పల్లకి ఎక్కని యాత్రికుడు
అబూ సయీద్ మహ్మద్ మగ్దూం మొహియుద్దీన్ హుజ్రీ అంటే ఎవరికి తెలుసు ? మగ్దూం అంటే ఎవరికి తెలియదు..! మగ్దూం అంటే ధర్మవ్యాపకుడట ! మహమ్మద్ ప్రవక్త తన తండ్రివైపు బంధువు హజ్రత్ అబ్బాస్‌ను ‘మగ్దూం’ అని పిలిచేవారట ! మన మగ్దూం సమకాలీన సమ-ధర్మవ్యాపకుడు ! 1908 ఫిబ్రవరి 4న మెదక్ జిల్లా అందోల్‌లో పేద తల్లిదండ్రులకు జన్మించాడు. శిశువుగా ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. మగ్దూంను తండ్రి తాలూకూ బంధువుల సంరక్షణకు అప్పగించి తల్లి మరో మనువాడింది. తన తల్లి జీవించే ఉన్న సంగతి మగ్దూంకు నలభైఏళ్ల వయసులో తెలిసింది.
అనాథ బాలుడు మగ్దూం. పేదరికంలో మూఢనమ్మకాలతో పెరిగాడు. ఆయన బంధువొకరు ఎన్నెన్నో కథలు చెప్పేవాడు. జానపద, విశ్వాస గాథలు. రష్యా విప్లవాన్ని గాథగా చెప్పేవాడు. ఆ వర్ణనలు నిబిడాశ్చర్యం కలిగించేవి. ‘అక్కడందరూ సమానమేనట. అందరికీ అన్నీ అట. పాలకుడు ప్రజలూ అందరూ కలసి సమాన హోదాలో భోంచేస్తారట. ఆ భోజనశాలలు ఎంతెంత విశాలంగా ఉంటాయో.. అంత పెద్ద చాదర్‌లు ఉంటాయా ?’ అని అనుకునేవాడు మగ్దూం. బడిలో చేరేందుకు నగరానికి వచ్చాడు మగ్దూం. సినీస్టార్స్, దేవుళ్ల క్యాలెండర్లు అమ్మి పూటకూళ్లు తిన్నాడు.
‘ఎథిక్స్’ తెలియని మగ్దూం..
ఉస్మానియాలో చదివే విద్యార్థులు కొన్ని ‘సంప్రదాయ నియమాలు’ పాటించాల్సి వచ్చేది. ముస్లింలకు అవి నేర్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ముస్లిమేతర విద్యార్థులకు ‘ఎథిక్స్’ అనే ప్రత్యేక క్లాస్ ఉండేది. ‘నియమ పరీక్ష’లో ఫెయిల్ అయిన మగ్దూంను ఎథిక్స్ క్లాస్‌కు పంపారు ! ఎంఏ ఉర్దూ పూర్తయిన తర్వాత దక్కన్ రేడియోలో, పత్రికల్లో మగ్దూం పార్ట్‌టైం పనులు చేశాడు. సహజ కవి కావడంతో మాటకు మాట, చమత్కార బాణాలు వదలడంలో దిట్ట. జార్జ్ బెర్నార్డ్ షా నాటిక ‘విడోయర్స్ హౌస్’ను ఉర్దూలో ప్రదర్శించాడు. ఓయూలో ప్రదర్శితమైన తొలి నాటిక అదే! అంతేనా.. మరో ప్రత్యేకతా ఉంది. ‘పీలా దుషాల’ (పసుపు దుశ్శాలువా) మగ్దూం కవిత ఏడో నిజాం చెవులకు సోకింది. మగ్దూంను తన నివాసానికి ఆహ్వానించాడు నిజాం. సంప్రదాయ దుస్తులు, తలపై టోపీ లేకుండా సాదాసీదా దుస్తుల్లో నిజాంను కలసిన విద్యార్థి కూడా మగ్దూం ఒక్కడే !
నిలకడ జీవితమే కాదు !
ఎంఏ పూర్తయింది. ఉద్యోగం కావాలి. సరోజినీనాయుడు రాసిన సిఫారసు లేఖతో బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మగ్దూం స్వతంత్ర వ్యక్తిత్వం గురించి బాగా తెలిసిన ఖాజీ మహ్మద్ హుసేన్ ‘నీకు ఉద్యోగం సరిపడదు.. ఆ ఆలోచన మానుకో’ అని హితవు చెప్పాడు. ‘ఓ కళాప్రేమికుడా ! నిత్య యాత్రికుడా! / ఒక గమ్యాన్ని అంగీకరించకు ! లైలా సహచరిగా వస్తానన్నా సరే / పల్లకి మాత్రం ఎక్కకు’ ఇక్బాల్ కవిత్వంలోని పై పాదాలను గుర్తు చేశాడు. మగ్దూం కన్విన్స్ అయ్యాడు. సిటీ కాలేజీలో లెక్చరర్‌గా చేరాడు. మగ్దూంపై ప్రిన్సిపాల్ నిఘా ! క్లాస్‌లో పాఠాలు చెప్పడం లేదని, కవిత్వం చెబుతున్నాడని. విద్యార్థుల ఒత్తిడి మేరకు కవితా గానం చేసేవాడు.. చేస్తూ ప్రిన్స్‌పాల్‌కు దొరికిపోయేవాడు. 1942లో సిటీకాలేజీకి వీడ్కోలు పలికాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఫుల్‌టైం కార్యకర్తగా మారాడు. కార్మిక సంఘాలను ఏర్పరచడం, కార్మికులను ఉద్యమింపజేయడంలో మగ్దూం పాత్ర ముఖ్యమైనది. 1946 తర్వాత మగ్దూం ఉంటే జైల్లో లేదా అజ్ఞాతవాసంలో! ప్రధానికి రాకుమారుల పరిచయం !
ప్రతి ముస్లిం ప్రభువే అనే అప్పటి మజ్లిస్ పార్టీ సిద్ధాంతాన్ని మగ్దూం అపహాస్యం చేశాడు. అయితే ముస్లిం అంటే ఎవరు ? అనే చర్చలు వచ్చేవి. శాస్త్ర ప్రకారం ‘ప్రతి ముస్లిం రాకుమారుడే’ అనేవాడు మగ్దూం. ఒకసారి నిజాం ప్రధానమంత్రి మీర్జా ఇస్మాయిల్ ఒక ఫ్యాక్టరీని సందర్శించాడు. ఆ ఫ్యాక్టరీలో బాలలు గుండీలు తయారు చేస్తున్నారు. పోషకాహారం లేక శుష్కించిన చిరుగుపాతల బాలలను చూపిస్తూ ‘మన రాకుమారులను సందర్శించండి. బెల్లావిస్టాలో మీకూ ఓ రాకుమారుడు ఉన్నాడు కదా..!’ అని మగ్దూం ప్రధానితో అన్నారు. సర్ మీర్జా రుసరుసలాడుతూ నిష్ర్కమించాడు. (నిజాం కుమారుడు, బేరార్ యువరాజు సోమాజీగూడలోని బెల్లావిస్టాలో గుడుపుతోన్న విలాసవంతమైన జీవితం గురించి అప్పట్లో కథలు కథలుగా చెప్పుకునేవారు). మగ్దూం భావుకుడు. స్వాప్నికుడు.
‘సకల జనులు ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలనే’ మహదాకాంక్ష ఆయనను కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చేలా చేసింది. సిద్ధాంత బద్ధంగా జీవించాలి అనే పార్టీ పట్టింపుల్లో కొన్నింటిని ఆయన పట్టించుకునేవారు కాదు. పార్టీకి ఆయన పూర్తి స్థాయిలో విశ్వాసపాత్రుడు ! పార్టీ విధానం తనకు నచ్చని సందర్భాల్లో సైతం పార్టీ ఆదేశాలకు బద్ధుడైనాడు. ఉదాహరణకు హైదరాబాద్ స్టేట్ భారత ప్రభుత్వంలో కలసిన తర్వాత కూడా తెలంగాణలో పార్టీ సాయుధ పోరాటం చేసింది. పోరాటవిరమణ చేయాలని మగ్దూం భావించాడు. పార్టీలో వాదించాడు. కొనసాగాల్సిందే అన్న పార్టీ నిర్ణయాన్ని తలదాల్చాడు.
వీధుల్లో భవంతుల్లో ప్రకంపనలు..
సామరస్య భావాలు, హాస్యచతురత, కవిత్వం మగ్దూంను సమాజంలోని అన్ని వర్గాలకు అభిమానిగా చేశాయి. అజ్ఞాతవాసంలో పట్టుబడ్డ మగ్దూంకు పోలీసులూ అభిమానులే. మగ్దూం ముఖతా ఆయన తాజా కవిత్వం విని పోలీసులు వదిలేసిన సందర్భాలు ఉన్నాయి ! ఆయన కవిత్వం తెలంగాణలోనే కాదు దేశమంతటా కమ్యూనిస్ట్ భావాల వ్యాప్తికి దోహదపడింది. మగ్దూంకు తన పాపులారిటీ గురించి ఎరుక. ‘షహర్ మే ధూమ్ హై ఎక్ షోలా నవా కీ మగ్దూం.. (మగ్దూం అనే కొత్త పిడుగు సృష్టిస్తున్న ప్రకంపనాలను నగరపు వీధుల్లో భవంతుల్లో చర్చిస్తున్నారు)’ అని కవితలో అన్నారు ! ‘ఎర్ర ఉదయం’ అనే పార్టీ ప్రచార కవిత్వంతో పాటు సాహితీ అభిమానులందరూ పాడుకునే కవిత్వాన్ని రాశాడు ! చమేలీకీ మండ్వా తలే (మల్లెపందిరి కింద) అటువంటి గీతమే ! ఈ పాట ప్రజల నోళ్లలో నానిన కొన్నాళ్లకు సినిమాలో వాడారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ అభ్యుదయ రచయితల సంఘం ఉద్యమ వ్యాప్తికి మగ్దూం కవితలు దీప స్తంభాలయ్యాయి.
భాగమతిపై ఆయన రాసిన కవిత ‘క్లాసిక్’గా సాహితీ అభిమానులు వర్ణిస్తారు. ఈ కోవలో సాహిర్ లుధియాన్వీ రచన ‘తాజ్‌మహల్’లో వ్యక్తమయ్యే వ్యంగ్యం మగ్దూం భాగమతిలో కన్పించకపోవడం విశేషం ! భాగమతి అనే మహనీయ వ్యక్తిత్వం సమక్షంలో తాను ఉన్నాననుకుని మగ్దూం ఇలా అంటాడు... నా పెదవుల నుంచి నీ పేరు ఎప్పుడు తప్పించుకున్నా / ఒక పద్మం వికసిస్తుంది/ కనులు సజలమవుతాయి / ఇప్పుడు ఇక్కడ నీవు లేకపోయినా / నీ సాన్నిధ్యంలోనే కదూ మేమున్నాం. ఇదీ దాని భావం.. మగ్దూం గురించి మరింత వచ్చే వారం..
ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి