోని ఉత్తర పంజాబ్ మండీ బౌహద్దీన్ నగర వాసినని చెప్పాడని వెల్లడించారు. అతని వద్ద 11 అంగుళాల కత్తితో పాటు బ్యాగులో మతానికి సంబంధించిన పుస్తకాలు, బట్టలు, ఆహారం, మట్టి ఉన్నట్లు గుర్తించామన్నారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మను చంపేందుకే తాను దేశం దాటి వచ్చినట్లు రిజ్వాన్ ప్రాథమిక విచారణలో చెప్పాడని అధికారులు పేర్కొన్నారు. అనంతరం తదుపరి విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరచగా.. 8 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఐబీ, రా, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు నిందితుడ్ని విచారిస్తున్నారు. చదవండి: నూపుర్ శర్మకు ప్రాణహాని ఉంది నిజమే.. అరెస్టు నుంచి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు -
నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘ఆమెకు ప్రాణహాని ఉంది నిజమే’
న్యూఢిల్లీ: నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెపై ఆగస్టు 10వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నూపుర్ శర్మకు ప్రాణహాని ఉందని అత్యున్నత న్యాయస్థానం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆమెపై ఎక్కడా కొత్త కేసులు నమోదు చేయవద్దని స్పష్టం చేసింది. తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, తనపై దాఖలైన తొమ్మిది కేసులను ఒకేదానిగా ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ నూపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నూపుర్ శర్మను చంపేస్తామని బెదిరింపులు ఎక్కువయ్యాయని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం నూపుర్ శర్మకు ప్రాణహాని ఉన్నది నిజమేనని వ్యాఖ్యానించింది. ఆమెకు ఊరటనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నూపుర్ శర్మపై నమోదైన అన్ని కేసులను ఢిల్లీకి బదిలీ చేసే విషయంపై ఆగస్టు 10లోగా స్పందన తెలపాలని ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, బెంగాల్, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, జుమ్ముకశ్మీర్, అస్సాం ప్రభుత్వాలను సుప్రీంకోర్టు అడిగింది. జులై1న నూపుర్ శర్మ పిటిషన్ విచారణ సందర్భంగా ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది సుప్రీంకోర్టు. టీవీ డిబేట్లో బాధ్యత లేకుండా మాట్లాడటం వల్ల దేశంలో ఆమె అగ్గిరాజేసిందని మండిపడింది. దేశంలో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు నూపుర్ శర్మ వ్యాఖ్యలే కారణమని ధ్వజమెత్తింది. ఆ తర్వాతి నుంచే నూపుర్ శర్మను చంపేస్తామనే బెదిరింపులు చాలా ఎక్కువయ్యాయని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అజ్మీర్ దర్గా ఖాదిం సల్మాన్ ఛిస్తీ, యూపీ చెందిన వ్యక్తి.. నూపుర్ శర్మను హతమారుమాస్తామని బెదిరించిన విషయాలను ప్రస్తావించారు. చదవండి: వాట్సాప్ స్టేటస్‌గా నూపుర్ శర్మ వీడియో.. కత్తులతో నిర్దాక్షిణ్యంగా పొడిచారు?! -
వాచాలతకు మూల్యం ఎంత?
నోటికి మాట తెగులు... నీటికి పాచి తెగులు అని జన వ్యవహారం. టీవీ చర్చల్లో మాట్లాడమన్నారు కదా అని అదుపు తప్పి మాట్లాడితే, అదే ఎదురు తంతుందని ఇద్దరు బీజేపీ నేతలకు ఆదివారం తెలిసొచ్చింది. జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై, పార్టీ ఢిల్లీ శాఖ మీడియా హెడ్ నవీన్ జిందాల్‌పై బీజేపీ పెద్దలు సస్పెన్షన్ వేటు వేశారు. ఖతార్, కువైట్, ఇరాన్ సహా పలు అరబ్ దేశాల నుంచి సదరు అభ్యంతర వ్యాఖ్యలకు నిరసన ఎదురవడంతో, అధికార బీజేపీ సొంతపార్టీ వాళ్ళపైనే కొరడా జుళిపించక తప్పని పరిస్థితి వచ్చింది. సదరు అభ్యంతరకర వ్యాఖ్యలు కాన్పూర్ లాంటి చోట్ల శుక్రవారమే హింసాకాండకు దారి తీస్తే, వ్యాఖ్యలు చేసి పదిరోజులవుతున్నా వాటిని ఖండించని అధికారపక్షపు దిలాసా ఆదివారం విదేశాల నిరసనకు కారణమైంది. మరోపక్క పశ్చిమాసియా దేశాల్లో లక్షలాది భారతీయుల ఉద్యోగాలకూ, సూపర్ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకూ ఉద్వాసన లాంటి వార్తలు వస్తున్నాయి. విద్వేషపు వాచాలతకు ఇదీ మూల్యం! గల్ఫ్‌లోని భాగస్వామ్య దేశాలతో పెరుగుతున్న భారత సంబంధాలకు ఈ వ్యాఖ్యలు ఇబ్బంది తెచ్చాయి. భారత ఉపరాష్ట్రపతి మూడు రోజుల ఖతార్ పర్యటన వేళ మరింత ఇరుకునపెట్టాయి. గల్ఫ్‌లో 90 లక్షల మంది భారతీయులు పని చేస్తున్న సంగతి మర్చి పోతే ఎలా? మనకు అత్యధిక విదేశీ మారక ద్రవ్యం చేకూర్చే తొలి 7 దేశాల్లో 5 గల్ఫ్ దేశాలేనని విస్మరించగలమా? అందుకే, చివరకు అభ్యంతర వ్యాఖ్యలు చేసినవారు ‘ప్రధాన స్రవంతిలో లేని అనధికారిక అతివాద శక్తులు’ అంటూ ప్రభుత్వం పరువు కాపాడుకొనే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. నిజానికి, ప్రధాని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే నూపుర్ కానీ, నవీన్ కానీ బీజేపీలో భాగమే తప్ప వేరొకటి కాదని ప్రపంచానికీ తెలుసు. చివరకు, బీజేపీ ఆత్మరక్షణలో పడి, అన్ని మతాలూ తమకు సమానమేననీ, వివాదాస్పద వ్యాఖ్యల్ని సమర్థించబోమనీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వారిపై వేటు వేయాల్సి వచ్చింది. అయితే, వ్యాఖ్యలు చేసి పది రోజులయ్యాక, అదీ అరబ్ ప్రపంచంతో ముడిపడిన భారత చమురు, వాణిజ్య, దౌత్య ప్రయోజనాల ఒత్తిడితో బీజేపీ ఈపాటి చర్యకు దిగిందన్నది చేదు నిజం. అధికార ప్రతినిధిపై వేటుతో బీజేపీ పిరికిగా వ్యవహరించిందంటూ కాషాయబృందంలో ఓ వర్గం విమర్శ. నిజానికి, ఎన్నికల్లో ఓ పార్టీకి మెజారిటీ ఇచ్చినంత మాత్రాన ప్రతి పనికీ, మాటకూ జనం మద్దతు ఉందనుకోవడం పొరపాటు. కేంద్రంలో వరుసగా రెండు ఎన్నికల్లో బీజేపీ గెలిచాక కాషాయ అజెండాతో స్వామి భక్తులు మైనారిటీ వ్యతిరేక వ్యాఖ్యలకూ, చర్యలకూ దిగడం పెరిగింది. తొలి రోజుల్లోనే పరిస్థితిని అదుపులో పెట్టాల్సిన పెద్దలు వ్యూహాత్మక మౌనం పాటించారు. ఇప్పుడు విషయం ప్రపంచ వేదికపైకి ఎక్కేదాకా వచ్చింది. కాలు జారినా తీసుకోవచ్చేమో కానీ, నోరు జారితే తీసుకోలేమని పాలక పక్షీయులకు పదే పదే గుర్తు చేయాల్సి రావడం దురదృష్టకరం. అయితే, ఇదే అదనుగా పాకిస్తాన్, తాలిబన్ల పాలనలోని అఫ్ఘానిస్తాన్ లాంటి దేశాలు భారత్‌కు సూక్తి ముక్తావళిని వినిపించడానికి ప్రయత్నించడం విడ్డూరం. సామాన్యుల స్వేచ్ఛకే గౌరవమివ్వని దేశాలు భారత్‌ను వేలెత్తి చూపుతూ, ఉపన్యాసాలిచ్చే పరిస్థితి తెచ్చుకోవడం మన స్వయంకృతాపరాధం. ఒక వర్గం అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినంత మాత్రాన, రెండో వర్గం హింసాకాండకు పాల్పడడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. వివాదాస్పద వ్యాఖ్యలే సాకుగా వీవీఐపీల పర్యటన వేళ గత శుక్రవారం కాన్పూర్‌లో జరిగిన మత ఘర్షణలు దురదృష్టకరం. దీని వెనుక దేశవ్యాప్తంగా నిద్రాణ రహస్య యంత్రాంగం ఉన్న ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ (పీఎఫ్ఐ) లాంటి సంస్థలు ఉన్నాయట. ఇది మరింత ఆందోళనకరం. ఇలాంటివి జరగకుండా తక్షణ, కఠిన చర్యలు తీసుకోక పోతే కష్టం. ఆ మాటకొస్తే – ప్రవక్త మీద వ్యాఖ్యలు చేయడం ఎంత తప్పో, శివలింగాల మీద ఎవ రైనా విపరీత వ్యాఖ్యలు చేస్తే, అవీ అంతే తప్పు. తప్పొప్పుల తరాజు ఎటు మొగ్గిందని చూసే కన్నా, ఈ వ్యాఖ్యల వల్ల దేశ సమైక్యతా చట్రానికి ఎదురయ్యే ముప్పును అర్థం చేసుకోవడం ముఖ్యం. కాన్పూర్ హింసాకాండకు ఒక రోజు ముందర జూన్ 2న ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ మాట్లాడుతూ, ‘ప్రతి మసీదులో శివలింగాల గురించి వెతికి, తవ్వాల్సిన పని లేదు’ అంటూ స్వయం సేవకులకు హితవు చెప్పారు. దేశంలో ముస్లిమ్‌ల పట్ల విద్వేషానికీ, హిందూ అతివాద సైద్ధాంతి కతకూ మూలకందమని భావించే ఆరెస్సెస్ నుంచి ఆ సంస్థ అధినేత నోట ఇలాంటి మాటలు ఆహ్వానించదగ్గవే. కానీ, గతంలో ప్రార్థనా స్థలాలపై హిందూ, ముస్లిమ్ వివాదాల్లో ఆరెస్సెస్ పోషిం చిన పాత్ర చూశాం. కాబట్టి, భాగవత్ తాజా మాటలను నమ్మగలమా అన్నది విమర్శకుల ప్రశ్న. విద్వేషపూరిత వ్యాఖ్యలు దేశానికీ, దేశ ప్రయోజనాలకూ భంగం కలిగిస్తాయి. ఆ విషయం గల్ఫ్ మిత్ర దేశాలు, చిచ్చురేపి చలి కాచుకుందామని చూస్తున్న పొరుగు దేశాలు చెబితే కానీ అర్థం కాని స్థితిలో మనం ఉన్నామా? ప్రపంచంలో ముస్లిమ్ జనాభా అధికంగా ఉన్న రెండో దేశం మనదే. ప్రజల మధ్య ప్రేమ పంచితే ప్రేమ వస్తుంది. ద్వేషాన్ని పెంచితే ద్వేషమే మిగులుతుంది. ఇవాళ దేశంలో నెలకొన్న అతి సున్నిత పరిస్థితులకు తామెంత కారణమో పాలకుల మొదలు ప్రతిపక్షీయుల దాకా అందరూ ఆత్మ విమర్శ చేసుకోవాలి. మతసామరస్యాన్ని చెడగొట్టేవారిపై తక్షణ, కఠినచర్యలు తీసుకోవాలి. ప్రపంచ వేదికపై భారత గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. -
హజ్ యాత్రలో 20 లక్షలు
మౌంట్ అరాఫత్: హజ్ యాత్రలో భాగంగా ఇప్పటివరకూ దాదాపు 20 లక్షల మంది ముస్లింలు సౌదీలోని ‘అరాఫత్’ కొండను దర్శించుకున్నారని సౌదీ అరేబియా ప్రభుత్వం శనివారం తెలిపింది. ఈ యాత్ర సందర్భంగా ఎలాంటి తొక్కిసలాటలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. హజ్ యాత్రలో భాగంగా భక్తులు తొలుత మక్కాను దర్శించి కాబా చుట్టూ ఏడుసార్లు తిరుగుతారు. మరుసటి రోజూ మినా నుంచి అరాఫత్ పర్వతం వద్దకు చేరుకుంటారు. మహమ్మద్ ప్రవక్త తన చివరి ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ఇక్కడి నుంచే అందించారు. -
పల్లకి ఎక్కని యాత్రికుడు
అబూ సయీద్ మహ్మద్ మగ్దూం మొహియుద్దీన్ హుజ్రీ అంటే ఎవరికి తెలుసు ? మగ్దూం అంటే ఎవరికి తెలియదు..! మగ్దూం అంటే ధర్మవ్యాపకుడట ! మహమ్మద్ ప్రవక్త తన తండ్రివైపు బంధువు హజ్రత్ అబ్బాస్‌ను ‘మగ్దూం’ అని పిలిచేవారట ! మన మగ్దూం సమకాలీన సమ-ధర్మవ్యాపకుడు ! 1908 ఫిబ్రవరి 4న మెదక్ జిల్లా అందోల్‌లో పేద తల్లిదండ్రులకు జన్మించాడు. శిశువుగా ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. మగ్దూంను తండ్రి తాలూకూ బంధువుల సంరక్షణకు అప్పగించి తల్లి మరో మనువాడింది. తన తల్లి జీవించే ఉన్న సంగతి మగ్దూంకు నలభైఏళ్ల వయసులో తెలిసింది. అనాథ బాలుడు మగ్దూం. పేదరికంలో మూఢనమ్మకాలతో పెరిగాడు. ఆయన బంధువొకరు ఎన్నెన్నో కథలు చెప్పేవాడు. జానపద, విశ్వాస గాథలు. రష్యా విప్లవాన్ని గాథగా చెప్పేవాడు. ఆ వర్ణనలు నిబిడాశ్చర్యం కలిగించేవి. ‘అక్కడందరూ సమానమేనట. అందరికీ అన్నీ అట. పాలకుడు ప్రజలూ అందరూ కలసి సమాన హోదాలో భోంచేస్తారట. ఆ భోజనశాలలు ఎంతెంత విశాలంగా ఉంటాయో.. అంత పెద్ద చాదర్లు ఉంటాయా ?’ అని అనుకునేవాడు మగ్దూం. బడిలో చేరేందుకు నగరానికి వచ్చాడు మగ్దూం. సినీస్టార్స్, దేవుళ్ల క్యాలెండర్లు అమ్మి పూటకూళ్లు తిన్నాడు. ‘ఎథిక్స్’ తెలియని మగ్దూం.. ఉస్మానియాలో చదివే విద్యార్థులు కొన్ని ‘సంప్రదాయ నియమాలు’ పాటించాల్సి వచ్చేది. ముస్లింలకు అవి నేర్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ముస్లిమేతర విద్యార్థులకు ‘ఎథిక్స్’ అనే ప్రత్యేక క్లాస్ ఉండేది. ‘నియమ పరీక్ష’లో ఫెయిల్ అయిన మగ్దూంను ఎథిక్స్ క్లాస్‌కు పంపారు ! ఎంఏ ఉర్దూ పూర్తయిన తర్వాత దక్కన్ రేడియోలో, పత్రికల్లో మగ్దూం పార్ట్‌టైం పనులు చేశాడు. సహజ కవి కావడంతో మాటకు మాట, చమత్కార బాణాలు వదలడంలో దిట్ట. జార్జ్ బెర్నార్డ్ షా నాటిక ‘విడోయర్స్ హౌస్’ను ఉర్దూలో ప్రదర్శించాడు. ఓయూలో ప్రదర్శితమైన తొలి నాటిక అదే! అంతేనా.. మరో ప్రత్యేకతా ఉంది. ‘పీలా దుషాల’ (పసుపు దుశ్శాలువా) మగ్దూం కవిత ఏడో నిజాం చెవులకు సోకింది. మగ్దూంను తన నివాసానికి ఆహ్వానించాడు నిజాం. సంప్రదాయ దుస్తులు, తలపై టోపీ లేకుండా సాదాసీదా దుస్తుల్లో నిజాంను కలసిన విద్యార్థి కూడా మగ్దూం ఒక్కడే ! నిలకడ జీవితమే కాదు ! ఎంఏ పూర్తయింది. ఉద్యోగం కావాలి. సరోజినీనాయుడు రాసిన సిఫారసు లేఖతో బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మగ్దూం స్వతంత్ర వ్యక్తిత్వం గురించి బాగా తెలిసిన ఖాజీ మహ్మద్ హుసేన్ ‘నీకు ఉద్యోగం సరిపడదు.. ఆ ఆలోచన మానుకో’ అని హితవు చెప్పాడు. ‘ఓ కళాప్రేమికుడా ! నిత్య యాత్రికుడా! / ఒక గమ్యాన్ని అంగీకరించకు ! లైలా సహచరిగా వస్తానన్నా సరే / పల్లకి మాత్రం ఎక్కకు’ ఇక్బాల్ కవిత్వంలోని పై పాదాలను గుర్తు చేశాడు. మగ్దూం కన్విన్స్ అయ్యాడు. సిటీ కాలేజీలో లెక్చరర్‌గా చేరాడు. మగ్దూంపై ప్రిన్సిపాల్ నిఘా ! క్లాస్‌లో పాఠాలు చెప్పడం లేదని, కవిత్వం చెబుతున్నాడని. విద్యార్థుల ఒత్తిడి మేరకు కవితా గానం చేసేవాడు.. చేస్తూ ప్రిన్స్‌పాల్‌కు దొరికిపోయేవాడు. 1942లో సిటీకాలేజీకి వీడ్కోలు పలికాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఫుల్‌టైం కార్యకర్తగా మారాడు. కార్మిక సంఘాలను ఏర్పరచడం, కార్మికులను ఉద్యమింపజేయడంలో మగ్దూం పాత్ర ముఖ్యమైనది. 1946 తర్వాత మగ్దూం ఉంటే జైల్లో లేదా అజ్ఞాతవాసంలో! ప్రధానికి రాకుమారుల పరిచయం ! ప్రతి ముస్లిం ప్రభువే అనే అప్పటి మజ్లిస్ పార్టీ సిద్ధాంతాన్ని మగ్దూం అపహాస్యం చేశాడు. అయితే ముస్లిం అంటే ఎవరు ? అనే చర్చలు వచ్చేవి. శాస్త్ర ప్రకారం ‘ప్రతి ముస్లిం రాకుమారుడే’ అనేవాడు మగ్దూం. ఒకసారి నిజాం ప్రధానమంత్రి మీర్జా ఇస్మాయిల్ ఒక ఫ్యాక్టరీని సందర్శించాడు. ఆ ఫ్యాక్టరీలో బాలలు గుండీలు తయారు చేస్తున్నారు. పోషకాహారం లేక శుష్కించిన చిరుగుపాతల బాలలను చూపిస్తూ ‘మన రాకుమారులను సందర్శించండి. బెల్లావిస్టాలో మీకూ ఓ రాకుమారుడు ఉన్నాడు కదా..!’ అని మగ్దూం ప్రధానితో అన్నారు. సర్ మీర్జా రుసరుసలాడుతూ నిష్ర్కమించాడు. (నిజాం కుమారుడు, బేరార్ యువరాజు సోమాజీగూడలోని బెల్లావిస్టాలో గుడుపుతోన్న విలాసవంతమైన జీవితం గురించి అప్పట్లో కథలు కథలుగా చెప్పుకునేవారు). మగ్దూం భావుకుడు. స్వాప్నికుడు. ‘సకల జనులు ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలనే’ మహదాకాంక్ష ఆయనను కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చేలా చేసింది. సిద్ధాంత బద్ధంగా జీవించాలి అనే పార్టీ పట్టింపుల్లో కొన్నింటిని ఆయన పట్టించుకునేవారు కాదు. పార్టీకి ఆయన పూర్తి స్థాయిలో విశ్వాసపాత్రుడు ! పార్టీ విధానం తనకు నచ్చని సందర్భాల్లో సైతం పార్టీ ఆదేశాలకు బద్ధుడైనాడు. ఉదాహరణకు హైదరాబాద్ స్టేట్ భారత ప్రభుత్వంలో కలసిన తర్వాత కూడా తెలంగాణలో పార్టీ సాయుధ పోరాటం చేసింది. పోరాటవిరమణ చేయాలని మగ్దూం భావించాడు. పార్టీలో వాదించాడు. కొనసాగాల్సిందే అన్న పార్టీ నిర్ణయాన్ని తలదాల్చాడు. వీధుల్లో భవంతుల్లో ప్రకంపనలు.. సామరస్య భావాలు, హాస్యచతురత, కవిత్వం మగ్దూంను సమాజంలోని అన్ని వర్గాలకు అభిమానిగా చేశాయి. అజ్ఞాతవాసంలో పట్టుబడ్డ మగ్దూంకు పోలీసులూ అభిమానులే. మగ్దూం ముఖతా ఆయన తాజా కవిత్వం విని పోలీసులు వదిలేసిన సందర్భాలు ఉన్నాయి ! ఆయన కవిత్వం తెలంగాణలోనే కాదు దేశమంతటా కమ్యూనిస్ట్ భావాల వ్యాప్తికి దోహదపడింది. మగ్దూంకు తన పాపులారిటీ గురించి ఎరుక. ‘షహర్ మే ధూమ్ హై ఎక్ షోలా నవా కీ మగ్దూం.. (మగ్దూం అనే కొత్త పిడుగు సృష్టిస్తున్న ప్రకంపనాలను నగరపు వీధుల్లో భవంతుల్లో చర్చిస్తున్నారు)’ అని కవితలో అన్నారు ! ‘ఎర్ర ఉదయం’ అనే పార్టీ ప్రచార కవిత్వంతో పాటు సాహితీ అభిమానులందరూ పాడుకునే కవిత్వాన్ని రాశాడు ! చమేలీకీ మండ్వా తలే (మల్లెపందిరి కింద) అటువంటి గీతమే ! ఈ పాట ప్రజల నోళ్లలో నానిన కొన్నాళ్లకు సినిమాలో వాడారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ అభ్యుదయ రచయితల సంఘం ఉద్యమ వ్యాప్తికి మగ్దూం కవితలు దీప స్తంభాలయ్యాయి. భాగమతిపై ఆయన రాసిన కవిత ‘క్లాసిక్’గా సాహితీ అభిమానులు వర్ణిస్తారు. ఈ కోవలో సాహిర్ లుధియాన్వీ రచన ‘తాజ్‌మహల్’లో వ్యక్తమయ్యే వ్యంగ్యం మగ్దూం భాగమతిలో కన్పించకపోవడం విశేషం ! భాగమతి అనే మహనీయ వ్యక్తిత్వం సమక్షంలో తాను ఉన్నాననుకుని మగ్దూం ఇలా అంటాడు... నా పెదవుల నుంచి నీ పేరు ఎప్పుడు తప్పించుకున్నా / ఒక పద్మం వికసిస్తుంది/ కనులు సజలమవుతాయి / ఇప్పుడు ఇక్కడ నీవు లేకపోయినా / నీ సాన్నిధ్యంలోనే కదూ మేమున్నాం. ఇదీ దాని భావం.. మగ్దూం గురించి మరింత వచ్చే వారం.. ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి